ఆబ్రహాము లింకను చరిత్ర/నాల్గవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

చుండెను. కావున నతడును వారివెంబడి వచ్చిచేరెను. అతనిరాక యాభ్రహామునకు మిక్కిలి యానందమియ్య నొకరి కొకరు మిత్రులయి యన్యోన్యముగ మెలగుచుండిరి.

నాల్గవ ప్రకరణము

దుఃఖ దినములు.

తమ మందిరమున నున్నపుస్తుక త్రయంబులును జదివి చదివి క్రొత్తపుస్తుకముల వాసన గానక ఆబ్రహాము వేసారెను. ఉన్న వాతనికి గంఠోక్తిగ వచ్చిపోయెను. నూతన గ్రంథములు చిక్కునా యను చింత యతని హత్తియుండెను. ఇట్టితరుణమున నాతని దృష్టి మరల్చు విషయ మొకటి కడుదు:ఖకరం బగునది సంభవించెను. ఇరుగుపొరుగుల 'స్తన్యరోగ' ఋజ యొండు ప్రబల నారంభించెను. మనుష్యులును పసువులును నద్దాని వాతబడి మరణ మొందిరి. సమీపించి సమీపించి స్పారోల భార్యాభర్తల నది తాకెను. లింకను లడలిపోయిరి. వైద్యు లనేకమైళ్లు గడచినంగాని కానవచ్చుటలేదు. కావున నీ 'మార్గదర్శకుల'యందు స్త్రీలు రోగుల మేలుకీళ్లరసి వారికి దగుసాయ మొనర్చుచుందురు. నాంసీకి దల్లిదండ్రులం బోలు స్పారోలు రోగపీడితులగుట చూచి యామె చాల దు:ఖించి వారిని దమ కుటీరమునకు దీసికొనివచ్చి పరిచర్య లొనర్చు చుండెను. అయినను దైవానుగ్రహము దప్పినందున గొంత కాలమునకు వారిరువురును లోకాంతరగతు లైరి. శోకము లింకనుల హృదయముల నాక్రమించెను. ఆప్రాంతపు జనులెల్లరు నప్పుడప్పుడు స్పారోల స్థితిగతుల దెలిసికొనుచుండి వా రంత మొందిరనుట వినినితోడ నేతెంచి యనంతర కార్యముల నడపిరి. థామసునకు దప్ప మఱేరికిని శవము నుంచుటకు బెట్టెసేయుటకు రాదు. కావున నతడె దనశక్తికొలది దాని నొనర్చెను. స్పారోల నద్దానియం దుంచి యందఱును నశ్రుధారల దమప్రేమ గనుబఱచుచు నుచితవిధమున వారికి సమాధి యొనర్చిరి. ఆబ్రహాము డెన్నిసుల కిదియ మిక్కిలి దు:ఖకరం బగు వార్తగ నుండెను.

తగిలినకాలె తగులును; నొగిలినకొంపె నొగులుననుట యనృతముగాదు. దు:ఖము లొక్కటిమీద నొకటి తరంగంబుల తెఱంగున పై బడుచుండును. స్పారోల మరణముచే నుద్భవిల్లిన సంతాపాగ్నిజ్వాల లింకనుల మనోవీధి బ్రచండంబుగ రేగుచుండ బ్రళయకాలవహ్నింబోలు మఱియొక వహ్ని యట జేరె. స్పారోలు నాకలోకంబునకు జన్న దాదిగ గొన్నిదినములకు స్తన్యరోగము నాంసీనె యంటె. ప్రాత:కాలము మూడుగంటలసమయమున నాబ్రహాము నిద్రనుండి లేవదీయ బడియెను. సమాచారము వినినతోడనె యామె యవస్థ జూచి యోర్చుట యసాధ్య మాయెను. ఋజబాధ మిక్కిలి యెక్కుడాయెను. ఆప్రాంతములనుండు నబలలెల్ల రామెకు సాయ మొనర్ప నేతెంచిరి. దిగులంది సహాయార్థము ఉడ్డుగారింటి యాడువారి గొనిరా బరుగిడియెను. వారిలో గొంద ఱనుభవముచే రోగుల గాపాడుటయందు సమర్థు లుందురు. అయిన దైవసాహాయ్యము లేనియెడ మనుజసాహాయ్య మెంతయుండిన నేమిఫలము? తగిలిన యైదుదినములలోపల నాంసీ పరలోకప్రాప్తి జెందెను. అచటిజనుల దు:ఖ మంతింత యని నుడువజాలము. లింకనులకు గలిగిన నష్ట మపారమయ్యెను. వారి మనములు నిండి దు:ఖము వెల్లివిఱియ జొచ్చెను. నిర్మానుష్యాటవికల్పమగు నాసీమయం దడగి సద్గుణోపేతుండగు నాబ్రహామున కాసుశీలయగుతల్లి దనువాసి పరమపదం బందిన నెంత మనోవైకల్యంబు సంభవించెనో నుడివిన దీరదు. చదువరుల యూహింతురుగాక. ఇట్టి కట్టడి విధి సంప్రాప్త మైన వారి యెక్కటికము దుర్వహమై తోచక మానదు. ఆబ్రహాము మాటలాడ నోరాడక తనతల్లివిషయ మెత్తుటయే మాని దిగ్భ్రమ జెందినవానివలె ముఖవర్చస్సు గోలుపోయి తిరుగుచుండెను.

