ఆ భా 7 1 211 to 7 1 240

వికీసోర్స్ నుండి


7_1_211 వ. అనుచు సంభ్రమాకులచిత్తు లగుచు నున్నంత.

7_1_212 మ. ధరణీ భాగము గ్రక్కునం గదల రథ్యవ్రాతచంచ ద్గతి స్ఫురణం బొప్పఁగ బాణజాలము నభంబుం గప్ప నత్యంత ని ష్ఠుర సంతర్జన ఘోష భీషణ మహాటోపంబు దగ్దంతు లా తురతం బొందంగఁ జేగవచ్చి వడిఁ బార్థుం డగ్గురుం దాఁకినన్.

7_1_213 వ. కౌరవ యోధవరు లొక్కపెట్టు భార్వద్వాజునకు బాసట యై ససైన్యంబుగా సవ్యసాచిం బొదివిన నవ్వీరుండు ఘోరాకారుం డయి గాండీవ చండ నివ్వనంబు లొండొండ నిగుడ నిశిత సాయక పరంపరలు గురసి కపాలోపలంబును మేదోమాంస పంకంబును నస్థిచూర్ణసికతంబును నగు శోణిత నదీ ప్రకరంబును బఱసె నంత గభస్తిమంతుం డస్తశైలాంతరితుం డయినఁ బార్థు బాణాంధ కారంబునకుఁ దోడు సంధ్యాసంతమసంబు గవిసినం గురుసైనికులకుఁ దమవారలు నెదిరివార లని నిరూపింప నశక్యం బగుటయు ద్రోణ దుర్యోధనులు సమరంబు సాలించి వాహినులఁ దివియించినం దిరం బై ధనంజయుండును జయాతూర్య స్వనంబులును బాంచాల కేకయాది బంధుమిత్త్ర ప్రశంసా వచనంబులును వీనులం బొలయఁ దన బలంబుల మరల్చి ధర్మనందనుం గొలిచి చనియె నిత్తెఱంగున రెండు సేనలు దమ తమ విడిదలల కరిగి యథోచిత వ్యాపారంబుల నుండి నాఁటి రాత్రి సనిన మఱునాఁడు.

7_1_214 క. రేపకడ యుభయ బలములు నేపును నెలమియును నెసక మెఁసగ వెడలి యా టోపంబున రణ సన్నా హోపక్రమలీల మెఱయ నుజ్జ్వల భంగిన్.

7_1_215 వ. ఉన్న సమయంబున లజ్జా విషాదంబులు మొగంబునం దోఁప ద్రోణుండు దుర్యోధనున కిట్లనియె.

7_1_216 చ. నరవర మున్న చెప్పితి రణంబున నర్జునుఁ డొద్దనున్న నె వ్వరికిని ధర్మసూనుఁ బొదువంగ నశక్య మొకండు పార్థును ద్దురుఁ డయు నేల వాసికొని దోర్బల మొప్పఁగఁ బోవఁ జాలినన్ వెరవునఁ బట్టెదం బరులు వేవురు మార్కొనినం గలంచెదన్.

7_1_217 ఆ. నరుఁడు లేనిచోయ ననుఁ గని వెన్నిచ్చి పాఱకున్నఁ బట్టు వడియెఁ గాఁగఁ దలఁపు ధర్మపుత్త్రు ధరణీశ పాఱుట గలిగెనేని నంతకంటె మేలు.

7_1_218 వ. అనిన విని సుశర్మ దుర్యోధనున కిట్లనియె.

7_1_219 క. ఆ నరుఁ డెప్పుడు మము నవ మానించుచు నునికిఁ జేసి మనుజేశ్వర కో పానలము సంతతము మా మానసములఁ బొదువ నతని మార్కొను కడఁకన్.

7_1_220 తమకించు చుందుము నీకు బాస యిచ్చి పెద్ద కాలం బయ్యె నేఁడు రణభూమి యందు నర్జునుం డొండెఁ ద్రిగర్తు లొండెం గావలయు నే మతనిఁ బెద్ద కయ్యంబులోనం బాపికొని పోవుట నీ చిత్తంబునకు వచ్చున కాదె యనవుడు నతని తమ్ములు సత్యవ్రతుండును సత్యకర్ముండును సత్యవర్ముండును నిబ్భంగిన పలికిరి వాలర పక్షం బైన రథిక వర్గంబు నిత్తెఱంగున నియ్యకొని యుల్లసిల్లె నిమ్మెయిం ద్రిగర్తలు పదివేవురు దొరలు గడంగినం గని తుండి కేరఙ మాళవ శిలీంధ్ర మగధ మచ్ఛిల్లి కాది దేశాధీశులును బంధుమిత్త్ర సహితంబుగా నివ్విధంబున వారితోడి వారై పంతంబులు పలిగి యబ్బునం బొంగిరిట్లప్పరుసున సగణ్య రథికోత్తము లుత్సహించి కృతస్నానులై యగ్నులం బూజించి తత్సన్నిధి సర్వయోధులు నాకర్ణింప నందఱు నిట్లనిరి.

