ఆబ్రహాము లింకను చరిత్ర/రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

బోవు ప్రకరణమున నాబ్రహాము లింక నింకొక విషయమున జదువరుల మనంబుల కాహ్లాద మొస గెడనుగాత.

_______

రెండవ ప్రకరణము

బాల్యము.

ఆబ్రహాము తల్లిదండ్రులు నివసించుచుండిన దేశస్థితిని గుఱించి యిదివఱకేవ్రాసియుంటిమి. అప్పుడు దేశమునకు దగిన విద్యాశాలలును, విద్యాశాలలకు దగిన యుపాధ్యాయులును అరుదు. మనదేశమునగూడ గ్రామము లనేకములయందు బళ్లు లేకుండుటయును, ఉన్నచో నైన తగుపంతులవా రుండకపోవుట దటస్తించుటయు సర్వసాధారణము. పూర్వ నాగిరకు లగుప్రజలును నవనాగరికాగ్రగణ్యు లగు ప్రభువులును గల హిందూదేశమే యిరువదియవశతాబ్దంబున నిట్టి దుర్దశయం దుండ నిప్పటి కొక శతాబ్దమునకు ము న్నప్పుడప్పుడ గన్నులు దెఱచుచుండిన యా కెంటకీ సీమయందు విద్యాసాధనము లతి యరు దనిన నేమివింత. అందున లక్ష్మీప్రసాదములేని యదృష్ట హీనులకు సరస్వితి చెలిమి కష్టసాధ్యము. థామసు లింకను రొట్టెముక్కకంటె నెక్కు డాశించినవాం డయ్యును దనబిడ్డల జదివించ బ్రయాసపడు చుండును. మొట్టమొదట ఆబ్రహాము లింకను ప్రవేశించిన పల్లెకూటము రైని యను నుపాధ్యాయునిచే నుంచబడి యుండెను. అత డచటికి గ్రొత్తగా వచ్చినవాడు. ఉపదేశమునకు వలయు సామగ్రి యెంతమాత్రమును గలవాడు గాడు. తన శిష్యులకు వాచకముమాత్రము నేర్ప గలవాడు. వ్రాత గఱపుట కాతనికి జాతుర్యము చాలదు. మిక్కిలి బీదవా డగుట నాతడు దనకొద్ది రాబడి కేదో మఱికొంత జేర్చి జీవనోపాయ మేర్పఱచు కొన నీపనికి బూనెను. అతనికంటె సమర్థు డిం కొకరుడు దొరకనందున దలిదండ్రు లాతని శిక్షకై తమ బిడ్డల ననుప నియ్యకొనిరి. ఇట్టి గురువుకడ నాబ్రహాము లింకను తలిదంద్రులతనికి విద్య యెంతెంత చేకూరిన నంతంత లాభకారి యగునని నమ్మి యతనిని అతనిసోదరి సారాను విద్యాభ్యసనమునకు బంపిరి. అచ్చటి పుస్తక భాండాగారమున శిధిల మైన డిల్ వర్తు వర్ణక్రమ పుస్తక మొండుమాత్ర మొప్పుచుండును. అద్దానినే బహు జాగరూకతతో వారు సంపూర్ణ ఫలాపేక్షచే నుపయోగించిరి. బుద్ధిమంతు లెట్టి స్వల్పసాహాయ్యంబు నైన స్వవృద్ధి కుపయోగించుకొందురుగాదే!

ఇట్లుపాధ్యాయులకడ నాబ్రహాము వాచకము నేర్చుకొనెను. అయిన నా విద్యాలయము చాలకాలము నిలచినది కాదు. అయిదారు వారములలోపల దాని యాయు వుడి గెను బోధకుల పాండిత్య మెండగొలె గాబోలు. శిష్యుల గొంద ఱతనికంటె నెక్కు డక్షరజ్ఞు లయిరనిన నంత యనృతముగా నుండదు. అది యెట్లుండిన నేమి. అబి (అబ్రహాము) సారా రైనిగారి నుండి సెలవు పుచ్చుకొని మరొండు బడికి దఱలిరి.

