ఆ భా 7 3 001 to 7 3 030

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


శ్రీ మదాంధ్ర మహాభారతము ద్రోణ పర్వము – తృతీయాశ్వాసము

7_3_001 క. శ్రీ రమ్యతాద్రి వర పు త్రీ రమణీయత్వ సుభగ దివ్య విలాసో దార వనమాలికోరగ హీర పరిష్కార సార హరిహినాథా.

- అర్జునుఁడు నిజ స్వప్న వృత్తాంతంబు ధర్మజాదులతోఁ జెప్పుట – సం. 7-58-1

7_3_002 వ. దేవా వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె.

7_3_003 ఆ. పార్థుఁ డిట్లు ప్రతిన వట్టిన నది నిర్వ హించు పనికిఁ గృష్ణుఁ డివ్విధమునఁ బూని రాత్రి యన్నిపోకలఁ బోవుట విని విచిత్ర వీర్యతనయుఁ డులికి.

7_3_004 క. ఇమ్మెయి వేగినఁ బాండవు లెమ్మెయిఁ గార్యంబు నడపి రెఱిఁగింపుము చి త్తమ్ము గలంగెడు సంజయ నమ్మితి నగ్గురుఁడు గాచెనా మిమ్ము ననిన్.

7_3_005 వ. అని యడిగిన నమ్మహీశ్వరునకు సూత సూనుం డిట్లను నట్లు ప్రభాతం బగుటయు.

7_3_006 క. వందిజనతుములముల యా నందిత మాగధ సుగీత నాదంబుల ప్ర స్పందిత పాఠక రవముల క్రందున ధర్మజూఁడు మేలుకనియె నరేంద్రా.

7_3_007 వ. ఇట్లు మేలుకని తగుతెఱంగున మజ్జనసాలకుం జని మంత్రపూతంబు లగు జలంబులు సముచిత పరిచారికా జనంబులు గనక కలధౌత కలశంబులం దేరఁ గృతస్నానుం డయి లఘుధౌతాం బర పరిధానంబును బరిమళ బహుళాంగ రాగానులేపనంబును సురభి కుసుమ మాలికా భరణ ధారణంబును నాచరించి దేవార్చనంబు దీర్చి యగ్ని కార్యంబు నిర్వర్తించి కక్ష్యాంతరంబు నకు వెడలి విప్ర నికరంబులకు ధేను ప్రకరంబులుఁ గాంయన సంచయంబులు వస్త్రవిసరంబులు మణిభూషణ పుంజంబులుం జిత్తంబు రంజిల్ల నొసంగి తదాశీర్వాదంబులు గైకొనుచు నేనుంగు మొగసాల గడచి యాస్థాన మండపంబునకు వచ్చి.

7_3_008 తే. ఉదయ ధరణీ ధరంబు పై నొప్పు దివస నాథు నెనయుచు సింహాసనంబు మీఁదఁ బొలిచె లీలావతీ కర కలిత చామ రములు వొలయంగ నుచిత జనములు గొలువ.

7_3_009 వ. కొలువున్న సమయంబున దౌవారికుండు వచ్చి దామోదరుండు వచ్చె నని యెఱింగించిన నవ్విభుండు వేగంబ తత్ప్రదేశంబు నడపు మనిన వాఁ డట్ల చేయ నమ్మహాత్ముండు ప్రీతి నేతెంచుటయు నుచితాసన విన్యాసంబున నత్యాదర ముఖ వికాసంబున నతనికి సత్కారంబు సేసి గారవించి తదాననం బాలోకించి యిట్లనియె.

7_3_010 క. జ్ఞానమ్ములు దెలివొందం గా నత్యతంబు సుఖముగా నింద్రియ సం తానంబు ప్రసన్నముగా నీ నిళ శుభవృత్తిఁ గడపితె మధు మథనా.

7_3_011 క. అనుటయు హరి ధర్మతనూ జున కిట్లనుఁ బ్రీతి నిన్నుఁ జూడఁగ నెపుడున్ జననుత శోభనములు నా కనూనములు కాదె దీని నడుగఁగ నేలా.

7_3_012 వ. అని పలికె నట్టియెట భీమ నకుల సహదేవులును సాత్యకి ద్రౌపదేయ ఘటోత్కచులును బాంచాల మాత్స్యకేకయులును మఱియు దగువారుం జనుదెంచి సముచితంబుగాఁ బ్రవేశించి యుధిష్ఠిరునకుం బొడసూపి యతండు నియోగింప నుచితాసనంబుల నుండిరి సాత్యకిం గృష్ణుండు నిజాసనంబున నునిచికొనియెం దదనంతరంబ యెల్లవారలు వినుచుండ నన్నరపతి నారాయణున కిట్లనియె.

