ఆనందమఠము/నలువది రెండవ ప్రకరణము
నలువది రెండవ ప్రకరణము
శాంతి యెడ్వర్ డ్సును మోసపుచ్చుట
అపు డాయిరువురును నేమో మాటలాడు కొనిరి. మెల్లగా జీవానందుఁ డొకవనంబున దాఁగికొనియెను. శాంతియు మఱొకవనంబునఁ బ్రవేశించి యచ్చట నొక యద్భుతమైన రహస్య కార్యమునందు ప్రవృత్తురా లాయెను.
శాంతి చచ్చుటకై పోవుచుండెను; అయినను చచ్చు సమయంబున స్త్రీ వస్త్రములను ధరింపవలయు నని, స్థిరపఱిచికొని యుండెను. ఆమెయొక్క పురుష వేషము మోసము చేయుటకుఁ దగినదని మహేంద్రుఁడు చెప్పి యుండెను, మోసము చేసి చచ్చుట సరికాదు. కావున, తన వెంట నొక తెల్ల చీరను దెచ్చి యుండెను. ఇంకను గొన్ని వస్తువులు నుండెను. నవీనానంద వేషమును దీసివేసి మాఱువేషమునఁ బ్రవృత్తురా లాయెను.
ముఖంబున కుంకుమముతో నూర్ధ్వపుండ్రము నుంచు కొని, వైష్ణవ స్త్రీ వేషముతో సారంగమును మీటుచు మనోహరముగ గానము చేయుచు నాంగ్లేయుల శిబిరంబునకుఁ బోయెను. ఆమెను చూచి సిపాయీలు మోహితులైరి. ఆమె కంఠమును విని జావళి పాడు మనిరి. కొందఱు కేదారగౌళ రాగము నాలాపనము చేయు మనిరి. కొందఱు కీర్తన పాడు మనిరి. కొందఱు కృష్ణుని విషయముగను, కొందఱు కాళికా విషయముగను, ఇట్లు నానావిధములుగాఁ జెప్పి, పాటలను పాడించి బియ్యము, పప్పు, ఉప్పు, దుడ్డు, చీర, ఱవికె మొదలగువాని నొసంగిరి. ఆ వైష్ణవి శిబిరము యొక్క స్థితినంతయు జక్కఁగాఁ జూచికొని వెడలెను. అప్పుడు సిపాయీలు ‘మరల నెప్పుడు వచ్చెదవు?’ అని యడిగిరి. వైష్ణవి ‘చెప్పలేను, నేనుండుట చాలదూర’ మనియెను. ఎంతదూర మని యడుగఁగా ‘పదచిహ్నమున నున్న దాన’ ననియెను. ఆదినము మేజరు ఎడ్వర్ డ్సు దొర పదచిహ్న గ్రామవిషయమై కొన్ని సంగతులను విచారించుచుండెను. ఇది యొక సిపాయికిఁ దెలిసి యుండెనుగాన, ఆవైష్ణవిని కేప్ట౯ చెంతకుఁ బిలిచికొని పోయెను. కేప్ట౯ దొర ఎడ్వర్ డ్సు దొరయొద్దకుఁ దోడ్కొని పోయెను. ఆ వైష్ణవి మధురమైన హసన్ముఖముతో మర్మ భేది యగు కటాక్షము నిగుడించి ఎడ్వర్ డ్సుదొర తల తిరుగునట్లు చేసెను. చేతనున్న సారంగమును మీటుచు మాళవరాగమున రూపక తాళగతితో
“మ్లేచ్ఛనివహ నిధనే కలయసి కరవాలమ్” అని పాడెను.
ఎడ్వర్ డ్సు —— నీ యిల్లెక్కడ బీబీ!
బీబీ —— నేను బీబినికాను, వైష్ణవిని. నాయిల్లు పదచిహ్నమునం దున్నది.
ఎడ్వ —— Well, that is Padsin——Padsin is it? అచ్చట నొక గర ఉన్నదా?
