ఆనందమఠము/ఇరువదెనిమిదవ ప్రకరణము
ఇరువదెనిమిదవ ప్రకరణము.
శాంతి భర్తకు హితము చెప్పుట
శాంతి హరిణ వేగముతో వనమధ్యమం దెచ్చటికో పోయెను. కొంచెము సేపటికి థామసు స్త్రీ కంఠమునుండి మధురమైన సంగీతమును వినెను.
ఈ యౌవన జలతరంగ వరోధిపుఁ డెవఁడో?
హరే మురారే! హరే మురారే!
మరల నెచ్చటనో సారంగ మధురధ్వని వినఁబడెను.
ఈ యౌవన జలతరంగ వరోధిపుఁ డెవఁడో?
హరే మురారే! హరే మురారే!
దానితో పురుషకంఠమును జేరి సంగీతము వినఁబడెను.
ఈ యౌవన జలతరంగ వరోధిపుఁ డెవఁడో?
హరే మురారే! హరే మురారే!
మూడు స్వరములు నొకటిగాఁ జేరి వనలతల నెల్లఁ గంపించెను. శాంతి గానము చేయుచు వెడలి పోయెను.
ఆ దట్టమగు వనమున నేమి యుండినదియు బయట నుండి చూచిన గోచరము కాదు. శాంతి, యా వనమధ్యమునఁ బ్రవేశించెను. అచ్చట శాఖాపల్లవరాశియందొక చిన్న కుటీర ముండెను. అది మ్రానికొమ్ములచేఁ గట్టఁబడి యాకులచేఁ గప్ప బడి యుండెను. అందలి గోడలు తడికెలు కట్టి మట్టిచే నలక బడినదిగ నుండెను. దానితలుపు లతలచే నల్లంబడి యుండెను. ఆ తలుపును దెఱచుకొని శాంతి ప్రవేశించెను. అచ్చట జీవానందుఁడు సారంగమును వాయించుచుఁ గూర్చుండి యుండెను.
జీవానందుఁడు శాంతినిఁ జూచి, ‘ఇన్ని దినములకు జల తరంగ ముప్పొంగి ప్రవహించెనా?’ యనెను.
శాంతి నవ్వి, ‘ఆనకట్ట కట్టఁబడినపిదప ఉప్పొంగి ప్రవహించు టెట్లు?’ అని యుత్తర మొసంగెను. జీవానందుఁడు కందిన మోముకలవాఁడై, చూడుము, ‘శాంతీ! ఒకనాఁడేమో నాకు వ్రతభంగము కలిగి నాప్రాణము ఉత్సర్గమై పోయి యుండెను. ఆపాపంబునకుఁ బ్రాయశ్చిత్తము కావలయును. ఇన్ని దినములకుఁ బ్రాయశ్చిత్తము జేసికొనుచున్నాను. కేవలము నీకోరిక చేతఁ జేసికొన లేదు. ఇఁక ఘోర యుద్ధము జరుగుటకు కాలవిళంబము లేదు. ఆయుద్ధ క్షేత్రముననే నాప్రాయశ్చిత్తము జేసికొనవలయును. ఈ ప్రాణమును ద్యజింపవలయును. నేను చచ్చుపర్యంతము ఈ బ్రహ్మచర్యమే’ అనెను.
శాంతి —— నేను నీ ధర్మపత్నిని; సహధర్మిణిని; ధర్మ కార్యమునందు సహకారిణినై యున్నాను. నీ వతిశయమైన గురుతర ధర్మంబును గ్రహించిన వాఁడవు. ఆధర్మమునకు సహాయము చేయుటకే నేను ధర్మంబును గృహమును త్యజించి వచ్చినదానను. ఇరువురును జేరి ధర్మాచరణము నాచరింత మనియే కదా యిల్లు విడిచివచ్చి వనమున వసించుచున్నాను. నీ ధర్మమును వృద్ధి చేసెదను. ధర్మపత్నినైయుండి ధర్మమును విఘ్నము చేయుదునా? వివాహము ఇహమునకు పరమునకు ప్రయోజనకారి. ఇహమునకు మాత్రమే నేను నిన్ను వివాహమాడ లేదు. దానిని నీ వెఱుంగుదువు, మన వివాహము పరలోక ప్రయోజనమునకునై యున్నది. పరమున ఫల మొకటికి రెండింత లగును. ప్రభూ! నీవు నాకు గురుఁడవు. నేను నీకు ధర్మమును జెప్పఁగలనా! మఱియు నీవు వీరుఁడవు, నీకు వీర వ్రతమును నేర్పఁగలనా? జీవానందుఁ డాహ్లాదముచే గద్గదకంఠుఁడై —— నీవు నేర్పియే నేను నేర్చికొంటిని, అనెను.
శాంతి ప్రఫుల్లచిత్తయై —— ఇంకను వినుము; గోసాయీ! ఇహమందే మన వివాహము నిష్ఫలమా? నీవు నన్నుఁ బ్రేమించుచున్నావు. నేను నిన్నుఁ బ్రేమించుచున్నాను. ఇంతకంటే ఇహమున నింకేమి యధిక ఫలము కావలయును? చెప్పుము ——“వందేమాతరం”
అపు డాయిరువురును జేరి యేకకంఠముతో “వందేమాతరం” అనుగీతమును పాడిరి. వారు గానము చేయుచు కన్నీరు నించి యేడ్చిరి.