7_3_013 ఉ. పంకజనాభ మా పడిన పాటులు రాజ్యము గోలపోకయుం గింకకు మూలమై కడఁగి గెల్పు కిరీటికిఁ నీఁ దలంచి యీ వంకకు వ్రాలి భక్తజన వత్సలతన్ రథచోదకుండ వై తింకిట మమ్ముఁ గావు మని యేటికిఁ జెప్పఁగ మాటిమాటికిన్.

7_3_014 వ. అర్జును ప్రతిన చిత్తంబున నిలుపుము దుఃఖామర్ష మహార్ణ వమగ్నుల మైన మమ్ముం దీరంబు సేరుపం దేపవు నీవ కావె యనిన విని యచ్యుతుం డతని కిట్లనియె.

7_3_015 మ. విను నేఁ డర్జునుఁ డన్య సైన్యముల నుర్విం గూల్చుచు బ్రేత భూ త నికాయంబులు మాంస భక్షణము రక్త స్వైరపానంబుఁ జే సి నలిం గ్రాలఁగఁ గ్రీడ సల్పు నిను మెచ్చించుం దుదివ్ సైంధవుం డను వానిం దెగటార్చి పేర్చు రిపు ధైర్యక్షేపణాటోపతన్.

7_3_016 వ. క్రోధ శోక జ్వర విముక్తుండ నై శాంతిం బొందు మనునవసరంబున ధనంజయుండు వచ్చి ధర్మనందనునకు మ్రొక్కి నిలిచినం జూచి యతండు సంతసంబున సముస్థితుం డై కౌఁగిలించుకొని దీవించి దరస్నితరుచిరాననుండై.

7_3_017 క. గెలుపు ధ్రువము నీకును మెయిఁ దలతల మనుచాయ దోఁచె దైత్యాంతకుఁడుం దెలివొంది యున్న వాఁ డని పలికిన నా విభునితోడఁ బార్థుఁడు నెమ్మిన్.

7_3_018 క. దేవరకు నధిక భద్రమ యీ వసుదేవ సుకు కరుణ నేనత్యాశ్చ ర్యావహముఁ గంటి నది వినఁ గా వలయును బంధు మిత్త్ర గణ సహితముగన్.

7_3_019 వ. అని పలికి స్వప్నంబున ఫాలలోచను వలనం బరమోత్కల్షంబు వడసిన తెఱం గేర్పడం జెప్పిన నతండును గొలువు వారును విస్మయ ప్రమోదంబులతో వృషభధ్వజు నుద్దేశించి నమస్కరించిరి తదనంతరంబ యన్నరపతి చేత ననుజ్ఞాతు లయి యా సకల యోధులుం బొంగి సంగర సన్నాహంబులు మెఱయ వెడలిరి కృష్ణార్జున సాత్యకులు నతనికి నభివాదనంబులు సేసి సహర్షంబుగా వెలువడి యర్జునావాసంబున కరిగి రందుఁ గృష్ణుండు రథంబు వన్ని జైత్రంబు లగు మంత్రంబులు ప్రయోగించి యుజ్జ్వలంబు సేసిన నది బాలభానుండునుం బోలెఁ దేజోమయం బై వెలుంగుచుండ సమరసన్నద్థుం డై ధనుర్బాణపాణి యై యర్జునుండు విప్రాశీర్వాదంబులతో నమ్మహనీయ స్యంనంబునకుం బ్రదక్షిణంబును బ్రణామంబునుం జేసి యారోహణం బాచరించి మేరు శిఖరంబునం బొలుచు భాస్కరుని భంగి శోభిల్లెఁ గృష్ణసాత్యకులు నొగలను నతని పిఱుందను గూర్చున్న నా ఫల్గునుండు బుధ శుక్ర సమేతుం డగు చంద్రు చందంబున నొప్పె నట్లొప్పి వారు పుణ్యపాఠక రవంబులును వందిమాగధ ధ్వనులును వినుచుం జని రప్పుడు దమకు విజయ ప్రదంబులుఁ గౌరవులకు విపరీతంబులు నైన గంధ వాహాది నానా నిమిత్తంబు లను సంధించి యా సవ్యసాచి సాత్యకితో నిట్లనియె.

