Jump to content

ఆనందమఠము/పదుమూఁడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
​

పదుమూఁడవ ప్రకరణము

మహేంద్రుఁడు కారాగారబద్ధుఁ డగుట

ఇట్లుండఁగా రాజధానియందు మిగుల గడబిడయై కలకత్తానగరమునకు వచ్చుచున్న సర్కారు రూకలను సన్న్యాసులు కొట్టి దోఁచుకొనిపోయి రని ప్రవాదము కలిగెను. అంత రాజా ​జ్ఞానుసారముగా సన్న్యాసులను బట్టుకొనవలసినట్లు బరకందాజ మొదలగు వారికి ఉత్తరువు చేసిరి. ఆ దుర్భిక్ష కాలమునందు నిజమైన సన్న్యా సు లొక్కెడ నిల్చుట లేదు. ఏలన, ఒక్క చోటనే యున్న పొట్టనిండుటకు వీలు లేనందున, దిక్కున కొకరుగాఁ బోయిరి. ఇట్లు నిజమైనవ్సన్న్యాసులు కాశీ ప్రయాగ మొదలగుస్థలములకుఁ బోయి యుండిరి. కేవలము సంతానులు మాత్రము ఆవశ్యకమైనపుడు సన్న్యాసివస్త్ర ధారణము చేయుచు అనావశ్యక మైనపుడు యథారీతివస్త్రములు ధరించుచు నుండిరి. ఈ గడబిడను విని చాలా మంది సన్న్యాసులు కషాయములను గట్టుటను మానివేసిరి. కాఁబట్టి పొట్టకు లేని రాజసేవకులు సన్న్యాసు లుండుచోటు తెలియక, గృహస్థుల కుండ చట్లను పగులఁగొట్టి అరకడుపు నింపించుకొని వెనుకకు మరలుచుండిరి. సత్యానందుఁడుమాత్రము ఏకాలమునందును గైరిక వస్త్రమును పరిత్యజింపలేదు.

ఆకృష్ణకల్లోలినీ తీరమునం దొక చెట్టు క్రింద కల్యాణిపడి యుండెను. సత్యానందుఁడును మహేంద్రుడును పరస్పరము ఆలింగనము చేసికొని సాశ్రులోచనులై భగవంతుని ప్రార్థించు చుండిరి. నజరద్దీ౯ కమేదారు సిపాయీలను పిలిచికొని వచ్చుచుండెను. వాఁడు సత్యానందునిఁ జూచి ‘వీఁడు మిగుల దుర్మార్గుఁ’ డని తిట్టుచు మెడపై చేయి వైచెను. వేఱొకఁడు మహేంద్రుని పట్టుకొనెను. ఏ లన, సన్న్యాసి వెంట నుండువాఁడును సన్న్యాసియే కదా. వేఱొకఁడు పచ్చిక పైఁబడియున్న శవశరీరమును పట్టీడ్చెనుగాని, యామె స్త్రీశవ మని తెలిసి విడిచి పెట్టెను. వీరిర్వురను మాత్రము పట్టుకొని పోవుచుండిరి. ​కల్యాణి మృతశరీరమునకును, బిడ్డకును రక్షకులెవరును లేరు. ఆచెట్టు క్రిందనే పడి యుండిరి.

మహేంద్రుడు మొదట శోకాభిభూతుఁడై వెంటనే యీశ్వర ప్రేమచే ఉన్మత్తుఁడై చేతనశూన్యుం డైనవానివలె నుండెను. ఏమైనది, ఏమి కాఁబోవుచున్నది, అను దానిని తెలియనివాడై తనబంధనముపై దృష్టినించ లేదు. అయినను, ఒకటి రెండడుగులు నడిచినమీఁద తన్ను పట్టుకొనిపోవుచున్నారని తెలిసికొనెను. కల్యాణిశవము పడియున్నది, సంస్కారము చేయలేదు. బిడ్డ దిక్కు లేక యడవిమృగముల పాలగును, అని యతనిమనస్సునకుఁ దోఁచెను. ఈరీతి భావోదయమైన వెంటనే మహేంద్రుఁడు రెండు చేతులను బలముగా లాగెను కట్టు తెగిపోయెను. తత్ క్షణమే జమేదారుని తన్ని పడంద్రోసెను. వాఁడు భూశయ్యాగతుఁ డాయెను. అప్పుడిద్దఱు సిపాయీలు వచ్చి మహేంద్రుని పట్టుకొనిరి. మహేంద్రుఁడు దుఃఖాకులిత చిత్తుఁడై సత్యానంద బ్రహ్మచారిని పిలిచి, ‘మీరు కొంచెము సహాయము చేసినచో వీరైదుగురును హతము చేయుదు’ ననెను. సత్యానందుఁడు, ‘నా యీప్రాచీనశరీరము నందు బలమే మున్నది? నే నెవరినిపిలిచెదనో వాఁడుతప్ప వేఱు బలము లేదు. పోవుటయే మంచిది; మన మీయైదుగురను జయింపలేము, ఎక్కడికి పిలుచుకొనిపోయెదరో పోనీ, మనముపోయి చూతము; జగదీశ్వరుఁడు రక్షింపఁగలఁడు’ అని చెప్పెను. ఇర్వురును విడిపించుకొనుటకు ప్రయత్నము చేయక పోవుచుండిరి. కొంచెము దూరము పోయిన మీఁద సత్యానందుఁడు సిపాయీలను జూచి, ‘అయ్యా! నేను హరికీర్తనము చేయు వాడుక ​ గలదు. దానికి మీయాక్షేపము కలదా?’ యని యడిగెను. సత్యానందుఁడు మంచివాఁడని జమేదారునకు తోఁచి యున్నందున, ‘నీవు హరికీర్తనము చేయుము, నీవు వృద్ధ బ్రహ్మచారివి. నిన్ను విడిచి పెట్టుటకు హుకుం అగును. ఈ చెడ్డనునిషిని మాత్రము గల్లుకు వేయుదు’ రనెను. అంత బ్రహ్మచారి మృదు మధురస్వరముతో ——

ధీరసమీ, తటినీతీరే
       వసతి వనే వరనారీ
మాకురు ధనుర్ధర, గమనవిళంబన
       మతివిధురా వరనారి,

అని యిట్లు పాడెను.

అందఱును నగరము చేరిరి. జమేదారు వీరిని కొత్వాలు నొద్దకు పిలుచుకొని పోయెను. కొత్వాలు రాజసర్కారుకు రిపోర్టు చేసి, బ్రహ్మచారిని మహేంద్రుని తత్కాలమున పహరాలో నుంచెను. ఆ కారాగారము అతిభయంకరముగా నుండెను. అచ్చటికిఁ బోయినవాడు బైటికి వచ్చుట లేదు. ఏలన విచారించువారే లేరు. ఇంగ్లీషు దౌలతు జైలుగా నుండెను. అపుడు, ఇంగ్లీషు వారికి అధికారము లేదు. ఇపుడు చట్టము ప్రబలిన కాలము అప్పు డానియమ్మమేమియు లేని కాలము. నియమముండు కాలమునకును నియమము లేని కాలమునకును మొకాబిలా చేసి చూడుఁడు.