Jump to content

ఆత్మవిచారము (పూర్వభాగము)/5వ అధ్యాయము

వికీసోర్స్ నుండి
​

ఐదవ అధ్యాయము


బీజం సంసృతి భూమిజస్యతు తమో దేహాత్మ ధీరంకురో ।
రాగః పల్లవ మమ్బుకర్మతు నపుః స్కంధో౽సవశ్శాఖికా ॥
అగ్రాణీంద్రియ సంహతిశ్చ విషయాః పుష్పాణి దుఃఖం ఫలం ।
నానాకర్మ సముద్భవం బహువిధం భోక్తాత్ర జీవః ఖగః ॥



ప్రవృత్తిమార్గము.


ఇదివరకును జీవాత్మగారు వివిధయోనులయందు జన్మించుచువచ్చి చివరకు మనుష్యశరీరమును ప్రవేశించిరని చెప్పబడెను.


ఇచ్చట ముఖ్యమైన యంశము నొక్కటిని చెప్పవలసి యున్నది. ఆత్మానాత్మవిషయమునుగురించి యిపుడే కొంత విచారించిన నిక ముందు తద్వివేచనమునుగురించి విచారించుట సులభము. ఆత్మయనగా జీవాత్మ. ఉపక్రమాధ్యాయమునందు వీరికి "క్రీడకుడు” అను పేరు నుపయోగించినాము. వీరికి సహాయముగా "క్రీడారంగము" అనునది యేర్పడినది. ఇది యనాత్మ. శ్రీమద్భగవద్గీత 13 వ అధ్యాయమునందు చెప్పిన క్షేత్రము అంతయు ననాత్మ. వేదాంతసంప్రదాయమునందు అనాత్మకు "బంధము" అని పేరు. అనాత్మబంధములు అనేకములున్నను ప్రకృతమందు ఈ అధ్యాయమునందు శరీరములయొక్కయు, వాని ​స్థితియొక్కయు, వాని యుపయోగములయొక్కయు వివరములను సంగ్రహముగా వ్రాయదలచియున్నాము. ఈ అధ్యాయమునందే అనాత్మబంధములలో నతి బలవంతమైన మనస్సుయొక్క స్వభావమునుగురించియు ఆ మనస్సును స్ఫుటీకరించి వికసింపచేసినప్పుడు అది యెంత విచిత్రకార్యములను చేయునో ఆ వివరమును సంగ్రహముగా వ్రాయనగును. ఇవంతయు ప్రవృత్తిమార్గము అను ముఖ్యాంశముగా నెరుగవలయును. ఒక్కొక యంశమునుగురించియు నొక్కొక గ్రంథమే వ్రాయవలసినంత విషయములున్నవి. అయినను అన్ని ముఖ్యాంశములనుగురించియు కొంతకొంత తెలిసికొనిన పిమ్మట ప్రతి అంశమునుగురించియు మరియు ననేకవిషయములనుగురించియు చదువవచ్చునని యుద్దేశించి ఈ యధ్యాయమందే కాక యిక రాబోవు అధ్యాయములయందు సహ అంశములనుగురించి సంగ్రహముగానే వ్రాయ నుద్దేశము.