అయ్యది హేజల్ అను నత డుంచినది. అతడు రైని కంటె పెక్కు మడుంగు లెక్కుడు నేర్చినవాడు. తన శిష్య బృందమునకు వాచక లేఖనములు రెండును సాధారణముగ నేర్ప సమర్థుడు. మొత్తముమీద నత డాబికి బ్రారంభదశయం దుచితవిధమున నుపదేశ మొసగ గలిగియుండెను. అయిన నతని పల్లెకూట మాబ్రాహా మింటికి నాలుగుమైళ్ల దూరము నుండెను. నాంసీ థామసు లీవిషయమును లెక్కకు గొన రైరి. ఎక్కువ వ్రయమునకు గూడ వెనుదీయ రైరి. తమ గడించినదాని నతిమితముగ నుపయోగించుకొని బిడ్డలకు విద్యాసంపత్తి లభించిన జాలు నని యనేక కష్టముల కోర్వనిశ్చయించిరి. నాటినుండి అబిసారాలి రిరువురును ప్రతిదినమును మధ్యాహ్న భోజనమునకు రొట్టెతునక మోసికొని నాలుగుమైళ్లు నడచి విద్యార్థు లై వెడల నారంభించిరి. అప్పుడ యాబ్రహాము విద్యా సంపత్తికి బ్రారంభము. అట నాతడు లేఖనము నభ్యసించెను. దాన నంత ప్రావీణ్య మల వడకుండినను అక్షరముల గూర్చునంతటి సమర్ధతనొంది యుత్సాహకలితుడయ్యెను. వాచకమునమాత్ర మత్యద్భుతశక్తి సంపాదించెను. ఇంతేల. ఎనిమిది పది వారముల దన యుపాధ్యాయు నతటివా డాబ్రహా మాయెనని నొడివిన నతని బుద్ధివిశేషము బయలుపడ గలదు. ఈ విషయము గురువగు హేజల్ గమనించినట్లు నిదర్శనము లున్నవి.

ఆకాలమున నా ప్రాంతమున మత ప్రసంగమున కెడము లేకుండెను. దేవాలయములును, మతవిషయిక సభలును మిక్కిలి యరుదు. ఆప్రదేశమున కప్పుడప్పు డొక మతాచార్యుడు వచ్చుచుండును. దైవికజ్ఞాన మంత గలవాడు గాకున్నను పురోహితన్యూనత జేసియు, సర్వజనప్రియత్వంబున జేసియు, నతడె స్వాగతం బనుభవించుచుండును. అతడును నెడనెడ లింకనుల కుటీరమున నుపన్యసించి తనత్రోవ దా బోవును. కావున సాధారణార్చనలును బైబిలు పఠనమును వారు దమంతకు దామ నెరవేర్చుకొనుచుందురు. ఆబ్రహాము లింకను దల్లి యక్షరజ్ఞురాలు. భాను వాసరంబులను మఱి యితరదినములను దమకు గల పుస్తుక రాజం బొక్కటి బైబిలును పలుమారు చదువుచుండును. దాని వినుట యందును నద్దాని యందలి కథలకు జెవి యిచ్చుటయందును నాబికి మిక్కిలి యాసక్తి. పుస్తకము చదువ నేర్చుకొనుటకు మున్నె యతడు బైబిలునం దెక్కుడుభాగము నెఱింగికొనెను. విద్యాభ్యసనము చేసినతరువాత నాయన కొదవిన ప్రథమ గ్రంథము నదియె. గొప్పవా డై లోక వ్యవహారముల బేరొందునప్పటికి గ్రైస్తవుడు గా కున్నను అతడు బైబిలును మాత్రము మరవలేదు. తఱుచుగ నా గ్రంథస్థితి విషయముల నట్టె ప్రయోగించుచుండె ననుట కనేక దృష్టాంతము లున్న యవి. ఆ యుత్కృష్ట గ్రంథపఠనం బాబ్రహామునందు నమ్రత, సత్యము మొదలగుసద్గుణముల యంకురములను నాటి యతని పురోభివృద్ధికి దోడ్పడెననుట నిర్వివాదాంశము.

