ఆనందమఠము/నలుబదియైదవ ప్రకరణము
నలుబదియైదవ ప్రకరణము
ఉపసంహారము
సత్యానందుఁడు రణక్షేత్రమునుండి యెవ్వరికి నేమియుఁ జెప్పక ఆనందమఠంబునకు వెడలి పోయెను. అచ్చట నా గంభీర మైన రాత్రి కాలమున విష్ణుమండపమునం గూర్చుండి ధ్యానము చేయుచుండెను. ఆ సమయమందు చికిత్సకుఁ డచ్చటికి వచ్చి దర్శన మొసంగెను. అతనిం గాంచి సత్యానందుడు ప్రణామము లాచరించెను.
చికిత్సక —— సత్యానందా! నేడు మాఘపూర్ణిమ.
సత్యానంద —— దయచేయుఁడు; నేను సిద్ధముగా నున్నాఁడను, అయినను “ఓ మహాత్మా! నాకొక సందేహ మున్నది. దానిని నివర్తి చేయవలయును. నేనేముహూర్తమున యుద్ధము నందు జయమొంది యార్యధర్మమును నిష్కంటకముగా నొనర్పితినో, యాముహూర్తమునందే యీ కార్యమునందు ప్రవర్తింపవల దనెడి యాజ్ఞ యేల?”
చికిత్సక —— నీ కార్యము సిద్ధ మాయెను. ముసల్మానుల రాజ్యము ధ్వంస మాయెను. ఇఁక నిచ్చట నీ కేపనియు లేదు. నిష్ప్రయోజనముగాఁ బ్రాణహత్యచేఁ బ్రయోజనము లేదు.
సత్యానంద —— ముసల్మానుల రాజ్యము ధ్వంసమాయెను. అయినను హిందూరాజ్యము స్థాపితము కాలేదు. ఇప్పటికిని కలకత్తాలో నాంగ్లేయులు ప్రబలులై యున్నారుకదా?
చికిత్సక —— హిందూ రాజ్యమిప్పుడు స్థాపితము కాదు. ఇప్పుడు నీవుండినచో నిష్ప్రయోజనముగా నరహత్యలు సంభవించును. కావున వెడలుము.
ఈమాటను విని సత్యానందుఁ డత్యంత చింతాక్రాంతుడై “ఓ ప్రభూ! హిందూ రాజ్యము స్థాపితము కాకుండిన నెవ్వరు రాజు లగుదురు? మరల తురకలే రాజు లగుదురా?” అనెను.
చికిత్సక —— లేదు. ఇప్పు డాంగ్లేయులు రాజు లగుదురు. సత్యానందుని నేత్రములనుండి కన్నీరు ప్రవహింప నారంభించెను. అతఁడు మీఁదనున్న మాతృరూపమైన జన్మభూమి యొక్క ప్రతిమదిక్కు మొగంబై చేతులు మోడ్చికొని బాష్పనిరుద్ధ స్వరముతో “హా! తల్లీ! నీ యుద్ధారమును జేయఁజాలకపోతిని. మరల నీవు మ్లేచ్ఛుల చేతికిఁ జిక్కుదువు; సంతానుల యపరాధమును మన్నింపుము. తల్లీ! యేల రణక్షేత్రంబున నేఁడు నా ప్రాణములు పోవయ్యెను” అని మొర యిడెను.
