ఆబ్రహాము లింకను చరిత్ర/తొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

బహు సమర్థుడు. తనతో నాడువారల నెల్లర సునాయాసముగ నోడించుచుండెను.

తొమ్మిదవ ప్రకరణము

తెప్పపై బ్రయాణము.

ఆకాలమున నమెరికాయందు బొగబండ్లుగాని, మంచి రాదారులుగాని లేవు. దట్టమగు నడవులచే నిండి చోరభయము గలిగించుచుండు ప్రదేశము లనేకము లుండెనని యిదివఱకే చెప్పబడియెను. నదులు దేశములకు మహోపకారులు. మఱి యేబాటలును లేనితరుణమున నివి రాకపోకల కుపకరణములుగ నుపయోగించుకొనబడుచు వచ్చుచున్నవి. పెద్దపెద్ద నదులపై నుండుపట్టణముల వ్యాపారము మెండుగ నుండుట పలుమాఱు తటస్థించుచున్నది. అమెరికాయందు నిట్టి పట్టణములు గొన్ని యప్పుడప్పుడ వృద్ధిజెందుచుండెను. అయిన నీటిమార్గమున వాని జేరుటకు దగిన సులభసాధనము లప్పుడు లేవు. ఇప్పటి నావికుల యదృష్ట మప్పటివారి కుండదాయెను. పడవ నిర్మించుట యనిన నాలుగు మొద్దు లొక్కటిగ గట్టుట. వీనిపై సరకుల నెక్కించుకొని ప్రవాహమున కెదురు బోవలసి యున్న దాళ్లచే మనుష్యుల నీడ్చికొని పోవుచుందురు. రాత్రి యనక, పగు లనక, చలి యనక, గాలి యనక, యెండ యనక నీడ యనక ప్రయాణము సేయుచు నా కాంతారంబుల శత్రువు లెదిర్చిన వారితో, బోరుచు బ్రాణముల కాశింపక పనిసేయుచుండుట యప్పటినావికుల కతిసామాన్యము. ధైర్యసాహసంబులు వారియంద మూర్తీభవించినట్లుండుట యత్యావశ్యకము. ఇట్టి పడవల మిసిసిప్పి నదిపై కెక్కు సరకులన్నియు బంపబడుచుండును. కొన్ని సమయముల దగినంత సామగ్రి యున్న గొప్పగొప్ప సాహుకారులు దామ యిట్టి వ్యాపారయాత్రలకు వెడలుచుందురు.

1828 వ సంవత్సరమున నాబ్రహాము జెంట్రి యను సాహుకారికి సేవకుడుగ జేరెను. అచ్చటను నాబి సర్వకార్యములు నిర్వహించుచు దనదొరచే మెప్పువడసెను. అతని కాలె నను కుమారుడు గలడు. ఆ బాలుడును నాబియు గలిసి పనిసేయుచుందురు. జెంట్రి యాబ్రహాముగార్యనిర్వాహకత్వమున దక్షత గలవా డని నమ్మి యతని దన గుమారుతో న్యూఆర్లియన్సు నగరమునకు సరకిచ్చి పంప నిశ్చయించుకొనెను. తండ్రి యాజ్ఞ యైన దా వెడలుటకు సిద్ధముగా నున్నాడ నని యాబ్రహాము వచించెను. లింకనులు జీతము విషయము నిర్ధారణ సేసికొని యా ప్రయాణమునకు నాబిని సిద్ధము గమ్మనిరి. పదమూడు వందల మైళ్లు కష్టములకోర్చి యపాయములకు దలయొగ్గి రాత్రింబవళ్లు త్రోవ నడవవలయునని విని "పసివాడ వీ వెట్లు పోగల్గుదువో" యని యాబ్రహాము దల్లి కొంచె మనిష్టము గనుబఱచి "అయినను నీ కీ ప్రయాణమున జయము గలుగుగాక. లోకజ్ఞాన మిందుమూలమున గొంత యలవడుగాక. ధైర్యస్థైర్యము లింకను గుదురుగాక. దేవు డెప్పుడు నీకుసాహాయు డగు గాకని" పంపెను.

