ఆనందమఠము/పదునైదవ ప్రకరణము
పదునైదవ ప్రకరణము
మహేంద్రునికూఁతురు సంరక్షింపబడుట.
బ్రహ్మచారి చేయుగానమును అనేకులు వినిరి. వారిలో జీవానందుఁడును ఆ గానమును వినెను. మహేంద్రుని అనువర్తియై వానిని జూచికొనవలసినదని జీవానందునికి బ్రహ్మచారి యాజ్ఞయైన విషయము పాఠకమహాశయునకు విదితమేకదా! మార్గమునందు ఒక్క స్త్రీని జూచెను. అది యేడు దినముల నుండి పస్తుగా పడి యుండెను. ఆమెకు జీవదానము చేయుటకు జీవానందునికి రెండు మూడు గడియలసేపు విళంబ మయ్యెను. ఆస్త్రీని బ్రతికించి తిట్టుచు పిలిచికొని వచ్చెను. (అవకాశమునకు ఆస్త్రీయే కారణము) వచ్చునపుడు తన ప్రభువైన బ్రహ్మచారిని ముసల్మానులు పట్టుకొనిపోవుటను జూచినదేగాకఁ ఆప్రభువు చేయు గానము చెవిని సోఁకెను. జీవానందునికి మహాప్రభు సంకేతము లన్నియుఁ జక్కఁగా దెలియును.
“ధీరసమీరే తటినీతీరే,
వసతి వనే పరనారీ.”
మహాప్రభువు యొక్క యీగీతమును విని, నదీతీరమునం దెవరో యొక స్త్రీ అన్నము లేక మలమల మాడుచున్నదని తెలిసికొని జీవానందుఁడు నదీతీరముగనే నడిచి వచ్చుచుండెను. జీవానందుఁడు బ్రహ్మచారిని పట్టుకొని పోవుటకు తనకన్నులారఁ జూచినాఁడు. కనుక ముందుగా నాతని విడిపింపవలసినది వానికి ముఖ్యకర్తవ్యముగా నుండెను. అయినను, జీవానందుని ఉక్త సంకేత గానమువలన, బ్రహ్మచారిని విడిపించుట ముఖ్యకర్తవ్యమని భావింపక, ఆతనియాజ్ఞను పాలించుటయే ముఖ్య కార్యమని తలంచి, యాపనినే ముందుగా నెరవేర్పవలయు నని సంకల్పము చేసికొనెను.
జీవానందుఁడు నదీతీరము నంటి పోవుచుండెను. కొంతదూరము పోయినమీద నొక చోట చెట్టు క్రింద ఒక స్త్రీ మృత కళేబరమును, ఒక బ్రతికియున్న ఆఁడుబిడ్డను గాంచెను. జీవానందుఁడు మహేంద్రుని పెండ్లమును బిడ్డను ఎప్పుడును జూచినవాఁడు కాఁ డనునది పాఠకులకుఁ దెలిసియే యున్నది. అయినను, వీరు మహేంద్రుని పెండ్లము బిడ్డలుగ నుందురేమో యని తలంచెను. ఏలన, మహేంద్రుఁడు తన ప్రభువుతోఁగూడ పోయినదియు వానికిఁ దెలియదు. ఎట్టులైననుసరే, తల్లి చచ్చి బిడ్డ బ్రతికి యున్నది, జీవానందుఁడు, మొదట బిడ్డను రక్షించవలయును; లేనిచో అడవిమృగములపాలై పోవును. భవా నందఠాకూరు ఇచ్చటనే యెక్కడనైన నుండును. వాఁడు వచ్చి యీస్త్రీని సంస్కారము చేయును, అని యెంచికొని, బిడ్డ నెత్తుకొని పోయెను.