- అర్జునుఁడు సాత్యకిని ధర్మరాజు రక్షణంబునకు నియోగించుట – సం. 7-60-27

7_3_020 క. మనకు నిమిత్తము లెంతయు ననుకూలము లయ్యె గెలుతు మాహవమున కేఁ జనియెదఁ బ్రతిజ్ఞ దీర్పఁగ ననఘా ధర్మసుతు రక్ష కరుగుము నీవున్.

7_3_021 క. విను సింధురాజ వధయును మనుజాధిప రక్షణంబు మనకు సరియ కా వున నే నొకపని నీ వొక పని మేకొని చేయు టరయఁ బాడియ కాదే.

7_3_022 ఆ. ఏను నిలిచినట్ల గా నూఱడిల్లు నీ వున్న నన్నరేశ్వరోత్తముండు నిర్భరుండ వగుము నీవు నా దెస నాకు హరి గలండు గలఁడె యచట నితఁడు.

7_3_023 వ. ఎల్లభంగుల రాజ రక్షణార్థంబుగా నీకుం బో వలయును బరాక్రమ ధుర్యుండగు నాచార్యు ప్రతిన యెఱుంగవే యనుటయు నట్లకాక యని యతండు ధర్మనందను పాలికిం జనియె నజ్జననాథుండు సమరోత్సాహ సముజ్జ్వలుండయి వచ్చి నిజ సైన్యంబు నలంకరించి చిహ్నంబులు మెఱయ నెఱయం బొలిచి నిలిచె ననిన విని సంజయునకు ధృతరాష్ట్రుం డిట్లనియె.

7_3_024 సీ. పుత్ర శోకానలంబును గ్రోధ వహ్నియు మనమున ముప్పిరి గొనఁగ మృత్యు భంగి నేతెంచు బీభత్సునిఁ గౌరవుల్ సెనకఁ జాలర యేమి చేటు మూఁడె నో పురిలో నొక్కయుమ్మడి నింటింట నార్తనాదములు పెక్కయ్యె నెల్ల రవముల మిగిలి సైంధవు నింటి దిక్కున నాక్రందన ధ్వను లతిశయిల్లె.

తే. నేను ద్రోణుండు భీష్ముండుఁ బూని చెప్ప శౌరిమాటలు మీ రాజు సరకుగొనఁడ సంధి గానీక కర్ణుండు సౌబలుండు దుస్ససేనుండు నందఱఁ ద్రుంచికొనిరి.

7_3_025 ఉ. ఎక్కటి పోరె రుద్రునకు నేమిటఁ దక్కువ ఫల్గునుండు వాఁ డొక్కఁడ యయ్యెనే జగము లొక్కట మ్రింగఁగఁ జాలు కేశవుం డెక్కిన వాఁడు వాని నొగ లేల చలం బని యెంత సెప్పినం దక్కఁడు రాజ్యలోభము మదంబున నా కొడుకేమి సేయుదున్.

7_3_026 వ. అది యట్లుండె.

7_3_027 తే. క్రీడి యమ్మెయి వచ్చినఁ గూడఁ బాఱి యెడలు గలఁగంగఁ గౌరవు లేమి సేసి రది యెఱుఁగంగఁ జెప్పవే యనఘ నీతి యయ్యె నేమి దా దుర్ణయ మయ్యె నేమి.

7_3_028 వ. అనుటయు నా సూత నందనుం డంబికా నందనున కిట్లనియె.

7_3_029 సీ. అధిప చెప్పెద నీకు నంతయు నివ్విలాపము గతజల సేతు బంధనంబు మాయ జూదము మున్ను మాన్పవ పదపడి సంధి గావింపక సకల జనులు నిను లుబ్దుఁడు నధర్మనిరతుండు నని దూఱుదురు దూఱ కేలుండుజురు నరేంద్ర పాండుఁ డవ్విధమునఁ బాలించె రాజ్యంబు పాండవు లెక్కుడు ప్రబ్బి యశము

తే. లాభమును భరతాన్వయోల్లాస మెసఁగఁ దగ నొనర్చిరి వారలఁ దగునె వారి తండ్రి పాలైన సిరి వాసఁ దనయు మీఁద బెట్టె దేల నీ దుర్నీతి ముట్టవచ్చె.

7_3_030 ఉ. కౌరవు లేమి సేయుదురు గాండీవ ఘోషముఁ బాంచజన్యతీ వ్రా రవమున్ సహింప దివిజావలికిన్ వశమే వియచ్చరుల్ పేరుకొనంగ నా దృఢకపి ధ్వజమైన రథంబుతోడనుం బోరిరి పోరుభంగి విను భూవర శోకము దక్కి ధీరతన్.