ఆనందమఠము/పదియవ ప్రకరణము
పదియవ ప్రకరణము
మహేంద్రుడు భవానందునితో భాషించుట
ఆజ్యోత్స్నామయి యైన రాత్రియం దిర్వురును నిశ్శబ్దముగా ప్రాంతరమును దాఁటిపోయిరి. మహేంద్రుఁడు విన్నఁ బోయిన వాఁడును, శోకాతురుఁడును, గర్వితుఁడును, కొంచెము కౌతూహలావిష్టుఁడునై యుండెను.
భవానందుఁడు, అన్యభావమును ధరించెను. వాఁడు స్థిర మూర్తియైన ధీర ప్రకృతిగల సన్న్యాసిగా నుండలేదు. ఆసైన్యాధ్యక్షుఁ డైన ఘాతుకుఁడుగాఁ గనఁబడ లేదు. కొంచెము సేపునకు ముందు మహేంద్ర సింహుని తిరస్కారము చేసిన యహంభావమును లేదు, జ్యోత్స్నామయియును శాంతశాలి నియునైన పృథ్వీ ప్రాంతమును, కానన నగమును, నదియొక్క శోభాకాంతినిఁ జూచి, వానిమనస్సు సముద్రము చంద్రోదయముచే ఆహ్లాదితమై హాసము చేయునట్లు విశేషస్ఫూర్తినిఁ దాల్చెను. భవానందుడు హసన్ముఖుఁడై వాఙ్మయ ప్రియసంభాషి యయ్యెను. ఏవేవోవిషయములను జెప్పుట కుత్సుకుఁ డయ్యెను. ఎన్నెన్నో ప్రయత్నములు చేసి చూచెను, మహేంద్ర సింహుఁడు మాటలాడలేదు. అంత భవానందుఁడు తనంతట తానే పాడుటకుఁ దొడంగెను. ఎట్లన——
పల్లవి
వన్దే మాతరం.
అనుపల్లవి
సుజలాం సుఫలాం మలయజశీతలాం,
సస్యశ్యామలాం మాతరం,
మహేంద్రుఁడు, సంగీతమును విని విస్మితుఁ డాయెను. ఏదియు బోధకాలేదు. కావున, “సుజలా, సుఫలా, మలయజ శీతలా, ఇట్టి గుణవిశిష్టురా లైనమాత యెయ్యది?” యని ప్రశ్న చేసెను.
భవానందుఁడు, ఉత్తర మీయక మరల సంగీతమును మొదటనుండి స్వరయుక్తముగ పాడుటకుఁ బ్రారంభించెను. దేశీయరాగము
పల్లవి
వన్దే మాతరం.
స్వరము, సా - - సా --
వన్దే
౧ - - -
నీ - (సారిస) - - ని - ౦ధాం
౨
పా - - థాం - పాంమంగాం
మా త
౩
రి - - - -
రం
o
మ - రి - మ - -
మా
౧
పా - - ధా - -
౨ - - - -
౩ - - -
(సారి సా)-ని- (ధా పామ) - పా.
వన
. .
- -
సా - - సా - -
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం.
శుభ్ర జ్యోత్స్నా పులకితయామినీం
ఫుల్లకుసుమిత ద్రుమదలశోభినీం
సుహాసినీం సుమధురభాషిణీం
సుఖదాం వరదాం
మాతరం.
సప్తకోటికణ్ఠకలకలనినాదకరాలే
ద్విసప్తకోటి భుజైర్ధ్రతఖరకరవాలే
అబలా కేన మా ఏత బలే
బహుబలధారిణీం నమామి తారిణీం
రిపుదలవారిణీం
మాతరం.
తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణా శ్శరీరే
బాహుతే తుమి మాశక్తి
హృదయే తుమి మాభక్తి
తోమార ఇ ప్రతిమాగడి మన్దిరే
త్వం హీ దుర్గా దశ ప్రహరణ ధారిణీ
కమలా కమలదళవిహారిణీ
వాణీ విద్యాదాయినీ
నమామి త్వాం.
