Jump to content

ఆనందమఠము/ఇరువదియాఱవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
​

ఇరువదియాఱవ ప్రకరణము

సంతానులు తమపరాక్రమమును జూపుట.

కడచిన డెబ్బదియాఱవ సంవత్సరము సంపూర్ణ మాయెను. బంగాళా దేశమునందు నాల్గుపాళ్లో యెనిమిది పాళ్లో లేక యెన్ని కోట్లజనులో దాని నెవరు చెప్పఁగలరు? ఎందఱనో యమపురికిఁ బంపి వేసి యాదుర్వత్సరము తానును కాలగ్రాస మొందెను. డెబ్బది యేడవసంవత్సరమున దేవుఁడు సుప్రసన్నుఁ డాయెను. సువృష్టి కలిగెను. పృథ్వి సస్యశాలిని యాయెను. జీవమాత్రావశిష్టులు కడుపు నిండుగ భుజించిరి. అనాహారులై యుండినవారును, అల్పాహారులై యుండిన వారును, పూర్ణాహారము నొక్క టేసారి తిని, యఱిగించుకొన లేక మృతులైరి. పృథ్వి సస్యశాలిని యాయెనుగాని, జనశూన్యము. గ్రామం ​బులలోని యిండ్లు పాడుపడి పశుపక్షులకు విశ్రామభూమియై ప్రేతభీతికిఁ గారణమాయెను. పంటభూములను సాగుబడి చేయువారు లేక, బీడుపడి గడ్డి పెరిఁగి యుండెను. దేశమంతయు కాననమువలెఁ గన్పట్టెను. ఎచ్చట శ్యామలకోమలమగు సస్య రాశి ప్రకాశించుచుండునో; ఎచ్చట అసంఖ్యాకములగు పశుపక్షులు మేయుచుండునో; ఎయ్యది గ్రామమందుండు యువకయువతులు గుంపు చేరి యామోద ప్రమోదంబులఁ జేయుచుండిన యుద్యానభూములుగా నుండునో; అవియన్నియు ఘోరతరమైన వనంబగుచు వచ్చెను. ఒక యేఁడు కడచెను; రెండేండ్లు చెల్లెను, మూఁడేండ్లాయెను. కాననము మఱింత వృద్ధియగుచు వచ్చెను. ఏస్థలము మనుష్యుని సుఖంబున కాటపట్టై యుండెనో యది నరమాంస లోలుపమైన వ్యాఘ్రాదులకు వాస స్థలమాయెను. ఎచ్చట సుందరీమణులు గుంపు చేరి యలకాంకిత చరణంబులయందలి గజ్జెలు, పిల్లాండ్లు, గొలుసులు, మెట్టులు ఈ మొదలగు నాభరణములు ఘల్లు ఘల్లున శబ్దము చేయఁగా నెచ్చెలులతో సరససల్లాపము లాడుచు పకపక నవ్వుచుఁ బోవుచుండిరో యాస్థలములయందు భల్లూకములు బిలంబులను ద్రవ్వికొని పిల్లలను కని లాలన పాలన చేయ నారంభించెను. ఎచ్చట పిన్నవాండ్రు పిన్న వయసున సంధ్యాకాల మల్లికా కుసుమమువలె ఉత్ఫుల్లహృదయులై యాటపాటలఁ బొద్దు పుచ్చుచు సంచరించుచుండిరో యాస్థలములయందు మత్తగజంబులు చెట్ల కొమ్మలను లాగుచుఁ దిరుగుచుండెను. ఎచ్చట దుర్గోత్సవములు జరుగుచుండెనో యచ్చట సృగాలావాస ​మయ్యెను. నాట్య మందిరములందు విషసర్పములు పగటియందే కప్పలను వెదకుచుండెను. పంటపండునుగాని, తినుటకు జనులు లేరు. ధాన్యము పండినను ధనము లేదు. కొనువారే లేరు. జమీందారులు కప్పముల నిచ్చుటకు శక్తి లేనివారైరి. వారికి రైతు లియ్యవలసిన పన్ను నియ్యరు. రాజు జమీందార్లను జప్తు చేసినందుచే హృతసర్వస్వులై దరిద్రులగుచు వచ్చిరి. భూమాత సుప్రసూతియాయెను. అయినను సొమ్ము పుట్టదు. ఎవ్వరింటియందును ఒక కాసైనను లేదు. ఎవని చేతికి దొరకిన దానిని వాఁడే తినుచుండెను. దోపిళ్లు, దొంగతనములు ప్రబలమాయెను. సాధుశీలుఁడు భీతిచే నిల్లు విడిచి కదలక తలదాచుకొని యుండెను.