ప్రయాణ సన్నాహములు వెనువెంట జేయ బడియెను. అచటి రేవున నొక పడవ యాయత్త మాయెను. ఆబీ యాలెనులు దమ సరకులతో మిసిసిప్పి నదిపై దేల మొదలిడిరి. ఆబ్రహాము దెప్ప ముందుకు నడప మొదలిడెను. ఈ నవీనానుభవ మాబ్రహామునకు మిక్కిలి యాహ్లాదకారి యాయెను. తా నిదివఱకు జూడని ప్రపంచపు వింతలెల్ల నప్పు డతనికి జూడ గల్గెను. ఆ గొప్ప జలసముదాయముపై నూగాడు చుండుటచేతను నూతనవిషయముల బరికింపుచుండుటచేతను నతడు ప్రపంచపరిమాణ మిట్టిదిగదా యని యూహించు కొనుచు సర్వకర్తయగు నా సర్వేశ్వరు మహిమాతిశయంబుల గ్రహింప దొడగెను.

దారియందు వారి కనేకానుభవములు ప్రాప్తించెను. వాని వన్నిటి నిచట వివరింప నలవిగాదు. వారి గాలమంతయు నాపడవపైన గడపబడుచుండెను. రాత్రులు పడవను గట్టున కీడ్చి పదిలముగ గట్టియుంచి పరుపుల కాశింపక దానిపైబడి కంబళుల గప్పుకొని నిదుర పోవుచుందురు. అడవులలో బెరిగినవారి కివియెల్లయు నంత విశేషమార్పులు గాకున్నను గొంతమార్పు లైన నగును గాదే. కొన్ని రాత్రులయందు వా రొంటిగ బరుండుట చూచిన నేరికి వారిపై జాలి గల్గదు?

వారి ప్రయాణ మసహ్యముగా నుండ దయ్యెను. దృగ్గోచరప్రదేశ మప్పటప్పటికి మాఱుచుండుటవలన గ్రొత్తక్రొత్తల తావితానముల, వృక్షసమూహముల, జంతుజాలముల, బ్రకృతివిచిత్రముల బొడసూపి యానందము గలుగ జేయుచుండెను. పలుమాఱు నది దిగివచ్చు 'పడవలు'ను వానియందలి నావిక సమూహములును నెదురుపడుచుండెను. ఆ యేటియొడ్డున నుండు గ్రామజనులు గుంపులుగుంపులుగ వచ్చి సంభాషణచే సంతృప్తి సేయుచుండిరి.

ఎల్లకాల మొక్కరీతిగా నుండదుగదా! గాలివాన లత్యుగ్రముగ నప్పుడప్పుడు పై గ్రమ్ముచుండును. అట్టి సమయముల దమ తెప్ప పల్లటిలకుండ నుంచుకొనుటకు వారి శక్తి యంతయు నుపయోగించి పాటుపడుచుందురు. దినదినమును వానలో దడిసి ప్రయాణము చేయవలసి యుండును, ఒక్కొక పర్యాయము రాత్రులు విపరీతముగ ఝంఝూమారుతము వీవ నాకసము చిల్లివడి కడవల గ్రుమ్మరించినతెఱగునను, ప్రతివస్తువును నాధారల సముద్రు జేర్తునని వరుణుడు మూర్తీభవించెనో యనునటులను వర్షము గురియుచుండును. అట్టిరాత్రుల నా 'నావికులు' పరుండ వారికి మఱొండు శరణు లేదు. తమ తెప్పపై జడివాన తాకుడుకు నడలక పడకచేసికొని పడియుందురు. వారి ధైర్యోత్సాహముల బరిశీలింప దైవమున కిట్టివియ యుక్త మగుసమయములు. వారును దమ స్థితి గతుల గుఱించి యెప్పుడును వగచినది లేదు. ఎట్టి యిక్కట్టులు వాటిల్లినపుడును నీ ప్రయాణమున కియ్యకొనకున్న బాగుండునని యాబ్రహాము దలచినది లేదు. అతని మన మాకార్యమున నంత మగ్న మయి యుండెను.