దేహములు

ఇంతకుముందు తృతీయాధ్యాయమునందు (43 వ పుట యందు) జీవాత్మ పాంచభౌతిక లోకమునందు అనుభవసంపాద నార్థము ప్రవేశించినపుడు అనేక శరీరములను సంపాందించుకొనుటకు ప్రయత్నముచేసి ఏ యే తత్త్వము ఏ యే లోకమందు ప్రధానాంశమో ఆ యా లోకమునందు వ్యవహరించుటకుగా ఆ యా తత్త్వముయొక్క భూతసూక్ష్మమును సంపాదించికొనెను అని చెప్పబడెను. ఆకాశతత్త్వప్రధానమైన సత్యలోకమునందు వ్యవహారము జరుపుటకుగా ఆకాశతత్త్వపు ​సంపాదించికొనెను. వాయుతత్త్వప్రధానములైన జనలోకము, తపోలోకము అను లోకములయందు సంచారముచేసి వ్యవహారము జరుపుటకుగా వాయుతత్త్వభూతసూక్ష్మము నొక్కటిని సంపాదించికొనెను. తేజస్తత్త్వప్రధానములైన మహర్లోకస్వర్గలోకముల యందు వ్యవహారార్థము తేజస్తత్త్వభూతసూక్ష్మమును సంపాదించికొనెను. అప్తత్త్వప్రధానమైన భువర్లోకవ్యవహారార్థము అప్తత్త్వపుభూతసూక్ష్మమునొకటిని సంపాదించికొనెను. అదే విధముగా భూలోకమందు సంచరించి అనుభవసంపాదనమునకుగా స్థూలశరీరము సంపాదించుకొనుటకై పృథీవీతత్త్వపుభూతసూక్ష్మమును ఒకటిని సంపాదించికొనెను.

ఈ చెప్పిన భూతసూక్ష్మములే దేహబీజము లను నపర నామధేయముతో 44 వ పుటయందు వ్యవహరింపబడెను. కలకండను చేయువారు విధానప్రకారము చక్కెరను పాగుగ కాచి ఆ పాగులో కొన్ని దారములను వ్రేలవిడుతురు. ఆ పాగు చల్లారుచు రాగా చక్కెర అణువులు ఒక దారమువెంబడి గుమిగూడి ఆ దారమును ఆధారముచేసికొని ఒక పెద్ద గడ్డవలె ఏర్పడును. కొన్ని సమయములయందు కలకండపెళ్లలయందు దారములు కండ్లపడుచుండుట అనేకులకు తెలిసిన విషయమే. అదేవిధముగా దేహబీజము లను అణువులు ఏమిచేయుననగా క్రొత్తగా నొక శరీరము ఏర్పడవలసిన అవశ్యము కలిగినప్పుడు తన తత్త్వపు అణువులు తనంతటి మంచివానినే వెదకి తనచుట్టు చేర్చుకొనును. అపుడు ఒక శరీర మేర్పడును. ఏ శరీర మైనను అణువుల సమూహమే కదా. వివిధదేహబీజములను మొట్టమొదట సంపాదించి ​పాంచభౌతిక లోకసమూహమునందు ప్రవేశించుట కుద్యుక్తుడైన ప్రజ్ఞానాంశువునకు ఇచ్చిన దేవతలు ఎల్లపుడు ఆ ప్రజ్ఞానాంశువు యొక్క వివిధదేహములను కాపాడుటకొరకు సిద్ధముగానుందురు. వారియొక్క అనుగ్రహమువల్ల నొక దేహబీజము తనయొక్క గుణధారణలకు అనురూపములైన అణువులను తాను ఆకర్షించుచుండును. అణువులకు స్వాభావికముగా రెండు శక్తులు గలవు. అనువర్తనశక్తి వివర్తనశక్తి అని. అనువర్తనశక్తిచేత అణువులు ఒకటితో నొకటి కలిసి ద్వ్యణు త్ర్యణు త్రనరేణు అని అనేకవిధములగా నుపాధులు ఏర్పడును. దేహబీజములు అనువర్తనశక్తివల్ల ఆయాలోకమందు జీవాత్మకు కావలసిన శరీరములను సిద్ధపరిచియిచ్చును. ఈ పుస్తకము 25 వ పుట చివరను గోళములనుగురించి సూచించినపుడు పృథివీతత్త్వగోళములో ప్రవేశించి కొంతమించి అప్తత్త్వగోళమున్నదని చదివితిమి. అదేవిధముగా పృథ్వీతత్త్వప్రధానమైన భూర్లోకమందు వ్యవహారార్థము జీవాత్మ సంపాదించుకొనిన స్థూలశరీరములో ప్రవేశించి అన్నిదిక్కులయందును కొంతమించి అప్తత్త్వప్రధానమైన భువర్లోకమునందు ఉపయోగపడు శరీరము అగు కామమయశరీరము అనునది యున్నది.