జీవానందగోస్వామి, ఆనిబిడమైన యరణ్యమార్గముగా బిడ్డ నెత్తుకొనిపోయి యొక చిన్న గ్రామమును జేరెను. ఆయూరి పేరు భైరవపురము; అయినను, జనులు భరయీపుర మని చెప్పుచుండిరి. ఆయూరిలో సామాన్య జనులు కొందఱే యుండిరి. సమీపమున వేఱె పెద్ద గ్రామ మేదియు లేదు. ఆగ్రామము చుట్టును పెద్దయడవి; మహారణ్యము నడుమ నీచిన్న పల్లె మిగుల రమణీయముగా నుండెను. కోమలమైన పచ్చికగల భూమిగ నుండెను. శ్యామల పల్లవయుక్తమైన మామిడి చెట్లును పనస చెట్లును రమ్యముగ నుండెను. తాఁటితోఁపును కలదు. దానికి సమీపమున నీలజలపూర్ణమైన తటాకము. అందు బకకారండవాది జలచరపక్షులు చూపున కింపొనర్చుచుండెను. తీరమునందలి వృక్షములయందు కోకిల చక్రవాకాది పక్షులు కలకలధ్వని చేయుచుండెను. కొంచెము దూరముగనుండి మయూర కేకాస్వరము వినవచ్చెను. ప్రతియింటి ముంగిటిలోను ఆవులు ఎనుములు కట్టియుండెను. లోపల గాదె లుండినవిగాని దుర్భిక్ష కాల మగుటచే వానిలో ధాన్యము లేదు. ఒక్కొక యింటివసారాలోను చిలుకలయు గోరువంకలయు పంజరములు వ్రేలాడుచుండెను. కొన్ని యిండ్లకు సున్నము గొట్టి ఎఱ్ఱమన్నుపెట్టి పిండి ముగ్గు లుంచి యలంకృతము చేసి యుండెను. కొన్ని యిండ్లముందు ఊరుగాయలు, వరుగులు, వడియము లెండఁ బెట్టి యుండిరి. కొన్ని యిండ్లలో మోదుగాకుల తోరణములు వ్రేలాడఁగట్టి యుండెను. జను లందఱును దుర్భిక్షముచే పీడితులై కృశులై సంతాపితులై యుండిరి. అయినను, ఆయడవి యందు మనుష్యాహారమునకుం దగిన కొన్ని పదార్థము లున్నందున నా గ్రామస్థులు దానిని తెచ్చి తినుచు ప్రాణమును గాపాడు కొనుచుండిరి.
అచ్చటనున్న యొక మామిడితోఁటలో నొక చిన్న యిల్లును, దానినంటి మఱి నాలుగు చిన్న యిండ్లు నుండెను. ఆ యింటికి మట్టితో ప్రహరి యుండెను. ఆయింటి యజమానికి పశుసమృద్ధి కలదు. ఇంటిముందు కోఁతి, చిలుక, నెమిలి, జింక ఇవి ఒక్కొక్కటి యొక్కొకపంజరమున నుంపఁబడి యుండెను. తోఁటలో మల్లె చెట్లు, నిమ్మ చెట్టు నుండెను. ప్రతి యింటిలోను నూలువడకు రాట్నము లుండెను. ఈ యింటిలోను నొక రాట్నముండెను. అయినను, జనులు చాలమంది లేరు. జీవానందుఁడు, బిడ్డ నెత్తికొని యీ యింటికిఁ బోయెను.
ఈయింటి లోనికిఁ బోయి జీవానందుఁ డొక రాట్నము దెచ్చి త్రిప్పి ఝరఝర శబ్దము చేసెను. ఆ బిడ్డ రాట్నము నెప్పుడును జూచినది కాదు. ఆ శిశువు తల్లిని విడిచినది మొదలు ఏడ్చుచునే యుండెను. తల్లి మృతినొందిన దని యా శిశువునకుం దెలియునా? నిద్ర పోవుచున్నదని యనుకొని యుండెనేమో! ఆహా! తల్లియందు పిల్ల కెంత ప్రేమ యున్నదని చదువరు లెఱుంగుదురుగాత. ఇప్పుడు రాట్నపుశబ్దమును విని భయపడి మఱింతగట్టిగా నేడ్వసాగెను. ఈధ్వని విని లోపల నుండి సుమారు పదునేడు పదునెనిమిది సంవత్సరముల వయస్సు గల యొక యువతి కుడి చెంపమీఁద కుడిచేతి చూపుడు వ్రేలు నుంచికొని గొంతునొక ప్రక్క వంచికొని వచ్చి నిలిచి, ‘అన్నా రాట్నమును త్రిప్పుచున్నా వేమి? ఈబిడ్డ యెక్కడిది? నీకు బిడ్డలే లేరుకదా! మరల పెండ్లి చేసికొంటివా యేమి?’ అనెను.
జీవానందుఁ డాబిడ్డను ఆయువతి చేతి కిచ్చి మెల్లగా మైచఱచి, “ఏమమ్మా నాకు ఇంకొక పెండ్లాముకూడ కావలయునా! ఇద్దరాండ్రు గలవారి బ్రతుకుచూచియుండ లేదా? అది పోనీ, ఇంటిలో పాలున్నవా?” యనెను.
యువతి —— పాలు లేకేమి, పుచ్చుకొంటావా?