నమామి కమలాం అమలాం అతులాం
సుజలాం సుఫలాం
మాతరం.
వన్దే మాతరం.
శ్యామలాం సకలాం సుస్మితాం భూషితాం
ధరణీం భరణీం మాతరం.
మహేంద్రుఁడు గీతమును విని, ‘ఇది దేశ వర్ణనముగానున్నది, మహాశక్తిమాత యైన దుర్గాదేవివర్ణనము కాదు’ అనెను.
భవానందుడు - మేము ఇతరమాతను స్తుతించుట లేదు. “జననీజన్మభూమిశ్చ స్వర్గాదపిగరీయసీ” మాకు జన్మభూమి యే తల్లి, మాకు వేఱేతల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేదు, తమ్ముండు లేదు, పెండ్లము లేదు, బిడ్డ లేదు, ఇల్లు లేదు, కుటుంబము లేదు, మాకుండునది యంతయు కేవలము సుజలా, సుఫలా, మలయజ శీతలా, సస్య శ్యామలా, అనెను. మహేంద్రుఁడు సంగీతార్థమును దెలిసికొనఁగోరి ‘మరల నొకతూరి చెప్పు’ మనెను.
భవానందుఁడు మరల నొక్కసారి గీతమును మొదట నుండి అర్థమగునట్లుగాఁ జెప్పుచు కన్నీరు కార్చుచు నుండుటను జూచి, మహేంద్రుఁడు మిగుల నాశ్చర్యము నొంది “మీ రెవరు?” అని యడిగెను.
భవానంద —— మేము సంతానులము.
మహేంద్ర —— సంతానులనగాఁ నేమి? ఎవరి సంతానులు?
భవానంద —— మహామాత యొక్క సంతానులము.
మహేంద్ర —— మంచిది, సంతానులు దొంగతనము చేసి, దారికట్టి దోఁచి మహామాతపూజ చేయవచ్చునా యేమి? ఇదెట్టి మాతృభక్తి?
భవానంద —— మేము దొంగతనము చేయలేదు, దారికట్టి దోఁచలేదు.
మహేంద్ర —— ఇప్పుడేకదా మీరు ఒక బండిరూపాయలను కొల్లగొట్టితిరి?
భవానంద —— అది కొల్లయగునా యేమి? ఆధన మెవరిది?
మహేంద్ర —— అది రాజు ధనము కాదా యేమి?
భవానంద —— రాజుధనమా? ఈధనమును తీసికొనుటకు వాని కేమి యధికార మున్నది?
మహేంద్ర —— రాజుగా నుండుట చేతనే.
భవానంద —— రాజు చేయవలసిన పని యేమి?
మహేంద్ర —— ప్రజలను పాలించుచుండుట. భవానంద —— ఎవఁడు ప్రజలను పాలించ లేదో, వాఁడు రాజు కాఁడు కదా?
మహేంద్ర —— మీరు రాజును ధిక్కారము చేయుట వలన ఒకప్పుడు కాకున్నను మఱొకప్పుడు సిపాయీల గుండు దెబ్బలకు గురి యగుదురు.
భవానంద —— చాల మంది సిపాయీలను జూచినాను. ఈదినమునను.
మహేంద్ర —— చక్కఁగా జూచినాను జూచితివి. ఇంకొక చూడఁగలవు.
భవానంద —— ఎందులకు కాఁగూడదు, చూడఁగలను. ఒక్క తేపగాక రెండు తేపలు చచ్చుట లేదు కదా?
మహేంద్ర —— కావలయు నని చచ్చిన ప్రయోజన మేమి?
