ఆనందమఠము/నలుబదియవ ప్రకరణము
నలుబదియవ ప్రకరణము
మహేంద్రుని మనోవిచారము
పదచిహ్న గ్రామంబున నూతనముగా నిర్మింపఁబడిన దుర్గమధ్యమునందు నేఁటిదినము మహేంద్రుఁడు, కల్యాణి, జీవానందుఁడు, శాంతి, నిమాయిమణి, నిమాయిమణిపతి, సుకుమారి, వీరందఱును సుఖముగాఁ జేరి యుండిరి. శాంతి నవీనానంద వేషముతోనే యుండెను. కల్యాణినిఁ బిలిచి కొనివచ్చిన నాఁటి రాత్రి యామె కల్యాణికి మగనితో తా నాఁడుది యని తెలుపవలదని చెప్పి యుండెను. ఒకనాఁడు కల్యాణి శాంతిని తన యంతఃపురమునకుఁ బిలిపించెను. నవీనానందుఁ డంతఃపురమునకుఁ బోయెను. కావలివారు ఆటంకము చేసినను వినక లోపలికిఁ బోయెను.
శాంతి కల్యాణినిఁ జూచి —— ‘నన్నేల రప్పించితి’ వని యడిగెను. కల్యాణి —— పురుష వేషముతో నెన్ని దినము లుండవలదును? ఒక్కటిఁగా జేరి మాటలాడుటకుసైతము వీలు లేదు. నీవిట్టిదని నాపతితోఁ జెప్పవలయును.
నవీనానందుఁడు పెద్ద ప్రొద్దు చింతించి యుత్తరమియ్యక యుండెను. పిమ్మట, ‘నిజము చెప్పుటవలన బహువిఘ్నంబులు సంభవించు’ ననియెను.
ఇరువురు నా సంగతిని గూర్చి మాటలాడఁ దొడంగిరి. ఇంతలో నవీనానందుని యంతఃపురంబునకుఁ బోఁగూడదని యాటంకపఱిచిన కావలివారు, మహేంద్రునితో “నవీనానందుఁడు ఆటంకపఱిచినను వినక అంతఃపురమును బ్రవేశించె”నని తెల్పిరి. వెంటనే మహేంద్రుఁ డంతఃపురమునకుఁ బోయెను. కల్యాణి శయ్యాగృహంబునకుఁ బోయి చూడఁగా, నవీనానందుఁడు మంచముదగ్గర నిలుచుకొని యుండెను. కల్యాణి, అతఁడు ధరించి యున్న వ్యాఘ్రచర్మముయొక్క దారము ముడిని విప్పుచుండెను. మహేంద్రుఁ డత్యంతాశ్చర్య మొంది కోపపరవశుఁ డాయెను.
నవీనానందుఁ డతనింజూచి నవ్వి —— ఏమిగోస్వామి! సంతానులందే నమ్మకము లేదా? యనెను.
మహేంద్రుఁ —— భవానంద ఠాకూరు నమ్మకస్థుఁడుగా నుండెనా?
నవీనానందుఁడు కనులంద్రిప్పుచు —— కల్యాణి భవానందుఁడు కట్టుకొనియున్న పులిచర్మము ముడిని విప్పెనా? అని చెప్పుచు కల్యాణి యొక్క చేతినిదీసి ముడిని విప్పవద్దనెను.
మహేంద్ర —— దానివలన నేమి? నవీనానంద —— నన్ను నమ్మక యుండవచ్చును —— కల్యాణిపై అపనమ్మక ముంచుట న్యాయమా?
మహేంద్రున కేమియుఁ దోఁచక అప్రతిభుఁడై “ఎపుడు, ఎందులకు నమ్మకయుంటిని” అనెను.
నవీనానంద —— అట్లు కాకున్నచో నా వెను వెంటనే యంతఃపురంబునకు రావలసిన దేల?
మహేంద్ర —— కల్యాణితో నాకుఁ బని యుండెను; అందులకై వచ్చితిని.
