Jump to content

ఆనందమఠము/పందొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
​

పందొమ్మిదవ ప్రకరణము

శాంతి సన్న్యాసి యగుట

జీవానందుఁడు వెడలిపోయిన పిదప, శాంతి, నిమాయిమణి యింటి యరుగుపై కూర్చుండెను. నిమాయిమణి శిశువును తొడపై నిడుకొని గూర్చుండెను. శాంతి నేత్ర జలంబులం దుడిచికొని యుండిన దేగాక ముఖము ప్రఫుల్లముగ నుండెను. కొంచెము కొంచెము నవ్వుచు నుండెను. గంభీరముగను, చింతా యుక్తముగను, అన్యమనస్కురాలుగను నుండెను. నిమాయి ‘చూచితివా’ యనెను.

శాంతి ఉత్తర మియ్యక యూరకుండెను. నిమాయి, శాంతి తనమనో భావములు వెల్లడి చేయదని భావించికొని, ప్రయత్నపురస్సరముగా ఏవేవో ముచ్చటలాడి, ‘చూడవేవదినే! ఇది యెంతటిబిడ్డనే!’ అనెను.

శాంతి —— ఈబిడ్డ నీ కెక్కడ దొరకెను? నీ వెపుడు కంటివి?

నిమాయి —— నీవుపాడైతివి, ఇది మాయన్న బిడ్డకదా!

నిమాయి, శాంతి యొక్క కడుపు మండించుట కీమాటఁ జెప్ప లేదు. అన్న బిడ్డయనఁగా అన్న యిచ్చిన బిడ్డ యని చెప్పుట కట్లు చెప్పెను. శాంతి యీయర్థమును గ్రహింపక, నిమాయి ​వంచనగా మాటలాడుచున్నదని యెంచి, ‘నేను బిడ్డ యొక్క తండ్రినిగూర్చి యడుగ లేదు. దానితల్లిని గుఱించి యడిగితి’ ననెను.

నిమాయి, ఉచితమైన శాంతిని బొంది, అప్రతిభురాలై యెవరి శిశువో నే నేమెఱుఁగుదును. అన్న యెక్కడనో పడియుండినదానిని ఎత్తుకొని వచ్చెను. ఈశిశువు సమాచారము నడిగి తెలిసికొనుట కవకాశము లేకపోయేను. ఇపుడు క్షామకాలము. ఎందఱో బిడ్డ పాపలను దారిలోఁ బాఱవైచి పోయెదరు. మనయొద్ద కెందఱో తల్లులు బిడ్డల నమ్ముటకై వచ్చి యుండిరి కదా. ఇతరుల బిడ్డల నెవరు కొనెదరు? (అప్పుడామె నేత్రములు జలపూరితము లాయెను. నిమాయి కన్నీరు తుడుచుకదని మరల) శిశువేమో దివ్యసుందరమైనది. దీని చక్కఁదనమును జూచి, అన్న నడిగి తీసికొంటి’ ననియె.

ఆపిమ్మట వారిరువునును బెద్దప్రొద్దు ఏమేమో ఆమాట యీమాట లాడుచుండిరి. కొంత సేపటికి నిమాయి భర్త యింటికి వచ్చినాఁడు. కనుక శాంతి లేచి తన కుటీరమునకుఁబోయి, తలుపు వేసికొని, ప్రొయ్యి నుండి కొంచెము బూడిదను బైటత్రోసి యుంచెను. మిగిలినబూడిదపై తనకై వండియున్న యన్నమును పాఱవైచి, నిలచినది నిలచినట్లే కొంతసేపు చింతించి, తనలోఁ దానే “యిన్ని దినంబులుగాఁ జేయవలయు ననుకొన్న దాని నీ దినము చేసి వేయుదును, ఏయాశచే నిదివఱకుఁ జేయకుంటినో యది సఫల మాయెను. సఫలమో; నిష్ఫలమో, నిష్ఫలము! ఈజీవనమే నిష్ఫలము, ఏమి సంకల్పము చేసి యుంటినో, దానిని ​నెఱవేర్చెద. ఒక్కసారి కేమి ప్రాయశ్చిత్తమో నూరుసారుల కదియే ప్రాయశ్చిత్తము.’ అని యెంచుకొనెను.

