ఆనందమఠము/ముప్పది మూఁడవ ప్రకరణము
ముప్పది మూఁడవ ప్రకరణము
సత్యానందుఁడు యుద్ధమునకుఁ బురికొలుపుట
తీర్థయాత్ర చేయుటకై పోయిన సంతానులలో సత్యానందుఁడు మాత్రము మరలి వచ్చె ననియును, సంతానుల కందఱకు నేమో చెప్పవలయు నని యున్నాఁ డనియును, సంతానులందఱును రావలసిన దని సెలవైనదనియును ప్రకటింపఁబడెను. గుంపులు గుంపులుగా సంతాను లందఱును అజయనదీతీరమున వచ్చి చేరిరి. వెన్నెలరాత్రి యందు అజయనదీ పార్శ్వమున నుండు పెద్ద యడవిలో ఆ ఆమ్ర పనస తింత్రిణి వటాశ్వత్ధ శాల్మలీ వృక్షాదులచే నలంకృతమైన యా మహాగహనమునందు పదివేల సంతానులు చేరిరి. అపు డందఱును పరస్పరము సత్యానందుని ఆగమనవార్త విని కోలాహలధ్వని చేయుచుండిరి. సత్యానందుఁ డెచ్చటి కేమి పనిగాఁ బోయియుండెనో యది యెవ్వరికిని దెలియదు. అయినను, వదంతి యేమనఁగా —— అతడు సంతానుల మంగళా కాంక్షియై తపస్సు చేయుటకు హిమాలయమునకుఁ బోయియుండెననియును, ఆమహాస్వాముల తపస్సు సిద్ధి యైనదనియును, మనకు రాజ్యము వచ్చు ననియును మిక్కిలి కోలాహలము చేయుచు, ‘కొట్టుఁడు, పట్టుఁడు, తురకలను చంపుఁడు’ అని చీత్కారము చేయుచుండిరి. కొందఱు జయ, జయ మహాస్వాములకు జయ జయ, అని యఱచిరి. కొందఱు “హరేమురారే మధు కైటభారే”యని పాడిరి. కొందఱు “వందే మాతరం” పాడిరి. కొందఱు ‘అన్నా! తుచ్ఛ బంగాళీలకై రణరంగమున నీ శరీరమును విడిచి పెట్టవలసిన దినము వచ్చె’ ననిరి. కొందఱు ‘అన్నా! మసీదులను గొట్టి ధ్వంసము చేసి రాధామాధవ మందిరములను కట్టుదినము వచ్చె’ననిరి. కొందఱు ‘తాను సంపాదించినదానిని తాననుభవించు దినము వచ్చె’ ననిరి. కొందఱు ‘వర్ణాశ్రమ హీనుల మైయుండక నిర్బాధకముగా మరల వర్ణాశ్రమమును గ్రహించు దినము వచ్చె’ ననిరి. కొందఱు ‘ఈ అరాజకము తప్పునా? ఈ జాతిపక్షపాతము తప్పిపోవునా? శిష్టాచరణమందు బుద్ధి కలుగునా!’ యనిరి. ఇట్ల నేకు లనేక విధములుగా తమతమ యభిమ తానుసారముగఁ జెప్పికొనుచుండిరి. పదివేగురియొక్క కలకల రవమును, మంద వాయువుచే తాడితమైనందునఁ గల్గిన వృక్ష పత్ర రాశియొక్క మర్మరశబ్దమును, సైకత వాహినియైన తరంగిణి యొక్క మృదువైన తరతర రవమును, నీలాకాశమునందలి చంద్ర తారలును, శ్వేత మేఘరాశియును, శ్యామలమైన ధరణీ తలము నందలి పచ్చగానుండు నరణ్యమును, స్వచ్ఛమైన తెల్లని యిసుకయును, ఫుల్లకుసుమదామము లును, మఱియు మధ్య మధ్య సకలజన మనోహరంబగు ‘వందేమాతరం’ ఘోషమును, మిళితమై యుండు సమయమున, సత్యానందుఁడు వచ్చి, యాసంతానులమధ్య నిలిచెను. అప్పు డాదశ సహస్రసంతాన మస్తకములు, చెట్ల సందులనుంచి ప్రసరించిన చంద్ర కిరణములచే ప్రభాసితమైన శ్యామల తృణావృత భూమియందుఁ బ్రకాశించెను. సత్యానందుఁడు అత్యుచ్చధ్వనిచే నశ్రుపూర్ణ లోచనుఁడై రెండు చేతులను పైకెత్తి చెప్పదొడంగెను :——
శంఖచక్ర గదాపద్మ ధారియును, వనమాలా విభూషితుఁడును, వైకుంఠ నాథుఁడును, కేశిమథనుఁడును, మధు ముర నరక మర్ధనుఁడును లోకపాలకుఁడు అగు శ్రీహరి మీకు మంగళము నిచ్చును గాక. మీభుజములయందు బలము నిచ్చును గాక. మనస్సున భక్తి నిచ్చును గాక, ధర్మంబున బుద్ధి నుంచును గాక. మీరంద ఱేకగ్రీవముగ నతని మహిమను వర్ణనగీతమును పాడుఁ డనినంతనే యా వేలకొలఁది జనుల కంఠములనుండి ఉచ్చస్వరముతో,
జయ జగదీశ హరే
ప్రళయ పయోధి జలే ధృతవానసి వేదమ్
విహితవహిత్ర చరిత్రమఖేదమ్
కేశవధృత మీన శరీర
జయ జగదీశ హరే
సత్యానందుఁడు వారిని మరల దీవించి, ‘సంతానులారా! ఈదినము మీకుఁ జెప్పవలసిన విశేష మొకటి కలదు. థామసుఁ డను నొక విధర్మి యగు దురాత్ముఁడు అనేక సంతానులను నాశము జేసి యున్నాఁడు. మనము, ఈ రాత్రి వానిని సైన్య సహితముగా హతము చేయవలయును. ఇది జగదీశ్వరుని యాజ్ఞ, మీరేమనెదరు?’ అనెను.
భీషణమగు హరిధ్వనిచే కానన మంతయు విదీర్ణమయ్యెను. “ఇపుడే కొట్టెదము, వాఁ డెచ్చట నున్నాఁడు! చూపుడు, పదండి, కొట్టుఁడు! కట్టుడు! శత్రువును గొట్టుడు!’ అనెడి శబ్దములు దూరముగ నుండిన కొండలయందుఁగూడ ప్రతిధ్వనిత మాయెను. అపుడు సత్యానందుఁడు ‘మనము కొంచెము తాల్మితో పని చేయవలయును, శత్రువులకు ఫిరంగి మొదలగు సాధనములు గలవు. అట్టి సాధనములు లేక మనము వారితో యుద్ధము చేయఁ దగదు. ఇదియును గాక, వారు వీరజాతివారు. పద చిహ్నదుర్గమునుండి పదునేడు ఫిరంగీలు వచ్చును. అవి రాగానే మనము యుద్ధంబునకుఁ బోదము. చూడుఁడు, ఇపుడే తెల్లవాఱుచున్నది. అయిదు గంటలు కాకమునుపే——అదియేమి?’ యనెను.
ఢం-ఢం అకస్మాత్తుగా ఆ విశాలమైన యడవియందు నాల్గు దిశ లందును ఫిరంగిగుండ్ల శబ్ద మాయెను. అవి ఆంగ్లేయుల ఫిరంగి గుండ్లు, కేప్ట౯ థామసు సంతానులను ‘వలలోఁ జిక్కిన చేఁపలవలె వధింపవలయు’ నని యుద్యమించి యుండెను.