ఆనందమఠము/ఇరువది రెండవ ప్రకరణము
ఇరువది రెండవ ప్రకరణము
మహేంద్రుఁడు దీక్షితుఁ డగుట
సత్యానందుఁ డిట్లు చెప్పిన మీఁద మహేంద్రసింహునిఁ బిలిచికొని మఠమందు అద్భుత చతుర్భుజమూర్తి నెలకొనియున్న అపూర్వ శోభోయమానమగు దేవాలయమునఁ బ్రవేశించెను. అపుడచ్చట అవూర్వశోభాకాంతిగల స్వర్ణ రత్నములచే నలంకరింపఁబడిన బహువిధ దీపములు వెలుఁగుచుండెను. వివిధ పుష్పరాసులచే మందిరము ఆమోదముగా నుండెను. మందిరమున నొకఁడు కూర్చుండి మెల్ల మెల్ల గా “హరేమురారే” యని నుడువు చుండెను. సత్యానందుఁడు మందిరమును బ్రవేశింపగనే యా మనుష్యుఁడు లేచి ప్రణామం బాచరించెను.
బ్రహ్మచారి —— నీవు దీక్షితుఁడ వయ్యొదవా! యనెను.
ఆమనుష్యుఁడు —— నన్ను అనుగ్రహించి దీక్ష నొసంగిన గ్రహించెద.
అపుడు సత్యానందుఁడు అతనిని, మహేంద్రుని సంబోధించి, వారిరువురును యథావిధిగా సుస్నాతులరై సంయతులై యనశనులై యున్నారు కదా? యని యడిగెను.
ఉభయులు —— ఆరీతిగనే యున్నాము.
సత్యానంద —— మీ రిరువురును భగవత్సాక్షిగా సంతానమత ధర్మనియమంబుల కన్నిటికి బద్ధులరై యుందుమని ప్రతిజ్ఞ చేయఁగలరా? ఉభయులు —— చేయుదుము.
సత్యానంద —— ఎన్ని దినములవఱకు. మాతయొక్క ఉద్దారము కాదో యంతవఱకు గృహధర్మములను త్యజింతురా?
ఉభయులు —— అట్లే చేయఁగలము,
సత్యానంద —— తల్లిదండ్రులను విడిచెదరా?
ఉభయులు —— విడిచెదము.
సత్యానంద —— భ్రాతలను భగినీలను?
ఉభయులు —— వారినిఁగూడ విడిచి పెట్టెదము.
సత్యానంద —— దార సుతులను?
ఉభయులు —— త్యజించెదము.
సత్యానంద —— ఆత్మీయస్వజనులను? దాసదాసీజనులను?
ఉభయులు —— అందఱను బరిత్యజించెదము
సత్యానంద —— ధనము? భోగములు?
ఉభయులు —— సర్వము పరిత్యాగ మాయెను.
సత్యానంద —— ఇంద్రియములను జయింతురా? ఏకాసనమున స్త్రీలతోఁ గూర్చుండకుందురా!
ఉభయులు —— ఇంద్రియములను జయించెదము. అట్లు కూర్చుండుట లేదు.
సత్యానంద —— భగవత్సాక్షిగా సొంతమునకుఁగాని, లేక స్వజనులకొఱకుఁ గాని అర్ధోపార్జన చేయుట లేదని ప్రతిజ్ఞ చేయుదురా! ఏముపార్జన చేసినను దానిని వైష్ణవధనాగారంబున కోసంగుదుమని ప్రమాణము చేయుదురా?
ఉభయులు —— అట్లే ప్రమాణము చేయుదుము. సత్యానంద —— సనాతనధర్మంబునకై శక్తివంచన లేక అస్త్రపాణులై యుద్ధము చేయుదురా?
ఉభయులు —— చేయుదుము.
సత్యానంద —— రణరంగంబున వెనుదీయరుకదా?
ఉభయులు —— వెనుదీయము.
సత్యానంద —— ప్రతిజ్ఞాభంగ మొదవినచో?
ఉభయులు —— జాజ్వల్యమానమగు అగ్ని యందుఁ బ్రవేశింతుము లేక, విషమునైనను తిని ప్రాణములను ద్యజింతుము.
సత్యానంద —— ఇంకొక మాట మహేంద్రుఁడు కాయస్థుఁడని నాకుఁ దెలియును; ఇంకొకనిఁ జూచి, నీ వేజాతి వాడవు?
మఱోక్కఁడు —— నేను, బ్రాహ్మణకుమారుఁడను.
సత్యానంద —— మంచిది, మీరు జాతిని విడువఁగలరా? సంతానులంద ఱొకే జాతి. ఈమహా వ్రతంబున బ్రాహ్మణ శూద్ర భేదము లేదు; మీరేమి చెప్పెదరు?
ఉభయులు —— మే మాభేదము నుంచుకోనుట లేదు. మన మందఱమొక మాతృసంతానులము.
సత్యానంద —— అట్లయినచో మిమ్ము దీక్షితులను జేసెదను, మీ రిపుడు చేసిన ప్రమాణవాక్యములయం దొక్కదానికైనను భంగము రాగూడదు. శ్రీమురారియే దీనికి సాక్షి. ఎవ్వఁడు రావణ కుంభకర్ణ కంస హిరణ్యకశిపు జరాసంధ శిశుపాలాది దుష్టుల నాశనంబునకు హేతుభూతుఁడై యుండెనో; ఎవఁడు సర్వాంతర్యామియై, సర్వజయియై సర్వశక్తిమంతుఁడై , సర్వనియామకుడై యున్నాడో, ఎవఁడు ఇంద్రుని వజ్రాయుధంబునను, మార్జాలనఖములయందును తుల్యరూ పుఁడై యున్నాఁడో; యట్టి మహానుభావుఁడు ప్రతిజ్ఞా భంగకారిని ధ్వంసము చేసి నరకంబునఁ బడ వేయునుగాక!
ఉభయులు —— తథాస్తు,
సత్యానంద —— మీరు "వందే మాతరం” అని గానము చేయుఁ డనఁగా నిరువురు నా నిభృతమందిరమున మాతృస్తోత్రమును పాడిరి. పిమ్మట బ్రహ్మచారి వారికి యథావిధిగా దీక్ష నొసంగెను.