ఈ ప్రకారముగా నాలోచించుకొని శాంతి యన్నంబును ప్రొయ్యిలో పడవేసి వనంబున కేఁగి కొన్ని ఫలములను దెచ్చికొని తినెను. అనంతము, నిమాయి కోరియుండిన కొత్త సరిగె చీరను దీసి యంచులను చించి పాఱవైచి, యాచీరెను కావినీటిలోఁ దడిపెను. చీరకు కావిరంగు పట్టెను. దాని నెండించుటకు ఎండ లేదు. సాయంకాల సమయము; దాని నట్లే యారవేసి కొంచెము చీఁకటి కాఁగానే తలుపును జక్కఁగా వేసికొని యొక చమత్కారమైన కార్యమునందు శాంతి ప్రవర్తింపఁ దొడంగెను. దువ్వక పేనుకొని ఆగుల్ఫలఁ బిత మైయున్న తన శిరః కేశ రాశిని పిడికిటఁ బట్టుకొని కొంతఁ గత్తరించి యుంచుకొని, తక్కిన తల వెండ్రుకలను జడవలె చేసెను. దువ్వెనముఖము జూడక చెదరి యుండిన వెండ్రుక లాయపూర్వవిన్యాసముచే భారమైన జడగా పరిణమించెను. పిదప, తడియారఁ గట్టిన కాషాయవస్త్రమును రెండుగాఁ జించి యొకటి నిదన మనోహరమగునంగంబునకుఁ గట్టి కొని, మఱి యొకటిని ఱొమ్మునకు బిగించి కట్టుకొనెను. ఇంటియందొక చిన్న యద్దముండెను. చాలకాలమునకు దానిని దీసి తన వేషంబును జూచి కొని, ‘అయ్యో! యెంతపని చేసితిని’ అని యనుకొని, దర్పణమును బాఱవైచి, కత్తిరింపఁబడియున్న వెండ్రుకలతో శ్మశ్రువును గల్పించెను. ఆచంద్ర బింబమువంటి ముఖము క్రొత్తలగు గడ్డము మీసములతోఁ బ్రకాశించెను. అనంతరము ఇంటిలోనున్న యొక హరిణచర్మంబును కంఠమునకుఁ గట్టికొని యెను. అది కంఠము నుండి జాను పర్యంతము శరీరము నాచ్ఛా ​దించెను. ఎవఁడేని కవియైనవాఁడు ఆ నవీన “కృష్ణత్వచం గ్రంధి మతీం దధాన” ను గాంచి యుండిన యెడల, ఇప్పుడు మన్మథుని వినాశ మట్లుండుగాక, ఆమన్మథుని పునర్జీవనశంక చేయును. ఈ ప్రకారము సజ్జీ భూతురాలైన, యానవీనసన్న్యాసిని నాల్గుప్రక్కలను సావధానముగాఁ జూచి యెవ్వరును లేరని తెలిసికొని, గోప్యముగా రక్షింపఁబడిన యొక పేటికను దీసి దానియం దుండిన యొక మూటను విప్పి నేలపై నుంచెను. అవి కేవలము భావమగుపుస్తకములుగా నుండెను. మనసునందు వీని నేమి చేయవచ్చును? వెంటఁ దీసికొనిపోయి చేయునదేమి? ఈ భారమును మోయు టెట్లు? ఇచట నుంచిపోయినచో బ్రయోజనమేమి? జ్ఞానముచే సుఖము లేదనునది తెలిసెను. అది కేవలము భస్మరాశిమాత్రమై యున్నది. ఆభస్మము భస్మముతోనే పోవలసినదని యెంచి ఆగ్రంథముల నొకటొకటిగా మండెడు మంటలో వైచెను. కావ్య, సాహిత్య, అలంకార, వ్యాకరణములు, (ఇఁకను నేమేమి యిండునో చెప్పనలవి కాదు) అన్నియు భస్మావశిష్ట మైపోయెను. రాత్రి రెండవజామున యంధకారంబున శాంతి సన్యాసవేషంబుతోఁ దలుపు తెఱచుకొని యేకాకిగా గంభీరమైన వనమధ్యమును బ్రవేశించెను. గ్రామవాసు లా యర్థరాత్రి సమయంబున కాననమధ్యమందు అపూర్వమైన సంగీత ధ్వనిని వినిరి.