ఆ భా 2 1 121 to 2 1 150

వికీసోర్స్ నుండి

సీ. రక్షణంబున భగీరథుఁడు జయంబున నయ్యౌవనాశ్వుండు నత్యుదగ్ర బాహు బలంబున భరతుండు తపమునఁ గార్తవీర్యుండును గరము బుద్ధి నమ్మరుత్తుండును నఖిల సామ్రాజ్యంబుఁ బడసిరి తొల్లి భూపాల యిప్పు డిన్ని గుణంబులు నెన్నంగఁ గలవు నీకిదియేమి దుర్లభ మిద్దురాత్ముఁ

ఆ. డెంత బలియుఁ డయ్యు నెంత గర్వితుఁడయ్యుఁ దన కఠోర దుష్ప్రతాపమునను విగత విభవుఁ డగు వివేకహీనుల కైన లక్ష్మి సుచిర మగునె యెందు. 121

భీమ సేనార్జునులు ధర్మరాజున కుత్సాహంబు గల్గించుట

వ. అనిన విని భీమసేనుండు ధర్మరాజున కిట్లనియె. 122

క. ఆరంభ రహితుఁ బొందునె యారయ సంపదలు హీనుఁ డయ్యును బురుషుం డారంభ శీలుఁ డయి యకృ తారంభుల నోర్చు నెంత యధికుల నయినన్. 123

క. కడు నధికుతోడఁ దొడరినఁ బొడిచిన నొడిచినను బురుషు పురుషగుణం బే ర్పడుఁ గాక హీను నొడుచుట కడిఁదియె పౌరుషము దానఁ గలుగునె చెపుమా. 124

క. ఈ హరికరుణయు నర్జును సాహాయ్యముఁ గలుగ నీ ప్రసాదమున జగ ద్ద్రోహు జరాసంధు మహా సాహసు వధియింతు నుగ్ర సంగ్రామమునన్. 125

తే. అనఘ యేముమువ్వురము మూడగ్నులట్లు నీ మహాయజ్ఞ కార్యంబు నిర్వహింతు మా జరాసంధ పశువున నఖిల శాత్ర వాహుతులఁ జేసి తృప్తుల మగుచు బలిమి. 126

వ. అనిన భీమసేను విక్రమవచనంబుల కనుగుణంబుగా నర్జునుం డిట్లనియె. 127

ఉ. భూభుజులన్ జయింపుము విభూతి నొనర్పుము రాజసూయమున్ నా భుజ వీర్య విక్రమ గుణంబులకుం దగు చున్న యీధను ర్లాభము దివ్యబాణ రథలాభము శోభిత మైన యీ సభా లాభము నొండుపాట సఫలత్వముఁ బొందునె కౌరవేశ్వరా 128

క. కులరూప గుణ ద్రవ్యం బులు విక్రమవంతు నందు భూ విదితములై నిలుచు, నవిక్రమునకు నవి గలిగియు లేని క్రియ నప్రకాశంబులగున్. 129

వ. మఱియు రాజసూయ మహాధ్వరంబు కారణంబుగాఁ బరాక్రమంబున జరాసంధు వధియించి నిఖిల క్షత్త్రియ నిగ్రహ మోక్షణంబు సేయునంత కంటె మిక్కిలి యశోధర్మంబు లొం డెవ్వి భీమార్జునుల పలుకులకు సంతసిల్లి నారాయణుం డిట్లనియె. 130

క. వెలయ విధిదృష్ట నయమున వలయుఁ బరాక్రమము సేయ వసుధేశ్వర య గ్గల మగు బుద్ధియుఁగడఁకయుఁ గల పురుషుల కిదియ చూవె కర్తవ్యమిలన్. 131

వ. కావున మేము మువ్వురముఁ గ్రమంబునం బరాక్రమించి జరాసంధు డాసి నదీ ప్రవాహంబులు వృక్షోన్మూలనంబు సేయునట్లు క్రమంబున వాని నిర్మూలితుం జేసెద మద్దురాత్ముండు భూతంబులయం దంతరాత్మయుం బోలెఁ దన యంతరం బెఱుంగక యే కాంతశీలుఁ డై సుఖం బనుభవించుటం జేసి వాని యంతికంబున కరుగుట యశ్రమం బనిన నారాయణునకు ధర్మరా జిట్లనియె. 132

క. దనుజహిత నీ కాహవమున నెదిరి మహోగ్రదహనమునఁ బడియిను గా లనిమిడుతవోనె నతికో పనుఁడు జరాసంధుఁ డెట్లు బ్రదుకఁగ నేర్చున్. 133

క. అట్టి యతిదారుణత్వము నట్టియజేయ భుజవిక్రమాధిక్యము వాఁ డెట్టి క్రియఁ బడసె నాతని పుట్టిన విధ మెట్లు చెప్పు పొలుపుగ నాకున్. 134

వ. అని యడిగిన ధర్మరాజునకుఁ గృష్ణుం డిట్లనియె. 135

సీ. అతి సమర్థుండు బృహద్కథుం డనువాఁడు మగధాధి నాథుఁ డున్మార్గదూరుఁ డక్షౌహిణీ త్రితయంబు బలంబునఁ బరుల నోడించిన బనిమికాఁడు కాశిరాజను వాని గాదిలి కూఁతులఁ గవల వారల నతి కాంతిమతుల నమరంగఁ బెండ్ల యై యనుపమ ప్రీతి నయ్యిరవుర యందు భోగేచ్ఛ సలిపి