ఆమెకు సమాధి యొనర్చుట కేర్పాటులు సేయబడియెను. థామసు దనచేతన భార్య కళేబరం బుంచుట కొకపెట్టె సేసెను. స్పారోల ప్రక్కన నొక గోరీ దీసి యద్దాన నాశవంబు నునిచిరి. ఆసీమయందలి 'మార్గదర్శక' కుటుంబము లెల్లయు నచటి కేతెంచి యార్తహృదయకమలములును నార్ద్రచక్షురుత్పలములను నామె కర్పించి దమప్రేమ సూపిరి.

నతి మరణానంతరము గొన్నిమాసములమీదట నొక సాయంకాలమునలింకను "ఆబి! పార్సన్ ఎల్కిన్సు (పురోహితుడు) గారికి నీ వొక యుత్తరము వ్రాయవలెను. నీ విప్పుడు చక్కగ వ్రాయ గలుగుదువుగదా" యనియెను. ఆబ్రహాము పదిసంవత్సరములు దాటి యుండెను.

"ఏమి వ్రాయవలయునో నొడివిన నే వ్రాసెద గాక" యని యాకుఱ్ఱడు ప్రత్యుత్తర మిచ్చెను.

తరువాత థామసు దనభార్య యారోగ్యము దప్పినది మొదలుగ బరమపద మందినవఱకు వ్రాయించి యాపార్సన్ దమ కుటీరమునకు విచ్చేసి యథావిధిగ నాంసీ జ్ఞాపకార్థ ముపన్యసించి పోవలసినదని వేడెను. ఆబ్రహాము దమ నూతన నివాసస్థలపు వర్ణనయు దా మట కేతెంచుటయు దమ యుత్తరాపేక్షలును ఆ పత్రమున లిఖించెను.

వ్రాసినజాబు కుమారుడు చదువుచుండ థామసు సంపూర్ణహృదయంబున వినుచుండెను. అంత పసివాడు దనపుత్రరత్న మింతకార్య మొనర్చువా డాయె నను మోద మాయ నకు మెండాయెను. తమ కుటుంబమున నేరును వ్రాయునంతటి ఘనకార్య మొనర్చి యుండలేదు. అతని కదియ వింతయై తోచెను.

తండ్రి వ్రాత నేర్పరితనపు బ్రయోజనముల బొగడుచుండెను. ఆబ్రహామున క వెల్ల గడుసామాన్యముగ దోచుచుండును. ఒకొకమారు దీనివిశేష మేమియును. మఱొండుతఱి నేనింతకంటె బాగుగ నేర్చెద ననిసంతసించు.

జాబు ముగిసినతోడనె యతనిదృష్టి వేరువిధమున బాఱ నారంభించెను. తా బంపిన కమ్మ పార్సన్‌గారి కెప్పుడందునో యత డెన్నడు విచ్చేయునో యెఱుగ గోరి తండ్రిని బ్రశ్నించెను. అతని కాలెక్కలు దెలియవు. ఉత్తరము వోయి చేరుననిమాత్రము వినియుండును. కావున 'నదంతయు నేనెఱుగ,జాపువోయి చేరును. చేరిన పార్సన్ రావచ్చు' ననియెను.

