Jump to content

ఆనందమఠము/ఏడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
​

ఏడవ ప్రకరణము

మహేంద్రుఁడు సిపాయీలకు లోఁబడుట

మహేంద్రసింహుఁడు, ఈ నిర్మానుష్యప్రదేశమునం గూర్చుండి యాలోచించి ప్రయోజనము లేదని తెలిసికొని, రాజనగరమునకుఁ బోయి పోలీసువారిని సహాయముగాఁ బిలుచుకొని భార్యను బిడ్డను వెదుకవలయు నని తలంచి, ఆమార్గముగాఁ బోవుచుండెను. కొంచెము దూరము పోఁగానే, ఒక యెద్దుబండి సిపాయీల పహరాతో వచ్చుచుండెను. రాజనగరము; లేక నగరము ఎయ్యది యనుదానిని యిపుడు చెప్పెదము.

వేయుయు నేడువందల డెబ్బదియాఱవ (1776) సంవత్సరమునందు వీరభూమి (Birbhoom) మొదలగు ప్రదేశములు ఇంగ్లీషువారిపాలనకు లోఁబడి యుండలేదు. ఆకాలమున ఇంగ్లీషువారు బంగాళా దివానులై యుండిరి. ఫౌజుదారియు వారికి ​ చేరియుండ లేదు. వారు కేవలము నేలపన్ను వసూలు చేయు అధికారులై యుండిరేగాని, బంగాళా దేశముయొక్క సివిల్, క్రిమినల్, పోలీసు ఇలాఖా అధికారములను వహియించి యుండలేదు. సిస్తు వసూలు చేయు అధికారము ఇంగ్లీషు వారిదిగను, జనులయొక్క ఆస్తి, ప్రాణము మొదలగు వాని సంరక్షణావేక్షణ భారము ఆ పాపిష్టియు, నరాధముఁడును, విశ్వాసఘాతుకుఁడును, మనుష్యకులకలంకుఁడు నైన మీరజాఫరు చేతిలో నుండెను. ఈ మీరజాఫరుఁడు ఆత్మరక్షణమునందే సమర్థత లేనివాఁడు. వీఁడు బంగాళా దేశము నెట్లు సంరక్షింపఁ గలఁడు? మీరజాఫరునకు గంజాయి త్రాగుట, అభిని తినుట, అను నీ రెండు పనులకే కాలము చాలక యుండెను. ఇంగ్లీషు వారికి ధనము వసూలు చేసి కొనుట, డెస్పాచ్ (Despatch) వ్రాయుట, అను నీ రెండు పనులే యుండెను. బంగాళా దేశము నందుండు వారికి నిరంతరము ఏడ్చుట, నష్టపడినందులకై చింతించుచుండుట, అను నీ రెండు పనులే యుండెను.

బంగాళా దేశమునందు ఇవి సాధారణ నియమములై యుండెను. వీరభూమి మొదలగు ప్రదేశములందు స్వతంత్రమైన రాజ్య ప్రణాళిక యుండెను. అది వీరభూమి రాజు చేతియం దుండెను. రాజనగరము, లేక నగరము ఆ దేశమునకు రాజధానియై యుండెను. వీరభూమి రాజులు పూర్వమునందు స్వతంత్రులై యుండి ప్రకృతమున మూర్షిదాబాదు ప్రభువునకు లోఁబడియుండిరి. పూర్వమున వీరభూమియందు స్వతంత్రులైన హిందూ రాజు లేలుచుండిరి. ఇప్పటి రాజవంశస్థులు ముసల్మానులు, మనము ఏకాలపుకథను ప్రారంభించితిమో దానికి మునుపున్న ​అల్లినఖ్కి ఖా౯ బహధర్ అను తురక రాజు, సిరాజఉద్దౌలా సాహాయ్యమువలన దేశమును వృద్ధి చేసి కలకత్తా నగరమును కొల్లగొట్టుకొని వచ్చియుండెను. ఆ తర్వాత క్లైవు వచ్చి యడుగు పెట్టిన వెంటనే తురకలు జన్మసార్థకము కొఱకు బేహస్తికి (వీరస్వర్గమునకు) ప్రయాణోన్ముఖు లైరి. బంగాళా దేశములోని ఇతర ప్రదేశములవలెనే వీరభూమి ఆదాయము కూడ ఇంగ్లీషువారు తీసికొనుట ప్రారంభించిరి. అయినను శాసనభారము రాజు చేతి యందే యుండెను. ఇంగ్లీషు వారు ఎచ్చ టెచ్చట పన్ను వసూలు చేసికొనుచుండిరో ఆయాస్థలములలో నొక్కొక కలెక్టరును నియమించి యుండిరి కాని, అప్పటివఱకు వీరభూమికి కలెక్టరును నియమించ లేదు. రాజే వారికొఱకు పన్ను వసూల్ చేసి కలకత్తాకుఁ బంపుచుండెను. ఆ కారణము చేత వీరభూమి ఆదాయము కలకత్తాకు ఇరసా లగుచుండెను. జనులు తినుటకు కూడు లేక చచ్చుచున్నను ఇరసాలు మాత్రము నిల్చుట లేదు. అపుడంతగా ఉత్పత్తియును లేదు. ఏలన, భూమి చక్కఁగా పండుట లేదు. అది యెటులైన నుండనీ; ఆదాయము కొంచెముగా నున్నను దానిని బండిలో వేసి సిపాయీల పహరాతో కలకత్తా యందలి కంపెనీ ఖజానాకు పంపుచుండిరి. అప్పుడు దొంగలభయము అధికముగా నున్నందున ఏఁబదుగురు సిపాయీలు ఆయుధపాణులై బండికి ముందు వెనుకల పహరా యిచ్చుచు పోవుచుందురు. వీరికి అధికారి ఒక యెఱ్ఱమూతివాఁ డుండెను. వాఁడు కంపెనీ వారి నౌకరుకాదు. ఆకాలమున దేశీయ రాజుల సైన్యములలో అనేకులు ఎఱ్ఱ మొగముగలవారు అధికారులుగా ​నుండిరి. ఎఱ్ఱమోము గలవాఁడు అందఱకు వెనుక గుఱ్ఱము నెక్కిపోవుచుండెను. ఎండ తాపము మిక్కుటముగా నున్నందున సిపాయీలు పగటి వేళ ప్రయాణము చేయక రాత్రి పూట ప్రయాణము చేయుచుండిరి ఇట్లు, ఇరసాలుబండితోఁగూడ పోవుచున్న సిపాయీలను మహేంద్రసింహుడు చూచి వారికి దారి విడుచుటకై కొంచెము ఒదిగి నిలిచెను. అయినను, సిపాయీలు వానిమీఁద పడుటకు వచ్చిరి. ఇది జగడమునకు సమయము కాదని మహేంద్ర సింహుఁడు రస్తా ప్రక్కన నున్న అడవియందున నిల్చెను.

