Jump to content

ఆనందమఠము/ముప్పదినాలుగవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
​

ముప్పదినాలుగవ ప్రకరణము

థామస్ యుద్ధము చేయుట.

ఆంగ్లేయుల ఫిరంగిగుండ్లు ఢం-ఢం- శబ్దము చేసెను. ఆ శబ్దము విశాలమైన కాననమును గంపింపఁ జేసి ప్రతిధ్వనితమాయెను. శబ్దము ఆజయనదీ సోపానమునుండి మఱొక సోపానమునకు విని, యిట్లు నదీముఖముగా దూరముననుండు కాననమును బ్రవేశించి యచ్చటను ఢం-ఢం- అని వినవచ్చెను. సత్యానందుఁ ‘డెవరి పటాలమో చూడుఁ’ డనియెను. ఆక్షణముననే కొందఱు సంతానులు గుఱ్ఱముల నెక్కి చూచుటకై వెడలిరి. అయినను, వారు కాననమును విడిచి కొంతదూరము పోవునంతలో శ్రావణమాస వర్ష ధారలవలె గుండ్లు వారిపై గురిసెను, వారు గుఱ్ఱములతోఁ గూడ ప్రాణములను విడిచిరి. సత్యానందుఁడు దూరముగ నుండి చూచి సంతానులు కొందఱు హతు లైరని తెలిసికొని, మణికొందఱను బిలిచి ‘గొప్పవృక్షము నెక్కి చూడుఁ డని చెప్పుచుండఁగా, జీవానందు డొక గొప్పవృక్షమునెక్కి చెట్టు కొమ్మపై నిలిచి, ‘ఇంగ్లీషువారి పటాల’ మనెను. సత్యానందుఁడు, ‘గుఱ్ఱపుసవారులా? కాల్బములా?’ అని యడిగెను.

జీవానంద —— రెండును గలవు.

సత్యానంద —— ఎంత? ​జీవానంద —— చెప్పుటకుఁ గాదు, చెట్లకొమ్మ లడ్డముగానున్నవి, వారు బయటికి రాలేదు.

సత్యానంద —— ఎఱ్ఱ మూతివారా? లేక ఉత్తసిపాయీలా?

జీవానంద —— ఎఱ్ఱమూతివారుకూడ నున్నారు, అని చెప్పుచు చెట్టునుండి దిగెను.

సత్యానంద —— పదిగురు సంతానులు సిద్ధముగ నున్నారు. ఏమి చేయుదువో, చూడుము, నీవు దీనికి సేనాపతివి.

దీనిని విని, జీవానందుఁడు సశస్త్రుఁడై సజ్జితుఁడై ఒక్క యెగురున గుఱ్ఱము నెక్కెను. ఒకతూరి నవీనానందుని వైపు తిరిగిచూచి కనుసన్న చేసెను. అదేమి సంకేతమో యెవరికినిఁ దెలియ లేదు. నవీనానందుఁడు కనుసన్న చే నేమి యుత్తర మిచ్చినదియు నెవ్వరికిని దెలియ లేదు. వారివారి మనస్సు నందు పరస్పర మిదియే కడపటి దర్శన మని భావించియుండ వచ్చును. అప్పుడు నవీనానందుఁడు దక్షిణబాహువును పైకెత్తి యందఱను జూచి “భ్రాతృలారా! ఈ సమయమున ‘జయజగదీశ హరే’ యని ప్రార్థింపు” డని చెప్పెను. అప్పుడా పది వేలసంతాను లేకకంఠముతో నది కానన గగనములు సైతము ప్రతిధ్వని చేయునట్లును, గుండ్ల శబ్దమును ముంచి వేయునట్లును చేతులు నెత్తుకొని,

జయజగదీశహరే
మ్లేచ్ఛనివహనిధనే కలయసి కరవాలమ్.

అని పాడిరి.

ఈసమయంబున నాంగ్లేయుల గుండ్ల వాన కాననమధ్య మందు సంతానులపై గురిసెను. అనేకులు పాటపాడుచుండి ఛిన్నమస్తకులై ఛిన్న బాహువులై ఛిన్న హృదయులై నేలకు ​వ్రాలిరి. అయినను, ఎవ్వరును పాడుటను నిల్పక ‘జయజగదీశ హరే!’ యని పాడుచునే యుండిరి. గానము ముగియగనే యంతయు నొకేసారి నిస్తబ్ద మాయెను. ఆ దట్టమగు నడవియును ఆ నదీసైకతమును ఆ యనంతమగు విజనమును ఒకేసారి గంభీరమైన నీరవమున నివిష్ట మాయెను. కేవల మాయతి భయంకరమైన ఫిరంగిగుండ్ల ధ్వనియును, దూరముగా నుండి వచ్చుచుండిన యాంగ్లేయుల అస్త్రముల ఝంకారధ్వనియును వారి పదధ్వనియును మాత్రము వినఁబడుచుండెను.

