Jump to content

ఆనందమఠము/ముప్పది యేడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
​

ముప్పది యేడవ ప్రకరణము

భవానందుఁడు నిహతుఁ డగుట

రణమునందు జయమైన పిమ్మట అజయనదీ తీరమునందు సత్యానందునిఁ బరివేష్టించికొని విజయులైన వీరులు నానావి ​ధోత్సవములను జరుప నారంభించిరి. సత్యానందుఁడు మాత్రము భవానందుని మరణముచే వ్యాకులచిత్తుఁడై యుండెను.

ఇదివఱకును వైష్ణవులకు రణవాద్యము లధికముగా నుండ లేదు. ఇప్పుడు భేరి, కాహళము, తమైట, నగారా, డోలు, డమరు, శంఖము, జయఘంట మొదలగు నానావిధ వాద్యము లెచ్చట నుండియో వచ్చి తుముల శబ్ద మయ్యెను. ఈ జయ సూచక వాద్యములచే కాననము ప్రాంతరము నదు లాదిగాఁ గల ప్రదేశములందు ప్రతిధ్వని పరిపూర్ణముగా నిండిపోయెను, ఈవిధముగా సంతానులు పెద్ద ప్రొద్దు నానావిధోత్సవములను జరిపినపిదప సత్యానందుఁడు, “జగదీశ్వరుఁడు నేఁడు కరుణించెను; సంతానధర్మంబునకు జయమాయెను; అయిన నొకపని నిలిచెను; ఎవఁడు మనతో నీ యుత్సవమునఁ జేరలేదో, ఎవఁడు మన యుత్సవముకొఱకై ప్రాణము నిచ్చెనో, యట్టి వానిని మఱచుట సరికాదు; ఎవఁడు రణక్షేత్రమునందు నిహతుఁడై పడియున్నాఁడోవానికి సత్కారము చేయుదము రండు; ఆ మహాత్ముడు మనకొఱకై యీరణజయంబును బొందిప్రాణత్యాగమును జేసి యున్నాఁడు; మహావైభవముతో నా భవానందుని సత్కరింపుము” అని చెప్పెను. అప్పుడు సంతానులు “వందేమాతరం” పాడుచు నిహతుఁడైన వానిసత్కారమునకై వెడలిరి. బహుజనులు గుంపుగాఁ జేరి హరిస్మరణము చేయుచు చందనకాష్ఠంబులను (అప్పుడు ఫారెస్టు అనఁగా: అడవి యిలాఖావారి సంకటము లేదు.) మోచికొనివచ్చి యెక చితినేర్పఱచి, “హరే మురారే” యని గానము చేయుచు, చితికిఁ బ్రదక్షిణము చేసిరి, (వీరు వైష్ణవసంప్రదాయంబున జేరిన విష్ణు ​భక్తులైనందున దహనము చేసెదరు.) పిదప కాననమందు సత్యానందుఁడు, జీవానందుఁడు, మహేంద్రుఁడు, నవీనానందుఁడు, ధీరానందుఁడు అగు వీరు మాత్రమే కూర్చుండి యుండిరి. ఈయైదుగురును ఏకాంతముగా పరామర్శ చేయుచుండిరి. అపుడు, సత్యానందుఁడు, “ఇన్ని దినములు మనము దేని కొఱకై సర్వధర్మమును సర్వసుఖమును త్యజించి యుంటిమో యావ్రతము నేడు సఫల మాయెను. ఈ ప్రదేశమున యవనుల సైన్యము లేదు. అవశిష్టమై యున్నవారు సైతము మన ముందు నిమిషమైన నిలువ లేరు. ఇప్పుడు మీ రేమి చెప్పెదరు?” అనెను.

జీవానందుఁడు, ‘దయ చేయుఁడు; ఈసమయము పోయి నగరాధికారమును వహింత’ మనియెను.

సత్యానంద —— నామతమును అదే.

ధీరానంద —— సైన్య మేది?

జీవానంద —— ఏల! మన సైన్యము.