జీవానంద —— కానీ, పుచ్చుకొనెద.
అంత, నాయువతి పాలుకాచుటకై వడిగా వెడలిపోయెను. జీవానందుఁడు పాలు వచ్చునంత వఱకును రాట్నమును ద్రిప్పు చుండెను. ఆయువతి, బిడ్డను ఎత్తుకొన్నది మొదలు ఏడువలేదు. బిడ్డ యేమని తలంచికొనెనో చెప్పుటకు కాదు. అపుడు వికసించిన పుష్పసదృశురాలైనయా యువతిని జనని యని భావించి యుండునేమొ. ‘ఇద మిత్థ’ మని మనము నిర్ణయించి చెప్పలేము. పాలు కాచుచుండఁగా సెగ తగిలి మఱొక తేప యేడ్చెను.
ఆ యేడ్పును విని, జీవానందుఁడు, ‘ఓనిమా! ఇంకా పాలు వెచ్చనఁ గాలేదా?’ యనెను. నిమి, ‘ఆయె’ నని చెప్పి పాలును ఱాతి మరిగెలో పోసి తెచ్చెను, జీవానందుఁడు కృత్రిమకోపముతో, “ఈ వేఁడిపాలను నీమీఁదనే పోయుదునా!” యనెను.
నిమి —— ఈ పాలెవరికి?
జీవానంద —— ఈబిడ్డ త్రాగు నేమో యిచ్చి చూడుము. నిమి, బిడ్డను ఒడిలో కూర్చుండఁ బెట్టుకొని పాలు త్రాగించుచుండగా, దాని కన్నులనుండి కన్నీ రొలికెను. దానికొక బిడ్డ యుండెను. అది చచ్చిపోయెను. ఈబిడ్డ తన బిడ్డవలెనే యుండెను. వెంటనే నిమి కన్నీరు తుడిచికొని, నవ్వుచు జీవానందునిం జూచి ‘అన్నా! ఈబిడ్డ యెవరిదన్నా?’ యని యడిగెను.
జీవానంద —— నీకేమి?
నిమి —— ఈబిడ్డను నా కిప్పించెదవా?
జీవా —— నీవు బిడ్డను తీసికొని యేమి చేయుదువు?
నిమి —— నేను బిడ్డకు పాలు పోసి సాఁకుకొనెద. పెద్దదానిని జేసెద. అని చెప్పుచుండఁగా, మరల కన్నుల నీరు స్రవించెను. నిమి చేతితోఁ దుడిచికొని మరల నవ్వెను.
జీవా —— నీకేల, నీకింక నెందఱో బిడ్డలు పుట్ట నున్నారు.
నిమి —— అయిన నేమి? ఈబిడ్డను నాకిమ్ము, లేదా తీసికొనిపో.
జీవా —— తీసికొనిపోయిన చచ్చిపోవును. నే నప్పుడప్పుడు వచ్చి చూచుకొనుచుండెద. ఇది కాయిత బాపనపిల్ల, నేను పోయెదను.
నిమి —— అదేమన్నా! భోజనము చేయలే దేమి? ఇంత సేపై నది; కొంచెము భోజనము చేసిపో, నాయాన, ఊరక పోరాదు.
జీవా —— కొంచెమేమి, నాయిష్టమువచ్చినంత భోజనము చేసెద. నీవు ఒట్టు బెట్టినందున నిలువ వలసి వచ్చినది. ఏదో ఉన్న దానిని ఉంచుము, అనెను. నిమి, బిడ్డ నెత్తికొని వంటయింటికిఁ బోయెను. తుమ్మ రేకులవంటి అన్నమును, కందిపప్పును, అపుడుకాచిన నేయియును, ఇంక నేమేమో పచ్చళ్ళును తీసికొనివచ్చి జీవానందునికి వడ్డించెను. జీవానందుఁడు భోజనము చేయుచు, ‘నిమి! నీ వుండుచోటు క్షామ’ మని యెవరు చెప్పుదురు?
నిమి —— క్షామము మాకును వచ్చును. అయినను, వర్షము కురిసినది నీకు దెలియదా? నీవు పోయిన వెంటనేకదా కురిసినది, మా పొలములన్నియు బాగుగా పండెను. అయినను మే మిద్దరము పక్షులవలె నున్నారము. కనుక మాకు చాలదా యేమి? ఎవరైనను ఎడప తడప వచ్చినచో వారి కింత పెట్టి మే మింత తినుచున్నాము. అదియునుగాక, అందఱును ధనాశచే పండిన ధాన్యమును నగరమునకుఁ దీసికొనిపోయి అమ్మి వేసిరి. మేము అమ్మక యున్నాము.