ఇచట సంతాన సంప్రదాయస్థులు నిత్యమును చందన పుష్ప తులసీదళములచే విష్ణుపాదపద్మంబులను పూజ చేయుచు నెవరి యింటియందైనను తుపాకి పిస్తోలు లుండినచో వానిని దీసికొని వచ్చుచు నుండిరి.

భవానందుఁడు, ‘భ్రాతృలారా! ఇండ్లయందు పద్మరాగ వజ్ర వైఢూర్య ప్రవాళాదు లుండినను వానిని తాఁకక, విరిగిపోయిన తుపాకిగా నుండినను వానినిమాత్రము తీసికొనిరం’ డని చెప్పుచుండెను.

సంతాన సేనాధిపతులు ఒక్కొక గ్రామంబునకును దమ యనుచరులను బంప నారంభించిరి. అనుచరులు గ్రామంబులకుల బోయి యెచ్చట హిందూజనులను జూచినను వారినిఁ గూర్చి విష్ణుపూజ చేయుదురా? యని యడుగుదురు. ఇట్లు చెప్పుచు ఇరువది ముప్పదుగురు గుంపుగాఁ జేరి ముసల్ మానుల ​గ్రామములపైఁబడి వారిండ్లను కాల్చుచుండిరి. ముసల్ మానులు ప్రాణరక్షణయందు వ్యస్తులై యున్నప్పుడు వారి సర్వస్వమును సంతానులు దోఁచుకొనిపోయి దానిని క్రొత్తఁగా వచ్చిన విష్ణుభక్తులకు పంచి యిత్తురు. కొల్లలో దొరకిన భాగముతో గ్రామనివాసులు తృప్తులు కాఁగనే వారినిఁ బిలిచికొని వచ్చి విగ్రహముల పాదస్పర్శ చేయించి వారిని సంతానులుగఁ జేయుదురు. జనులు సంతానత్వమునందు విలక్షణమైన లాభము కలదని భావించిరి. విశేషముగా తురకల రాజ్యమందు సరిగాని యనాయకత్వమును గాంచి, యందఱును వారియందు విరక్తులైరి. హిందూధర్మము లోపముగా నుండిన కారణముచే ననేక హిందువులు హిందూమతమును స్థాపించుటకు ప్రబలమగు నాతురము గలవారైరి కావున, సంతానులసంఖ్యవృద్ధియైనది. దినదినము నూర్ల కొలఁదిజనులు చేరుచుండిరి. అందఱును భవానందజీవానందుల పాదములపైఁబడి వారి యాజ్ఞ ప్రకారము దండులోఁ జేరి తురకలను శాసింపఁబోవుచుండిరి. సర్కారునౌకర్లను ఎచ్చటఁ జూచినను పట్టి కొట్టుచుండిరి. కొందఱను జంపుటయుఁ గలదు. సర్కారు ధన మెచ్చటనుండినను కొల్లగొట్టి యింటికిఁ దెచ్చుకొందురు. తురకల గ్రామము కనఁబడినచో కాల్చి బూడిద చేయక వదలరు.

అప్పుడు నగరంబున మహారాజునకు హెచ్చరిక గలిగెను. సంతానులను శాసించుట కతఁడు సైన్యములను బంప నారంభించెను. అయినను, అదివఱుకే సంతానులు బలవంతులై శస్త్ర ధారులై మహాపరాక్రమశాలులై యుండిరి. వారిదర్పమునకు తురకల సైన్యము నిలుపక పోయెను. ఒక వేళ ముందు ​నకువచ్చి నిలిచినను, సంతాను లగుటచే వారు తురకలను ఛిన్నభిన్నము చేసి హరిధ్వని చేయుచుండిరి. సంతానుల బలమును యవనసైనికులు పాఱఁ ద్రోలినను, అప్పుడే యెక్కడ నుండియో వేఱొక సంతానులగుంపు వచ్చి తురకల తలలను నరికి పాఱవైచి “హరి హరీ” యని వెడలిపోవుదురు. రాజైన అసదుల్ జమానునకు మిక్కిలి కష్టము సంభవించెను. వాఁడు అనేకములైన ఫిరంగులు మందు గుండ్లు ఏనుఁగులు గుఱ్ఱములు ఇంకను కావలసినవానిని బంపెను. అందువలనఁగూడా సంతానుల “జయజగదీశ హరే” యను నినాదము నివారణము కాలేదు. అసదుల్ జమానుఁడు తాను రాజ్యచ్యుతుఁ డగుదుననియే నిశ్చయించెను.