చికిత్సక —— సత్యానందా! వ్యసనపడవలదు. అన్యాయధనముచే రణజయమును బడసితివి. పాపకార్యముచేసి పుణ్యఫలము గోరిన సిద్ధించునా? ఇఁక నన్నియు మంచిదే యగును. ప్రకృతమున ఇంగ్లీషు వారు రాజులుగా నున్నారు. ఇఁక ఆర్యధర్మము పునరుద్ధార మగును. ఈ విషయమున మహాత్ములు చెప్పియుండు మాటనే నేనును జెప్పెదను. సావధాన చిత్తుండవై వినుము. ముప్పది మూఁడుకోట్ల దేవతలను బూజించుట ఆర్యధర్మము కాదు. అది యొక లౌకికమైన అపకృష్ట ధర్మము. దాని ప్రభావమే యిప్పటి యార్యధర్మమై యున్నది. మ్లేచ్ఛులు దేనిని హిందూధర్మ మనియెదరో యది లోపమై పోయినది. శుద్ధమైన హిందూధర్మము జ్ఞానాత్మకమైనది. అది కేవలము కర్మాత్మక మైనది కాదు. అజ్ఞానము రెండువిధములు. బహిర్విషయిక మైన దొక్కటి. అంతర్విషయిక మైన దొక్కటి. అంతర్విషయిక మైన జ్ఞానమే ఆర్యధర్మ ప్రధాన భాగము. అయినను, బహిర్విషయిక మైన జ్ఞానము మొదట పుట్టకుండినచో, నంతర్విషయికజ్ఞానము కలుగుట దుర్లభము. స్థూలమును దెలియకుండినచో సూక్ష్మమును దెలియుట కష్టము. ఇప్పు డీదేశము నందు బహుకాలమునుండి బహిర్విషయికమైన జ్ఞానము విలుప్తమై పోయినది. ఆర్యధర్మమును పునరుద్ధారము చేయవలసి వచ్చినచో, మొదట బహిర్విషయిక జ్ఞానమును బ్రచారము చేయవలయును. ఇప్పుడీ దేశంబున బహిర్విషయిక మైన జ్ఞానమే లేదు. తెలిసి చెప్పెడివారును లేరు. మనము జనులకు నేర్పఁగల సమర్థులము కాము. అందువలన, వేఱే దేశమునుండి బహిర్విషయిక జ్ఞానము రావలయును. ఇంగ్లీషువారు బహిర్విషయిక జ్ఞానమున పండితులు. జనులకు నేర్పుటయందు సమర్థులై యున్నారు. కనుక నాంగిలేయులు రాజులు కావలయును. ఇంగ్లీషు నేర్చినచో జనులు బహిర్విషయికజ్ఞానమున సుశిక్షితులై అంతస్తత్త్వమును దెలిసికొనుటకు సమర్థు లగుదురు. అపు డార్యధర్మ ప్రచారమునకు విఘ్నము సంభవింపదు. అప్పుడు నిజధర్మము తనంతట పునరుద్దీప్త మగును. ఎన్ని దినము అట్లగుట లేదో; యెన్ని దినములు హిందువులు జ్ఞానులగుటలేదో; గుణాఢ్యు లగుట లేదో, బలిష్ఠులగుట లేదో, అన్ని దినములు ఇంగ్లీషు వారి రాజ్యము అక్షయముగా నుండును. వారి రాజ్యమునందు ప్రజలు సౌఖ్యము నొందుదురు. నిష్కంటకముగా ధర్మాచరణము నాచరింపఁగలరు. కావున, నోబుద్ధిశాలీ! ఆంగ్లేయులతో యుద్ధము చేయక నన్ననుసరించి నా తోడరమ్ము.
సత్యానంద —— మహాత్మా! ఆంగ్లేయులే రాజులుగ నుండ వలయు ననియును, ఆంగ్లేయుల రాజ్యమే యీ దేశంబునకు మంగళదాయక మైనదనియు దమకుఁ దెలిసియుండియు నీనృశంసమైన యుద్ధ కార్యమునందు నన్నేల నియమించితిరి? మహాపురుషుడు —— ఆంగ్లేయు లిపుడు వర్తకులు. అర్థ సంగ్రహమందే బుద్ధిగలవారై యున్నారు. రాజ్యశాసన భారమును వహించుట కష్టము లేదు. ఈసంతాన విద్రోహమే కారణమై రాజ్యశాసన భారమును వహింపవలసివచ్చును. ఏమనఁగా, రాజ్యశాసనము చేయక గాని అర్థసంగ్రహము కాదు. ఆంగ్లేయులు రాజ్యాభిషిక్తు లగుటకే సంతానవిద్రోహము సంఘటించెను. ఇప్పుడు వెళ్లుము. జ్ఞానసంపన్నుఁడ వైనపిదప నీకు నీవే సర్వమును దెలిసికొనఁగలవు.