7_1_221 సీ. అర్జునుఁ జంపుదు మతని కోడితిమేని గో వధంబును వనితా వధంబు బ్రహ్మ వధంబును బరదార గమనంబు బ్రహ్మ స్వహరణంబుఁ బర ధనాప హరణంబు గురుజన త్యాగంబు శరణాగతా రక్షణము ననృతాభిరతియు మద్యపానము నర్థిమానస వైముఖ్యమును గృహ దాహంబు జనుల నెట్టి

ఆ. గతులఁ బుచ్చు నట్టిగతులు వాటిలు నక్కి రీటి కోలుతలకు నోట లేక దురము సేసి తగినతుది గన్నపుణ్యాత్మ కలితగతుల మేలు గలుగు మాకు.

7_1_222 వ. ఆని సంశాపంబులు పలికి సంశప్తకు లనేక రథిక ముఖ్యులు బహుళ చతురంగ బల వరివృతులై కురురాజు సంతసిల్ల నుల్లాసంబునం జనిరి గురుండును గరుడ వ్యూహంబు సమకట్టి దానికిఁ జంచు వై తాను నిలిచె దుర్యోధనుండును దమ్ములుం దలయును గృపకృతవర్మలు గన్నులును సింహళాభీర శూరసేన కేకయ ప్రముఖులు మెడయును బాహ్లిక భూరిశ్రవ స్సోమదత్త శల శల్యులు వలపతి ఱెక్కయు నశ్వత్థామ సుదక్షిణ విందానువిందులు డాపలి ఱెక్కయు శకుని పౌండ్ర కళింగాంబష్ఠ మాగధులు వెన్నును నానాజన పదసేనా సమన్వితుం డై సూత పుత్త్రుండు పూచ్ఛంబును సైంధవాది వివిధ దేశాధీశులు నెడనెడు గలయన్ బెరసి యొడలి పొలుపును బలుపును నై నిలువ నియోగించిన నమ్మోహరంబు మహా పవన సముద్ధూత సాగరాకారం బై యుత్సాహ నృత్యంబు సేయ చందంబునం జూడ నొప్పె నందు మధ్యమ ప్రదేశంబున భగదత్తుండు గజారూఢుం డై యుదయాచలంబు పైఁ బొలుచు భానుండునుం బోలెఁ దేజరిల్లుచు నుండె నంత నక్కడం ద్రిగర్తాదులు పాండవ సేన దక్షిణ దిక్కునకుం జని సమరంబునకు సవ్యసాచిం దొలంగం బిలుచుటయు నన్నర శార్దూలుం డన్నతో నిట్లనియె.

7_1_223 చ. తఱిమి సుశర్మ దమ్ములును దానును నాజికి నన్నుఁ బిల్వ నే నెఱుఁగనియట్టు లుండు టిది యే పురుషార్థము వారి నెల్ల నే డ్తెఱ నుఱుమాడఁ బంపుము కడిందిగఁ జూడకు నీకు నేమియుం గఱగొఱ గాదు పోమి గడుఁ గష్టము నాకు నుదాత్త మానసా.

7_1_224 వ. అనుటయు నయ్యుధిష్ఠిరుండు.

7_1_225 తే. గురుని బల శౌర్యములు నెఱుంగుదుము మనకు నతని పూనికి బొంకు సేయంగ వలయు దీని కెయ్యది కార్యంబు దాని నీవు బుద్ధి నుచితంబుగాఁ దలపోయు మనుడు.

7_1_226 వ. ధనంజయుం డతని కిట్లనియె.,

7_1_227 చ. పిలిచినఁ బోవకుండు టిది బీదతనం బగుఁ గాన నేర్పుగాఁ దలఁపదు లోక మే నరివధం బొనరింపఁగ నెట్లుఁ బోయెదం జలము బలంబు ధైర్యమును శౌర్యమునుం గలవాఁడు వీఁడు నేఁ డలఘుఁడు గుంభ సంభవుని నాఁగు భవత్పరిరక్షణార్థి యై.

7_1_228 వ. అని పాంచాల వరుం డగు సత్యజిత్తుం జూపి.

7_1_229 క. ఇతఁ డున్న యంత సేపును మతి నేమియు వెఱవ వలదు మార్తుర చేతన్ హతుఁ డయ్యెనేని నిలుచుట చతురత గా దనికిఁ దొలఁగి చనవలయు నృపా.

