Jump to content

ఆనందమఠము/నలుబదినాలుగవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
​

నలుబదినాలుగవ ప్రకరణము

సంతాన సేనా విజయము.

పూర్ణిమారాత్రి! —— ఆ భీషణంబగు రణక్షేత్ర మిప్పుడు స్థిర మాయెను. గుఱ్ఱంబుల పటపట శబ్దమును, తుపాకుల దడదడ శబ్దమును, ఫిరంగిగుండ్ల ఢంఢం శబ్దమును, సర్వవ్యాపకమైన ధూమమును లేదు. “హుర్రే” అని చెప్పు వారును లేరు, హరిధ్వని చేయువారును లేరు. శబ్దముమాత్రము ​చేయుచుండినవి; ఏవి? నక్కలు, కుక్కలు, గద్దలు, ఇవిగాక ఆ హతులైన జనుల క్షణికమైన ఆర్తనాదము. కొందఱు ఛిన్నహస్తులు; కొందఱు ఛిన్నమస్తకులు; కొందఱకు కాళ్లు భగ్నములై యుండెను; కొందఱకు శరీరము చిల్లులుపడి పోయెను; కొందఱు గుఱ్ఱముల క్రిందఁ బడి యుండిరి; కొందఱు అమ్మా! యనుచుండిరి; కొందఱు అయ్యా! యని యఱచుచుండిరి; కొందఱు దాహము అనుచుండిరి; కొందఱు మూలుగుచుండిరి. బంగాళీలు, తురకలు, ఇంగ్లీషువారు, హిందూస్థానీలు, తెలగాలు, అఱవలు, అందఱు నేకత్ర జడజడితమై మృతులైరి. ఆమాఘమాసపు పూర్ణిమా రాత్రి యందు ఆ దారుణమైన శీతమున వెలుఁగుచుండు వెన్నెలయందు రణభూమి అతిభయంకరమై కానఁబడుచుండెను. అచ్చటికిఁ బోవుట కెవ్వరికిని ధైర్యము లేదు.

ఎవ్వరును ధైర్యము చేసి పోలేదు. అయినను, ఆ యర్ధరాత్రి సమయంబున నొక రమణీమణి ఆ యగమ్యమైన రణక్షేత్రంబున తిరుగుచుండెను. ఒక మషాలును వెలిఁగించుకొని దాని వెల్తురున నేమో వెదకుచుండెను. ప్రతిశవము యొక్క ముఖమును ఆవెల్తురులోఁ జూచుచుండెను. ఎచ్చటనైనను శవము గుఱ్ఱము క్రింద పడి యుండినచో, నాయువతీమణి చేతిలోనున్న వెల్తురుకట్టెను దిగువ నుంచి, గుఱ్ఱమును రెండు చేతులతో లాగివేసి ఆ శవమును పరీక్షించి చూచును. ఈరీతిగా వెదకుచు నారణ క్షేత్రము నంతయుఁదిరిగెను. వెదకుచుండిన శవ మెక్కడను దొరక లేదు. అప్పుడు వెల్తురును బాఱవైచి యాశవరాశి పూర్ణమైన రక్తమయభూమిపైఁ బడి యేడ్చుచు పొరలాడు ​చుండెను. ఈమెయే శాంతి; జీవానందుని కళేబరమును వెదకుచుండెను.

శాంతి ఏడ్చుచు పొరలాడుచుండిన సమయమునందు, అతి మధురమైన సకరుణధ్వనిచే, “ఏడ్చువా రెవరు? లేవమ్మా! యేడ్వవలదు” అని చెప్పిన మాటలను విని, శాంతి తిరిగి చూడఁగా నెదుట నాజ్యోత్స్నాలోకంబునందు వెనుక నెపుడు చూడని జటాజూటధారియైన పురుషుఁడు నిలిచి యుండెను.

శాంతి ఏడ్చుచు లేచి నిలువంబడెను. వచ్చిన మహాపురుషుఁడు “ఏడ్వవలదమ్మా! జీవానందుని దేహమును నేను వెదకి యిచ్చెదను, నాతోరమ్ము” అనియెను.