ధీరానంద —— సైన్య మిం కెక్కడ? ఎవరైనఁ గనఁబడు చున్నారా?

జీవానంద —— అచ్చటచ్చట విశ్రమించి యుండవచ్చును. భేరి మ్రోగించినచో నందఱును వచ్చి చేరుదురు.

ధీరానంద —— ఒక్కఁడును లేఁడు.

జీవానంద —— అదేల?

ధీరానంద —— అందఱును కొల్లగొట్టుటకై పోయి యున్నారు. గ్రామములన్నియు నిపు డరక్షితము లై యున్నవి. ముసల్మానుల గ్రామములను, పట్టుపని చేయు కార్ఖానాలను ​కొల్లగొట్టుకొని యిండ్లకుఁ బోయి చేరుదురు. ఎవ్వరును కనఁబడ లేదు. నే నిప్పుడే వెదకి చూచి వచ్చినాఁడను.

సత్యానందుఁడు విషణ్ణుఁడై , “ఎట్లయినను కానీ, నగరము తక్క సమస్తమైన వీరభూమి మనస్వాధీనమై యున్నది. నగరము బయట మనకుఁ బ్రతికక్షు లైనవా రెవ్వరును లేరు. కనుక, మీరు వీరభూమియందు సంతాన రాజ్యమునుఁ జేయుఁడు. ప్రజలచే పన్ను గొనుఁడు. మఱియు, నగరమును మన యధికారమునకు లోఁబఱిచి కొనుటకు సైన్యమును సంగ్రహింపుఁడు. హిందువుల రాజ్య మైనది యని విన్నచో ననేకులు సంతాన సైన్యము ననుకరింపఁగలరు.” అని చెప్పెను.

అపుడు, జీవానందుఁడు మొదలగువారు సత్యానందునికి మ్రొక్కి, “మేము నమస్కరించు చున్నారము, ఓమహారాజాధిరాజా! అనుజ్ఞ నిండు; మేమీ కాననమునందే తమ సింహాసనమును స్థాపించెదము" అనిరి.

సత్యానందుఁడు పుట్టినది మొదలు కోప మెఱుఁగనివాఁడు, నేఁడు ప్రథమ కోపమును బ్రకాశింపఁ జేసి, ‘ఛీ! నన్నొక మూర్ఖునిగాఁ దలంచితిరా? మన మెవ్వరమును రాజులము కాము —— మనము సన్న్యాసులము —— ఈ దేశంబున కంతయు సాక్షాత్ వైకుంఠ నాథుఁడే రాజు. నగరము మన యధికారమునకు లోఁబడఁగానే మీ కెవరియం దిష్టమో వాని శిరమున రాజమకుటము నుంపుఁడు. నేను మాత్రమీ బ్రహ్మచర్య వ్రతమును మాని యితరాశ్రమమును స్వీకరింపను. ఇది ఖండితముగాఁ దెలిసి యుండవలయును. ఇప్పుడు మీ మీ పనులకుఁ బోవనగు” ననియెను. ​అప్పు డానల్వురును బ్రహ్మచారికి నమస్కరించి లేచి నిలువంబడిరి. సత్యానందుఁ డితరులకుఁ దెలియనీక సంజ్ఞ చేసి మహేంద్రుని నిలుపుకొనియెను. మిగిలిన ముగ్గురును వెడలి పోయిరి. సత్యానందుఁడు మహేంద్రునితో “మీరందఱును విష్ణు మందిరమున ప్రతిన పల్కి సంతానుల ధర్మమును గ్రహించితిరి. భవానందుఁడు, తా నొప్పుకొనియుండిన ప్రాయశ్చిత్తమునకు నేఁడు లోఁబడియెను. జీవానందుఁడు సహిత మెన్నఁడు ప్రాయశ్చిత్తమునకు లోఁబడి ప్రాణమును ద్యజించునో? అని నాకు భయమై యున్నది. అయినను నాకొక నమ్మకమున్నది. ఏమన, ఒకానొక నిగూఢమగు కారణముచే నతఁడు ప్రకృతమునఁ జచ్చుట కిష్టము గలవాఁడుగా లేదు. నీవొక్కఁడవే ప్రతినను గాపాడుకొని యున్న వాఁడవు. ఇప్పుడు సంతానుల కార్యోద్ధార మాయెను. సంతానుల కార్యోద్ధార మగువఱకే నీవు నీ పెండ్లము బిడ్డల ముఖము చూడఁగూడదు; ఇప్పుడు సంతానుల కార్యము ఉద్ధరింపఁ బడెను. ఇఁక నీవు గృహస్థుఁడవు కావచ్చు” ననియెను.