తే. యం దపత్యంబు పడయదు నని తలంచి విప్రముని దేవ పూజల వివిధ విధులఁ బుత్త్ర కామేష్టులను నొండు పుణ్యకర్మ యుక్తులను జేసి పడయంగ నోప కలసి. 136

వ. పుత్త్రుఁడు లేని విభవంబు లన్నియు నేల యని నిర్వేదించి పత్నీద్వయ సమేతుండయి వనంబున కరిగి. 137

ఉ. ఆవిపినాంతరంబున నిరంతరనిష్ఠ ననంత మోక్షకాం క్షావిధి నొక్క బాలసహకారమహీజము క్రింద నుజ్జ్వల త్పావకతేజుఁడై తపము పాయక చేయుచు నున్న ధన్యుఁ గా క్షీవతుఁ గాంచె గౌతము నకిల్బిషమానసుఁ జండకౌశికున్. 138

క. ధరణీశ్వరుఁ డమ్మనివరుఁ బురాతనమునిన్, నిరాశుఁ, బుణ్యాత్ము, నిరం తరకృత నియమ సపర్యా వరివస్యుం డగుచు భక్తి వదలక కొలిచెన్. 139

వ. ఇట్లుపాస్యమానుం డయి చండకౌశికుండు బృహద్కథునకు నీ కిష్టంబు చెప్పు మిచ్చెద ననిన వినయవినమితోత్తమాంగుం డయి వాఁ డిట్లనియె. 140

ఉ. సంతత మైన సర్వసుఖసంపద గల్గియు దానికిం దగన్ సంతతి లేమిఁజేసి యది సర్వము హేయమకాఁ దలంచి ని శ్చింతుఁడ నై ధృతిం దపము సేయఁగ వచ్చితిఁ బుత్త్ర జన్మ మై నంతన యేను మీదయఁ గృతార్థతఁ బొందుదు సన్మునీశ్వరా. 141

వ. అనినం గరుణించి మునివరుండు పరమ ధ్యాన ముకుళిత నయనుం డై యున్నంత. 142

క. పవన విధూతము శుకచం చువిలూనముఁ గాక యొక్క చుతఫలం బ య్యవనిజమువలన నమ్ముని ప్రవరుపృథూత్సంగతలము పైవడిఁ బడియెన్. 143

వ. దానిం బుచ్చికొని యభిమంత్రించి చండకౌశికుండు బృహద్రధున కిచ్చి యీ ఫలంబువలన నీకొక్క పుత్త్రుం డుద్భవిల్లు నని చెప్పిన నాతండును గృతార్థుండై క్రమ్మఱి నిజపురంబునకు వచ్చి తన యిద్దఱు భార్యలకు నప్పండు సమంబుగా విభాగించి పెట్టినం దత్ఫలోపభోగంబున నయ్యిద్దఱు గర్భిణు లయినఁ బదియగు మాసంబున నొక్కనాఁటి రాత్రియందు వారలకు. 144

క. ఒక్కొక కన్నును జెవియును, జెక్కును, జను, బొడ్డు, మూఁపుఁ, జెలు వగుచేయున్ బ్రక్కయుఁ, గుఱువును, గాలును నక్కజముగ మనుజ శకనమై యుదయించెన్. 145

క. అమ్మానిసి వ్రయ్యలు గని యమ్ముదితలు వెఱచి వీని నాత్మజూఁ డని నె య్యమ్మున నెట్టులు చూపుదు మిమ్మును జేశ్వరున కనుచు నెంతయు లజ్జన్. 146

వ. వీని నెవ్వరున్ నెఱుంగ కుండ వెలుపల వైచి రం డని తమ దాదులం బంచిన వార లా రెండు వ్రయ్యలుం గొనిపోయి రాజ గృహద్వార తోరణ సమీపంబునఁ జదుకంబునొద్ద నొక్క చోట వైచిన నచ్చదుకంబున నుండెడు రాక్షసి జర యనునది వాని బలియ కా వగచి పఱతెంచి. 147

ఆ. ఎత్తికొని చనంగ ని మ్మగునట్లుగా మెదలు చున్న వ్రయ్య లదిమి రెంటిఁ గూడఁబట్టె నవియుఁ గూడి యొండొంటితోఁ జక్క నంటి రెండు నొక్కఁడయ్యె. 148

వ. అబ్బాలకు రోదన ధ్వని విని యంతిపురంబున నున్న ముదుసలి యవ్వ లెల్లం బఱతెంచి మహా హర్షంబుతో వాని నెత్తికొని రట్టి సంభ్రమంబెఱింగి బృహద్రథుండు వచ్చి తేజోధికుం డయి తామ్రతల ముష్టిం దనముఖ పద్మంబునం బెట్టికొని దిక్కులు సెలంగ నేడ్చుచున్న కొడుకుం జూచి కృతార్థీకృత లోచనుండయ్యె నట్టి యవసరంబున నారాక్షసి కామరూపిణి గావున మనుష్య స్త్రీ రూపధారిణి యయి యమ్మగధరాజున కిట్లనియె. 150


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com