"అప్తత్త్వగోళములో ప్రవేశించి కొంతమించి తేజస్తత్త్వగోళమున్న" దని 25 వ పుటలో వ్రాయబడియున్నది. అదేవిధమున కామమయశరీరములో ప్రవేశించి కొంతమించి అన్నిదిక్కులను వ్యాపించి మనోమయ శరీరమున్నది.

"తేజస్తత్త్వగోళములో ప్రవేశించి కొంతమించి వాయుతత్త్వగోళముండును" అని వ్రాసినప్రకారము మనోమయదేహ ​మందు ప్రవేశించి కొంత అన్నిదిక్కులయందును మించి వాయుతత్త్వప్రధానమైన లోకములయందు అనుభవసంపాదనకు కరణమగు బుద్ధిమయశరీరమున్నది. దివ్యజ్ఞానసమాజపు గ్రంథముల యందు వాయుతత్త్వప్రధానమైన లోకములకు "బుద్ధిక్ ప్ళేను” (Buddhic plane) అని పేరు. బుద్ధిక్ ప్ళేనునందు చరించు దేహమునకు "బుద్ధిక్ బాడి” (Buddhic Body) అని పేరు. ఇదే బుద్ధిమయశరీరము.

"వాయుతత్త్వగోళములో ప్రవేశించి కొంతమించి ఆకాశతత్త్వగోళమున్నది" అని 25 వ పుటలో నున్నది. ఈ గోళమునకు దివ్యజ్ఞానసమాజపు పుస్తకములలో "ఆత్మిక్ ప్ళేను” లేక "నిర్వాణిక్ ప్ళేను” అని పేరు. ఆ ప్రకారము "బుద్ధిక్ బాడి”లో ప్రవేశించి అన్నిదిక్కులలోను కొంత మించి ఆకాశతత్త్వప్రధానమైన "ఆత్మిక్ ప్ళేను” లేక "నిర్వాణిక్ ప్ళేను" అను సత్యలోక సంచారార్థముగా నేర్పడిన శరీరమున్నది. ఈ శరీరము కరచరణాద్యవయవములు కలిగి యుండదు. కనుక అంత ఉన్నతమైన దేహమునుగురించి వ్రాయునపుడు దేహ మను సంజ్ఞ సాధారణముగా నుపయోగించు సంప్రదాయము లేదు. ఈ ఆచారమును అనుసరించి "పరకోశము" అని మన గ్రంథములయందుపయోగించుచున్నారు. శ్రీమద్భాగవతము, చతుర్థస్కంధము, 23 వ అధ్యాయము, 11 వ శ్లోకమునందు "జీవకోశమ్" అని యుపయోగించియున్నారు. అయితే యోగవాసిష్ఠము, ఉత్పత్తి ప్రకరణము, లీలోపాఖ్యానమునందు "జ్ఞానదేహమ్” అని యుపయోగించియున్నది. దివ్యజ్ఞానసమాజపు గ్రంథములయందు ​"ఆరిక్ ఎగ్" (Auric Egg) అని యుపయోగించి యున్నారు. కనుక జీవాత్మకు పాంచభౌతిక ప్రపంచమునందుండు శరీరములు:

1. "ఆరిక్ ఎగ్” అను ఆకాశతత్త్వప్రధాన శరీరము. - Auric Egg

2. ఇందులోపల సంకుచితమై "బుద్ధిక్ బాడి" అను వాయుతత్త్వ ప్రధానమైన శరీరము. - Buddhic Body

3. ఈ రెండవ శరీరములో మరియంత సంకుచితమై రెండుతెగలగా భిన్నమై తేజస్తత్త్వప్రధానమై మనోమయ శరీరమున్నది. - 1. Higher Mental Body శుద్ధమానస శరీరము 2. Lower Mental Body అశుద్ధమానస శరీరము

4. ఈ మనోమయ శరీరమందు అంతకన్న చాలసంకుచితమై అప్తత్త్వప్రధానమైన కామమయ శరీర మున్నది. - Astral Body