మహేంద్రుని కన్నులనుండి నీరు ప్రవహించుచుండెను. కొంతవడికి మహేంద్రుఁడు, “స్వామీ! ఎవ్వరిని బొంది గృహస్థుఁడ నగుదును? భార్య ఆత్మ ఘాతినియై పోయెను. ఇంక నా బిడ్డ యెక్కడ చున్నదో నే నెఱుంగను. ఎక్కడ దొరకును? బ్రతికియున్నదని సెలవిచ్చియుంటిరి. ఇంతేకాక “వేఱేమియు నెఱుంగ” ననియెను.

తలపై చెట్టుకొమ్మయం దెవరో యుండి, ‘బిడ్డ యుండు ​చోటు నేనెఱుంగుదు’ ననెను. మహేంద్రుఁడు తల యెత్తి చూచి ‘నీ వెవ్వర’ని యడిగెను.

సత్యానందుఁడు, కొంచెము కోపము దాల్చి, ముఖమును పైకెత్తి చూచుచు “నవీనానందా! నిన్ను వెడలి పొమ్మని యిదివఱకే సెలవిచ్చి యుంటిని. ఇంకను ఇచ్చట నేల యున్నావు?” అనెను.

శాంతి కొమ్మపై నుండియే “ప్రభూ! స్వర్గలోకమందును మర్త్యలోక మందును తమ కధికారము కలదు. చెట్టుకొమ్మపైనను గలదా?” యనెను.

ఇట్లని శాంతి కొమ్మపై నుండి తటాలున క్రిందికి దుమికెను.

సత్యానందుఁడు మహేంద్రునిఁ జూచి, “ఇతఁడు నవీనానందగోస్వామి. అతిపవిత్రాత్ముఁడు: నా ప్రియ శిష్యుఁడు. ఇతఁడు నీ కొమార్తెను వెదకి పిలుచుకొని రాఁగలం”డని చెప్పి, శాంతికి కనుసన్న చేసెను. శాంతి నమస్కరించి సెలవు గైకొనియెను. అప్పుడు మహేంద్రుడు మరల “ని న్నెచ్చటఁ జూడ నగు” నని యడిగెను.

శాంతి ‘నాయాశ్రమంబునకు రావచ్చు’ నని చెప్పి వడివడిగాఁ బోయెను.

మహేంద్రుడు బ్రహ్మచారికి మ్రొక్కి, సెలవు గైకొని శాంతితోడ నామె యాశ్రమంబునకుఁ బోయెను. ఇంతలో రాత్రి కాల మాయెను. అట్లుండినను శాంతి విశ్రమింపక నగరాభిముఖియై చనెను.

అందఱును వెడలిపోయిన మీఁద బ్రహ్మచారి యొకఁడే ​భూమిపై సాష్టాంగ నమస్కారము చేసి మనంబున జగదీశ్వరుని ధ్యానింప నారంభించెను. రాత్రి ప్రభాతమగుచు వచ్చెను. అపు డెవరోవచ్చి యతని మస్తకమును స్పృశించి “నేను వచ్చి యున్నాను” అనెను.

బ్రహ్మచారి లేచి చూచి విస్మితుఁడై బహువ్యగ్రభావముతో, “తాము దయ చేసితి రేల?” అనెను. “దినము ముగిసె” ననెను. బ్రహ్మచారి “ప్రభూ! నేఁడు క్షమింపవలయును; రాఁగల పున్నమనాఁటికి తమ యనుమతి ప్రకారము వర్తింతు” ననియెను.