ఆనందమఠము/ముప్పదియవ ప్రకరణము
ముప్పదియవ ప్రకరణము
భవానంద ధీరానందుల సంవాదము
భవానందుఁ డాలోచనా క్రాంతుఁడై మఠమునకు వెడలెను. పోవుచుండఁగాఁ బొద్దు క్రుంకెను. అడవియం దొక్కఁడే పోవుచుండెను. అచ్చట నెవఁడో యొకఁడు ముందు పోవు చుండెను. భవానందుఁ ‘డెవరది’ యని యడిగెను.
అగ్రగామి —— అడుగువా రెవరు? తెలిసినచో నుత్తర మిచ్చెదను. నేను పథికుఁడను.
భవానంద —— వందే.
అగ్రగామి —— మాతరం.
భవానంద —— నేను భవానంద గోస్వామిని.
అగ్రగామి —— నేను ధీరానందుఁడను.
భవానంద —— ధీరానందా! ఎచటికిఁ బోయి యుంటివి? ధీరానంద —— నిన్ను వెదకుచు.
భవానంద —— ఏల?
ధీరానంద —— ఒకమాట చెప్పుటకు.
భవానంద —— అదేమి మాట.
ధీరానంద —— నిర్జనస్థలమునఁ జెప్పఁదగినది.
భవానంద —— ఇచ్చటనే చెప్పుము. ఇట నెవ్వరును లేరు.
ధీరానంద —— నీవు నగరంబునకుఁ బోయి యుంటివా?
భవానంద —— ఔను.
ధీరానంద —— గౌరీ దేవి యింటికా?
భవానంద —— నీవును నగరంబునకే పోయియుంటివా ఏమి?
ధీరానంద—— అచ్చట నొక పరమసుందరియైన వనిత నివసించుచున్నది కాదా?
భవానందుఁడు, కొంచె మాశ్చర్యపడి భయభ్రాంతుఁడై —— ఇదేమి మాట? యనెను.
ధీరానంద —— నీవు దానిని చూచితివి గదా?
భవానంద —— ఆతర్వాత.
ధీరానంద —— నీ వాయువతియం దనురక్తుడవై యున్నావా?
భవానంద —— (కొంచెము ఆలోచించి) ధీరానందా! ఈ యన్వేషణ మేల ఘటించెను! నీవు చెప్పిన దంతయు నిజమే. నీవు దక్క ముఱెవ్వ రెఱుఁగుదురు?
ధీరానంద —— ఎవ్వరు నెఱుఁగరు,
భవానంద —— అట్లయినపుడు నిన్ను గొట్టి చంపి నేను కళంక ముక్తుడను కావచ్చును కదా? ధీరానంద —— కావచ్చును.
భవానంద —— అయినను రమ్ము. ఈ విజనస్థలమున మన మిరువురమును జగడము చేయుదము. నిన్నుఁజంపి నేను నిష్కంటకుఁడ నయ్యెదను, అట్లు గానిచో నన్ను నీవు చంపి నీకోప జ్వాలనంతయు నణఁగించుకొనుము. ఆయుధ మున్నదా?
ధీరానంద —— ఉన్నది. ఉత్త చేతులతో, నామాటలన్నియు నీతోఁ జెప్పుటకు సాధ్య మగునా? యుద్ధమే నీమత మైయుండినచో నావశ్యకముగా జేయుదును. సంతానులకు పరస్పరము విరోధము నిషిద్ధము. ఆత్మరక్షణార్థమై యెవరితో విరుద్ధము చేసినను నిషిద్ధము లేదు. అయినను, ఏమాట చెప్పుటకై నిన్ను వెదకుచుంటినో దాని నంతయు నీవు విన్న తర్వాత యుద్ధముచేయుట మంచిదికదా?
భవానంద —— చెప్పుము బాధక మేమి?
భవానందుఁడు కత్తిని యొరనుండి తీసి ధీరానందుని భుజముపై నుంచెను. ధీరానందుఁడు భయపడి పరుగిడ లేదు.
