Jump to content

ఆనందమఠము/పదునాల్గవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
​

పదునాల్గవ ప్రకరణము

మహేంద్రుఁడు కారాగారవిముక్తుఁ డగుట.

రాత్రి యైనది, కారాగారబద్ధుండైన బ్రహ్మచారి మహేంద్రునిం జూచి, “నేఁడు ఆనందమైనదినముగా నున్నది. ఏలన, మనము కారాగారమునందు బద్ధులమై యున్నారము; ‘హరే మురారే’ యని చెప్పు మనెను. మహేంద్రుఁడు దీనస్వరముతో ‘హరే మురారే’ యని చెప్పెను.

సత్యానంద —— దైన్య మేల? నీవు ఈ వ్రతమును గ్రహణము చేసితి వేని, భార్యను బిడ్డను అవశ్యము త్యజింపవలయును. వారికిని నీకును ఏసంబంధము నుండఁగూడదు.

మహేంద్ర —— త్యజించుట యనునది యమదండస్వరూపముగా నున్నది. ఏబలముచే నే నీ వ్రతమును గ్రహింపవలయునో, ఆ మహాబలము నా భార్యతోను బిడ్డతోను పోయినది.

సత్యా —— శక్తి వచ్చును, నేను శక్తి నిచ్చెదను. మహా మంత్రమునందు దీక్షితుఁడవు కమ్ము. మహా వ్రతమును గ్రహింపుము.

మహేంద్రుఁడు విరక్తుఁడై —— నేను పెండ్లమును బిడ్డను కుక్కల నక్కలపాలు చేసితిని. నాకు ఏవ్రతమును అక్కఱ లేదు.

సత్యా —— ఆవిచారమును మానుము. సంతానులు నీభార్యను సత్కారము చేసినారు. నీబిడ్డను పిలిచికొని పోయి కాపాడుచున్నారు. ​ మహేంద్రుఁడు విస్మితుఁడై —— అతని మాటను నమ్మక ‘తమ కెట్లు తెలిసినది. తాము నాతోఁగూడనేకదా యున్నారు’ అనెను.

సత్యా —— నేనీమహావ్రతదీక్ష, చేసియున్నాఁడను. దేవుఁడు దయ చేసి పరోక్షజ్ఞానము నా కిప్పించి యున్నాఁడు. ఈ రాత్రి లోపల నీకు సమాచారము వచ్చును. ఈరాత్రికే నీవు కారాగారమునుండి విడివడుదువు.

మహేంద్రుఁ డేమియు నన లేదు. సత్యానందుఁడు, తాను జెప్పినమాటలలో మహేంద్రునికి నమ్మకము కలుగ లేదనితోఁచి, “నీవు నమ్మవా! కావలసినయెడల పరీక్ష చేసి చూడుము” అని చెప్పి కారాగార ద్వారముదాఁక వచ్చెను. అచ్చట నేమి చేసినదియు మహేంద్రునికిఁ దెలియదు. అయినను, ఎవరితోడనో మాటలాడుచున్నట్లు బోధ మయ్యెను. సత్యానందుఁడు మరలి వచ్చెను. మహేంద్రుం ‘డేమిపరీక్ష చేయవలయు’ నని యడిగెను.

సత్యా —— నీవు ఇప్పుడు కారాగారమునుండి విముక్తుఁడ వగుదువు.

ఇట్లు చెప్పుచుండు నంతలో కారాగారద్వారము తెఱువఁ బడెను. ఒకానొకఁడు లోపలికి వచ్చి, “మహేంద్ర సింహుఁడను వాఁడెవ” డనెను.

మహేంద్ర —— నేనే.

ఆగంతకుఁడు - ‘నిన్ను విడుదల చేయుటకు హుకుం వచ్చియున్నది. నీవు పోవచ్చు’ ననెను. ​ మహేంద్రుఁడు మొదట విస్మితుఁ డయ్యెను. అనంతరము అబద్ధమని యెంచుకొని పరీక్షార్థము బయట పోయెను. ఎవరును ఆటంకము చేయలేదు. మహేంద్రుడు వీధివఱకును బోయెను.

ఆగంతకుఁడు, సత్యానందుని జూచి —— ‘మహారాజా! తామేల పోవుట లేదు! నేను తమకొఱకేకదా వచ్చినది’ యనెను.

సత్యా —— నీ వెవరు ? ధీరానందగోస్వామివా?

ధీరా —— ఔను, మహాస్వామి.

సత్యా —— నీవు పహరావాఁ డైన దెట్లు?

ధీరా —— భవానందుఁడు నన్ను పంపించెను. నేను నగరమునకు వచ్చి, తాము కారాగృహమునం దున్నట్లు తెలిసికొని, కొన్ని దుత్తూర మిశ్రమమైన గుళికలతో నిచ్చటికి వచ్చితిని. వాఁడు దానిని తిని మైమఱచి భూశాయియై పడి యున్నాఁడు. నేను ధరించి కొనియుండు కోటు, షరాయి, టోపి, బల్లెము ఇవి ఆ సాహేబువే.

సత్యా —— నీవు దీనిని ధరించుకొని పొమ్ము. నే నిప్పుడే బయలు వెడలను.

ధీరా —— ఏల? కారణ మేమి?

సత్యా —— ఈదినము సంతానుల పరీక్ష.

మహేంద్రుఁడు మరలి వచ్చెను. సత్యానందుఁడు చూచి ‘ఏల మరలవచ్చితివి’ అని యడిగెను. ​మహేంద్ర —— తాము నిశ్చయముగా సిద్ధపురుషులు. అయినను నేను తమ్ము విడిచి యుండువాఁడను కాను.

సత్యా —— అట్లయినచో నుండుము, మనమిర్వురము వేఱు విధముగా విడివడి పోవుదము.

ధీరానందుఁడు వెడలిపోయెను. సత్యానందుఁడును, మహేంద్ర సింహుఁడును కారాగృహముననే యుండిరి.