ఆనందమఠము/ఇరువదినాలుగవ ప్రకరణము
ఇరువదినాలుగవ ప్రకరణము
మహేంద్రుఁడు శాంతిని దెలిసికొనుట
మహేంద్రుడు సత్యానందుని పదకమలంబుల కెఱఁగి, యనుజ్ఞఁ గైకొనియె. అతనితో నింకొక మనుష్యుఁడును దీక్షితుండై యుండెను. అతఁడును వచ్చి సత్యానందునికి మ్రొక్కెను, సత్యానందుఁ డాశీర్వదించి కృష్ణాజినము పైఁ గూర్చుండ నియమించెను. అనంతరము, యోగ క్షేమలాభములను గూర్చి ముచ్చటించుచుండి, ‘కుమారా! నీకు స్థిరమైన భక్తి కలదా?’ యని యడిగెను.
శిష్యుఁడు —— ఎట్లు చెప్పఁగలను? మన మెవనిని భక్తిగల వాఁడని నుడివెదమో యట్టివాఁడు శుద్ధ శుంఠయై యాత్మ ప్రతారణుఁ డై యుండును.
సత్యానందుఁడు సంతోషపడి, ‘చక్కఁగా నుడివితివి; భక్తి నెట్లతిక్రమింపవలయునో యావిధమగు అనుష్ఠానము చేయుము. నీ ప్రయత్నము సఫలము కానిమ్మని దీవించెను. ఏలన వత్సా నీవింకను బాలుఁడవుగా నున్నావు. నిన్నే పేరున పిలుతును? దానిని గుఱించి నేనిదివఱకు ఆలోచించలేదు.’
నూతనసంతానుఁడు —— తమమనంబునం దేపేరు తోఁచెడినో యా పేరునఁ బిలువవచ్చును. నేను వైష్ణవుల దాసానుదాసుఁడను. సత్యానం —— నీయొక్క నవీనవయస్సును బట్టి నీకు నవీనానందుఁ డని పేరిడిన బాగని తోఁచుచున్నది. కావున నీవానామంబును పరిగ్రహింపుము, అయిన నీ మొదటి పేరేమి? చెప్పుట కేమి యభ్యంతర ముండినను జెప్పవలయును. నాకుఁ జెప్పినయెడల వేఱెవ్వరి చెవిని సోఁకదని నమ్ముము. సంతానుల మర్మమేమనఁగా, ఏదైనను సరియే, ఏవిషయమైనను సరియే, అది వాచ్యమైయుండినను సరియే, గురువునకుఁ జెప్పవలయును. చెప్పినందునఁ నష్టమేమియు నుండదు.
శిష్యుఁడు —— నా మొదటి పేరు శాంతిరామదేవశర్మ.
సత్యానంద —— నీ పేరు శాంతిమణి పాపివి కాదా?
అని చెప్పి, సత్యానందుఁడు వ్రేలాడుచుండిన గడ్డమును పట్టి యీడ్వగా నది యూడి వచ్చెను. పిదప, సత్యానందుఁడు ‘తల్లీ! నాయెడ వంచన చేయ నగునా? ఈయల్ప వయస్సుననే వంచన నేర్చినచో నింకేమి? మీసమును గడ్డముంచుకొనిన నేమి? నీకంఠ స్వరము, కనుచూపులు, ఈ ముసలివానిముందు మఱుగుపఱుప నగునా? నేను తెలివిమాలిన వాఁడనై యుండినచో నింతటి గొప్ప కార్యమునకుఁ బూనఁగలనా?’ యనెను.
శాంతి —— ముఖము మాడ్చుకొని రెండు కన్నులును మూసికొని యధోవదనయై యుండెను. వెంటనే కనులు తెఱిచి యావృద్ధునిపై విలోలకటాక్షమును నిగుడించి, ‘ప్రభూ! ఏమి దోషము నాచరించితిని. స్త్రీ బాహువులయం దెపుడును బలముండదా?’ యనెను.
సత్యానంద —— గోష్పదంబున నీరున్న యట్లే. శాంతి —— సంతానుల బాహుబలంబును తామెపుడైనను పరీక్ష చేసి యున్నారా?
బ్రహ్మచారి —— పరీక్షించి యున్నాను.
ఇట్లని చెప్పి సత్యానందుఁ డొక యుక్కు ధనుస్సును, నొక యినుపతంతిని దెచ్చియిచ్చి, “యెవఁ డీధనుస్సున నీతంతిని గట్టి, వింటిని వంచి, టంకారము చేయునో, వాఁడే సంతానుఁ”డనెను.
శాంతి —— వింటిని తంతిని చేతఁ దీసికొని చక్కఁగాఁ జూచి సంతానులంద ఱీపరీక్షయందు ఉత్తీర్ణులైనారా? యనియెను.
సత్యానంద —— లేదు. దీనిచే వారి బల మెంతటి దనునది నిశ్చయించుకొని యున్నాను.