ఆయుత్తరము మెల్లమెల్లగ మార్గము వట్టెను. దాని ఫల మరయ నాబ్రహాము మనసు తొందర పడుచుండును. మొత్తముమీద నీకార్య మతని బాల్యమున నొకముఖ్యాంశ మనుటకు సందియము లేదు. అది పార్సన్‌కు జేరునా యనుశంక యతనివట్టుట స్వాభావికము. దాని వ్రాసినదిమొద లతనికి బ్రఖ్యాతిం దెచ్చి యితరుల మేలున కతని బురికొల్పె ననుటయు జిత్రముగాదు. లింకనుతండ్రి దన పుత్రుని యాచరణను గుఱించి యితరులకు బొంగిపొంగి చెప్పుచుండును. వారును సంతసంబున నతని బొగడుచుందురు. ఆ ప్రదేశమునకు నిరుగుపొరుగున జాలదూరమువఱకు గల పెద్దవారలలో నొక పాతికమందికి గూడ వ్రాయు నేర్పులేదు. కావున నాబాలకున కంతపని చేయు శక్తిగల్గుట మహాద్భుతముగ నుండెను. ఆవార్త చుట్టు ప్రక్కల వ్యాపింప దత్ఫలముగ ననేకు లాబ్రహాము లింకను కడకఱిగి తమ కుత్తరముల వ్రాసి యియ్యమని ప్రార్థింప మొదలిడిరి. అతడును శైశవము నుండి తనవల్ల నగు మే లితరులకు లే దనువాడు గాడు. ఇతరుల కోరికల దన శక్తికొలది నెరవేర్ప నెప్పుడు బ్రయత్నించుచుండును. అట్లగుట బహుకాలము దమ బంధుమిత్రుల క్షేమసమాచారములు వినని దూరదేశీయు లెల్ల నాబ్రహాము వ్రాయ గలిగినందున నెడనెడ దమవారినుండి పత్రికల నందుకొను భాగ్య మనుభవింప గనిరి. ఉత్తరముల వ్రాసియిచ్చు టతనికొక బరువుగ దోచుట మాని యాహ్లాదకరముగ బొడగట్టుచుండెను.

అతని ప్రధమపత్రము చేరి మూడుమాసములమీదట పార్సన్‌గా రేగుదెంచిరి. అపు డాబి యింటికి మూడు మైళ్లు దూరమున మెలగుచుండి యాపురోహితునింగాంచి సంతసించి "అయ్యా! నా కమ్మ మీకందెనే" యని తనమనసున నిండి యున్న విషయమునే మొదట నడిగెను. జాబు చేరిన దనుటకు లక్ష్యము దనకండ్ల కగుపడుచుండినను దా జేసిన కార్యము ఫలించిన దనునిశ్చయ మెఱుగ నతడు దడబడు చుండెను.

"నీ యుత్తరమా? మీ తండ్రిగారిది నాకు జేరె." తంద్రి నామ మిడి వ్రాసిన విషయము స్మరించుట కాబ్రహామున కవకాశము లేకపోయెను.

"నేను వ్రాసితిని."

"నీవా వ్రాసితివి?"

"అవును తండ్రిగారు వ్రాయలేరుగా."

"అవునవును. నా కిపుడు స్మరణకు వచ్చినది. నీతండ్రి వ్రాయలేరు. కావున నీవే వ్రాసితివే? బాలురలో నీతెఱంగున ననేకులు వ్రాయజాలరు సుమా."

"అదియ నా ప్రథమ ప్రయత్నము."

"ఓహో! కడులెస్స. నీ మొదటి కమ్మయా యిది? నీవద్దాన లోపము లున్నవని జంక నవశ్యము లేదు."

ఈవిధమున సల్లాపము లాడుచు వారు లింకనుల గుడిసె సమీపించుచుండిరి. ఆబ్రహాము గుఱ్ఱముప్రక్కన జరుగిడు చుండెను. పార్సన్ అతనిపై గరుణావలోకంబుల సారించి భాషించుచు సవారిసేయుచుండెను. ఇలు గాన్పించినతోడనె యాబి చేచాయనె చూపి "అల్లదె మాగృహము. మే మట నివసింతు" మనియెను.

"ఓ! కాపురముండుట కది రమ్యముగ నున్నది. మీ తండ్రిగా రట నుందురు ?"

"అదె యతడె. మిము జూడ గుతూహలుడై యున్నాడు."

"నాకును నతని జూడ గొప్ప వాంఛ గలదు."