కెంటకీ సీమ 'బానిససీమ' యగుట దత్ప్రాంతమున నేదేని యొక 'ముక్తసీమ' గలిగిన నటకు వెడలుదముగా కని లింకనులు వేచియుండిరి. వా రిట్టిప్రయత్నమున నుండుటకు గారణము మఱి యొకటిగలదు. కెంటకీ సీమయందు క్షేత్రస్వామ్య మస్థిర మగుచుండెను. అనేక సంవత్సరము లెండ యనక, గాలి యనక కష్టించి భూమి వృద్ధి జేసికొని యనుభవింతము గదా యని యుండ నోటికివచ్చినకడి జారిపడె నను విధమున భూ స్వాతంత్ర్యం బగోచరం బగుచుంట తటస్థించుచు వచ్చెను. అనేకులు దమ పూర్వీకులు గడించిన స్థితినంతయు గోలుపోయి రిక్తహస్తు లయిరి. ఇట్లు నష్టప్రయాణము వాటిల్లుచుంబం జూచి ప్రతి భూ స్వామియు దన హ క్కెప్పుడు నిరర్ధకం బగునో యని జడియుచుండును. ఈ భయము లింకనులకు గూడ కలిగెను. ఈ రెండు కారణములకును థామసు పర్యట నేచ్ఛ ప్రోద్బలం బొసంగుచుండును. ఇట్టి సందర్భముల 'నిందియానా' ముక్తసీమ గాగలదా యను విమర్శ జరుగుచుండుట విని యా విషయమున థామసు నాంసీ లిరువురును మగ్ను లైరి.

1816 వ సంవత్సరము ఆకురాల కాలమున 'ఇందియానా' ముక్త సీమ యై యునైటెడ్ స్టేట్సు సంఘ రాష్ట్రమున జేరె ననువార్త బయలువెడలెను. సీమాంతరముల నుండి యచటికి జనులు గుంపులు గుంపులుగ దరలుచుండి రనుటయు విశదమాయెను. లింకనులకు గ్రొత్తసీమజొర దత్తరం బొడమె. తమస్థితి నమ్ముకొన గలిగినతోడనే ప్రయాణం బగుట కాయత్త బడిరి. అమ్ముట కియ్యకొనిన గొనువా రొకరు వలయునే యను చింత వారిని బీడింప దొడగె. దేశ కాల గతులను బట్టి యచట గొనువారే గరువైరి. వేచివేచి తుట్టతుదకు 1816 వ సంవత్సరము అక్టోబరునెల మధ్యదినముల దమ కుటీర ద్వారమున నొక నూతన విగ్రహమును కోల్బిని గాంచిరి. అతడ వీరితో బేర మాడ నేతెంచినవాడు. కొద్ది భూస్థితి సంపాదింప నిష్టము గలవా డగుట గోల్బి లింకనుల చేనుల గొన నుద్యమించెను. కాని వాని వెల నొసంగుట కతనికద ద్రవ్యము లేదాయెను. వ్యాపారమునకుగాను చేర్చిపెట్టిన సారాయి మాత్రము దగినంత యుండెను. * లింకను తనభార్య సలహా యడిగి మఱి వేరు మార్గము గానక సారాయి చేయుట నెఱుగని 'ఇందియానా' జనుల కద్దాని నమ్ముకొనిన ద్రవ్యము గడింప వచ్చునని తలచి కోల్బి చెప్పిన మార్గము నవలంబింప నియ్యకొనియెను.+

బేరము ముగిసినతోడనే థామసు దన నవీన నివాస స్థలమునకు దరల నాయత్తము కావలసి వచ్చెను. కొంత భాగము ధనముగను చిశేషభాగము సారాయిగను దన గృహాదికముల విలువగ జేకొని యా సరకు నొకతెప్పపై నిడుకొని యుపక్రమ ప్రయత్నముల జేయ దా నొకడ వెడలి చనెను. త్రోవన దురదృష్ట మొకం డతని గలంచె. తన సొత్తున కపాయ మేమిలేక దరిచేరు సమయము సమీపించెగా యను నంతనమున నతం డుండం, దటాలున నాతెప్ప పల్లటిలి సారాయి ______________________________________________________________


  • ఆకాలమున నాదేశమున సారాయి యమ్ముటగాని కొద్దిగ స్వీకరించుటగాని తప్పుగ గణింపబడుట లేదు. తాగుబోతుతనముమాత్రము దూష్యమై యుండె.

