ఆ భా 1 4 9 to 1 4 44

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

1_4_9 కందము ఆతని రాజ్యంబున ను ర్వీతలము ప్రజాసమృద్ధి వెలసి రుజాశో కాతంకక్షయశంకా పేతం బై ధర్మచరితఁ బెరుఁగుచునుండెన్

1_4_10 వచనము అమ్మహీపతి యొక్కఁనాడు మృగయావినోదార్థి యయి యాదిత్యహయం బులకంటె వడిగలవాహనంబులు పూని రథం బెక్కి యాజానేయతురంగా రూఢులైన యాశ్వికులు పరివేష్టించి రాఁగ ననంతకుంతశక్తిచాపకృపాణ పాణు లయిన వీరభటసహస్రంబులతోఁ జని వనంబులోని మృగంబులం జుట్టిముట్టి।

1_4_11 కందము కలయఁగ నార్పుల బొబ్బల యలివున నవ్విపిన మనుమహోదధిఁ బెలుచం గలఁచెను దుష్యంత మహా బలమందరనగము సత్త్వభయజననం బై।

1_4_12 కందము సరభసపరిచలితమహా శరభద్విపరిపువరాహశార్దూలమద ద్విరదాదిప్రకరభయం కరవనమధ్యమున నృపతి గడుఁ గడిమి మెయిన్।

1_4_13 కందము ఓసరిలి పఱచుమృగముల నేసియు డాసినమృగముల నెగచి భుజాసిన్ వ్రేసియుఁ జంపెను మృగయా వ్యాసక్తి నపారఘోరవన్యమృగాలిన్।

1_4_14 వచనము ఇట్లు పెక్కుమృగంబుల నెగచి చంపుచు మఱియుఁ జంపెడు వేడుక నతి దూరంబున కరిగిన నాతనిరథవేగంబు ననుగమింప నోపక యధికక్షుత్పిపాసా పరవశు లయి పదాతు లయ్యయిప్రదేశంబుల విశ్రమించి రంత దుష్యంతుండు కతిపయామాత్యపురోహితసహితుండై కొండొకనేల యరిగి ముందట నొక్క పుణ్యనదీతీరంబున వివిధసురభికుసుమఫలభారవినమ్రతర ులతాగుల్మపరిశో భితం బయిన యొక్కవనంబు గని।

            -: కణ్వాశ్రమ వర్ణన :-

1_4_15 కందము అమరపతిఖాండవమునకు రమణను వైశ్రవణుచైత్రరథమునకు సమా నముగా దీనిని భూభా గమునను రచియించె నొక్కొ కమలజుఁడు దయన్।

1_4_16 వచనము అని దానిరమణీయభావంబుఁ బొగడుచు జనుదెంచి యవ్వనంబు సొచ్చు నప్పుడు

1_4_17 చంపకమాల అతిరుచిరాగతుం డయిన యాతనికిన్ హృదయప్రమోద మా తతముగ నవ్వనంబున లతాలలనల్ మృదులానిలాపవ ర్జితకుసుమాక్షతావళులు సేనలు వెట్టిన యట్టి రైరి సం పతదళినీనినాదమృదుభాషల దీవన లొప్ప నిచ్చుచున్।

1_4_18 వచనము

మఱియును

1_4_19 కందము కాఱడవిఁ బఱచుమృగముల నూఱడకం దిగిచి డస్సి యున్నతనిశ్రమం బాఱఁగ నెడఁ బరితాపము దీఱఁగఁ బై వీచె నన్నదీపవనంబుల్।


1_4_20 మానిని ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల నిమ్మగుఠావులజొంపములం బూచినమంచియశోకములన్ సురపొన్నలఁ బొన్నల గేదఁగులం గాచి బెడంగుగఁ బండిన యాసహకారములం గదళీతతులం జూచుచు నీనుల కింపెసఁగన్ వినుచున్ శుకకోకిలసుస్వరముల్।

1_4_21 కవిరాజవిరాజితము చనిచని ముందట నాజ్యహవిర్ధృతసౌరబధూమలతాతతులం బెనఁగినమ్రాకుల కొమ్మమీఁద నపేతలతాంతము లైనను బా యని మధుపప్రకరంబులఁ జూచి జనాధిపుఁడంత నెఱింగెఁ దపో వన మిది యల్లదె దివ్యమునీంద్రునివాసము దా నగు నంచు నెదన్