జీవా —— నీవదినె యెక్కడ?
నిమి, తలవంచుకొని మెల్లఁగా —— రెండుమూఁడుపళ్ల బియ్యము తీసికొని పోయెను, బియ్య మెవ రిత్తురు?
జీవానందునికి యిట్టి యన్నము చాల దినములనుండి దొరక లేదు. ఇది వానికి అదృష్టసమయ మని తోఁచెను. వాఁడు వృథామాటలచే కాలము గడుపుట కిష్టము లేక గబగబ భోజనము చేసెను. శ్రీమతి నిమాయిమణి తనకును తనమగనికిని వలసినంత వంట చేసి యుండెను. ఆకులో నేమియు లేనందున నిమాయి యేమియు తోఁపక మగని భాగమును దెచ్చి వడ్డించెను. నిమాయిమణి, ‘అన్నా! ఇంకేమైనను గావలయునా?’యనెను. జీవా —— ఇంకేమున్నది?
నిమాయిమణి, మంచి పనసపండొకటియున్నది, అని చెప్పి లోపలికిఁ బోయి తెచ్చి ముందుంచెను. ఏమియు బదులు చెప్పక జీవానందగోస్వామి ఆ పండును తినెను. నిమాయి నవ్వి, ‘అన్నా! ఇంకేమియు లేదే’ యనెను.
జీవా —— అయిన నేమి, ఇం కొకనాఁటికి వచ్చి భోజనము చేసెదను.
అని చెప్పి లేచెను, చేతులు కడిగికొనుటకు నిమాయి నీళ్ళిచ్చెను. జీవానందుఁడు చేతులు కడిగికొనుచుండఁగా, నిమాయిమణి, ‘అన్నా! నే నొకమాట చెప్పెదను, విని యాప్రకారము చేసెదవా?’ యనెను.
జీవా —— అదేమి మాట?
నిమి —— నాపై ఆన పెట్టుము.
జీవా —— ఏమి చెప్పుము?
నిమి—— ఆలాగు చేసెదవా?
జీవా —— ఆమాట మొదట చెప్పుము?
నిమి —— నీవు ఆన పెట్టు నీ కాలికి మ్రొక్కెదను.
జీవా —— ఆన పెట్టితిని; కాళ్లకు మ్రొక్కు మనఁగా, నిమాయిమణి కాళ్లపైఁ బడఁగా ఆశీర్వదించి, లెమ్మని చెప్పి ‘ఆమాటయేమో చెప్పుము’ అనెను.
నిమాయిమణి, చేతులు రెంటిని గ్రుచ్చుకొని, తలవంచికొని, కొంత సేపటికి మొగమెత్తి జీవానందునిఁజూచి నేలపై దృష్టి నిగుడించి, మరల తల యెత్తి నోరు విడిచి, ‘ఒక తేప వదినెను పిలుతునా?’ యనెను. జీవానందుఁడు, ‘నీవు పిచ్చిదానవు. నీకుఁ గొంచె మైనను బుద్ధి లేదు. నీముఖమే చూడకూడదు, నీవుఁ జెప్పఁగూడని దానిని చెప్పితివి. ఇంక నే నిచ్చట నుండను. పోయెదను’ అని చెప్పి లేచిపోవుట కుద్యుక్తుం డాయెను.
నిమి —— నేను పిచ్చిదాననా, అయిన నేమి? ఒక్క తేప వదినెను పిలుతునా? యనెను.
జీవా —— ఇదిగో పోయెద, అని చెప్పి వీథి కడపవఱకుఁ బోయెను.
నిమాయిమణి, కడపకు అడ్డముగా నిల్చి, ‘మొదట నన్ను చంపి వేసి తర్వాత నీవు పో. వదినెను చూడక నీవు పోఁగూడదు’ అని ముష్కరముగాఁ జెప్పెను.
జీవా —— నే నెందఱను చంపినది నీకుఁ దెలియునా?
నిమాయి, ఆమాటను విని కోపముతో. ‘చాల కీర్తియే పెండ్లమును విడిచి పెట్టుట, కన్నవారిని చంపుట, మంచి పనియని యనుకొంటివేమొ? నీ వెవనికి కుమారుఁడవో, నే నాతనికిఁ గుమార్తెను. జనులను చంపు నీకు నన్ను చంపుటయు దౌలత్తు కాదా?’ యనెను.
