ఆనందమఠము/నలువదియొకటవ ప్రకరణము
నలువదియొకటవ ప్రకరణము
ఎడ్వర్ డ్సు దీర్ఘాలోచనము
ఉత్తరబంగాళము ముసల్మానుల చేయి విడిచి పోయెను. అయినను ముసల్మాను లెవ్వరును ఈమాట చెప్పుకొనుటయు లేదు! ఒప్పుకొనుటయు లేదు. కొందఱు దుర్మార్గులు అపుడపుడు సమయము చూచి హిందువులను తొందర చేయుచుండిరి. అందఱును పట్టి తెచ్చునట్లును చెప్పుచుండిరి. ఇట్లు చాల దినములు చెప్పుచుండిరి కాని, యాపని జరుగలేదు. ఈ సమయంబున భగవదాజ్ఞచే కలకత్తాయందు వార౯ హేస్టింగ్సు గవర్నరుజనరలుగా నుండెను. వార౯ హేస్టింగ్సు కన్నులు మూసికొనియుండు మనుష్యుఁడుగా నగపడ లేదు. అతని కావిద్య తెలిసి యుండినచో నీకాలమందు భరతఖండమున బ్రిటిషు సామ్రాజ్య మెక్కడ నుండెను? పిమ్మట, మేజరు ఎడ్వర్డ్సు అను రెండవ సేనాపతి కొత్త సైన్యముతో కలకత్తాకు వచ్చి చేరెను.
ఎడ్వర్డ్సు కిది యూరోపియనుల యుద్ధము కాదని తెలియవచ్చెను. శత్రువులకు సైన్యము లేదు. రాజధాని లేదు. కోటలు లేవు. అయినను అంతయు వారి యధీనమందుండెనని తెలిసినది. ఏదిన మెచ్చట బ్రిటీష్ సేనాశిబిరమో యాదినము మాత్రము ఆస్థలము బ్రిటీష్ సేనాధీనమై యుండును. మఱుదినము బ్రిటీష్ సేన యాస్థలమును విడిచి పోయినచో నాల్గు దిక్కులందును “వందే మాతరం” పాడఁబడును. ఎక్కడ నుండియో చీమలబారుతీరుగా రాత్రియం దింతమంది వచ్చి యాంగ్లేయుల వశమందున్న గ్రామములను కాల్చుటయును స్వల్పసంఖ్యగల బ్రిటిష్ సేన చిక్కినచో నాక్షణమే ధ్వంసము చేయుటయును ఎడ్వర్ డ్సుదొర తెలిసికొనఁజాలక పోయెను. తుదకు ఆ సేనాపతి, పదచిహ్న గ్రామంబున కోటను గట్టుకొని యచటనే తమయాయుధశాలను ధనాగారమును నిర్మించికొని యున్నారని తెలిసికొనెను. కావున, అతఁడు ఆదుర్గమును పట్టుకొనవలయు ననెడి ప్రతిజ్ఞ కలవాఁ డాయెను.
ఎడ్వర్ డ్సు, గూఢచారులవలన పదచిహ్నమున నుండు సంతానులసంఖ్యను దెలిసికొనెనుగాని, వెంటనే యాదుర్గము నాక్రమించుటకు ధైర్యము లేకపోయెను. అయినను మనస్సునందొక యపూర్వమైన కౌశలము నేర్పాటు చేసికొనియెను. మాఘశుద్ధ పూర్ణిమ సమీపించెను. ఆనాఁడు వానిశిబిరంబునకు సమీపమున నుండు కేందుబిల్ల మను గ్రామమున గోసాయీల పరిషత్తు జరుగుట కలదు. కాఁబట్టి ఈతూరి ఆపరిషత్తు కోలాహలముగా జరుప నిశ్చయించిరి. అక్కడ సామాన్యముగా ప్రతిసంవత్సరము నొకలక్ష ప్రజ చేరును. ఈ వత్సరము వైష్ణవుల రాజ్యాధికార మైనందున వైష్ణవులు పరిషత్తును బహుసంభ్రమముగా జరుపవలయు నని యెంచి యుండిరిగాన, సంతాను లందఱును కేందుబిల్ల గ్రామంబునకు వచ్చి చేరుదురని తలంచుట కవకాశము కలిగినది. మేజరు ఎడ్వర్ డ్సు దొర, పదచిహ్నగ్రామంబున నుండు ధనాగార రక్షకులుకూడ పరిషత్తుకు రాఁగలరు గాన, నాసమయంబునఁ బోయి పదచిహ్నదుర్గమును స్వాధీనము చేసికొనవలయు నని యాలోచించి యుండెను.
ఎడ్వర్ డ్సు ఈయభిప్రాయమును మనసునం దుంచికొని బాహ్యముగా పరిషత్తునాఁడు కేందుబిల్ల గ్రామంబు నాక్రమించు కొనఁబడుననియు, ఆదినమే శత్రువులు అందఱును నిశ్శేషముగా జంపఁ బడుదు రనియు, కనుక వైష్ణవుల పరిషత్తును జరుపఁగూడ దనియుఁ బ్రచురించెను.
ఈసమాచారము ప్రతి గ్రామంబునను బ్రచురింపఁబడియెను. ఇందువలన నచ్చ టచ్చట నున్న సంప్రదాయస్థులందఱును ఆయుధపాణులై కేందుబిల్ల గ్రామమున కేఁగి పరిషత్తు జరుపఁదలంచి పోయి చేరిరి. సకల సంతానులును మాఘశుద్ధ పూర్ణిమ దినమున కేందుబిల్ల గ్రామము జేరిరి. ఎడ్వర్ డ్సు దొర తలంచినట్లే యాయెను. ఆంగ్లేయుల యదృష్టమునకు సరిగా మహేంద్రుఁడును ఈ మోసకృత్యమునకు లోఁబడియెను. మహేంద్రుఁడు పదచిహ్న గ్రామంబున స్వల్పసంఖ్యగల సైన్యము నుండునట్లు నియమించి గొప్ప సైన్యమును దీసికొని కేందుబిల్ల గ్రామంబునకు బయలువెడలెను.
ఇవన్నియు జరుగుటకు మునుపే జీవానందుఁడును శాంతియును పదచిహ్న గ్రామమునుండి వెడలిపోయిరి. అపుడు యుద్ధ సమాచార మేమియు నుండ లేదు. మాఘపూర్ణిమా పుణ్యదినమున శుభముహూర్తమునందు జయదేవగోస్వామి యొక్క తీర్థమైన అజయనదీ పవిత్ర జలమున నాత్మ సమర్పణచే ప్రాణవిసర్జనము చేసి ప్రతిజ్ఞా భంగ మహాపాపంబునకుఁ బ్రాయశ్చిత్తము జేసికొనవలయు నని వారిరువురయొక్కయభిసంధియై యుండెను. అయినను, వారు త్రోవలోఁ బోవుచుండఁగా కేందుబిల్ల గ్రామంబునఁ జేరెడు సంతానులకు రాజసైనికులకును మహా ఘోరయుద్ధము కాఁబోవుచున్నదని వినిరి. జీవానందుఁ “డట్లైనచో యుద్ధముననే చచ్చిపోదము, నడువు” మనియెను.
వా రతి వేగముగా పోవుచుండిరి. మార్గమున నొకకొండ కనఁబడెను. అంత నాకొండ నెక్కి యావీరదంపతులు చూచిరి. కొంచెము దూరమున నాంగ్లేయుల శిబిరము కనఁబడెను. శాంతి —— చచ్చుమాట యిపు డటుండనిమ్ము; “వందేమాతరం” చెప్పు మనియెను.