అపు డతఁడు దుఃఖితుఁడై యాంగ్లేయులకు జాబు వ్రాసెను. ఎట్లన: —— ‘నే నిప్పుడు నేలపన్ను రూపాయలను వసూలు చేయుట కేమి చేసినను సాధ్యపడలేదు. ఇరసాలు పంపలేను; ఇప్పుడు మీరు రక్షించితి రేని పిదప వసూలు చేయవచ్చును; లేనియెడల మీరే వచ్చి వసూలు చేసికొనవలయును.’

ఆంగ్లేయులు మొదట కొన్ని చోట్లయందు తామే పన్నులు వసూలు చేసికొనుచుండిరి. అయిన, నిప్పుడు వారి ప్రయత్నము విఫల మగుచు వచ్చెను. ఈ సమయంబున ప్రధిత నామకుఁ డగు భారతవర్ష యింగ్లీషుకులోత్పన్నుఁ డైన ప్రాతస్సూర్యుఁడోయనునట్లు ప్రకాశించెడు వార౯ హేస్టింగ్సు భారతవర్ష గవర్నరు జనరలుగా నుండెను. అతఁడు కలకత్తాలో కూర్చుండి యొక యినుపగొలుసును ముందిడుకొని మనస్సునందీయొక్క గొలుసుతో నీససాగరద్వీపభారతభూమిని కట్టి ​వేయుదు నని తలంచుకొనెను. ఒక్కనాఁడు జగదీశ్వరుఁడు సింహాసనాసీనుఁడై నిస్సందేహముగా “తథాస్తు” అనెను. అయినను, ఆ దినము దూరముగా నుండెను. సంతానులభీషణమగు హరిధ్వనికి వార౯ హేస్టింగ్సుకూడా కంపితుఁ డాయెను.

వార౯ హేస్టింగ్సు మొదట పౌజుదారి సైన్యమువలన సంతానుల రాజవిద్రోహము నణఁగింపఁ బ్రయత్న పడెను. అయినను, ఫౌజుదారి సిపాయీలవ్యవస్థ చాల చెడిపోయి యొకముసలిదాని నోటనుండి హరినామము వినినను భయపడి పాఱిపోవునట్టి స్థితిలో నుండెను. కావున వారన్ హేస్టింగ్సు నిరుపాయుఁడై దక్షుఁడగు కేఫ్ట౯ థామస్ అనునొక సైనికుని యధినాయకునిగాఁ జేసి కంపెనీసైన్యమును విద్రోహనివారణార్థమై వీరభూమి ప్రదేశంబున కంపెను.

కేష్ట౯ థామసు వీరభూమినిఁ జేరి, యచటరాజవిద్రోహ నివారణ విషయమై యత్యుత్తమములైన యేర్పాట్లు చేయ నారంభించెను. రాజు యొక్క సైన్యమును, జమీందారుల సైన్యముల నడగితీసికొని యుద్ధంబున సుశిక్షితులగు కంపెనీ సైన్యముతోఁ జేర్చి, వారిలో బలిష్ఠులైన దేశవిదేశ వీరులను వెదకి సైనికులను తయారుచేసెను. పిమ్మట, నాసైన్యమును గుంపులు గుంపులుగా విడఁదీసి, యాగుంపులకు తగినవారిని యధికారులనుగా నియమించెను. పదంపడి, వారికి దేశ దేశములను విభాగించియిచ్చి మీరు వేఁట కాండ్రవలె పొంచియుండి యెచ్చట విద్రోహులు చిక్కినను చీమలను నలుపునట్లు ధ్వంసము చేయవలయునని చెప్పిపంపెను. కంపెనిసైనికులలోఁ గొందఱు గంజాయి, కొందఱు రం (నిషాగలిగించు సారాయి) త్రాగి, తుపా ​కులను బారు చేసికొని సంతానుల వధకై వెడలిరి. అయినను, సంతానులసంఖ్య యెక్కువగా నుండి నదేగాక, వారు అజయ్యులై యుండిరి. కేష్ట౯ థామసుయొక్క సైనికులు, కోతకాలములో కొడవలికి దొరికిన పైరువలె కత్తరింపఁబడిరి. హరిహరిధ్వనిచే కేప్ట౯ థామసుయొక్క చెవులు చెవుడు వడెను. ఈవిధముగ 1776-వసంత్సరమునందు వీరభూమిలో సంతానులు ప్రసిద్ధి కెక్కిరి.