Jump to content

ఆనందమఠము/పదునొకండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
​

పదునొకండవ ప్రకరణము

మహేంద్రుఁడు భార్యను బిడ్డను గాంచుట.

రాత్రి గడచెచు. ఉదయ మయ్యెను. నిర్జనారణ్యము. ఇదివఱకు అంధకారముగను నిశ్శబ్దముగను ఉండెను. ఇప్పుడు ​ ఆలోకమయ మైనది. పక్షుల కలకలశబ్దము శ్రోత్రానందమై యుండెను. ఆనందమయ మైన కాననమునందలి “ఆనందమఠ” మునందు సత్యానంద ఠాకూరు మృగచర్మాసీనుఁడై ప్రాతస్సంధ్యా వందనము చేయుచుండెను. వానిపార్శ్వమున జీవానందుఁడు కూర్చుండి యుండెను. ఈసమయమునందు భవానందుడు మహేంద్రసింహునితోఁ బోయి నిలువంబడెను. బ్రహ్మచారి మాటలాడక సంధ్య వార్చుచుండెను. ఎవరును మాటలాడుటకు ముందు పడలేదు. సంధ్యాహ్నికకృత్యము ముగిసిన మీద, భవానందుఁడును జీవానందుఁడును సాష్టాంగ ప్రణామం బాచరించి వినీత భావముతోఁ గూర్చుండిరి. అపుడు సత్యానందుఁడు భవానందునికి సంజ్ఞ చేసెను. ఇర్వురును బైటపోయి యేమో మాటలాడుచుండిరి. వారిమాటలు మనకుఁ దెలియవు, తర్వాత ఇర్వురును వచ్చిరి. బ్రహ్మచారి మందహాసవదనుఁడై కరుణ భావముతో మహేద్రునింజూచి, ‘అన్నా! నీదుఃఖమునందు నేనును భాగియై యున్నాఁడను, దీనబంధువైన భగవంతునికృపచే నీ భార్యయు బిడ్డయు క్షేమముగా నున్నా’రని వారివృత్తాంతము నంతయుఁ జెప్పి, ‘రమ్ము, వారిని కనఁబఱ చెద’ నని నడిచెను. మహేంద్రుఁడు వెంబడిపోవుచుండెను.

ఇర్వురును దేవాలయములోనికిం బోయిరి. పోఁగా మహేంద్రుఁడు విస్తారమైనదియును అత్యున్నతమైనదియు నగు గృహమును జూచెను. ఆ నవారుణోదితమైన ప్రాతఃకాలము నందు సమీపమునం దున్న కాననము సూర్యకిరణములచే వజ్రఖచిత మైనట్టు జ్వలించుచున్నను, విశాలమైన యాగృహము అంధ కారమయముగనే యుండెను. ఆగృహమునం దేమి ​ యుండెనో యది మహేంద్రునకు మొదట తెలియలేదు. అట్లే చూచుచుండఁగా నొక చతుర్భుజమూర్తి గోచర మయ్యెను. ఆమూర్తి శంఖచక్రగదాపద్మహస్తయును, కౌస్తుభశోభిత హృదయయునునై యుండెను. ఆమూర్తి కెదుట సుదర్శనము ఘూర్ణ్యమానప్రాయముగ స్థాపితమై యుండెను. మధు కైటభ దైత్యస్వరూపములు బృహదాకారఛిన్న మస్తకములుగను రక్త ప్లావితమైనవిగను చిత్రింపఁబడి యుండెను. వామభాగంబున శ్రీలక్ష్మీదేవి విగ్రహము విశీర్ణ కుంతలముతోడను, శతదళమాలాధారిణిగను, భయకంపిత శరీరిగను నిలుచునట్లు నిర్మింపఁబడి యుండెను. దక్షిణ భాగమునందు సరస్వతీ దేవి వీణాపుస్తకపాణియు మూర్తిమంతము లైన రాగరాగిణి పరివృతయు నై నిలిచి యుండెను. వీనికంటె, మహోన్నత స్థానంబునందు మంచము మీఁద నవరత్న ఖచితాసనమునందొక యైశ్వర్యాన్విత మోహినీ మూర్తి యుండెను. ఆమూర్తికి, దేవ గంధర్వ కిన్నర యక్ష రక్షస్సు లెల్లరు వివిధోపచారములు చేయుచున్నట్లు కన్పట్టెను. బ్రహ్మచారి గద్గద స్వరముతో మహేంద్రునిం జూచి, “అన్నియుఁ జూచినావా!” యనెను.

మహేంద్ర —— అన్ని టిని జూచితి.

బ్రహ్మచారి —— మీఁద నున్నదేమి, చూచితివా?

మహేంద్ర —— చూచితిని, అది యెవరు?

బ్రహ్మచారి —— మహామాత.

మహేంద్ర —— మహామాత యెవరు?

బ్రహ్మచారి —— సంతానులకుమాత, మాకు ఆమెయేతల్లి, ​ మహేంద్ర —— ఆ తల్లి యెవరు?

