Jump to content

ఆనందమఠము/ఇరువదియవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
​

ఇరువదియవ ప్రకరణము

శాంతి గురుదర్శనంబు చేయుట

మరునాఁడు ఆనందమఠంబున నేకాంతమగు గదియందుఁ గూర్చుండి భగ్నోత్సాహులైన సంతాన నాయకులు మువ్వురాలోచించు చుండిరి. జీవానందుఁడు సత్యానందునిఁ గాంచి ‘మహాస్వామీ? దైవము మనయం దేల యిట్లు అప్రసన్నుఁడాయెను? ఏదోషంబు వలన మనము మ్లేచ్ఛులచేఁ బరాభ వింపఁబడితిమి?’ అని యడిగెను.

సత్యానంద —— దైవము ప్రసన్నము కాకపోలేదు. యుద్ధంబున జయాపజయంబులు రెండును గలవు. ఆ దినము మనము జయించితిమి. ఈదినము పరాజితులమైతిమి. తుదకు జయమే సిద్ధించును. ఎవఁ డిదివఱకును దయ చూపినాడో యాశంఖచక్ర గదాధారి యగు వనమాలియే రక్షించునని నాకు నిశ్చయముగా నమ్మకము గలదు. ఆతని పాదములను స్పృశించి మనమే వ్రతమును గ్రహించితిమో యావ్రతమునే సాధింప వలయును. విముఖల మైతిమేని యనంతనరక భోగంబుల ననుభవింతుము. మన భవిష్యన్మంగళవిచారంబునందు నాకేమియు సంశయము లేదు. అయినను, దైవానుగ్రహము లేక యేకార్యమును సిద్ధింపదు. దానికి పురుషకారమును గావలయును. మనము నిరస్త్రులమై యంటిమి. గుండు తుపాకి ఫిరంగీల యెదుట మన కొయ్యలు, బళ్లెము లేమి చేయ నోపును. కనుక, మనకు పురుష ​కార లాఘవంబున నీయపజయము సంభవించెను. ఇప్పుడు చేయవలసిన దేమనిన, మనము నట్టి యస్త్ర సాధనఁబులను చాలినంత సంపాదింపవలయును.

జీవానంద —— అది బహు కఠిన వ్యాపారము.

సత్యానంద —— కఠిన వ్యాపారమా? జీవానందా! నీవు సంతానుఁడవై యుండియు నిట్టి మాట చెప్పఁదగునా? మన కసాధ్యమైన కార్య మెద్ది కలదు?

జీవానంద —— స్వామీ! వాని నెట్లు సాధింప నగునో సెలవొసంగుఁడు.

సత్యానంద —— వాని సంగ్రహార్థమై నేఁటి రాత్రికి తీర్థయాత్ర వెడలెదను. నేను మరల వచ్చునంతవఱకును మీరు ఎక్కువ పనులకుఁ బోకుండుఁడు; సంతానులలో ఐకమత్యంబును గాపాడుకొని యుండుడు; మీరు వారికి గ్రాసపసనంబుల నిచ్చుచుండుటయేగాక, మాతృరణ జయార్థమై అర్థ భాండాగారంబును పూర్ణముగా వృద్ధిపఱిచియుంచి కొనుఁడు. ఈ భారము మీయిరువురపై నున్నది.

భవానంద —— స్వామి! తీర్థయాత్ర చేసి వీనిని సంగ్రహంబు చేయుట యెట్లు? మందు, గుండు, తుపాకి, ఫిరంగి మొదలగువానిని విలువకుఁ గొని పంపుట చాల కష్టము. మఱియు ఇవన్నియు దొరకు టెక్కడ? విక్రయించు వారెవరు? తెచ్చువారెవరు?

సత్యానంద ——వెల యిచ్చి కొనుటకు నాచేత కాదు. నేను పనివాండ్రను బంపెదను. ఇచ్చటనే వాని నన్నిటిని తయారు చేయవలయును. ​జీవానంద —— అదెట్లు? ఈ యానందమఠమందేనా?

సత్యానంద —— దానిని మఱెచ్చట చేయవచ్చును? ఇందులకై నేను పెక్కు దినములనుండి చింతించుచున్నాఁడను. ఈశ్వరుఁడు దాని కిపుడు మార్గమును జూపి యున్నాడు. దేవుడు ప్రతికూలుఁడై యున్నాఁ డని మీరు చెప్పితిరి. అనుకూలుఁడయ్యే యున్నాఁ డని నానమ్మకము.

భవానంద —— కార్యశాల నెచ్చట నుంచవలయును?

సత్యానంద —— పదచిహ్న గ్రామంబున.

జీవానంద —— అచ్చట నెట్లు జరుపనగును?

సత్యానంద —— అట్లు కాకుండినచో నెందులకై మహేంద్ర సింహుడీమహా వ్రతమును గ్రహింపవలయును?