ఇట్లు పరిపూర్ణహృదయమున యాత్రనడపుచు నొక దినము సాయంకాలమున నాతెప్ప గట్టున కీడ్చి బంధించి దాని ముందరిభాగమున బడి నిదురపోవుచుండిరి. అర్థరాత్రమున నడుగుల చప్పుడు వారిని మేలుకొల్పెను. ఆబ్రహాము గొంచెము చెవియొగ్గి విని యిది మోసమైనకృత్య మగునని యాలెనునకు గుసగుసధ్వనితో జెప్పెను.

దొంగల బెదరింప సమకట్టి. యాలెను గంభీరస్వనమున "ఆబి తుపాకుల దెమ్ము వారి బరిమార్చు"మని యఱ ఈ యఱపులకు నీగ్రోలు జడియరైరి. ఎప్పటియట్లు మరల నిశ్శబ్ద మావరించెను. తమకడ సాధన మొక్కటియైన లేకుండుట సూచి యాబి ధైర్యము పూని యొకదుడ్దుకఱ్ఱ దీసికొని ప్రాణమునకై పోట్లాడవలె నని నుడువుచు మహారావమున "ఎవడురా దుర్మార్గు డని" యఱచెను. దానికి బ్రత్యుత్తరములేనందున నింకను భయంకరముగ నదేవిధమున నఱచెను.

"దుష్టవర్తనులారా! ఏల మీ రిచటి కేతెంచిరి? మరలి చనిన మే లగు. లేకున్న నిదె మిము జలముల కాహుతి యొసంగెద" నని యాగ్రహమున బల్కుచు శరాసనంబు నుండి విడువబడిన బాణంబువోలె చీకటియనక రివ్వున వారిపై కురికెను.

కొంతకాలము గఱ్ఱలతో యుద్ధము జరిగెను. తరువాత దగ్గరదగ్గర చేరి ముష్టియుద్ధమే ప్రారంభమాయెను. సమరము మిక్కిలి ఘోరమై రక్తముల వెల్లువల కావాసమై ఫల మేమగునో యెఱుంగరాక పదినిమిషములవఱ కొక్క పెట్టున బ్రబలసాగెను. తుట్టతుద కాబ్రహాము శత్రువులలో నొకని బ్రవాహంబున ద్రోసె. తక్కినవారెల్ల నీట దుమికి పలాయితు లయిరి.

"వారి వెన్నంటి దఱిమి చంపుదముగా" కని భయంబెల్ల బోదోలి యాబ్రహా మాలెను లరమై లా నీగ్రోల వెంబడించిరి. వారును నెందఱు 'నావికులు' దము నెదిర్చిరో గదా యని భయపడి తిరిగిచూడక పరుగెత్తిపోయిరి.

ఈ నీగ్రోలు బానిసలు. తమ యజమానుని యుత్తరువు ననుసరించి నాదారి బోవు పడవల గొల్లగొట్ట నేతెంచిరి. ఆహా! బానిసవృత్తి యెంతహీన మైనదో చూడుడి. తమ దేహముల దొర కర్పించుటయేగాక మనముల గూడ నర్పించ వలసి వచ్చుచుండెను. దొంగతనముచేసి ధనము గొనిరమ్మనిన నట్టిదుష్టకార్యము మే మెట్టుల సల్పుదు మనుటకు వారికి స్వాతంత్ర్యము లేకుండెను. ఇట్టిదుర్దశయం దుండువారల నీ తరుణమున నెదిర్చి పోరి యోడించి, వారిదెబ్బలచే నెన్నియో గాయములు తగుల గంటి పైమచ్చ దాని కానవాలుగ బ్రాణాంతమువఱకు నిడికొనిన యాబ్రహాము దేశాధ్యక్షత వహించి యీదిక్కుమాలిన వారికై పెనగి వారిదుర్దశ మాన్చి వారికై ప్రాణము లర్పించు టెంతటిదైవికాజ్ఞయో గమనింపుడి.

తమ వైరుల బాఱదోలి యాబ్రహా మాలెనులు దమ పడవను మఱియొక స్థలమునకు గొంపోయి నా డచట రాత్రి గడపి తరువాత బ్రయాణముసేసి న్యూఆర్లియన్సు చేరిరి. వారి సరకంతయు దగినవెల కమ్మబడియెను. మొదట నేర్పఱచుకొనిన తెఱంగున వారిరువురును దమ యిండ్ల కొక పొగయోడపై వచ్చిచేరిరి.