ధీరానంద —— నేనేమి చెప్పుచున్నా ననఁగా, నీవు కల్యాణిని వివాహము ——
భవానంద —— కల్యాణి కది తెలియునా?
ధీరానంద —— ఎందులకు చేసికొనదు?
భవానంద —— దానికి మగఁడున్నాడు కదా ?
ధీరానంద —— వైష్ణవులం దిట్టివివాహము కావచ్చును.
భవానంద —— అది వట్టిగొడ్డు సన్న్యాసిరాదు —— సంతానులకు వివాహమే లేదు.
ధీరానంద —— సంతానులధర్మ మపరిహార్యమా! నీప్రా ణము పోవుచున్నదే? ఛీ! ఛీ! నాగొంతు గాయ మాయెను. (వాస్తవముగా ధీరానందుని మెడనుండి రక్తము కాఱుచుండెను.)
భవానంద —— నీవు నాకధర్మమును బోధించుటకు వచ్చితివా యేమి? నీకేమో స్వార్థ ముండవలయును.
ధీరానంద —— దానినే చెప్పుట కిష్టము కలవాఁడనై యున్నాను. కత్తిని నొక్క కుము చెప్పెదను. ఈ సంతానధర్మము నందు ఎముక లెల్ల పొడి యగుచున్నవి. నేను దీనిని పరిత్యజించి యాలు బిడ్డల ముఖమును జూచికొని కాలహరణము చేయవలయునని మిగుల నాతురుఁడనై యున్నాను. నే నీ సంతానధర్మమును విడిచి పెట్టుదును. అయిన, నింట గూర్చుండి చేయున దేమి? నేను విద్రోహి నని యందఱును దెలిసికొని యున్నారు. ఇంటికి బోయి కూర్చుండినను రాజభటులు వచ్చి తల నఱికి తీసికొని పోదురు. లేనియెడల, సంతానులే నన్ను విశ్వాసఘాతుకుఁడనని నఱికి వేయుదురు. కావున, నిన్నును నా మార్గమునకుఁ దీసికొనుట కిష్టము కలవాడనై యున్నాను.
భవానంద —— నన్ను నేల?
ధీరానంద —— ఇది ముఖ్యమైనమాట. ఈసంతానసైన్యము నీయాజ్ఞాధీనము. సత్యానందుఁ డిప్పు డిచ్చట లేఁడు. నీవే వారికి నాయకుఁడవు. నీ వీసేనను గొనిపోయి యుద్ధము చేయుము. నీకు జయము కలుగునని నాకు దృఢమైన నమ్మకము కలదు. యుద్ధమునందు జయ మైనచో నీ సొంత పేరుతో రాజ్యస్థాపన జేయుము. సైన్యము నీ స్వాధీనమై యున్నది. నీవు రాజగుము —— కల్యాణి నీకు మండోదరి కానిమ్ము. నేను నీ యను చరుఁడనై పెండ్లము బిడ్డలతోఁ గాలహరణము చేయుచు నిన్ను దీవించుచుండెదను. సంతానధర్మము నతలజలమునఁ గలిపి వేయుము.
భవానందుఁడు కత్తిని ధీరానందుని మెడనుండి మెల్లగా దీసి, ‘ధీరానందా! యుద్ధము చేయుము; నిన్నుఁ జంపెదను; నేను ఇంద్రియ పరవశుఁడనై యున్నాను; అయినను విశ్వాసఘాతుకుఁడను గాను. నన్ను విశ్వాసఘాతుకుఁడ వగు మని నీవు హెచ్చరిక చేయుచున్నావు. నీవు స్వయం విశ్వాసఘాతుకుఁడవు; నిన్నుఁ జంపినచో బ్రహ్మహత్యా పాతకము సంభవింపదు. నిన్ను వధింతు’ ననెను. మాట ముగియునంతలో ధీరానందుఁడు నిట్టూర్పు పుచ్చి పరుగిడిపోయెను. భవానందుఁడు వాని వెంట నంటి పోలేదు. వాఁడు కొంచెము సేపు అన్యమసస్కుఁడై యుండి, పిదప వెదకెను, వాఁడు కనఁబడ లేదు.