- అర్జునుఁడు ధర్మజుచే ననుజ్ఞాతుం డై సంశప్తకుల పైఁ బోవుట - సం. 7-16-44

7_1_230 తే. అనిన నొడఁబడి యట్ల కా కనుడు నన్న రేంద్రునకు భక్తి మ్రొక్కి సురేంద్రపుత్రుఁ డతని చేత దీవన గొని యవ్వరోధు లున్న దెస కేఁగె సంతోష ముత్కటముగ.

7_1_231 వ. ఇట్లు ధర్మజుని యొద్ద వాసి విజయుండు చనుటకు నుబ్బిన మన సైన్యంబులం గనుఁగొని యమ్మహీపతి ధృష్టద్యుమ్నుతో గౌరవులు గరుడ వ్యూహంబుగా మోహరించిన వారు దీనికి నీవుం దగ మండలార్ధ వ్యూహంబు సమకట్టు మని పనిచిన నతం డట్ల చేసె నివ్విధంబున నుభయ వ్యూహంబులును గాఢ సన్నాహంబు లై శంఖభేరీ సముఘ తూర్యస్వనంబులు సెలంగ నడువాన కాలంబునం బొంగిన గంగా యమునలుఁ బోలె నొఁడొంటిం దార్కొను సమయంబున నయ్యజాత శత్రుండు ద్రుపద పుత్రు నాలోకించి గురుం జూపి.

7_1_232 క. నేఁ డీ బ్రాహ్మణు చేతం బోఁడిమి సెడి యేను జిక్కి పోవక యుండన్ వేఁడిమి మెఱయు శరంబుల వాఁడిమి సొం పెల్లఁ జూప వలయుం జుమ్మీ.

7_1_233 క. అనుడు నతఁడు నవ్వుచు ని ట్లను నే నా గంగ ద్రోణుఁ డని నినుఁ గదియం జనువాఁడె యింత యేటికి నను నీతఁడు గెలువ లేఁడు నమ్ము మధీశా.

7_1_234 వ. అని పలికి పారావత వర్ణాశ్వవర్ణనీయరథుం డగు నయ్యతిరథుండు గుంభ సంభవునకు సమ్ముఖంబుగా నడచుటయు నా ధృష్టద్యుమ్ను దర్శనంబు దనకు నరిష్టం బగుటయు నగ్గురుం డొక్కింత విన్న నై యతని దిక్కు దేఱిచూడం జాలక క్రీడించి పాంచాల బలంబుపై నిశిత విశిఖంబులు పరగించుచుం బాయ వడ నడరె నంత నక్కడ.

7_1_235 సీ. క్రీడి యాఁకొని యున్న కేసరి హరిణ చయము మీఁదఁ జనునచట్టు లా త్రిగర్త వరులపై నరుగంగ వా రటము న్నర్థ చంద్రాకృతిగ నొడ్డు సంఘటించి కొని యుండి యాతనిఁ గని ప్రీతి నార్పులు బొబ్బలుఁ జెలఁగంగఁ బొంకుటయును జూచుచు నా సవ్యసాచి మందస్మితుఁ డై కృష్ణుతోడ ని ట్లనియెఁ జూడు

ఆ. మెక్కు డైన రవము నెసకంపుటుబ్బునఁ బొదలుచున్న వారు మదము కతన నెదిరిఁ దమ్ము నించుకేనియు నెఱుఁగరు వీరు క్రొవ్వి చావ వేఁడి రకట.

7_1_236 వ. అని మఱియును.

7_1_237 క. తగు సంతసింపఁ గుజనుల కగపడని విశిష్టగతికి నస్మద్దివ్యా శుగముల చేఁ బోఁ గనుటను విగత భయత్వంబు సమరవిధి కొప్పుఁ గదా.

7_1_238 వ. అనుచు జేర నడచి దేవదత్తంబు పూరించిన.

7_1_239 ఉ. ఆ నినదంబు సాంద్రముగ నాకస మంతయు నిండఁ బర్వుడున్ మానసముల్ గలంగి యభిమానము ధైర్యముఁ దూలి విద్విష త్సేన నితాంత నిశ్చలతఁ జిత్ర సమర్పిత మూర్తియై యనం గా నులి వేది యుండియును గ్రమ్మఱఁ దేఱె రవంబు మీఱఁగన్.

7_1_240 వ. ఇట్లు దెలివొంది యొండొరులం బురుకొలిపికొని సంశప్తకు లొక్కపెట్ట ఫల్గును పయిం బటు శర పరంపరలు గురిసి రతండు దవ్వుదవ్వులఁ బదియేను వేల రథంబుల వారిం గూల్చినం బెలుచ నబ్బలంబు లడరి.


http://www.volamsite.com