ఈలోపుగ వారు థామసుంజేరిరి. అతడు పార్సన్ రాక కుప్పొంగి మన:ప్రీతిగ స్వాగత మిచ్చెను. వారిద్దఱకును గొంత సంభాషణ జరిగినపిదప నెల్కిన్సు పార్సన్ గా రుపన్యాసము నా మరుసటి భానువాసరమున నాంసీ సమాధికడ నిచ్చునట్లు నిర్ధారణచేసికొనిరి. పదిపదునైదుమైళ్లలోగల 'మార్గదర్సక' గృహములకెల్ల నీవార్త పంప బడియెను. ఈ పవిత్ర కార్యమునకు వలయు సన్నాహము లన్నియు నాయత్తపఱుపబడెను.

మధ్యకాలమున నా పురోహితు డిరుగుపొరుగులనుండు జనులనెల్లర దర్శించి దైవికవిషయముల వారికి బోధించుచుండెను. ఆబియొక్క బాలప్రౌఢిమకు మెచ్చి యతనికిగూడ గొంత యుపదేశ మొనర్చెను.

ఆదిత్యవారము సమీపించెను. నాంసీ చనిపోయి యాఱు మాసము లై యుండినను నాపె జ్ఞాపకార్థ ముపన్యాసమనిన నెల్లరును మూగ నారభించిరి. ఏరికిని నామెపై బ్రీతియె. ఇట్టి యుపన్యాసములు వారి కెండకాలపు వానలుగాన ననేకుల కిది పండుగ బోలియుండెను. అందున నాంసీ స్మరణార్థము గాన మహోత్కృష్ట మయ్యెను. పదిమైళ్లనక పదునైదు మైళ్లనక, శైశవ మనక ముదుసలితనమనక కొందఱు శకటముల మీద గొందఱశ్వముల పైని గొందఱు నడచుచు గొందఱు పఱచుచు పలువిధముల జనులు పలువిధ యానములతో గుంపులుగుంపు లేతెంచిరి. ఆప్రాంతముల కుటుంబములన్నియు నట నుండెను.

పార్సనెల్కిన్సు మన:పూర్వకముగ బనిసేయువాడు. అక్కార్య గౌరవం బాతని కౌత్సుక్యం బొసంగె. లింకనులు దక్క నతని యుపన్యాసము లదివఱ కెవ్వరును వినియుండరైరి. అతని వాక్సుధారసంబు గ్రోలి యందఱు నానందం బొందిరి. నాంసీ గుణసంపద నతడు వర్ణించుటలో న్యాయ వ్యతిరేకము లేదని యామోదించుటేగాని "యెంత వర్ణించినను నామె గుణసంపదకు నావర్ణన చాల" దనిరి.

ఆ యుపన్యాసమున నాబ్రహాము మగ్ను డయ్యెను. తల్లి ప్రేమయు గనికరంబును మరల నతని నావరించినట్లుండెను. రెండవమా రాపె యుత్తరక్రియల బరికించులాగు గనుపించెను. ఆమెసమాధి తనకు గొంతదవ్వున నుండెను; ఆమె సుగుణపుంజంబు దన మనమున నివసించి యామెను సంపూర్ణముగ గోచరింప జేయుచుండెను.

ఉపన్యాసస్థితభావముల ననేకముల నతడు చక్కగ గ్రహించెను. తనంతట దా యోచించువాడు గాన నతని కిది యపూర్వము గాదు. కొన్ని సంవ్త్సరములకు దరువాత నిట్టి యుపన్యాసకుల యభిప్రాయముల ఖండించుచు వినువారల నానందింప జేయుచుండును. ఒకొక్కవేళ వారు చేసిన సిద్ధాంతముల బూర్వపక్షము సేయుచుండును. అతని బాల్యప్రౌఢిమ యీవిధమున బయలుపడుచుండెను. పై జెప్పిన నాంసీ జ్ఞాపకార్థకోపన్యాసము నందలి భావముల మాత్ర మతని మన:శిలపై జెరపరాని స్ఫుటాక్షరముల లిఖితము లయ్యెను.

భాల్యమున నాబి యిరుగుపొరుగువారి సంభాషణముల తఱచుగ శ్రద్ధతో వినును. జ్ఞానశూన్యు లగుగొందఱు మాటలాడునెడ వారి యర్థములేని పిచ్చిమాటలకు విసుగును. ఆతని తీక్ష్ణబుద్ధియొక్క విషయమున జ్ఞాన మలవడిన నట నిలుచునదిగాదు. ప్రతిసంగతియు గ్రహింప నిచ్ఛగలిగి చలించు చుండును. కావున నప్పుడప్పుడు జ్ఞానహీనుల ప్రగల్భములకు నతడు గోపించుకొనుటగూడం గలదు.