భవానంద —— మహేంద్రసింహా! నిన్ను మనుష్యుఁడని తలంచి యుంటిని. ఇపుడు చూడఁగా నీవు పాలు వెన్న చక్కెరకు యమస్వరూపుఁడవై యున్నాఁడవే గాని వేఱేమిఁయు కాదు. సర్పమునకు కాళ్లు లేవు; అది కడుపుతోనే జరుగుచున్నది; అంతకంటే నీచమైనజంతువును, నేనిదివఱకు చూడలేదు. ఎవరైనను కాలితో ద్రొక్కినయెడల, పడగ నెత్తికొని లేచుచున్నది; నీశాంతము ఇంకను పోలేదు; అదెట్టి శాంతమో దేవునికే తెలియవలయును; ఎంత దేశ మున్నదో యాలోచింపుము; మగధము, కాశి, కాంచి, డిల్లి, కాశ్మీరము మొదలగు దేశము లెన్నియో గలవు, ఏ దేశమునను ఇట్టి దుర్దశ లేదు. ఏ దేశస్థులు తినుటకు కూడు లేక మలమల మాడుచు కసవును గడ్డిని తినెదరు? ఆకులలములు తినెదరు? ఏదేశమున మనుష్యులు కుక్కలను నక్కలను తిందురు? చచ్చిన పీనుఁగులను తిందురు? ఏదేశమున గుప్తముగా ధనమును దాఁచి యుంచినను రక్షకము లేకున్నది? పెండ్లాము బిడ్డలకుఁ గూడ నెమ్మది లేదు; కడుపులోని శిశువునకుఁగూడ నెమ్మది లేదు. ఇంతకంటె అన్యాయము వేఱేమున్నది? ఏ దేశమందు రాజులు ప్రజారక్షణము చేయకున్నారు? అదియే ఉభయులకుఁగల సంబంధము. అది లేనప్పుడు పరస్పర సంబంధ మేమున్నది? మనదేశమునందు రాజు ప్రజలను సంరక్షించుచున్నాఁడా! ధర్మము పోయెను, జాతి పోయెను, మానము పోయెను, కులము పోయెను, ఇఁక ప్రాణముకూడ పోనున్నది. ఈ దుర్మార్గులను తఱిమి వేయక గాని హిందువులు హిందువులుగా నుండుటకు సాధ్యముకాదు.
మహేంద్ర —— వారిని దేశమునుండి తఱిమివేయుట యెట్లు? ఆపని చేయువా రెవరు?
భవానంద —— నేనే.
మహేంద్ర —— నీవు ఒక్కఁడవే తఱిమి వేయుదువా? ఒక్కనిచేత నేమగును?
ఆమాటను విని, భవానందుఁడు మరల గీతములు పాడఁ దొడంగెను.
“సప్తకోటి కణ్ఠకలకలనినాదక రాలే
ద్విసప్తకోటిభుజై ర్ధృతఖరకరవాలే”
ఇట్టి మహామాతను ఎవరు అబల యని చెప్పుదురు?
మహేంద్ర —— అయినను, నీవు ఒక్కఁడవే కదా ? భవానంద —— ఇపుడు నీవు ఇన్నూర్గురుజనులను చూడ లేదా?
మహేంద్ర —— అందఱును సంతానులా (సన్న్యాసులా?)
భవానంద —— ఔను, అందఱును సంతానులే.
మహేంద్ర —— ఇం కెంద ఱున్నారు?
భవానంద —— ఇట్టివారు వేలకొలఁదిజను లున్నారు, ఇంకను కాఁదగినవారు నున్నారు.
మహేంద్ర —— పది ఇరువది వేల జనులు చేరుదురా! అయినంతమాత్రమున తురకలను రాజ్యపద భ్రష్టులనుగాఁ జేయుటకు సాధ్యమా?
భవానంద—— పలాశి (Plassy) యుద్ధమునందు ఇంగ్లీషువారి కెంత సైన్యముండెను?
మహేంద్ర —— ఇంగ్లీషువారు బంగాళీలా యేమి?
భవానంద —— అయిన నేమి? శరీరబల మధికముగ నున్న చాలదా? గుండేమి చేయును, అది యెంతమాత్రము?
మహేంద్ర —— అయినను ఇంగ్లీషు వారికిని తురకలకును ఇంత వ్యత్యాసమేమి?