వైష్ణ —— ఘర్ (ఇల్లు)? ఎన్నియో యున్నవి.
ఎడ్వ —— గర్ కాదు, గర్ కాదు, గర్ కాదు.
వైష్ణ —— నీమనసులోనిమాట తెలిసెను. కోటయా?
ఎడ్వ —— ఎస్, ఎస్, కోటు! కోటు! ఉన్నదా?
వైష్ణ —— కోట యున్నది. పెద్దకోట. ఎడ్వ —— ఎంతజనము?
వైష్ణ —— కోటలో నెందఱున్నా రని యడిగెదవా? 20-25 వేల జన ముందురు.
ఎడ్వ —— నాన్సెన్సు, ఒక కోటయందు 3-4 వేల జన ముండుటకే చాలదు. ఇంక నున్నారా? వెల్లిపోయిరా?
శాంతి —— ఎక్కడికి పోవుట?
ఎవ్వ —— పరిసకు, కిండలకు.
శాంతి —— కేందులికా, కేందులికి వారు పోరు.
ఎవ్వ —— నీ వక్కడనుండి యెప్పుడు వచ్చితివి?
శాంతి —— నిన్న రాత్రి వచ్చితిని.
ఎడ్వ —— వా రీదినము వెళ్లి యుండవచ్చును.
శాంతి యంతరంగమున నీ శ్రాద్ధము చేయింపకున్నచో నారసికత్వ మంతయు వ్యర్థ మనితలంచి, ప్రకాశముగా “ఓదొరా! అట్లుండవచ్చును, ఈదినము వారు బయటికి వెళ్లియుండ వచ్చును. సమాచారము నాకు సరిగా తెలియదు. నేను వైష్ణవిని; అచ్చటచ్చట పాడుచు బిచ్చము తెచ్చుకొని తినుదానను. ఆసమాచారము నాకేల? పాడిపాడి గొంతెండిపోయెను, ఏమైన నిచ్చిన తీసికొని వెళ్లెదను. కొంచెము హెచ్చుగా నిచ్చినచో ఎలుండి వచ్చి చెప్పఁగలను” అనియెను.
ఎడ్వర్ డ్సుదొర ఒక రూపాయి దీసి పడవేసి, ఎల్లుండికి కాదు బీబీ! నా కీదినము రాత్రికే వర్తమానము రావలెను.
శాంతి —— మంచిది, నీవు ఒక బుడ్డి సారాయి త్రాగి తుపాకిని తల క్రింద నుంచికొని నిద్రపో, నీకు సమాచారము చెప్పుటకు నే నీదినము ఇరువది మైళ్లు పోయి రావలెను గదా? బాగుగ నున్నది హనుమంత రాయా!
ఎడ్వ —— హనుమంత రాయఁ డనఁగా నేమి?
శాంతి —— అతఁడు మహావీరపురుషుఁడు, భారీ జనరల్.
ఎడ్వ —— Great General! వానికన్నను బలవంతుఁడనై యున్నాను. క్లైవు వలెనే, అయినను నా కీదినము సమాచారము రావలెను. నూఱు రూపాయలు ఇనా మిచ్చెదను.
శాంతి —— నూఱిమ్ము, వేయిమ్ము, ఇరువది మైళ్ల దూరము నడుచుటకు కాదు.
ఎడ్వ —— గుఱ్ఱము పై నెక్కిపోతే?
శాంతి —— గుఱ్ఱముపై నెక్కుటకు తెలిసి యున్నచో నేనీ వేషముతో వచ్చి నీ తావున బిచ్చ మడుగుచుంటినా?
ఎడ్వ —— ఎవరైనను జీను వేసి కూర్చుండఁ బెట్టుకొనిన పోదువా?
శాంతి —— ఇంకొకనితోఁ గూడనా! నాకు లజ్జ కాదా?