అప్పు డతఁడు శాంతిని రణక్షేత్ర మధ్యస్థలంబునకుఁ బిలిచికొని పోయెను. అచ్చట అసంఖ్యేయములగు శవరాసులొకదానిపై నొకటిగా పడియుండెను. శాంతిచేత దానిని కదలించుటకు కాకపోయెను. ఆ బలిష్ఠుండగు మహాపురుషుఁడు దానినంతయుఁ దీసి యొకశవమును వెలికిఁ దీసెను. దానినిఁ గాంచి శాంతి జీవానందుని దేహమని గుర్తించెను. సర్వాంగమును గాయములచే రక్తమయమై యుండెను. శాంతి చూచి సామాన్య స్త్రీవలె విలపింప నారంభించెను.

ఆ మహాపురుషుఁడు, మరల “ఏడ్వవలదమ్మా! జీవానందుఁడు చావలేదు. స్థిరముగా నతని దేహమును పరీక్షించి చూడుము, మొదట నాడిని పట్టిచూడుము” అనియెను.

శాంతి శవము యొక్క నాడినిబట్టి చూచెను. కొంచెమైనను గతి లేదు. ఆ పురుషుఁడు “ఱొమ్ముపై చేయి నిడి చూడు” మనియెను. ​శాంతి హృత్పిండముండుచోట ఎదపై చేయి నిడి చూచెను. అచ్చటను గతి లేకుండెను. శరీరమంతయు చల్లనై పోయియుండెను.

అతఁడు మరల, “ముక్కు నొద్ద చేయినుంచి శ్వాస మాడు చున్నదా? లేదా? చూడు” మనెను.

శాంతి చూడఁగా నేమియు నుండ లేదు.

ఆ పురుషుఁడు, “నోట యుష్ణ మున్న దేమో వ్రేలిడి చూడు” మనెను. ఆ విధముగా, నోట వ్రేలిడి చూచెను. ‘చక్కఁగా దెలియ లేదు’ అని చెప్పి భర్త జీవించునేమో యనెడి యాలోచన చేయుచు నేమియు బలుకక యూరకుండెను.

ఆ మహాపురుషుడు తన యెడమ చేతితో జీవానందుని దేహమును స్పృశించి, “నీవు భయముచే హతాశురాలవై యున్నందువలన నేమియు దెలియక పోయెను. శరీరమున నింకను ఉష్ణమున్నట్లు కన్పట్టుచున్నది; మరల చూడు” మనియెను.

శాంతి మరల నాడిని బట్టి చూచెను. నాడికి కొంచెము గతి కలిగెను. విస్మితురాలై యెదపై చేయిడి చూచెను. దడ దడ కొట్టుకొనుచుండెను, ముక్కు నొద్ద వ్రేలిడి చూడఁగా శ్వాస యాడు చుండెను, నోటియందును ఉష్ణము నుండెను. ఆశ్చర్యపరవశురాలై, “ప్రాణ ముండెనో? లేక క్రొత్తగా వచ్చెనో!” యనెను.

అతఁడు, “అట్లుండఁడు; అయినను, నీ వితని నెత్తికొని ఆ కనఁబడు పుష్కరిణి యొద్దకుఁ దేఁగలవా? నేను వైద్యుఁడను, ఇంకను చికిత్స చేయవలయును.” అనెను. ​శాంతి అనాయాసముగా జీవానందుని చంకయందిడుకొని కొలనియొద్దకుఁ దీసికొని పోయెను. ఆవైద్యుఁడు “నీవు శరీరమందలి రక్తమును గడుగుచుండుము, నేను ఔషధములను దెచ్చెదను” అని చెప్పి వెడలిపోయెను. శాంతి వైద్యుఁడు చెప్పిన మేరకు రక్తము నంతయుఁ గడుగుచుండెను.

శాంతి, కడుగుచుండఁగనే వైద్యుఁడు అడవియాకులను తీఁగెలను దెచ్చి రసముదీసి గాయములకుఁ బూసి దేహమును తన చేతితోఁ దడవెను. జీవానందుఁడు దీర్ఘ శ్వాసము విడిచి లేచి కూర్చుండి, శాంతినిఁ జూచి “యుద్ధమున నెవరు జయించిరి?” అని యడిగెను.

శాంతి, “నీకే జయ మాయెను. ఈ మహాపురుషునకు సాష్టాంగ దండ ప్రణామంబు లాచరింపు” మనియెను.

ఆప్పు డాయిరువురును చూడఁగా నెవ్వరు నుండ లేదు! ఎవరికి నమస్కరించుట?