బ్రహ్మచారి —— సమయము వచ్చినప్పుడు తెలిసికొనెదవు. ఇపుడు “వందేమాతరం” అని చెప్పుము; అనెను.

మహేంద్రసింహుడు “వందేమాతరం” అని చెప్పెను.

అటమీఁద, బ్రహ్మచారి మహేంద్రుని వేఱొకగృహమునకుఁ బిలుచుకొనిపోయెసు. మహేంద్రుఁడు, అపూర్వమై, సర్వాంగ సౌందర్యయై, సర్వాభరణభూషితయై, జగద్ధాత్రియై వెలయు దేవీమూర్తినిం గాంచి, ‘యిదేమి?’ యనెను.

బ్రహ్మచారి —— మహామాత పూర్వస్థితి.

మహేంద్ర —— అదేమి?

బ్రహ్మచారి —— ఈ దేవి మొదట సింహగజాదివన్యమృగములన్నియు పదతలమునం దొక్కి వన్యపశువాసభూమియందు తన పద్మాసనమును స్థాపించెను. అక్కాలమున సర్వాభరణ భూషితయై, మందహాసవదనయై, మహదైశ్వర్యసంపన్నయై, మహాసుందరియై, బాలార్కారుణవర్ణాభయై ప్రకాశించుచుండెను. ఈమెకు ప్రణామము చేయుము.

మహేంద్రుఁడు, భక్తిభావము చేత జగద్ధాత్రి రూపిణియైన మాతృభూమికి ప్రణామము చేసినపిదప, బ్రహ్మచారి వాని కొక సొరంగమును జూపి ముందు నడిచెను. మహేంద్రుఁడు భయముతోఁ గూడినవాఁడై వెన్నంటిపోయెను. ఆభూగర్భస్థ అంధకారమయమైన మందిరమునందు ఎచ్చోటనో కొంచెము వెలుతురు మినుకుమినుకు మని తెలియు చుండెను. ఆ రవంత వెల్తురులో నొక కాళికామూర్తి కనఁబడెను.

బ్రహ్మచారి —— చూడుము, తల్లియెటు లైపోయియున్నదో ​ మహేంద్ర —— భయముతో, కాళి, యిట్లేల యైనదో?

బ్రహ్మచారి —— ‘అంధకార సమాచ్ఛన్నమైన కాలిమామయి యైన మహాకాళి, అపహృతసర్వస్వయై నగ్నయై యున్నది. ఇపుడు దేశమంతయు శ్మశానమై పోయినది. కావున, మహామాత కంకాళమాలినియై యున్నది. తనమంగళమును తన పదతలంబున మెట్టుకొని యున్నది’ అని చెప్పుచు కన్నీ రొలుకుచు ‘హా తల్లీ!’ యనెను.

మహేంద్రుఁడు —— ఈమె చేతియందు ఖేటకర్పరము లేల?

బ్రహ్మచారి —— మేము సంతానులము, వీనిని మాతల్లికి ఆయుధములుగా నిచ్చి యున్నారము. చెప్పుము, “వందేమాతరం.”

మహేంద్రుడు “వందేమాతరం” అని చెప్పి కాళికి నమస్కరించెను. అనంతరము బ్రహ్మచారి, ‘ఈమార్గముగా రమ్ము’ అని చెప్పి రెండవ సొరంగమునకు పోయెను. మహేంద్రుఁడును పోవుచుండెను. పోవునపుడు వా రిర్వురిమీఁదను ప్రాతస్సూర్యకిరణ రాశి సోఁకెను. నలుదిశలయందును పక్షులు కలకల మనికూయుచుండెను. అచ్చట మర్మర ప్రస్తర నిర్మితమైన ప్రశస్తమందిరమునందు సువర్ణ నిర్మితమైన దశభుజవిగ్రహము, ఆనవారుణకిరణమునందు జ్యోతిర్మయమై మందహాసముఖియై ప్రకాశించుచుండెను. బ్రహ్మచారి ప్రణామము చేసి, ఈమెయే తల్లి. ముందెట్లు కావలయునో ఆస్వరూపమును దెలియఁ జేయు చున్నది. దశభుజములు దశదిశలయందు ప్రసారితమై యున్నవి. ఆదశభుజములయందు నానావిధశక్తులు ఆయుధస్వరూపములుగా శోభిల్లుచున్నవి. శత్రువిమర్దితపదయుగళంబును ​ జూడుము. పదాశ్రితులైన వీర కేసరులు శత్రునిపీడనమునందు నియుక్తులై యున్నారు. ‘హేదిగ్భుజ!’ అని చెప్పుచు గద్గదకంఠుడై కన్నీరొలుకుచుండి, కొంతవడికి యీదిగ్భుజ నానా ప్రహరణధారిణియు, శత్రుమర్దనియు, వీరేంద్రపృష్ఠహారిణియు నై యున్నది. ఈమె దక్షిణ పార్శ్వమునందు భాగ్యస్వరూపిణి యగు మహాలక్ష్మి యున్నది. వామపార్శ్వము నందు విద్యా విజ్ఞానదాయినియైన వాణియున్నది. మఱియు, సమీపమునందు బలపరాక్రమసంపన్నుఁడైన కార్తికేయుఁడు, కార్యసిద్ధిదాయకుఁడైన గణనాథుఁడు నున్నారు. రమ్ము. మన మిర్వురమును మహామాతకు ప్రణామము చేయుదము” అని చెప్పి యిర్వురును చేతులు జోడించుకొని, ఊర్ధ్వముఖులై ఏకకంఠముతో “సర్వమజ్ఞళ మాజ్జల్యే శివే సర్వార్థసాధకే, శరణ్యే త్య్రంబకే దేవి నారాయణి నమోస్తుతే” అని స్తుతించి, భక్తిభావము తోడ సాష్టాంగ దండ ప్రణామము చేసి లేచి నిలువంబడిరి.

