ఆనందమఠము/పదునాఱవ ప్రకరణము
పదునాఱవ ప్రకరణము
ఆస్త్రీకి ముప్పదేడు వత్సరముల వయస్సు. అయినను, చూచెడువారికి నిమాయికన్న నెక్కుడు వయస్సు గలదని బోధపడ లేదు. మాసిన జీర్ణ వస్త్రమును ధరించుకొని యా గృహంబునఁ బ్రవేశించిన వెంటనే యింటియందు మెఱుపు చందంబున ప్రకాశించెను. చెట్లయందు తలిరాకులచేఁ గప్పం బడిన పూవులగుత్తు లాకస్మికముగా వికసించినట్లయ్యెను, ఎచటనో యత్తరుబుడ్డి మూఁత దెఱచి యుంచినట్లు ఘుమఘుమ వాసన వీచెను. పొగ లేక నిగనిగలాడు నిప్పున దశాంగచూర్ణము చల్లినట్లయ్యెను. ఇటులుండ నా సుందరవతి గృహంబునఁ బ్రవేశించి యచ్చటచ్చటఁ దన విభుని వెదకెను. ఎచ్చోటను కనఁబడఁడయ్యెను. ఇఁకను గొన్ని ప్రదేశములయం దరసి చూడఁగా నొకచోట గున్న మావి కొమ్మపై శిరము నుంచికొని జీవానందుఁ డేడ్చుచుండెను. ఆ సుందరీమణి యల్లనల్లన నతని సమీపంబునకుఁ బోయి యాతని కరంబును బట్టుకొనియెను. జగదీశ్వరుఁడే యెఱుఁగుఁగాక, ఆయమ నేత్రంబుల యం దశ్రుధారలు వర్షంబు నతిక్రమించిన ట్లుండెను. ఆ నేత్ర జలంబులు అడ్డగింపఁబడక ప్రవహించి యుండినచో నందు జీవానందుఁడును తేలిపోయి యుండును. ఆమె యించుక ధైర్యశాలిని కాఁబట్టి యాజలంబులను నిరోధించుచుండెను. పిదప, జీవానందుని చేయిఁబట్టుకొని, ‘అయ్యో! యిదే మన్యాయము! నీవు నాకై విలపించుచున్నావని నాకుఁ దెలియును. విలపింప నక్కఱ లేదు, నీవు నన్నెట్లుంచి యుంటివో యాస్థితియందే నేను సుఖియై యున్న దాన’ ననెను.
జీవానందుఁడు ముఖ మెత్తి కన్నీరును దుడిచికొని భార్యను గాంచి, ‘శాంతీ! నీకీశతచ్ఛిద్ర మలినవస్త్ర మొప్పునా? నీకు భోజనమునకు నేమియుఁ గొఱఁత లేదుకదా’ యనెను.
శాంతి, నీధనము నీకొఱకయ్యే యున్నది నే నాధనము నేమి చేయుదును? ఏమియుఁ దోఁచ లేదు. నీవు వచ్చి నన్ను మరల గ్రహించినచో——
జీవానంద —— గ్రహింతును, ‘శాంతీ! నిన్నిపుడు పరిత్యజించితినా?’
శాంతి —— త్యాగము కాదు —— ఎపుడు నీవ్రతము సాంగ మగునో! ఎపుడు నన్ను ప్రేమింతువో, ఈమాట ముగింపు కాకమునుపే జీవానందుఁడు శాంతిని గాఢాలింగనముఁ జేసికొని ఆమె భుజముపై శిరంబు నిడి చాలసేపు నిర్విణ్ణుఁడై యుండి, నిట్టూర్పు నిగుడించి ‘నే నేల నిన్నిపుడు చూచితిని!’ అని పరితపించెను.
శాంతి —— ఏల చూచితివి? నీవ్రతమును భంగపఱుప లేదుకదా?