సమీపమునందే జయశాలురైన సంతానుల కోలాహల మగుచుండెను. అయినను, శాంతిగాని జీవానందుఁడుగాని లేచి పోలేదు. ఆ పూర్ణచంద్ర కిరణోజ్జ్వలమై ప్రకాశించు పుష్కరిణి సోపానములపైఁ గూర్చుండి యుండిరి. జీవానందుని శరీరము ఔషధ మహిమచేఁ గొంచెము సేపులోనే స్వస్థ మయ్యెను. అతఁడు “శాంతీ! చికిత్సకుని యౌషధము ఆశ్చర్యకరమైనది! నా శరీరమునం దేవేదనమును లేదు. ఇపు డెచ్చటికి పోవలయునో నడువుము. అదిగో అచ్చట సంతానుల జయసూచకమైన యుత్సవము జరుగుచున్నది” యనెను. ​శాంతి, “ఇఁక అచ్చటికి పోనేల? మహామాతయొక్క కార్యోద్ధార మాయెను. ఈ దేశము సంతానుల వశ మాయెను. మనకు రాజ్యంబున భాగము వద్దు” అనెను.

జీవానంద —— దేనిని జయించినామో దానిని బాహుబలముచేఁ గాపాడుకొనవలదా?

శాంతి —— కాపాడి యుంచుకొనుటకు మహేంద్రుఁ డున్నాఁడు. సత్యానందుఁడు నున్నాఁడు. నీవు ప్రాయశ్చిత్తమును జేసికొని సంతానధర్మంబునకై దేహమును ద్యజించి యుంటివి. ఇప్పుడు మరల ప్రాప్తమైన దేహమునందు సంతానుల కేమియు నధికారము లేదు. మనము సంతానుల పాలిటికి చచ్చినవారమై యున్నారము. ఇప్పుడు సంతానులు మనలఁ జూచినచో; “జీవానందుఁ డా యుద్ధసమయమునఁ బ్రాయశ్చిత్త భీతి చే దాఁగికొని యుండి జయమైనందున రాజ్య భాగమునకై వచ్చి యున్నాఁడు.” అని చెప్పుదురు.

జీవానంద —— అదెట్లు, శాంతీ! జనాపవాదంబునకు వెఱచి మనము చేయుపనులను మానవలయునా? మనపని మాతృసేవ. ఎవరేమి చెప్పినను నేను మాతృ సేవను వదలను.

శాంతి —— దానికి నీకు మరల నధికారము లేదు. ఏమనఁగా, నీవు మాతృసేవానిమిత్తమై దేహమును ద్యజించితివి. మరల మాతృసేవ చేయవలసినయెడల నీ ప్రాయశ్చిత్తము నిష్ప్రయోజన మగును. మాతృసేవకంటె ప్రాయశ్చిత్తము శ్రేష్ఠమైనది. లేకుండినచో, కేవల మీతుచ్ఛమైన ప్రాణమును పరిత్యజించు టొక పెద్దపనియా? ​జీవానంద —— శాంతీ! నీవే శాస్త్రసారమును దెలిసిన దానవు, నే నీ ప్రాయశ్చిత్తమును అసంపూర్తి చేయుట లేదు. నాసుఖము సంతానధర్మమందే —— ఆ సుఖమునందు వంచితుఁడ నయ్యెదను అయినను, పోవు టెచ్చటికి? మాతృసేవను మాని యింటికిఁ బోయి సుఖభోగముల ననుభవించుటకు వలను పడదుగదా.

శాంతి —— నే నట్లు చెప్పుదునా! ఛీ! మన మింక గృహస్థులము కాము. ఇట్లే యిరువురమును సన్న్యాసులమై యుందము గాక —— చిరబ్రహ్మచర్యమును గాపాడుదము. నడువుము; దేశ దేశంబులందు చని తీర్థయాత్రలు చేసికొని యుందము.

జీవానంద —— తర్వాత?

శాంతి —— తర్వాత హిమాలయమునందు కుటీరము నేర్పఱుచుకొని దేవతారాధన చేయుదము. దేనిచే మన మహామాతకు మంగళమగునో యావరమును వేఁడుదము.

అంత నాయిర్వురును లేచి యొకరి చేయి నొకరు పట్టుకొని నడుచుచు జోత్స్నామయమైన యర్ధరాత్రి యం దనంతమున నంతర్హితులైరి.

హా తల్లీ! మరల రాఁగలరా? జీవానందునివంటి పుత్త్రుని శాంతివంటి పుత్త్రిని మరల గర్భంబునందు ధరియించెదవా?