+నాణ్యము లింత ప్రబలినకాలమున నొక్కడు దన గృహమును సారాయి కమ్ముకొనె ననిన నతిచిత్రముగ నుండునని యొక యాంగిలేయ పుస్తుక కారుడు నుడువుచున్నాడు. మనదేశమున నిది యొక వింత యని తోచనేర దని చెప్ప నొప్పును. దరిద్రులై ద్రవ్యార్జన విశేషముగ లేక ధాన్యమున కనేక వస్తువుల గొనువారు మనవా రనేకులు. తిత్తులు జలంబుల బొరల నారంభించె. థామసు సొమ్ముదక్కించుకొను సంభ్రమమున నాతెప్ప నొక్కిపట్టుట కెదురువైపునకు పరుగిడియె గాని సారాయిబరువుచే నాతెప్ప దలక్రిందులాయెను. తిత్తులతోగూడ దాను నీట మునుగవలసి వచ్చుట గాంచి యతడు బ్రయత్నించి యాతెప్ప పట్టు వదలక తన ప్రాణముల గాపాడుకొన సన్నద్ధుండాయెను. అప్పుడ "అధైర్యపడకు మధైర్యపడకుము. మే మిదె యొక్కనిమేషంబున వచ్చితి" మను శబ్దము విననాయెను. అందుల కానందం బంది థామసు దత్తరపాటున "శీఘ్రంబు నను రక్షింపుడే" యనీ కేక వైచెను. కొందఱు దను బై కెత్తుచుండ టతనికి విశదమాయెను. ప్రక్కన దమకార్యముల మెలంగుచుండిన యోడవారతనిపై జాలిగొని రక్షింప వచ్చియుండిరి. వా రతని దమపడవపై నెక్కించుకొని యతని సామగ్రి నెత్తియిచ్చుటకు బూనిరి. ఓహియోనదియం దిట్టి యుత్పాతము లాదినములలో బహుమెండు. తన్ని వారణానుకూలు లగుసహాయులు పెక్కండుందురు. వా రితరుల కష్టముల దీర్చుటకు గంకణము గట్టియుందురు. సోదరభావంబును నైకమత్యంబును నెల్లెడల గను పఱచిగాదే పశ్చిమదేశము లతివినుతి జెందినవి.

ఇట్లా థామసు రక్షింపబడి దనరక్షకు లెత్తి యియ్యగల్గిన సొమ్మును మరల దన తెప్పపై నెక్కించుకొని వారు సూచించిన దారిని యుద్దేశితస్థానముచేరి లంగరు వైచెను. అటనుండి పదునెనిమిది మైళ్లు లోపలికి సారాయితో గూడ తన్ను గొంపోయి విడుచుటకు పోసీ యను మార్గదర్శకుని నియమించుకొనియెను. అతని కుంకువగ దనతెప్ప నియ్యనంగీకరించెను. పోసీ యొక కాడియెద్దులు గలవాడు. తెప్పనొకదాని నెచ్చటనైన గొనవేచియుండెను. థామసునకు దెప్పతో దరువాత బనిలేకుండెను. కావున వీరిద్దఱికిని నీబేరము పొసగెను.