ఎడ్వ —— కష్ట మేమి? ఏనూఱు రూపాయ లిచ్చెదను.
శాంతి —— ఎవరు పిలుచుకొని పోవువారు? నీ వేవచ్చెదవా?
ఎడ్వర్ డ్సుదొర, వ్రేలితో నెదుట నిలిచి యుండిన లిండ్లె అను నొక యౌవనపురుషుఁడైన ఎ౯సైనును (Ensign) జూపి, వానిని బిలిచి, “లిండ్లె! నీవు పోయెదవా!” అని యడిగెను.
శాంతియొక్క రూపలావణ్యంబును గాంచి మిక్కిలి సంతోషముతోఁ ‘బోయెద’ ననెను. అప్పుడొక పెద్దయరబ్బీ గుఱ్ఱములగాము జీను వేయఁబడి తయారుగా వచ్చి నిలిచెను. శాంతిని పట్టి యెత్తి గుఱ్ఱముపైఁ గూర్చుండఁ బెట్టుటకై పోయెను. శాంతి, “ఛీ! ఇంతమంది యెదుటనా! నాకు లజ్జ లేదా? ముందు నడువుము. ఎత్తైన చోట నెక్కు కోనెద” ననియెను.
లిండ్లె గుఱ్ఱమును నడిపించుకొని పోయెను. శాంతి వెనుక పోయెను. ఇట్టిరువురును శిబిరమును విడిచిపోయిరి.
శిబిరమును విడిచి నిర్జన ప్రాంతంబునకుఁ బోయిన పిదప శాంతి లిండ్లె కాలిపై కాలు నుంచి యెగిరి గుఱ్ఱముపై నెక్కుకొనియెను.
లిండ్లె నవ్వి “నీవు పక్కా సవారు రాలవుగా నున్నావు” అనియెను.
శాంతి “నేనింత పక్కా సవారురాలను గనుకనే నీతో గుఱ్ఱము నెక్కుటకు సిగ్గాయెను. ఛీ! ఛీ!! రికాబున కాలూనికొని గుఱ్ఱము నెక్కుదురా! యనెను.
గర్వముతో లిండ్లె యొకమాటు రికాబునుండి కాలు దీసెను.
శాంతి యామూఢుఁడైన యింగ్లీషువానిని మెడబట్టి గుఱ్ఱమునుండి త్రోసివేసి గుఱ్ఱము పై నెక్కి కూర్చుండి కాలితోఁ గడుపుపై నొక తన్ను తన్ని వాయువేగముతో నాయరబ్బీ గుఱ్ఱమును దౌడాయించుకొని వెడలిపోయెను.
శాంతి నాలుగేండ్లుగా సంతానుల సహవాసంబున మెలఁగి యుండినదిగాన గుఱ్ఱపుసవారి చక్కగా నేర్చుకొని యుండెను. అట్లు లేకుండినచో జీవానందునితోడ నెట్లు వసించుటకు సాధ్యము? లిండ్లె కాలు విఱిగి పడెను. శాంతి వాయు వేగముతో గుఱ్ఱమును దౌడాయించుకొని పోయెను.
శాంతి జీవానందుఁడు దాఁగియుండిన యరణ్యంబునకుఁ బోయి యతని కీసమాచారము నంతయుఁ జెప్పెను. అతఁ‘డటు లైన నేను శీఘ్రముగా పోయి మహేంద్రుని హెచ్చరించెదను. నీవు కేందుబిల్ల గ్రామంబునకుఁ బోయి సత్యానందునికి సమాచారమును దెల్పుము. నీవు గుఱ్ఱము పైననే పొమ్ము, ప్రభువులకు శీఘ్రముగా సమాచారము చేరవలయును’ అని చెప్పెను. అప్పుడా యిరువురును, ఒక్కొక్క దిక్కున కొక్కొకరుగా పాఱిరి. శాంతి మరల నవీనానందుఁ డాయె నని చెప్పవలసినది అనావశ్యకము.