మహేంద్ర ——(గద్గదకంఠ స్వరముతో) మహామాతయొక్క యిట్టి దివ్యమంగళ స్వరూపమును మఱల నెప్పుడు చూడ వచ్చును!

బ్రహ్మచారి —— ఎప్పుడు మహామాతయొక్క సంతానులందఱును తల్లిని తల్లీ, యని పిలుతురో, అప్పుడు చూడవచ్చును? అప్పుడామె ప్రసన్నురా లగును.

మహేంద్ర —— నా పెండ్లము బిడ్డ లెక్కడ నున్నారు?

బ్రహ్మచారి —— నా వెంబడి రా, చూతువు.

మహేంద్ర —— వారిని ఒక్కమాఱు చూచి చెప్పి వచ్చెదను. ​ బ్రహ్మచారి —— చెప్పి రావలసిన దేల?

మహేంద్ర —— నేనును ఈమహా వ్రతమును గ్రహణము చేయుదును.

బ్రహ్మచారి—— వారిని ఎచ్చటికి పంపగలవు?

మహేంద్రుఁడు కొంచె మాలోచించి, నాయింటియం దెవరును లేరు. నాకు వేఱే చోటేమియు లేదు. ఈ అనాయక సమయమునం దెచ్చట స్థలము దొరకును?

బ్రహ్మచారి —— మనము వచ్చిన మార్గమున నే వెనుకకుఁ దిరిగి పోయితి మేని యచ్చటనుండు మందిరమున నీ భార్యయు బిడ్డయు నుందురు. కల్యాణి, ఇంకను ఉపవాసము, వారుండు చోటనే భక్ష్య సామగ్రులు సిద్ధమై యున్నవి. వారిని భుజింపజేసి నీయిష్ట ప్రకారమే మేని చేయుము, నేను పోయెదను. నీ మనస్సారీతిగ నుండెనేని ఉపయుక్తసమయమునందు నిన్ను చూడఁగలను. అని చెప్పి బ్రహచారి యేదో యొక రహస్యమార్గముగా వెడలిపోయెను. మహేంద్రుడు తాను పోయిన మార్గమున నే వెనుకకు దిరిగివచ్చి చూడఁగా నచ్చటి మందిర ద్వారమునందు కల్యాణి కొమార్తెను తొడపై నిడికొని కూర్చుండి యుండెను.

సత్యానందుఁడు వేఱొకసొగంగమున దిగి భూగర్భస్థమైన మఱొకమందిరమునకుఁ బోయెను. అచ్చట జీవానందుఁడును భవానందుఁడును గూర్చుండి రూపాయలను లెక్కఁ పెట్టి కుప్పలుకుప్పలుగా నుంచుచుండిరి. ఆమందిరమునందు స్తూపాకారముగా బంగారు వెండి, తామ్ర, నాణెములును, వజ్ర వైడూర్య ప్రవాళ ముక్తాది నవరత్నములును రాసులు రాసులుగా నుం ​డెను. నిన్నటిరాత్రి వీరు కొల్లగొట్టి తెచ్చిన రూపాయల నెంచి సరిగా నుంచుచుండిరి. సత్యానందుఁడు ఆమందిరమునకుఁ బోయి, ‘జీవానంద! మహేంద్రుఁడు వచ్చును. వచ్చినయెడల సంతానులైన మనకు మహోపకార మగును. ఏలయన అట్లు వచ్చినయెడల వారి పెద్దలనాఁటినుండి సంపాదించిన ధనరాశి మహామాత సేవకు అర్పితమగును. అయినను వాఁ డెన్ని దినములదాక త్రికరణశుద్ధిగా మాతృభక్తుఁడు కాకుండునో అంతవఱకును వానిని గ్రహింపఁగూడదు. మీపనియైనమీఁద మీరు భిన్న భిన్న సమయములలో వాని ననుసరించి, అనుకూలమైనప్పుడంతయు శ్రీవిష్ణు మంటపమునకుఁ బిలిచికొని పోవలయును. మఱియు, ఎట్టిసమయమునం దైనను సరియే, వాని ప్రాణరక్షణమునందు జాగరూకత కలిగియుండవలయును. ఏలయన, సంతానులకు దుష్ట శాసన మెట్లు కర్తవ్యమో, అట్లే, శిష్టరక్షణమును గర్తవ్య మైన ధర్మమై యున్న’ దని చెప్పెను.