నూతన పుస్తకము అతనికి దొరకినచో వాని జదివి వానివిషయముల విమర్శించి తన యభిప్రాయముల నిరంకు శంబుగ నిచ్చుచుండును. పైరుచుల పచరించు బాలురకును నతనికిని ఇదియ భేదము. వారు చదువుదురు; అచ్చటన వారి పని ముగియును. వారావిషయమున శ్రద్ధజేయుట లేదు. చెప్ప బడినవిషయ మేల చెప్పబడియె? దీని మూలకారణ మెద్ది? యను చర్చ వా రెన్నడు జేయుట లేదు. కావున జదివినవిషయముల జాఱవిడుచునలవాటు పట్టవడును. తమకు దామ యోచించుకొనుట వా రెఱుగరు. ఇతరులు నంది యనిన వారికి నంది; పంది యనిన వారికి బందియె యగు: వా 'రిట్లు జరుగుచున్న' దని తెలిసికొనిన జాలునని సంతసింతురు. ఏల జరగుననుసంశయముతో వారికి బనిలేదు. ఆబ్రహా మట్టివాడు గాడు. తాన యోచించు స్వబుద్ధిచే బరిశీలించు. ఇదియ యాతని మన:శక్తి నత్యద్భుతముగ వృద్ధిసేయ గల్గెను.

ఈ మార్గదర్శిక 'పురోహితుల' విషయము జదువరు లిక కొంచెము వినవలయును. అందు గొందఱ మహాశక్తి యుతు లుండినను సాధారణముగ వారు విశేషము విద్య గడించినవారు గారు. కళాశాలలును విద్యాలయములును వా రెఱుంగరు. అయిన దైవికజ్ఞాన మితరులకు గలుగ జేయ వారుత్సుకులయి యుందురు. ఈశ్వరుం డట్టికార్యము దమకు విధించెనని వారు గట్టిగ నమ్మి నిర్మలహృదయు లై పని బూనుచుందురు. ఒక యశ్వమును బుస్తకముల సంచియు వారికి విడువని మిత్రులు. పల్లెనుండి పల్లెకు సంవత్సరారంభము నుండి సంవత్సరాంతమువఱకు దిరిగి యుపన్యసించుట వారి పని. తమ యుపన్యాసముల మార్గమున సిద్ధపఱచుకొను చుందురు. ఎచ్చట సాయంతన మగు నటన వారికి విడిది. ఒక్కొక సమయమున మనుష్యసంచారభూమికి నెన్నియో మైళ్లదూరమున నాకసము గప్పుగ భూమిశయ్యగ వారు నిద్రింతురు. వారికి జీతమిచ్చువా రొక్కరు నుండరైరి. అందు బలువురు కట్టుటకు మంచిబట్టలును, దినుటకు రుచ్యమగు నన్నమును గోరక దైవభక్తిచే లోకమున కుపకార మొనరించుచుందురు. అం దొక్కరివిషయము వినుడు.

ఒక పురోహితుడు నిరుపేద దనస్థితికి వగవక ప్రయానపడి తిరుగుచు నితరులకు జ్ఞానప్రదానము సేయుచుండెను. అతని దైవభక్తికిని, నైర్మల్యంబునకును మెచ్చి యొక భక్తుడు భూస్వామి యతనికి 320 యెకరముల క్షేత్రము దాన మిచ్చి దానపత్రము వ్రాసి చేతి కిచ్చెనట. అతడు సంతసించి దాని దీసికొని కృతజ్ఞత సూచించి వెలువడిపోయెను. పోయి మూడు మాసములకు మఱలివచ్చి దానపత్రమును దిరిగి భూదాత కియ్య బోయెను. ఆ భూస్వామి యాశ్చర్యమును భయమును పెనగొన,

"అం దేమైన లోపమున్నదా" యన నతడు "లేద"నియెను.

"మంచిభూమి కాదా?"

"ఈ సీమ నంత సుక్షేత్రము లేదు."

"అయిన రోగముల కిక్కయా?"

"ఆరోగ్యదాయియే."

"నేదానము మనస్ఫూర్తిగ జేయలేదని శంకించెదరో?"