పయనమై కదలుటకుమున్ను దేశస్థితి చక్కగ గుర్తెఱిగినవాడు గాన పోసీ "ఈప్రాంతముల మంచి బాటలు లేవు. మన మడవి ఛేదించుకొని వెడలవలసియుండు" నని నొడివెను. థామసద్దానికి గుంది "నివసించు జనులైన నిందున్నారా" యనియెను. "అచ్చటచ్చట నలువురు నలువు రున్నారు. మిము జూచినవా రత్యానంద మొందెదరుగాక. వెడలుదము రండ"ని పోసీ దన కాడిగట్టి దానిపై తిత్తుల నెక్కించి తన యజమానుని దోడ్కొని దారిబట్టెను. కడుదవ్వరుగకమున్నె దట్టం బడుగహనప్రదేశ మాసన్న మాయెను. గొడ్డలితో జెట్లుచేమల నఱకి త్రోవచేసికొని ప్రయాణము జరప నారంభించిరి. ఎంతదూర మిట్లు ప్రయాస పడవలె నని విచారింప నదియెల్లయు నడవియే యనియు బాట లేర్పఱచుకొనుట కష్టతర మనియు విశద మాయెను. అయినను దుస్సాద్యం బని వెఱవక వా రనేకాయాసముల కోర్చి దినములు గడపి పదునెనిమిదిమైళ్ల ప్రయాణము సలిపిరి. అ క్కాననంబున నటనట వసించు జనులు నూతనాగతుల జూచిన బ్రేమాదరణంబుల గనుపఱచుచుందురు. క్రొత్తగ వచ్చినవారికి వలయుసాయ మొనర్చుటకు దమచే నైనంత పాటుపడుచుందురు. వారి కాథిథ్యం బొసంగి తమ శక్తికొలది గారవించుచుందురు. నియమితస్థానము జేరుటకు రెండుమూడుమైళ్లదూరమున నొకగృహస్థుడు థామసు పోసీల కమితానందంబున స్వాగత మిచ్చి యాతిథ్యంబు సలిపెను. తనకు దేవు డిచ్చినదాన వారి సంతృప్తుల జేసి తద్దేశస్థితు లెఱిగించి వారి వెంబడిచని థామసునకు నివాసయోగ్య మగుప్రదేశంబు జూపెను. ప్రయాణము ముగిసినందుకు మిక్కిలి యలరి దన నవమిత్రుడు 'ఉడ్డు' దెల్పిన భూమి నివాసార్హం బని నిశ్చయించి పోసీ ననిపి తన వస్తువుల 'నుడ్డు' స్వాధీనమున నుంచి థామసు దన పూర్వ గృహమునకు నడవ నారంభించెను. చక్కని బాట యైన నిందియానా నుండి కెంటికి కొకవంద మైళ్లదూరము. థామసు లింకను దీసిన త్రోవ యంతకంటె నిరువదియైదు మైళ్లెక్కుడు. వేసరక నడచినడచి తుట్టతుద కత డిల్లుచేరెను. పుత్రకళత్రము లతని నతిసంతోషమున లో గొనిరి. ఆబ్రహాము దనతండ్రి యనుభవముల నచ్చెరువున వినియెను. ప్రయాణ ప్రయత్నములు త్వరితగతి నొనర్ప బడియెను. రెం డశ్వముల నద్దెకు దీసికొని వానిపై గృహోపకరణంబుల నెక్కించిరి. నాంసీ, ఆబ్రహాము, సారా కొంత దూరము నడచుచు నప్పుడప్పుడు గుఱ్ఱములపై నెక్కుచు బ్రయాణము సాగింప నారంభించిరి. ఈ విధి దరలి రాత్రులు తారాపథంబు కప్పుగ గొంగళులు హంసతూలికాతల్పంబులుగ గడపి యేడు దినంబులు దారినడచిరి.

వారి కదియెల్ల నూతనానుభవంబె. ఆయనుభవంబును ననే కాపాయకారణకలితంబు, అయిన వారికి భీతి లేశంబును గానరా దయ్యె. ఆ దేశమున నాదినముల నెట్టికష్టములు వచ్చినను స్త్రీపురుషు లందఱు జంకు కళంకు లేక ప్రవర్తించుచుందురు.

అప్పటి స్త్రీ లిప్పటివారివలె బెదరుపోతులు గారు. వారొక్కొకతఱి జూపిన ధైర్యసాహసంబులు మహాద్భుతములు. ఆపదశ్రేణులకు దల లొగ్గవలసి యుండుట వా రెట్టికష్టముల నైన దిట్టడితనంబున వహింపనేర్చి కీడు జంకించిన ధైర్యం బవలంబించి నష్టముల గణింపక రానురాను సుగుణపుంజంబుల కిక్క లగుచు దేవుడు దమకు నిర్ణయించిన కార్యము నెరవేర్చుచుందురు.

ఈవిషయము నుదాహరించుట కనేక చరిత్రాంశముల వ్రాయవచ్చును. ఆబ్రహాము తాత కెంటకసీమ చొచ్చిన కొద్ది దినములకు విచిత్రవిషయ మొండు జరిగెను. డేవిసను నొక తెల్లవాడు కార్యార్థి యై యిలు వెడలిపోయి యుండెను. అతని భార్యాపుత్రులుమాత్ర మట నుండిరి. దీనిం గాంచి యొక యిందియ నతనియిల్లు కొల్లగొట్టి యాలుబిడ్డల జెరగొనిపోవ నిశ్చయించుకొని తుపాకి చేతబూని డేవీసు గృహము సొచ్చెను. డేవిసుభార్య వాని జూచి గుండెనీరు విడువక మన స్థైర్యమున నా హతకుని నాతిథ్య మంగీకరింపు మనివేడుచు సారాయి సీసా నొకదానిదీసి బల్లపైనిడి వాని నద్దాని స్వీకరింపు మనిప్రార్థించెను. వా డట్లుచేయ నిచ్చగించి సీసానుండి సారాయి పోసికొను బ్రయత్నమున దన తుపాకి బల్లపయి నిడియె. అంత నా నారీమణి దాని చివుక్కున లాగుకొని వాని శిరంబునకు దానిమూతి నిడి 'నీవు నా కధీను డవు గాకున్న నీ యుసురుల నీ క్షణంబున దీసెద' నని వెఱపించెను. ఆ యిందియను దనచేత నున్న బుడ్డి దిగవిడచి "నను కాల్వకున్ననే నీకేమియు గీడు చేయ"నని పలికి కదల మెదల లేక కూర్చొని యుండెను. ఈతీరున వాని దన పెనిమిటి యిలుసేరువఱకు నా రమణీలలామ పట్టునబట్టి యుండెను!