5. ఈ కామమయశరీరమందు దానికన్న చాలచిన్నదై మనకు ఇంద్రియగోచరమైన స్థూలశరీరము పృథివీతత్త్వ ప్రధానమైయున్నది. - Physical Body

ఈ విషయమును వివరముగా మననము చేసి అవగాహన పరచుకోవలెను. బ్రహ్మాండము అను అధ్యాయము చదువబోవునపుడు ఈ అర్థములు అత్యావశ్యకము గానుండును. ​ఐదు తత్త్వములకును సంబంధించినవి ఐదు "ప్ళేనులు" అని దివ్యజ్ఞానసమాజపు వారుపయోగించిన

1. నిర్వాణిక్ ప్ళేను Nirvanic Plane
2. బుద్ధిక్ ప్ళేను Buddhic Plane
3. మెంటల్ ష్ళేను Mental Plane
4. ఆస్ట్రల్ ప్ళేను Astral Plane
5. ఫిజికల్ ప్ళేను Physical Plane

అను పంచతత్త్వముల ప్ళేనులు లేక లోకభాగములయందు జీవాత్మకు ఉపయోగించుటకుగా వారు ఐదు శరీరములను పైన వివరించిన ప్రకారము సంపాదించుకొనిరి. ఇవి అయిదుశరీరములు.

స్థూలశరీరము (ఫిజికల్ బాడి) నందు ప్రవేశించి కొంతదూరము అన్నిదిక్కులయందు వ్యాపించి కామమయశరీరము (ఆస్ట్రల్ బాడి) న్నది.

స్థూల-కామమయశరీరములు రెండింటియందును ప్రవేశించి కొంతదూరము వెలుపల అన్నిదిక్కులయందును వ్యాపించి ద్వివిధంబుగా భాగింపబడిన మనోమయశరీరమున్నది.

స్థూల-కామమయ-మనోమయశరీరములు మూటియందును ప్రవేశించి వెలుపల అన్నిదిక్కులయందును మించి బుద్ధిక్ బాడి యనునది యున్నది.

స్థూల-కామమయ-మనోమయ-బుద్ధిక్ బాడీలు నాలుగింటను ప్రవేశించి అన్నిదిక్కులయందును మించి "ఆరిక్ ఎగ్" అను "జీవకోశము" మున్నది. ​ఈ అంతటి మధ్యన జీవాత్మ జ్వలించుచు స్థూలశరీర మధ్య నుండు మాంసపిండమైన హృదయమును ఆశ్రయించి యుండును.


మనోమయః ప్రాణశరీరసేతా ప్రతిష్ఠితోన్నే హృదయం సన్నిథాయ ।

ముండకోపనిషత్తు


పైప్రస్తావించిన యోగవాసిష్ఠము, ఉత్పత్తిప్రకరణము, లీలోపాఖ్యానమును జాగ్రతగా చదివి మననముచేసినపుడు శరీరములు ఒకటిలోనొకటి ప్రవేశించి స్థూలమైనదానిని సూక్ష్మమైనది ఆవరించి యున్నదనియు కదళీవృక్షమువలె కప్పుపైన కప్పుండునట్టు శరీరములుండుననియు విశదమగును.