1_4_22 వచనము ఇట్లు హృదయసుఖావహం బగుచున్న యవ్వనంబులో నరిగి యరిగి యన వరతమహాద్విజపఠ్యమానవేదధ్వనులను నవిచ్ఛిన్నహూయమానాగ్నిహోత్ర స్వాహాశభ్దంబులను ననేకమునిగణప్రణీతవచనవిషయవిభాగవినిర్ణయ న్యాయనిపుణవిద్వత్సభాసంభాషణఘోషంబులను బ్రతిపక్షదుర్విభేదప్రమాణ విచార్యమాణవేదార్థమీమాంసకగోష్ఠీవివాదనాదంబులనుం జేసి మ్రోయుచు యజ్ఞ ప్రయోగప్రవీణు లయిన యాజ్ఞికులకును విహితానుష్ఠానాసక్తు లయిన యనుష్ఠాతలకును నధితతపోనిరతు లయిన మహాతపోధనులకును నివాసం బయిన పుణ్యనదీతీరంబునఁ దదయు రమ్యం బయి గంగాతీరంబున నర నారాయణస్థానంబునుంబోలె జగత్పావనం బైన కణ్వమహామునియాశ్ర మంబు గని యందు

1_4_23 సీసము శ్రవణసుఖంబుగా సామగానంబులు

  చదివెడు శుకములచదువు దగిలి

కదలక వినుచున్న కరులయు గరికర

 శీతలచ్ఛాయఁ దచ్ఛీకరాంబు

కణముల చల్లనిగా డ్పాసపడి దానిఁ

 జెంది సుఖం బున్న సింహములయు

భూసురప్రవరులు భూతబలుల్ చెచ్చి

 పెట్టు నీవారాన్నపిండతతులు

తేటగీతి గడఁగి భక్షింప నొక్కటఁ గలసి యాడు చున్న యెలుకలుఁ బిల్లులయొండుసహజ వైరివర్గంబులయు సహవాస మపుడు సూచి మునిశక్తికెంతయుఁ జోద్య మంది।

1_4_24 వచనము ఇక్కాశ్యపుం డైన కణ్వమహామునీంద్రునకు నమస్కరించి వచ్చెద నావచ్చు నంతకు నందఱు నిచ్చోటన యుండు నది యని

1_4_25 చంపకమాల వలయునమాత్యులం దగినవారల నుండఁగఁ బంచి ధారుణీ తలవిభుఁ డొక్కరుండ చని తన్విఁ బయోజదళాయతాక్షి సం కులమిళితాళినీలపరికుంచితకోమలకుంతలన్ శకుం తల యను కన్యకం గనియెఁ దన్మునివల్లభుమందిరంబునన్

1_4_26 వచనము అదియును ననంతవిలాసంబున జయంతుండపోని దుష్యంతు నెఱింగి యతి సంభ్రమంబున నాసనార్ఘ్యపాద్యాదివిధులం బూజించి కుశలం బడిగి యున్న నక్కన్యకం జూచి దుష్యంతుం డిట్లనియె

1_4_27 ఉత్పలమాల క్రచ్చఱ వేఁట వచ్చి యిట కణ్వమహామునిఁ జూచి పోవఁగా వచ్చితి మెందు బోయిరొకొ వా రనినన్ విని యాలతాంగి వా రిచ్చట నుండి యీక్షణమ యేఁగిరి కానకుఁ బండ్లు దేర మీ వచు టెఱింగిరేని జవల్లభ రారును వత్తు రింతకున్

1_4_28 వచనము వచ్చునంతకు నొక్కముహూర్తం బుండునది యనిన విని యక్కోమలి వినయంబునకు మృదుమధురవచనంబులకు సంతసిల్లి దానిం కన్యకఁగా నెఱింగి మనోజరాజ్యలక్ష్మియుంబోని దాని సర్వలక్షణలక్షితంబు లయిన సర్వా వయవంబులుం జూచి సంచలితహృదయుండై నీ వెవ్వరికూఁతుర విట్టి రూపలావణ్యవిలాసవిభ్రమగుణసుందరి విందుల కేల వచ్చి తని యడిగిన నది యిట్లనియె

 -: శకుంతల దుష్యంతునకుఁ దన జన్మక్రమం బెఱింగించుట :-

1_4_29 కందము జగతీవల్లభ యే న త్యగణిత ధర్మస్వరూపుఁ డని జనముల దన్ బొగడఁగ జగదారాధ్యుం డగు కణ్వమహామునీంద్రునాత్మజ ననిన్

1_4_30 చంపకమాల ఇది మునికన్య యేని మఱి యేలొకొ యీలలితాంగియందు నా హృదయము దద్దయుం దవిలె నిప్పలు కింకను నమ్మనేరన య్యెద విజితేంద్రియుం డనఁగ నిమ్మునిఁ బాయక విందు నంచు దా నిది కలరూ పెఱుంగ ననీపతి యుత్సుకుఁ డయ్యె నాత్మలోన్