సత్యానంద —— మహాత్మా! నాకు జ్ఞానలాభంబునం దభిరుచి లేదు. జ్ఞానముతో నాకుఁ బని లేదు. నే నేవ్రతమునందు వ్రతియై యుంటినో యావ్రతమును రక్షించుకొని యుండెద. నావ్రతమైన మాతృభక్తి యచలముగా నుండున ట్లాశీర్వదింపుఁడు.
మహా పురుష —— వ్రతము సఫల మాయెను. తల్లి యొక్క మంగళమును సాధించితివి. ఆంగ్లేయ రాజ్యమును స్థాపితము చేసితివి. యుద్ధవిగ్రహములను విడువుము. జనులు కృషి కార్యమున నియుక్తులగుదురుగాక. పృథ్వి సస్యశాలిని యగుఁగాక.
సత్యానందుని నేత్రములనుండి అగ్ని కణములు రాలెను. అతఁడు, “శత్రువుల రక్తమును పాఱించి మాతను సస్యశాలినిగాఁ జేసెద” ననెను.
మహాపురుష —— శత్రువు లెవరు? శత్రువు లింక లేరు. ఆంగ్లేయులు మిత్త్ర రాజులు, ఆంగ్లేయులతో యుద్ధము చేసి జయించుటకు శక్తి గలవారును ఎవ్వరును లేరు. సత్యానంద —— శక్తి లేకుండినచో నిచ్చటనే నీమాతృ ప్రతిమ యొక్క సాన్నిధ్యముననే దేహత్యాగము చేసెదను.
మహాపురుష —— ఇట్లు చేయుట అజ్ఞానము చేతనే! నడువుము. జ్ఞానలాభమును బడయుము. హిమాలయశిఖరంబున మాతృమందిర మున్నది. అచ్చటనే మాతృమూర్తిని నీకుఁ జూపించెదను.
ఇట్లని చెప్పి, ఆమహాపురుషుఁడు. సత్యానందుని చేయి పట్టుకొనియెను. ఏమి యపూర్వమైన శోభాకాంతి! ఆ గంభీరమైన విష్ణుమందిరమున నా ప్రకాండమండిత చతుర్భుజమూర్తి యొక్క సముఖంబున, బ్రాహ్మముహూర్తమున వెన్నెల వెలుంగున మహాప్రతిభాపూర్ణులగు నిరువురు పురుషమూర్తులును ఒకరు మఱియొకరి చేతినిపట్టుకొని నిలిచిరి. ఎవరు ఎవరినిఁ బట్టుకొనియున్నారు? జ్ఞానము భక్తి చేతిని బట్టికొని యున్నట్లును, ధర్మము కర్మము చేతినిఁ బట్టికొని యున్నట్లును, నివృత్తి ప్రవృత్తి చేతినిఁ బట్టుకొని యున్నట్లును, కల్యాణి శాంతి చేతినిఁ బట్టికొని యున్నట్లును నుండెను. ఈసత్యానందుఁడే శాంతి; ఈ మహా పురుషుఁడే కల్యాణి; సత్యానందుఁడే ప్రవృత్తి, ఈమహాపురుషుఁడే నివృత్తి. నివృత్తి ప్రవృత్తినిఁ దోడ్కొని పోయెను.
సమాప్తము
చెన్నపురి: వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారి
‘వావిళ్ల’ ప్రెస్సున ముద్రికము, 1948