ఒక సిపాయి, ఇదిగో దొంగ పరుగెత్తి పోవుచున్నాఁడని యఱచెను. మహేంద్రుని చేత తుపాకి యుండుటను జూచి వానికి వీఁడు దొంగ యనుట దృఢమైనది. ఆ సిపాయి వానిని వెంబడించి పరుగిడి పట్టుకొని, దొంగముండాకొడుకా! అని తిట్టుచు ఒక గుద్దు గుద్ది తుపాకిని లాగుకొనెను. మహేంద్రుఁడు వట్టిచేతివాఁ డైనందువలన సిపాయిగుద్దుకు బదులు తానొక గుద్దు గుద్దెను. మహేంద్రునికి అధిక కోపము కలిగినదని వేఱుగఁ జెప్ప నక్కఱలేదు కదా. గుద్దుతిన్న సిపాయి తాళ లేక యట్లే నేలపైఁ బడిపోయెను. అపుడు నలుగురు సిపాయీలు వచ్చి మహేంద్ర సింహుని పట్టి యీడ్చుకొని పోయి సేనాపతి సాహేబుముందు నిలిపి, ‘వీఁడు ఒక సిపాయిని ఖూని చేసినాఁ’ డని రిపోర్టు(Report) చేసిరి. అపుడు సాహేబు పైపు (pipe) అనఁగా (చుట్టపట్టుకోవికి పేరు) పట్టుచుండినదేగాక, సారాయి త్రాగిన మత్తు చేతను కొంచెము విహ్వలుఁడై యుండినందున, “ఈదొంగముండాకొడుకును పట్టి ‘షాదీ’ (అనఁగా ​తురకలలో పెండ్లికి పేరు) చేయు” డని చెప్పెను. ప్రకృతము నందు “కైది” అని చెప్పవలసియుండెను. దానికి బదులు కై పెక్కియున్నందున ‘షాది’ అని సాహేబు నోటనుండి వెడలెను. ఆ సిపాయీలు “వీనికి పెండ్లి యెట్లు చేసేది? వీనికిని దెబ్బతిన్న సిపాయికిని పెండ్లి చేసేదా, లేక వీనికి యేడనుండి పిల్లను తెచ్చి పెండ్లి చేసేది? ఇదేమొ వింత తీర్పుగా నున్నదే. అయినా వీనిని కాళ్లు చేతులుకట్టి బండిలో పడ వేసికొనిపోదము. సాహేబువారు మత్తు తిరిగిన మీఁదహుకుం బదలాయింపఁగలరు” అని తమలోఁ దా మాలోచించుకొని మహేంద్ర సింహుని మోకుదారముతో కట్టి బండిమీఁద వేసిరి. మహేంద్రసింహుఁడు ఇందఱతోను జగడమాడిన ప్రయోజన ముండదని తెలిసికొని యూరకుండెను. సాహసము చేసి తప్పించుకొన్నను ఫలమేమి? పెండ్లము బిడ్డ పోయినమీఁద జీవితుఁ డై యుండుటకు వానికి సమ్మతము లేదు. సిపాయీలు మహేంద్రసింహుని బండిగూటమునకు భద్రముగా కట్టిరి. అనంతరము, యథాప్రకారము ఇరసాలును తీసికొని మృదు గంభీరమైన నడకతో పోవుచుండిరి.