శాంతి —— అట్లయిన నెంద ఱీపరీక్షలో ఉత్తీర్ణులైన వారు.
సత్యానంద —— ఇరువురు మాత్రము.
శాంతి —— ఎవరెవరని యడుగవచ్చునా?
సత్యానంద —— చెప్పుటయందు నిషేధ మేమియు లేదు. నేనొకండను
శాంతి —— రెండవవా రెవరు?
సత్యానంద —— జీవానందుఁడు.
శాంతి —— వింటిని తంతిని దీసికొని కొంచెమైనను శ్రమ లేక విల్లు వంచి, నిమిషమాత్రంబునఁ బూన్చి సత్యానందుని పాదముల సమీపమున పాఱవైచెను.
సత్యానందుఁ డాశ్చర్యభయంబు లొంది స్తంభితుఁ డాయెను. కొన్ని నిమిషముల ‘కిదేమి? నీవు దేవివా? లేక మానవస్త్రీవా?’ యని యడిగెను. శాంతి —— చేతులు జోడించికొని, నేను సామాన్యురాలగు మనుష్య స్త్రీని. అయినను, నేను బ్రహ్మచారిణిని యనెను.
సత్యానంద —— అయిన నేమి? నీవు బాలవితంతువా? అట్లయినను ఇంత బల మెక్కడిది? అది యేకాహారికదా?
శాంతి —— నేను సధవను.
సత్యానంద —— నీస్వామి నిరుద్దిష్టుఁ డా? ఎవరు, చెప్ప వచ్చునా?
శాంతి —— ఉద్దిష్టుఁడే; అతనికొఱకే వచ్చితిని.
ఉన్నట్లుండి మేఘమును భేదించుకొని వెడలి వచ్చిన యెండవలె, సత్యానందుని స్మృతి ప్రకాశమాన మయ్యెను. వెంటనే జీవానందుని భార్య పేరు శాంతి యని తెలిసికొని, ‘నీవు జీవానందుని బ్రాహ్మణి వేనా?’ యనెను.
ఈ తేప జటాభారముచే నవీనానందుని ముఖము మఱుఁగు చేయఁబడియెను. కొన్ని యేనుంగుల తొండములు రాజీవములపైఁ బడియున్నవియో యనునట్లగపడియెను.
సత్యానందుఁడు —— ‘ఏల నీవీపాపాచరణము నాచరించుటకై వచ్చితిని?’ అని యడిగెను.
శాంతి —— వెంటనే జటాభారమును వీపుపై వేసికొని, ముఖమెత్తి, ‘ప్రభూ! పాపాచరణ మేమున్నది? పత్ని పతి ననుసరించుట పాపాచరణమా? సంతానుల ధర్మశాస్త్రమునందు దీనిని పాపాచరణ మని చెప్పియుండినయెడల, సంతానుల ధర్మము అధర్మమైనయదే. నేను నాస్వామియొక్క సహధర్మిణిని. వారు ధర్మాచరణమందు ప్రవృత్తులై యున్నారు. నేను వారి తోఁగూడ ధర్మాచరణ మాచరించుటకై వచ్చి యున్నాను’ అనెను.
శాంతి యొక్క గంభీరవాణిని విని, యామె యున్నత గ్రీవమును, స్ఫీతవక్షఃస్థలమును, కంపితాధరమును, అశ్రుప్లుత నేత్రములను గాంచి సత్యానందుఁడు అమితానందంబును బొంది శాంతినిఁజూచి, “నీవు సాధ్వివి. అయినను, తల్లీ! పత్ని కేవలము గృహధర్మమున సహధర్మిణిగాని, వీరధర్మమున రమణి లేదుగదా?’
శాంతి —— ఏమహావీరుఁడు అపత్నీ కుఁడై వీరుఁడై యుండెను? రాముఁడు సీత లేకుండిన వీరుఁ డగుచుండెనా? అర్జునునకెందఱో భార్య లుండిరి. భీమున కెంతబలమో యందఱు పత్ను లుండిరఁట! ఎంతయని చెప్పుదును? తమకుఁ దెలియని దేమున్నది?
సత్యానంద —— నీవు చెప్పునది నిజము; అయినను, రణరంగమున నేవీరుఁడు భార్యాసహితుఁడై యుండెను?
శాంతి —— అర్జునుఁడు యాదవసైన్యముతో నంతరిక్షమునఁ బోరునపు డాతని రథమును నడపినవారెవరు? ద్రౌపది సమీపమున లేకుండిన, పాండవులు కురుక్షేత్రమునందు యుద్ధము చేయుదురా?
సత్యానంద —— వారట్టుండవచ్చును. సామాన్యులగు మనుజుల మనస్సు స్త్రీలయం దాసక్తమై కార్యభంగమగుచున్నది. ఆ హేతువు చేత సంతానుల వ్రతమందు స్త్రీలతోడ నేకాసనంబునం గూర్చుండరా దనుపద్ధతి యొకటి యేర్పడి
. యున్నది. జీవానందుఁడు నా కుడిభుజమై యున్నాఁడు. నీవు నాకుడిభుజమును విఱుచుటకై వచ్చితివి.