1_4_31 వచనము ఇట్లు దుష్యంతుం డాశకుంతలజన్మం బెఱుంగ వేఁడి వెండియు దాని కిట్లనియె

1_4_32 తేటగీతి ఉత్తమాశ్రమనిష్ఠితుంఁ డూర్ధ్వరేతుఁ డైన కణ్వమహాముని యనఘచరితుఁ డట్టిముని కెట్లు గూఁతుర వైతి దీని నాకు నిఱుఁగంగఁ జెప్పుము నలిననేత్ర

1_4_33 వచనము అని యడిగిన నారాజునకు శకుంతల యిట్లనియె

1_4_34 కందము ఇక్కమలాక్షి శకుంతల యెక్కడియది దీనిజన్మ మెవ్విధ మని త మ్మొక్క మునినాథుఁ డడిగిన నిక్కాశ్యపు లర్థిఁ జెప్పి రేను వినంగన్

1_4_35 వచనము నాజన్మప్రకారంబు మాయయ్య యమ్మునికిం జెప్పినవిధంబు చెప్పెదఁ జిత్త గించి విను మని యాదుష్యంతునకు శకుంతల యిట్లనియె

1_4_36 సీసము అనఘుఁడు రాజర్షి యై తపశ్శక్తిమై

 బ్రహ్మర్షిభావంబుఁ బడసి యున్న

సన్మునీశ్వరుఁడు విశ్వామిత్రుఁ డతిఘోర

 తపము సేయుచునున్నఁ దత్తపమున

కెంతయు వెఱచి దెవేశ్వరుఁ డప్సరో

 గణములలో నగ్రగణ్య యైన

దాని మేనక యను ధవలాక్షిఁ బిలిచి వి

 శ్వామిత్రు పాలికిఁ జని తదీయ

ఆటవెలది ఘోరతపము చెఱిచి కోమలి నాదైన దేవరాజ్యమహిమఁ దివిరి నీవు గావు మనిన నదియుఁ గడు భయంపడి యమ రేశ్వరునకు మ్రొక్కి యిట్టు లనియె

1_4_37 చంపకమాల వనజభవప్రభావుఁ డగువాని వసిష్ఠు నపత్యశోక మ న్వననిధిలోన ముంచిన యవారితసత్త్వుఁడు నిన్నుఁ దొట్టి యీ యనిమిషు లెల్ల వానికి భయంపడుచుండుదు రట్టి యుగ్రకో పనుకడ కిప్పు డేఁగు మని పాడియె యిప్పని నన్నుఁ బంపఁగన్

1_4_38 ఉత్పలమాల అమ్ముని యల్గి చూచుడును నా క్షణమాత్రన గోత్రధారుణీ ధ్రమ్ములు వ్రయ్యు నయ్యిసుము దక్కఁగ నంబుధు లింకు మూఁడు లో కమ్ములు దిర్దిరం దిరుగు గాడ్పు చలింపఁగ నోడు నుగ్రతం బమ్మిన యట్టి కోపపరుపాలికి భామలు వోవ నోడరే

1_4_39 వచనము అయినను నానేర్చు విధంబున నమ్మునివరుచిత్తంబు మెత్తన చిత్తజాయత్తం బగునట్లుగాఁ జేసెద నని వాసవు వీడ్కొని మేనక తనకు మందమలయా నిలంబు దోడుగాఁ జనుదెంచి హిమవత్పర్వతప్రదేశంబునం దపంబు సేయు చున్న విశ్వామిత్రుతపోవనంబు సొత్తెంచిన

1_4_40 కందము చల్లని దక్షిణమారుత మల్లన వీతెంచెఁ దగిలి యాలలనాధ మ్మిల్ల కుసుమాంగనరాగస ముల్లసనసుగంధి యగుచు మునివరుమీఁదన్

1_4_41 వచనము

అంత

1_4_42 చంపకమాల అనిమిషకాంతయున్ నవలతాంతవిభూషణలీల నల్లన ల్లన వనకేళిలాలసవిలాసగతిం జనుదెంచి ముందటం గనియె మహామునిప్రవరుఁ గౌశికుఁ గౌశికచిత్తభీతసం జననమహాతపశ్చరణసంయతచిత్తు నిరస్తచిత్తజున్

1_4_43 కందము అంబుజలోచన కడువిన యంబున నమ్మునికి మ్రొక్కి యనురాగముతో డం బుష్పాపచయవ్యా జంబున విహరించుచుండె సఖులుం దానున్

1_4_44 చంపకమాల అలసత యొప్పఁగాఁ దరుణి యమ్మునివల్లభుమ్రోల నున్న సం మిళితసుగంధబంధురసమీరవశంబునఁ దూలి బాల సై వలు వెడలన్ బయ ల్పడియె వల్దకుచంబులుఁ గక్షయుగ్మమున్ లలితకృశోదరంబుఁ దరళత్రివళీయుతరోమరాజియున్

"https://te.wikisource.org/w/index.php?title=ఆ_భా_1_4_9_to_1_4_44&oldid=2701" నుండి వెలికితీశారు