ఆనందమఠము/తొమ్మిదవ ప్రకరణము
తొమ్మిదవ ప్రకరణము
మహేంద్రుఁడు తప్పించుకొనుట
మహేంద్రుఁడు బండినుండి దిగి ఒక సిపాయి చేతిలోనికత్తిని లాఁగికొని యుద్ధములోఁ దానును చేరవలయునని యెంచెను. అయినను, వీరు దొంగలు, ధనాపహరణార్థమై సిపాయీలను గొట్టుచున్నారని తెలిసికొని, యుద్ధ స్థానమునకుఁ గొంచెము దూరమున నిలిచెను. ఏలన, దొంగలకు సహాయము చేసినచో వారు చేయుపాపములకు భాగి కావలసివచ్చు నని యెఱింగి కత్తిని పాఱవేసి యచ్చోటనుండి మెల్ల మెల్లగ పోవుచుండెను. అపుడు భవానందుఁడు వచ్చి వాని ప్రక్కనునిల్చెను.
మహేంద్ర—- మీరెవరండి?
భవానంద —— నే నెవరైన మీకేమి?
మహేంద్ర —— అందువలన నాకు కొంచెము పనియున్నది; ఈదినము మీవలన మహోపకారమును బొందితిని.
భవానంద —— అట్టి ఉపకారము నావలనఁ గలిగినదని మీరు నమ్మినట్లు నాకు తోఁప లేదు. మీ చేత ఖడ్గ ముండియు దూరముగ నిలిచియుంటిరి, జమీందారుల కుమారులు పాలు పెరుగు వెన్న నెయ్యి లడ్డు బూంది మొదలైనవానిని గొంతు వఱకు తినుటకును, ఇష్టానుసారముగా ధనమును దుర్వినియోగము చేయుటకును సమర్థతగలవారేకాని సమయము వచ్చినపుడు ఎందులకును పనికి రారు.
మహేంద్ర——భవానందునిమాట ముగియునంతలోపల వేసటనొంది, ‘ఈపని మంచిపనికాదు, ఇది దొంగపని’ యనెను.
భవానంద—— దొంగపని యైనను చింత లేదు. నావలన, మీరు ఉపకృతు లైతిరి. ఇంకను ఉపకారమును పొందవలసిన వారై యున్నారు, నే నింకను ఉపకారము చేయవలయునని యున్నాను అనెను.
మహేంద్ర——మీరు నాకుపకార మొనర్చినది నిజము, ఇంక నేమియుపకారము చేయఁబోయెదరు? దొంగలచేతనుండి తప్పించితిరి. నేను తమకు ప్రత్యుపకారము నేమియు చేయుటకును శక్తుఁడను కాను. భవానంద —— మీరు నా ఉపకారమును గ్రహించిన నేమి, గ్రహింపకపోయిన నేమి, ప్రత్యుపకారము చేసిననేమి, చేయక పోయిన నేమి, మీయిష్టము. మీరు నాతో వచ్చితిరేని మీ భార్యను కొమార్తెను చూపఁగలను.
మహేంద్ర——(భవానందుని ముఖమునుజూచి ఆశ్చర్యముతో) అదెట్లు?
భవానందుఁడు మారాడక పోవుచుండెను. మహేంద్రుడు చేయునది లేక వాని వెంబడి పోవుచుండెను. పోవునపుడు తనలో “వీ రెట్టి దొంగలబ్బా!” అని తలంచుకొనెను.