శాంతి —— నేను తమకుడిభుజము బలమును ఎక్కువ చేయుటకై వచ్చియున్నాను. నేను బ్రహ్మచారిణిని. విభునితో బ్రహ్మచారిణిగనే యుండెద. నేను కేవల ధర్మాచరణము కొఱకే వచ్చినదానను. స్వామి సందర్శనంబునకుఁ గాదు. విరహయంత్రమునకు నేను లోఁబడినదానను గాను. స్వామి ధర్మచ్యుతికి రక్షకురాలను. వాన లేక గొప్పవృక్షము లెండి పోవును. నేను మహామహీరుహతలము నందు వర్షింపఁ జేయుదు. తాము నిశ్చింతతో నుండుఁడు.
సత్యానంద —— అదేమి; మహామహీరుహంబునకు అనావృష్టి భయము కలదా? జీవానందునికి ధర్మచ్యుతియా?
శాంతి —— అయినదానిని కానీక చేయఁగలవా?
సత్యానంద —— ఏమై యున్నది? జీవానందునికి ధర్మచ్యుతి కల్గినదా? హిమాలయములోని కోనలో మునిఁగిపోయెనా?
శాంతి —— నిన్న మధ్యాహ్నంబున వారు వచ్చి చూచిరి; వ్రతభంగమై పోయెను.
దీనిని విని, పలితకేశి యగు బ్రహ్మచారి రెండు చేతులతో కనులు మూసికొని యేడ్చెను. సత్యానందు డేడ్చుటను నింతకుమున్నెవరును జూచి యుండ లేదు.
శాంతి —— ప్రభూ! మీకన్నుల నీరు రాఁదగునా?
సత్యానంద —— ప్రాయశ్చిత్త మేమి తెలియునా?
శాంతి —— తెలియును. ఆత్మహత్యయే. సత్యానంద —— అందులకై యేడ్చెదను; జీవానంద శోకంబునకై యేడ్చెదను.
శాంతి —— నేనును దానికొఱకే వచ్చి యున్నాను. జీవానందుని ప్రాణము పోకుండునట్లు చూచుకొని యుండుటకే వచ్చి యున్నాను.
సత్యానంద —— బాలా! నీ యభీష్టము సిద్ధించుగాక. నీ యపరాధముల నన్నిటిని మన్నించితిని. నీవు సంతానుల యందు పరిగణితురాలవై యుందువు. నీ మర్మము నెఱుంగ నందున నిన్నుఁ దిరస్కరించితి, నా కేమి తెలియును? నేను వనచారి యగు బ్రహ్మచారినిగాని వేఱుకాదు. నేను స్త్రీల వలె నౌదునా? అదెట్లగుదును? జీవానందుఁడు నా ప్రాణాధిక ప్రియుఁడు. ఇప్పుడు చూచితివా! కుడి చేయి పడిపోయినచో దేవకార్యము నెఱవేఱదు, ఎన్ని దినములు సాధ్యమో యన్ని దినంబులవఱకును జీవానందుని పృథ్వియం దుంచుటకు బ్రయత్నింతును. నీవును కూడనుండి యీ బ్రహ్మచర్యంబును బాలింపుము. నీవు నా ప్రియశిష్య వైతివి. సంతానులని వినినచో నా కానందము. కావున సంతానుల కందఱకును "ఆనంద” యను నామ మిడఁ బడినది. ఇది “ఆనందమఠము" నీవు “ఆనంద” యను పేరును ధరింపుము. నీ పేరు “నవీనానంద” యని యుండనిమ్ము.
శాంతి —— నేను ఆనందమఠమున నుండవచ్చునా?
సత్యానంద —— ఇఁక నెచటికి పోదువు? ఈ రాత్రి యిచటనే యుండుము.
శాంతి —— తర్వాత? సత్యానంద —— తల్లీ! భవానివలె నీ లలాటమునందు అగ్ని ప్రజ్వలించుచున్నది. సంతానసంప్రదాయస్థుల నందఱను కాల్చి వేయుదువేమొ? అని చెప్పి, శాంతిని దీవించి యనుజ్ఞ నొసంగెను.
శాంతి మనంబున, ‘ఓరీ ముదుసలిగొడ్డా! నాముఖము నందా యగ్ని? నేను కాలినముఖము గలదాననా? నిన్నుఁ గన్న తల్లి కాలినముఖము గలది.’ అని యనుకొనెను.
వాస్తవముగా సత్యానందున కీ యభిప్రాయము లేదు. ఆమె నేత్రంబుల విద్యుత్కటాక్షమును గుఱించి యతఁ డట్లు చెప్పెను. అయినను, ఆముసలివాఁడు యువతికి వివరించి చెప్ప వచ్చునా?