భవానంద —— మహేంద్రసింహుడు వ్రతంబును గ్రహించినాఁడా!

సత్యానంద —— వ్రతంబును గ్రహింప లేదు గ్రహించును. ఈ దినమురాత్రి యతనిని వ్రతదీక్షితునిఁగాఁ జేసెదను.

జీవానంద —— మహేంద్రసింహుని వ్రతదీక్షితునిగాఁ జేయుట కెట్టి ప్రయత్నములు జరిగి యున్నవో నే నెఱుగను. అతని భార్య బిడ్డ యవస్థ ఏమిగా నున్నదో! వారి నెచట నుంచి యున్నాఁడో? నే నీదినము నదీ తీరమునం దొకశిశువును జూచితిని. దానిం గొనిపోయి నా చెల్లెలి చెంతఁ జేర్చి వచ్చినాఁడను. ఆ శిశుసమీపంబున నొకసుందరమైన యువతి చచ్చిపడియుండెను. ఆమెయే మహేంద్రుని భార్యగా నుండుననియు తలఁచితిని.

సత్యానంద—— వారే మహేంద్రుని పెండ్లమునుబిడ్డయును ​భవానందుఁ డాశ్చర్యానందపరవశుఁడై, ‘తాను ఔషధము నిచ్చి బ్రతికించిన స్త్రీ రత్నము మహేంద్రుని భార్యయైన కల్యాణియే’ యని నిశ్చయించెను. అయినను, ఆ సమయంబున నేమాటయుఁ జెప్పుట కవసరము లేదని మిన్న కుండెను.

జీవానంద —— మహేంద్రుని భార్య యెట్లు చచ్చెను?

సత్యానంద —— విషమును మ్రింగి చచ్చెను.

జీవానంద —— విషము నేల మ్రింగెను?

సత్యానంద —— భగవంతుఁ డామెస్వప్నంబున ప్రాణ త్యాగంబుఁ జేయుమని యాజ్ఞ నొసంగెను.

భవానంద —— ఆ స్వప్నాదేశము సంతానుల కార్యోద్ధారముకొఱకేనా యేమి?

సత్యానంద —— మహేంద్రసింహుఁ డిట్లనియే చెప్పెను. ఇపుడు సాయంకాలమైనది; నేను సాయంకృత్యములను దీర్చికొని వచ్చి నూతన సంతానులకు దీక్ష నొసంగెదను.

భవానంద —— సంతాను లెందఱు? మహేంద్రసింహుఁడుగాక మఱెవ్వరైనను తమ నిజశిష్యులుగా వచ్చియున్నారా?

సత్యానంద —— ఔను; మఱియొక క్రొత్తవాఁడు వచ్చియున్నాఁడు. వానిని నేనెపుడును జూచినది లేదు. నేఁడు వాఁడు వచ్చినాఁడు, వాడు స్వల్పవయస్సుగల యౌవనపురుషుఁడై యున్నాఁడు. వాని యాకారేంగితంబులను, మాటలను జూచి మిక్కిలి సంతోషము బొందినాఁడను వాఁడు బంగారుముద్దవలె నున్నాఁడు. వానిని సంతానుల కార్యమందు శిక్షితునిఁగాఁ జేయు భారము జీవానందునియందున్నది. ఏలనఁగా, జీవానందుఁడు జనుల ​చిత్తాకర్షణ చేయుటయందు దక్షుఁడు. నేను పోయెదను; ఇంకొక మాట యున్నది, దానిని మనసుంచి వినుఁడు.

అనఁగా, వారిర్వురును చేతులు జోడించుకొని ఆజ్ఞ పాలింపవలయు నని విన్నవించుకొనిరి.

సత్యానంద —— మీ రిరువురేమైన యపరాధమును జేసి యుండినను, లేక, నేవచ్చునంతలోఁ జేసినను, నేవచ్చువఱకును దానికి ప్రాయశ్చిత్తము జరుపవలదు. నే వచ్చినపిదప, ప్రాయశ్చిత్తము జరపఁ దగినది.

ఇట్లు చెప్పి సత్యానందుఁడు స్వస్థానంబునకుఁ జనెను. భవానందుఁడును జీవానందుఁడును పరస్పరము కన్ను లెగరవేసి తలలల్లాడించిరి.

భవానంద —— నీమీఁది మాటయే కదా?

జీవానఁద —— ఉండవచ్చును. చెల్లెలింటికి మహేంద్రుని బిడ్డను విడిచిరాఁ బోయి యుంటిని.

భవానంద —— దానియందు దోష మేమి? అదేమి నిషిద్ధము కాదు; బ్రాహ్మణిని జూచివచ్చితివా యేమి?

జీవానంద —— గురు దేవుఁడు దానినే మనస్సున నుంచుకొని చెప్పియుండవచ్చునని తోఁచుచున్నది.