ఈ ఐదుశరీరముల పైకి ఆధ్యాత్మికసృష్టి యని యపరనామధేయమునం బరగు విజ్ఞానమయకోశప్రతిష్ఠ యగు పర్యంతమును చాలమట్టుకు స్థూలశరీరము మాత్రము రూపేర్పడినది. అంతకంటె సూక్ష్మములైన శరీరములలో కామమయశరీరము కొంతమట్టుకు మాత్రము ఏర్పడినది. కుమ్మరవాడు కుండలను నిర్మించుతరి కుండరూపమును మాత్రముచేసి ఆవమునందు పెట్టకమునుపు ఆ వస్తువునకు కుండయని పేరు ఇడవచ్చునుగాని ఆ కుండలో నీళ్లు నించుటకు సాధ్యము కాదు కదా. అదే విధముగా స్థూలశరీరము రూపుమాత్రమేర్పడినది. కర్మేంద్రియములైన వాక్కు పాణి పాదము పాయువు ఉపస్థ ఇట్టి ఇంద్రియములు ఏర్పడినవి. వాటిని నాగరికముతో నుపయోగించు యోగ్యత రాలేదు. జ్ఞానేంద్రియములైన శ్రోత్రము, చక్షుస్సు, స్పర్శనము, రససము, ఘ్రాణము అను నింద్రియములయొక్క యునికిపట్టులగు చెవులు కండ్లు, చర్మము, ​నాలుక, ముక్కు అను అవయవములున్నవి గాని వాని వాని కార్యములను లాభకరముగా జరిపించు శక్తి జీవాత్మకు రాలేదు. ఇదే విధముగా కామమయదేహమందు అతి ముతకలైన "భావములు" (Emotions) మాత్రము ఆ దేహముగుండా జీవాత్మను అందునుగాని నాగరికతజెందిన సూక్ష్మభావములను (refined emotions) తనగుండా జీవాత్మను అందించగలయోగ్యత ఆ కామమయశరీరమునకు రాలేదు. మనోమయశరీర మన్ననో మరి అంత అసమాధానకరముగా నుండును. ప్రాజ్ఞాత్మకును తైజసవైశ్వానరాత్మకును అభేద్యమైన సంబంధము కలిగి మానవజన్మము వచ్చినదిగాని మానవత్వము ఇదివరకును స్థిరపడలేదు. మానవత్వ మనగా "మన్యతే సర్వం అనేన ఇతి" - దేనివల్ల వ్యక్తప్రపంచమంతయు దత్కారణం బైన యవ్యక్తమును ఎరుగబడునో అది యని యర్థము. ఈ శక్తి మానవజన్మమునందు చాలవ్యవసాయము జరిగినపిమ్మటనేగాని సాధ్యముగాదు.

దేహములయందెల్లయు స్థూలాతిస్థూలమైన స్థూలశరీరమును ఆయుధముగా నుంచుకొని ప్రయత్నబాహుళ్యము జరిపినగాని కామమయ మనోమయ బుద్ధిమయాది శరీరములు సుష్ఠుపడవు. కనుక ఆదియందు స్థూలశరీరమును గురించి విచారించవలయును.

స్థూలశరీరము

జీవాత్మ యుపయోగించు శరీరములన్నింటిలోనును చిన్నదై, స్థూలమై, కొద్దికాలమే బ్రతికియుండునది స్థూలశరీరము. ఈ శరీరముగుండానే జీవాత్మ యనేక భోగములనును దుఃఖములనును ​అనుభవించగలడు. "భోగాయతనం ఇదం వపుః”. ఇంద్రియములవల్లనే జీవాత్మ బహి:ప్రపంచమును ఎరుగును. అట్టి యింద్రియగోళములు ఈ శరీరమందున్నవి. ఈ శరీరమునకు పుట్టుక, వయస్సు, ముసలితనము, మరణము మొదలగు అవస్థలు గలవు. "స్థూలస్య సంభవ జరా మరణాది దుఃఖాః" అని యున్నది.