అదేసమయమున నద్భుత తరం బగు సాహసప్రవర్తనంబు మరొండు రామాకులవతంసంబు గనుపఱచె. ఒకనాటి నిశీధమునం గొంద ఱిందియనులు -----------------యతడు కవాటముదరికి వచ్చునప్పటికి బ్రాణావశేషుని జేసి గేహము జొర యత్నము సేసిరి. అతని భార్యయు గూతురును దలుపుమూసి బంధించి వారి నడ్డగించిరి. వా రద్దానికిని వెనుదీయక ద్వారంబున బిలంబొనర్చి యొక్కడొక్కరుడ ప్రవేశింప సమకట్టిరి. బిడ్డల యాక్రందనంబును మేరిలు దురవస్థయు నసహ్యము లయ్యె. అయినను వానిని గణింపక మెరిలుసతి గండ్రగొడ్డలి చేతగొని మొదటివాడు గన్నమున దూరినతోడనె వానితల నట్టె కత్తిరించి మొండెంబును లోని కీడ్చివైచెను. ఈవిధమున నలువురు జము నిల్లు చేరుటయు నిందియనులు మేల్కాంచి గవాక్షము నుండి యిద్దఱుగ బ్రవేశించి యామె రూపుమాప నుద్యమించిరి. స్త్రీలకు బుద్ధికౌశల్యం బెక్కుడుగదా? ఆ వనిత చక్కగ యోచించి తనబిడ్డం బిలిచి రాజుచుండిన ప్రొయ్యిలో దమ పరుపు దూదిం గ్రుమ్మరించు మనియెను. అ దట్లుచేయుటయు నెక్కి వచ్చు మంటలలో బొగలలోబడి యూపిరి యాడక విఫల మనోరథులై యిందియనులు ప్రాణము లున్నవో లేవో యనుస్థితియందు నేలం గూలిరి. మెరిలు మహాప్రయత్నమున వారిం బరిమార్చె. ద్వారమున నొక్క యిందియను మాత్రము మిగిలియుండెను. వాడును మెరిలు సతిదెబ్బకు నిలువలేక పాఱిపోయెను. ఇట్టి యుదాహరణములచే గ్రంథంబుల నింపవచ్చును. అయిన నీరెండును నాకాలపు స్త్రీలకు గల ధైర్యస్థైర్యంబుల నిరూపింప లిఖింపబడియెను. వారిగుణములచే నలంకృత యగు ఆబ్రహాము తల్లి నిర్భయమానస యై యెల్ల గష్టంబులనెల్ల తొందరల నోర్చెను.

ఏడుదివసములు త్రోవ నడచిరని చెప్పితిమిగదా. అట్లు నడచి తమనిర్ణీతస్థానమునకు రెండుమైళ్లదూరమున నీలను పొరుగువారి గుడిసె చేరిరి. వారును లింకనుల మిక్కిలి యాదరించి మఱునాడు గృహనిర్మాణంబున దోడ్పడ బూనిరి.

ఈయనుభవవిషయములెల్ల బెంచివ్రాయుట కొకకారణ మున్నది. ఇ వెల్లయు నాబ్రహామునందు ధైర్యస్థైర్యసాహసాదిగుణంబుల వృద్ధికి హేతుభూతంబు లాయె ననుటకు సందియంబులేదు.

_______

మూడవ ప్రకరణము

నూతన నివాసస్థల నిర్మాణము.

ఆకాలమున 'దేశసంపాదన మార్గదర్శకు' లగు వారలకు ముఖ్యసాధనము గొడ్డలి. దాని నుపయోగించుటయందు బ్రావీణ్యము సంపాదింప బ్రారంభించుట యాబ్రహామునకు