నవీనానంద —— అట్లయినచో నిప్పుడు కల్యాణితో నాకును గొంచెము పని యున్నది; దయచేసి తాము వెడలిపోయినచో నేను మొదట మాటలాడి పోయెదను. ఇల్లు వాఁకిలి తమది. కల్యాణి తమది. తా మెప్పుడు తలఁచినను మాటలాడవచ్చును. నేను కష్టపడి యొక్కతూరి వచ్చినవాఁడను.
మహేంద్రుఁడు మూఁగవానివలె నిలిచెను. ఏమియుఁ దోఁచకుండెను. ఆ పలుకులను వినఁగా అపరాధిమాటలుగా నుండలేదు. కల్యాణి యొక్క భావము విచిత్రమై యుండెను. ఆమెయు అవిశ్వాసినివలె పాఱిపో లేదు, భయపడ లేదు, లజ్జితురాలు కాలేదు —— కొంచెము చిఱునవ్వు నవ్వుచుండెను. మఱియు కల్యాణి యా చెట్టు క్రింద నిరాయాసముగా విషమును మ్రింగినట్టిది. అట్టిది యపరాధి యగునా! మహేంద్రుఁ డిట్లు చింతించుచున్న సమయంబున అభాగినియైన శాంతి మహేంద్రుని దురవస్థను గాంచి కొంచెము నవ్వి, కల్యాణిని విలోల కటాక్షముతోఁ జూచెను. అపు డాకస్మికముగా నంధకారమున వెల్తురు కలిగిన ట్లాయెను. మహేంద్రుఁడు చూడఁగా అది రమణియొక్క కటాక్షముగా నుండెను. సాహస ధైర్యములతో నవీనానందుని గడ్డమునుబట్టి యీడ్పెను. కృత్రిమగడ్డమును మీసములును చేతికి వచ్చెను. ఆసమయంబున కల్యాణి అవకాశమును గైకొని పులిచర్మము ముడిని విప్పి వేసెను, చర్మము క్రింద పడిపోయెను.
శాంతియు —— నేలపైఁబడి అవనతముఖి యాయెను.
మహేంద్ర —— నీ వెవ్వరు? అని యడిగెను.
శాంతి —— నేను శ్రీమాన్ నవీనానందగోస్వామి.
మహేంద్ర —— అది దొంగ వేషము. నీవు స్త్రీ వే?
శాంతి —— ఇప్పుడు యత్నము తప్పెను.
మహేంద్ర —— ఇప్పుడు మఱొక్కటియడిగెదను —— నీవాఁడుదానవై యుండి సదా జీవానందఠాకూరు సహవాసముననే యుండెదవేల?
శాంతి —— దానిని తమతో నేను జెప్పలేను.
మహేంద్ర —— నీవు వనితవు. జీవానందఠాకూరు నెఱుఁగుదువా?
శాంతి —— ఎఱుఁగుదును.
దీనిని విశుద్ధాత్ముఁడైన మహేంద్రుఁడు విని కందిన మోముగలవాఁ డాయెను. ఇఁక నిజము చెప్పవలయు నని తలంచి కల్యాణి, “ఈమె జీవానందగోస్వామి యొక్క ధర్మపత్ని యగు శాంతిదేవి” యనెను.
ఒక ముహూర్తమాత్రము మహేంద్రుని ముఖము ప్రఫుల్లమాయెను. మరల నాముఖమున నంధకారము క్రమ్ముకో నెను. మహేంద్రుని యభిమతంబు నెఱింగి కల్యాణి, “ఈమె బ్రహ్మచారిణి” యనెను.
మహేంద్రుఁడు విషణ్ణుఁడై, అయినను, ప్రాయశ్చిత్తమున్న దని చెప్పి, శాంతి ముఖమును జూచుచుఁ “బ్రాయశ్చిత్త మేమి? తమకుఁ దెలియునా” యనెను.
శాంతి —— మరణము, ఇది ఏసంతానునికిఁ దెలియదు? రాఁగల మాఘశుద్ధ పూర్ణిమ నాఁడు ఆప్రాయశ్చిత్తము కావలయు నని నిశ్చయింపఁబడినది. తాము నిశ్చింతతో నుండుఁడు.
ఈమాటను జెప్పి శాంతి యచటనుండి వెడలిపోయెను. మహేంద్రుడును కల్యాణియు వజ్రాహతులైన వారివలెనే నిలుచుకొని యుండిరి.