"మీ త్యాగమున లోప మున్నదని నే నెన్నటి కనువాడ గాను."

"అయిన మీరేల యీ చేనుల విడిచెదరు?"

"ఒకటి వినుడు. నేను కీర్తనలు పాడుటయం దాసక్తిగలవాడ నని మీకు దెలియునుగదా? అట్టికీర్తనల నొక్కటి నాప్రాణ మున్నంతదాక నానందం బొసంగునది యిదె వినుడు:

సీ. క్షేత్రాధిపతి గాక చెలగుచుండుట జేసి
         ధన్యుండ నైతి నే ధరణియందు;
   గహనభూముల నైన గృహ మొండు లేకుంట
         సంసార దు:ఖంబు సడలెనాకు;
   స్వేచ్ఛా విహారంబు సెడకుండ సల్పుచు
         నీశ్వరు భజియింతు శాశ్వతముగ;
   నిమిషమాత్రము నన నిర్మూల మందెడు
         పటకుటీరము దీని బాసి చనగ,

    నాదు హర్మ్యంబు గలుగు నా నాకమందు
       నదియ సౌభాగ్య గరిమంబు లందజేయు;
    నదియ నా మన మానందమందు ముంచు;
       నదియ యెల్లప్పు డగు నాకు నభవుగృహము

"మీకడ దానము గొన్నది మొద లీకీర్తన నే మనస్సంతోషమున బాడ లేకున్నాడను. మీభూమి మీరు గొనుడి నా కమెరికాఖండ మంతయు నిచ్చిన నే నొల్ల. నాకీర్తన నే బాడు కొనియెద" ననియెను.

ఇట్టివారితో సాంగత్య మప్పుడప్పుడు ఆబ్రహామునకు దటస్థించుచుండెను. వారు చెప్పినవిషయములును వారి చరిత్ర విశేషములును అతని మనమున నాటి యాతని యుత్కృష్ట పదవికి దారిజూపెను. నిర్మల మనస్కు లై నిజ మరయుచు బై పూతల దిరస్కరించి సద్గుణముల నలరారు పురోహితులు లోకమున కెంత మేలు గలుగ జేయనేరరు?

చదువరులారా! మన కిప్పు డిట్టి యాచార్యులు గావలయును. లోకమును మోసపుచ్చు పై వేషముల జూచి భ్రమయ:బోకుడి. మనోనైర్మల్యంబును గార్యథురంధరత్వమును దేశ క్షేమము పై దృష్టియు గల మహనీయులకు జన్మబలంబు గాని ద్రవ్యబలంబుగాని మిథ్యాశాస్త్రబలంబుగాని యనవసరంబు కావున నీ బహి:పటాటోపము చూపు డాంబికుల నిర సించి నిత్యు, నిర్మలు గరుణాసముద్రు, ననన్యసామాన్యు సర్వేశ్వరు మనోవాక్కాయకర్మంబులచే దెల్పు గురుజనంబుల నరయు బ్రయత్నింపుడి.

ఐదవ ప్రకరణము

ఉల్లాసతర దినములు.

మృత్యువురాక గృహంబున గలుగజేసిన మార్పులకు వగచి యాబ్రహాము బహుకాలము దైన్యావలోకనముల బ్రసరింప జేయుచు ఖిన్నవదనుం డై యుండెను. మధ్యకాలమున మిక్కిలి యానందదాయి యగు విషయ మొక్కటి తటస్థింపకున్న నత డా స్థితియంద యుండియుండునేమో యని తోచుచున్నది. అతనితండ్రి యిరువదిమైళ్ల దవ్వున నుండు నొకానొక స్నేహితునింట 'పిల్గ్రిమ్సుప్రోగ్రెస్స'ను నొక పుస్తకము గని దాని దనకొమరున కియ్యదెచ్చెను. ఆబ్రహామా గ్రంథము గాన్పించినతోడనె చాల సంతసించి తండ్రి కద్దానిపేరును జదివి చెప్పెను. తండ్రియు నాపుస్తకపువిషయ మెన్నడో వినియున్నవాడు గాన దనపుత్రునకు సుగ్రంథ మలవడె నని పొంగి 'అబ్బాయీ! నీ వా పుస్తకమును జక్కగ జదువుము. అందలి విషయము మంచిది. నీకు మేలగు'నని కొడుకుచేతి కిచ్చెను.