భవానంద —— మొదటిది, ఇంగ్లీషువారిలో నొకఁడు చచ్చిపోయినయెడల అందఱును పరుగెత్తిపోవుట లేదు; ముసల్మానులమీఁద ఒక దెబ్బ పడినచో నందఱును పలాయనపరులగుచున్నారు; షర్బత్తును వెదకుచు పోయెదరు. రెండవది, ఇంగ్లీషు వారికి పట్టుదల కలదు; పట్టినపట్టు విడువరు; సాధించెదరు. ముసల్మానులు దీనికి వ్యతిరేకము; వేతనాపేక్ష కలవారు; ధనమునకై ప్రాణమును విడిచి పెట్టువారు; అదియు సరిగా వచ్చుట లేదు. సిపాయీలకు నెలజీతము సరిగా ముట్టుట లేదు కడపటిమాట, సాహసము పిరంగిగుండు, ఒక్కస్థలమున నేగానీ పది చోట్లలో పడుట లేదు. కాఁబట్టి ఒక గుండును జూచి పదుగురు పరుగిడవలసిన పని లేదు. అయినను, ఒకగుండును జూచినయెడల తురక లందఱును పరుగిడెదరు. గుంపులో గుండుపడినా ఇంగ్లీషువారు పాఱిపోవుట లేదు.
మహేంద్ర —— అట్లయిన మీకీగుణములన్నియుఁగలవా?
భవానంద —— లేదు. గుణములు పండ్లవలె చెట్లలోనుండి రాలుట లేదు. అభ్యాసము చేసినచో వచ్చును.
మహేంద్ర —— మీరు అభ్యాసము చేయుచున్నారా యేమి?
భవానంద —— కనఁబడ లేదా మేము సన్న్యాసులనునది? మాసన్న్యాస మంతయు నీయభ్యాసముకొఱకే. కార్యసాధనమైన (అభ్యాసము సంపూర్ణమైన) యెడల, మేము మరల గృహస్థుల మగుదుము. నాకును ఆలు బిడ్డలు కలరు.
మహేంద్ర —— మీసంతాన మంతయు జనులను వంచించుటకే కదా!
భవానంద —— సంతానులు అబద్ధము చెప్పుట లేదు. నీ యొద్ద బొంకి మెప్పొందవలసినంత గ్రహచార మేమియు లేదు. వంచించువా రెవరు? వంచన యనునది మాయొద్ద దొరకదు. అది మొదటనుండియు లేదు. మేము మాత్రము నెఱవేర్చువారము. నీవును సంతానుఁడ వయ్యెదవా?
మహేంద్ర —— నేను నా పెండ్లామును బిడ్డను చూడకయే యేదియుఁ జెప్పను. భవానంద —— అట్లయిన రమ్ము, నీ భార్యను కొమార్తెను జూపెదను. ఇట్లు చెప్పి భవానందుఁడు ముందు నడిచెను. మహేంద్రుడు వానిని వెంబడించి చనెను. భవానందుఁడు మరల “వందేమాతరం” అను గీతమును పాడుటకుఁ దొడంగెను. మహేంద్రుని కంఠ స్వరమును శ్రావ్యమైనది. వాఁడును పాడుట కారంభించెను. ఇట్లు పాడుచున్న మహేంద్రుఁడును బాష్పపూరిత లోచనుం డయ్యెను. అంత వాఁడు భవానందుని జూచి, ‘భార్యను బిడ్డను ద్యజింపకుండుటకు సాధ్య మగునెడల, మీవ్రతమును నాకును దెల్పుఁ’ డనెను.
భవానంద —— ఈ వ్రతము నవలంబించువారు భార్యను బిడ్డలను ద్యజింపవలయును. నీవు ఈవ్రతము నవలంబించితివేని పెండ్లామును బిడ్డను జూడఁగూడదు. వారు సుఖముగా నుండుటకుం దగిన పద్ధతులు చేయఁబడును. ఈ వ్రతము సమాప్తియైన మీఁద భార్యను బిడ్డను జూచుటకు ఆటంకము లేదు.
మహేంద్ర —— అట్లయిన యెడల నే నీ వ్రతము నాచరింపను; నాకుఁ దెల్పవలదు.