సత్యానందుఁ డాగంభీరమైన నిశ్శబ్దమధ్యమునం దత్యుచ్చస్వరముతో ‘జగదీశుఁడగుహరి మీకుఁ గ్రుపచేయును. ఫిరంగులెంతదూరమున నున్నవి,’ అనియెను.

మీఁదుగ నుండి యొక్కఁడు, ఈకాననమునకు సమీపమున నున్నది. ముందు కనఁబడు కొండయే యడ్డ’ మనెను.

సత్యానంద —— నీ వెవరు?

పై నుండి —— నేను నవీనానందుఁడను.

సత్యానంద —— మీరు పది వేలసంతాను లున్నారుకదా, మీకు జయ మగును, ఫిరంగులను లాగుకొని రండు

అపుడు అశ్వారూఢుఁడై మొదట యుండిన జీవానందుఁడు “రండు” అని యఱచెను.

అంత అశ్వారూఢులును పదాతు లందఱును అతిత్వరితంబుగ జీవానందుని వెన్నంటి చనిరి. పదాతులు భుజమున తుపాకులను, నడుమున కత్తులను, చేతియందు బల్లెములను ధరించి కాననము నుండి బయటికి రాఁగానే, ఆ యజస్ర మగు గుండ్లవర్షము గురిసి వారిని చిన్న భిన్నము చేయ నారంభించెను. ​పెక్కుమంది సంతానులు యుద్ధము చేయకయే ప్రాణత్యాగము చేసి భూశయ్యాగతు లైరి. ఒకఁడు జీవానందునిఁ గూర్చి ‘జీవానందా! నిరర్థకముగా ప్రాణిహత్య వలన నేమి ప్రయోజన’ మనియెను.

జీవానందుఁడు వెనుకకు తిరిగి చూడఁగా, భవానందుఁడై యుండెను. జీవానందు ‘డేమి చేయుదము? చెప్పు’ మనెను.

భవానంద —— వనముననే చెట్ల యొక్క యాశ్రయముచే ప్రాణరక్షణ చేసికొందము. గుండ్ల బారికి చిక్కినచో భూమియే గతి. ఫిరంగులు లేక, ఈసంతాన సైన్య మొక్క నిమిషమైన నిలువదు. అయినను పొదలయందు దాఁగి యుండి చాల సేపు యుద్ధము చేయవచ్చును.

జీవానంద —— నీవు చెప్పినది నిజము. అయినను ప్రభువు ఫిరంగులను లాగుకొని రావలయునని యనుజ్ఞ చేసి యున్నాఁడు. అందుచేత మేము ఫిరంగులను లాగికోని రాఁబోవు చున్నాము.

భవానం —— ఫిరంగులను లాగికొని రానెవరికి సాధ్యము? అట్లు అవశ్యముగా పోవలసియే యుండినచో నీవు నిలువుము; నేను బోయెదను.

జీవానంద —— అది కానేరదు, భవానందా! నేఁడు నే చచ్చుదినము.

భవానంద —— నేడు నేనును జచ్చుదినము.

జీవానంద —— నేను ప్రాయశ్చిత్తము చేసికొందును.

భవానంద —— నీది నిష్పాప శరీరము, నీకుఁ బ్రాయశ్చిత్త ​ము లేదు, నామనస్సు కలుషిత మైనయది, నేనే చావవలసినది. నీవు నిలుపుము, నేఁ బోయెదను.

జీవానంద —— భవానందా! నీవు చేసిన పాప మేమో నే నెఱుఁగను అయినను, నీ వుండినచో సంతానుల కార్యోద్ధారమగును, నేను బోయెదను.

భవానందుఁడు కొంచెముసే పూరకుండి, తుదకు ‘చావు స్థిరమై యున్న నేఁడే చత్తును. ఏనాడు చచ్చుటచే ప్రయోజనమో యానాఁడే చచ్చెదను, చచ్చుటకు కాలాకాలము లేమి?’ అనెను.

జీవానంద —— అట్లయిన రా,

ఇట్లు మాటలాడుచుండగనే భవానందుఁ డందఱకంటె ముందుగా నడిచెను. అప్పుడు దళదళములందును గుంపుగుంపులందును గుండ్లుపడి సంతాన సైన్యమును ఖండ విఖండములుగా జేయుచుండెను; చించి చెండాడుచుండెను; తల క్రిందులుగాఁ జేయుచుండెను. ఇదియునుగాక, శత్రువులలో తుపాకిని ధరించిన సిపాయీలు గుఱి పెట్టి సంతానులను వరుసలు వరుసలుగా భూమిపైఁ బడునట్లు కొట్టుచుండిరి. ఇట్టి సమయంబున, భవానందుఁడు “ఈతరంగమునందు నేఁడు సంతానులు దుముక వలయును, ఎవ్వరు దుమికెదరు? ఈసమయమున ‘వందేమాతరం’ పాడవలయు” నని చెప్పెను. అప్పుడుచ్ఛస్వరముతో, మేఘమల్లారి రాగమునందు నాసహస్రసంతాన సైన్యము ఫిరంగి గుండ్ల తాళమునకు సరిగా ‘వందేమాతరం’ పాడిరి.