జీవానందుఁడు నవ్వి, ‘పిలిచికొనిరా, నే నెవతెను కొంత కాలముదాఁకఁ జూడఁగూడ దని తలంచి యుంటినో దానిని పిలిచికొని వచ్చెద ననుచున్నావు, కాల మెట్లు నడపుచున్నదో అట్లు నడువవలయును కదా!’ యనెను.
నిమి, తనమనస్సునందు కార్యసాఫల్య మయినదని సంతోషించుచు నవ్వుచు నవ్వుచు సమీపమునందున్న గుడి సెకుపోయి, ‘వదినే, వదినే, లే! లే!’ యనెను. అప్పుడామె నూలు వడకుచుండెను.
వదినె —— ఏమి నిన్ను నీమగఁడు కొట్టినాఁడా యేమి? గాయమునకు నూనె పెట్టవలయునా? యనెను.
నిమి——అవునవును, నూనె యున్నదా?
వదినె —— నూనెదుత్తను జూపి యెత్తుకొమ్మనెను.
నిమి, అందున్న నూనెను తుడిచి వదినె తలకు చరిమి దువ్వి, ‘నీవు కొత్తచీరెను కట్టుకొని రా,’ యనెను.
వదినె —— ‘ఏమే నీకు పిచ్చి పట్టినదా! నే నెట్లున్న నేమి, కొత్తచీర లేదు, పో; వచ్చెద’ ననెను.
నిమి, వదినెను లేపి, వీపుపై తట్టి, ‘రా వదినె, కొత్తచీర యెత్తికట్టుకో’ అనెను.
తమాషాకు ఆ యువతి కొత్తచీరను దీసెను. ఇంతటి కష్ట కాలమునను తమాషా చేయువృత్తి యామె హృదయమునందు లుప్తము కాలేదు. నవీనయౌవనము ఫుల్ల కమలతుల్యమైన నవవయస్సౌందర్య మాలా గుండెను. నూనె లేదు, గుడ్డ లేదు, అయినను సౌందర్యము ప్రదీప్తముగ నుండెను. అననుమేయసౌందర్యము, ఆశత గ్రంథి యుక్తవసన మధ్యమునందును ప్రకాశమానమై ప్రస్ఫుటితమై యుండెను. వర్ణమునందు శ్యామలము. నయనములందు కటాక్షము. అధరమునందు హాస్యము, హృదయమునందు ధైర్యము. ఆహారము మాత్రము లేదు; అయినను, శరీరలావణ్యము కొఱఁతపడ లేదు. మంచి వస్త్రము లేదు. సౌందర్యము సంపూర్ణముగా అభివ్యక్తమై యుండెను. మఱియు మేఘమధ్యంబున మించువలెను, మనోమధ్యంబున ప్రతిభవలెను, శబ్దమధ్యమున సంగీతము వలెను, దుఃఖమధ్యమున సుఖమువలెను, ఆ రూపరాశియందేదియో యొక్కొక అనిర్వచనీయమైన తేజముండెను. అంతియగాక, అనిర్వచనీయమైన మాధుర్యము, అనిర్వచనీయమైన ఉన్నతభావము, అనిర్వచనీయమైన ప్రేమ, అనిర్వచనీయమైన భక్తి ఆమెయందు నెలకొని యుండెను. ఆమె నవ్వుచు నవ్వుచు (ఆనవ్వును పరు లెఱుంగరు) క్రొత్త చీర నెత్తి యిదిగో చూడుము! అనెను నిమి ‘చీరను కట్టుకొను’ మనెను. అది ‘నాకేల’ యనెను.
అంత నిమాయిమణి, దాని కమనీయమైన కంఠ దేశము నందు తన కమనీయమైన బాహువుల నుంచి, ‘అన్న వచ్చియున్నాఁడు, నిన్ను రమ్మని చెప్పినా’ డనెను. ఆ యువతి, ‘నన్ను రమ్మని చెప్పిరా! దానికై క్రొత్తచీర యేల? ఇట్లే పోఁగూడదా యేమి?’ యనెను. నిమాయిమణి, ఆ యువతి భుజములందు చేతుల నుంచి కొని ముందు నడచునట్లు త్రోయుచు కుటీరమునుండి బయటికి వచ్చి, ‘చాలు గంతగుడ్డ చాలు, రా’ అని చెప్పుచు, పిలుచుకొని వచ్చి, యామెను లోపల త్రోసి నిమాయిమణి వీధితలుపు గడియ వేసికొని బైట నిల్చి యుండెను.