ఇట్టి శరీరముయొక్క పుట్టుకయొక్క సందర్భములను విచారింతము. ఈ విచారమందు మొదటి అంశము కర్మ. కర్మయనగా జీవాత్మ మనస్సుతోచేసిన కార్యములయొక్క ఫలము. ఈ విషయమును విపులముగా ముందు వ్రాయనగును. జీవాత్మ జన్మమునకు వచ్చుటకుముందు వారియొక్క పుణ్యపాపఫలములలో రాబోవు జన్మమందు అనుభవించుటకు అనుకూలమైనంత భాగమును వేరు దీసి కర్మవివరణదేవతలు ఆ భాగమును ఒకచిన్న దేవతచేతికి ఇత్తురు. వీడదీసిన భాగమునకు ప్రారబ్ధకర్మ యని పేరు. ఈ చర్య మహర్లోకమందు నిర్ధారింపబడును. అపుడు జీవాత్మ తనయొక్క శుద్ధమనోమయశరీరమం దుండును. తన ప్రారబ్ధకర్మయని నిర్ధారింపబడిన ఫర్వానాను చేతబూనిన చిన్న దేవతవెంబడి జీవాత్మ క్రిందిలోకములకు దిగును. స్వర్గలోకమునందు ప్రవేశించి తన (అశుద్ధ) మనోమయదేహబీజమందలి శక్తులను వెలిపరచుటకు ఎంతటి శక్తిమంతమైన (అశుద్ధ) మనోమయశరీరము అవశ్యమో అట్టి మనోమయశరీరమును సంపాదించుకొనును. పిమ్మట తనకు అప్పటివరకు నుండు శుద్ధమనోమయశరీరము, అశుద్ధమనోమయశరీరము ఈ రెండు శరీరములతో సహ "ఆస్ట్రల్ ప్ళేను" అను భువర్లోకమునకు దిగును. అచ్చట తన కామమయశరీరపు దేహ ​బీజమందు ఇమిడియుండు శుద్ధశక్తులు, అశుద్ధశక్తులు ఇవన్నిటిని వ్యక్తీకరించగల కామమయశరీరమును సంపాదించుకొనును. అనంతరము ఆ చిన్న దేవతవెంబడి భూర్లోకమునకు వచ్చును. ఆ దేవత భూర్లోకమందు ఒక విచిత్రమైన పనిచేయును. అనగా తన స్వాధీనమందుండు జీవాత్మ అనుభవించవలసిన ప్రారబ్ధకర్మను అనుభవించుటకు ఎట్టి అంగములుండవలెనో అవన్నియు బాగుగ చింతించి భూలోకపు సూక్ష్మఅణువులతో నొక ఛాయాశరీరమును కట్టును. గుడ్డితనమును అనుభవించవలసినదిగా ప్రారబ్ధకర్మయందుండినయెడల ఛాయాశరీరమందు కన్నులను విడిచిపెట్టును. ఆజానుబాహువై ఉన్నత పురుషుడుగానుండవలెనని ప్రారబ్ధ కర్మ యందుంటే ఆ విధముగా ఛాయాశరీరమును కట్టును. సంగీతశాస్త్రము అభ్యసించి గాయకుడుగా నుండవలసినదిగా ప్రారబ్ధకర్మ యందుండినయెడల మంచిశారీరమును ఇయ్యగల అణువులతో కుత్తుకను గట్టును. అజీర్ణరోగముల ననుభవించవలసిన ప్రాప్తి యుండినయెడల బలహీనమైన యణువులతో జీర్ణకోశమును గట్టును. ఈ విధముగా ప్రారబ్ధకర్మానుభవమునకు కావలసిన పరికరములనన్నిటినిని ఆ ఛాయాశరీరమందు ఇమిడ్చియుంచి రాబోవుజన్మమునందు జీవాత్మకు ఏ స్త్రీ తల్లిగానుండవలెనో ఆ స్త్రీనిని ఏ పురుషుడు తండ్రిగానుండ వలసినదిగా ప్రారబ్ధకర్మయందున్నదో అట్టి పురుషునిని యొకస్థలమునందు చేరునట్టు చేసి ఆ స్త్రీకి గర్భధారణయగునట్టు చేయును. ప్రారబ్ధ కర్మయను ఫర్వానాను చేతనుంచుకొనియుండు చిన్న దేవత చేయు యుక్తులు అనేకములు. ఇక ముందు తనతండ్రి ​యెవడో చెప్పుటకు తెలియక అవమాన పడవలసినదిగా ప్రారబ్ధకర్మయందుండిన యెడల జన్మమునకు రాబోవు జీవాత్మకు న్యాయముగా వివాహితులైన తలితండ్రులుండరు. వ్యభిచారమందు జన్మించును. ఇట్టి వేలకొలది గల యుపాయములనన్నిటిని చిన్న దేవత యుపయోగించి తల్లియొక్క గర్భకోశమందు క్రొత్తఛాయాశరీరమునుంచి జీవాత్మకును ఆ శరీరమునకును ఒక విధమైన అభిమానరూపకమైన సంబంధము నేర్పరిచి ఆ స్త్రీ సమీపముననే జీవాత్మతోసహ తాను (ఆ చిన్న దేవత) ఉండును. ఈ విధముగ జీవాత్మ జన్మించవలసిన దేశము, కాలము, జాతి, తెగ, దంపతులు, అన్నలు, అక్కలు మొదలగు సమూహములనును చిన్న దేవత నిర్ధారించి సంపాదించియిచ్చును.