జీవానంద —— వ్రతభంగమైనఁ గానిమ్ము —— దానికి ప్రాయశ్చిత్తము కలదు. దానికై చింతింప వలసినది లేదు. నిన్నుఁ జూచిన పిమ్మట వెనుకకుఁ బోలేను. కావుననే నేను నిమాయిని ‘పిలిచికొని రావద్దు, నిన్నుఁ జూచి మరలి పోఁజాల’ నని చెప్పి యుంటిని, ఒక్క ప్రక్కను ధర్మార్థ కామ మోక్ష జగత్సంసార ములు; ఒక ప్రక్కను వ్రత యజ్ఞ యాగ హోమములు; వేఱొక ప్రక్కను నీవు; నీవొక్క దానవుమాత్ర మే —— నే ననేకవిధంబులుగాఁ దలపోసినను ఏవైపున బరు వగునో, దాని నిర్ధరింపఁ జాలకున్నాను. దేశమేమో శాంతిగ నున్నది. దేశంబును గట్టుకొని నేనేమి చేయఁగలను. దేశమునం దొక్క యెకరా భూమి యుండినచో నిన్నుంచుకొని స్వర్గానుభవభోగంబు లనుభవింపఁగలను. నాకు దేశముతోఁ బని యేమి? గుణవతియగు నిన్ను వరించియు త్యజించితిని. ఇంతకంటే దేశంబున నెవఁడు దుఃఖియగును? నీమలినమైన ఛిద్ర వస్త్రంబును జూచి యూరకుండు వానికన్నను, దేశంబున దౌర్భాగ్యుండగు దుర్బలుం డెవ్వడు గలఁడు? నా సకలధర్మములకును నీవు సహకారిణివి. దానినే త్యజించిన పిమ్మట, నంతకన్న మిన్నయగు సనాతనధర్మం బేమున్నది? నేను ఏధర్మంబు కొఱకై దేశ దేశంబులును వనవనంబులును తుపాకీని భుజము పై నుంచుకొని తిరిగి తిరిగి ప్రాణి హింస చేయుచు పాప కార్యంబును సంగ్రహింప వలయును? పృథ్వి సంతానుల వశమగునో కాదో నేఁ జెప్పఁజాల. నీవేమో నాకు వశురాలవై యున్నావు. నీవీపృథ్వికన్న నెక్కుడు దానవు. నీవే నాకు స్వర్గము. ఇఁక నడువుము. ఇంటికిఁబోవుదము; నే నిఁకఁ బోవుట లేదు.
శాంతి కొంచెము సేపు మాటలాడ కూరకుండి, పిమ్మట ‘సరి కాదు, నీవు వీరుఁడవు, నేను వీరపత్నినై యుండుట నాకుఁ బరమసుఖమై యున్నది. నీ వీయధమురాలికై ధర్మ త్యాగంబు జేయఁదగదు! నీవు నన్నుఁ ప్రేమింపకుము, నేనా సుఖంబు నపేక్షించుట లేదు. ఇపుడు నాకొకమాటఁ జెప్పి పొమ్ము; ఏ మనఁగా, ఈ వ్రతభంగమునకుఁ బ్రాయశ్చిత్త మేమి?’ అని యడిగెను,
జీవానంద —— ప్రాయశ్చిత్తము —— దానము —— ఉపవాసము —— ఇరువది రెండు గవ్వలు.
శాంతి కొంచెము నవ్వి, ‘ప్రాయశ్చిత్తమనఁగా నేమో నాకుఁ దెలియదు, ఒక యపరాధంబున కేమిప్రాయశ్చిత్తమో, శతాపరాధంబులకు నదియే ప్రాయశ్చిత్తమా!’ యని యడిగెను.
జీవానందుఁడు, విస్మితుఁడును విషణ్ణుఁడునై ‘యీమాట లేల?’ యనెను.
శాంతి —— నేను నిన్ను వేడుకొను టేమనఁగా ‘ఇఁకనీవు నన్నుఁజూడ ప్రాయశ్చిత్తము చేసికొనవలదు అనెను’.
జీవానందుఁడు నవ్వి, ‘ఆ విచారంబున నిశ్చింతలో నుండుము; నిన్నుఁ జూడక నేను జచ్చుట లేదు; చచ్చునంతటి యవసరమును లేదు; నే నిఁక నిట నుండుట లేదు; అయినను, ఇప్పుడు నిన్ను కన్ను లారఁ జూడఁజాలను, నేను జూడనని తలంపకుము. ఇపుడు గాకున్న నింకొకప్పుడైనఁ గనులారఁజూతును. ఇపుడు పోయెదను. ఇంకొకప్పుడైన నామనోరథము సఫల మగును, పోయెద. నీవు నామాటను నెఱవేర్చవలయును; ఏమన ఈవస్త్రమును పాఱవేసి మన పెద్దల యింటికిఁ బోయి వసించుచుండుము.’ అనెను.
శాంతి —— ఇపుడు నీ వెక్కడికి పోదువు?
జీవానంద —— బ్రహ్మచారిని వెదకుటకై మఠంబునకు పోయెదను. వారు నగరంబునకుఁ బోయి యున్నారు. వారి యవ స్థను జూచి కొంచెము విచారముగా నున్నది. మఠమందిరమున వారు లేకున్నచో నగరంబునకుఁ బోయెదను’ అని చెప్పి వెడలిపోయెను.