గర్భముధరించిన నాలుగవమాసమువరకు జీవాత్మ తనకు తల్లిగాకాబోవుస్త్రీయొక్క సమీపమందుండి స్థూలశరీరదేహబీజమును నాలుగవనెలలో గర్భస్థపిండమునకు సంబంధపరుచును. అది మొదలు ఆ పిండము కదులుటకారంభించును. జీవాత్మ స్వాధీనమందుండు దేహబీజసూత్రముగుండా తనయొక్క శక్తిని ఆపిండమును ప్రవేశింప జేయుచుండును. దేహబీజసూత్రము అనగా 45 వ పుటలో ప్రస్తావించియుండు అయిదు శరీరములయొక్కయు "ఖాయమైన అణువు" (44 వ పుట చూడుడు) లను చేర్చిపట్టియుండు దారమువంటి సూత్రము. దీనిని కొందరు సూత్రాత్మ యనియును అందురు. వేదాంతములలో నుపయోగించు సూత్రాత్మ కాదు.

గర్భస్థఛాయాశరీరమునందు అతిజాగ్రతతో అణువువెంబడి అణువుగా దేవతలు స్థూలశరీరమును కట్టుచుందురు. (ఈ విషయ ​మై "సంస్కారములు" అను అంశమును చూడుడు.) ఈరాబోవు శరీరము పరంపరావేష్టమైనది. పరంపర యనగా నింగ్లీషుభాషయందు (Heredity) అని యర్థము. పరంపర యనగా తలిదండ్రులకు కల రోగములు, స్థూలశరీరవాసనలు మొదలగునవి. జీవాత్మయొక్క దేహవాసనలే కాక తలిదండ్రులయొక్క దేహవాసనలుకూడ నీ శిశువుయొక్క శరీరమందు వ్యక్తమగుచుండును. మేఘజాడ్యపుశరీరముల సంయోగమువల్ల శిశువు పుట్టితే శిశువునకు కూడ నా జాడ్యము కలుగునట్టి అణువులవల్ల శిశువుయొక్క శరీరము కట్టబడును. మరియు పిండము గర్భమునందుండు కాలమందు తల్లికి గలుగు సంతోషము, శాంతము, దుఃఖము, కోపము మొదలగు గుణములకు అనుగుణములైన అణువులు ఆ శిశువుయొక్క శరీరమందు ప్రవేశించును. అదే విధముగా తండ్రియొక్కయు మరియు నితర సమీపబంధువులయొక్కయు శాంత కోపావేశములచే శిశువుయొక్క శరీరమును కట్టుచున్న దేవతలయొక్క పని మారుచుండును. కనుకనే మనశాస్త్రములయందు గర్భాధానము మొదలు జాతకర్మవరకును గర్భిణీస్త్రీని అతి జాగరూకతతో కాపాడుచుండవలెనని అనేక సంస్కారము లేర్పడినవి.

పిండము గర్భమునందుండు నపుడే ఇక ముందు జీవాత్మ ఉపయోగించుటకుగా భువర్లోకములో తాను సంపాదించుకొనిన కామమయశరీరమునకును పిండమునకును సంబంధ మేర్పడి మరికొన్ని దినములకు ఇకముందుపయోగించుటకుగా సిద్ధముగానుండు "అశుద్ధమనోమయశరీరము” నకును గర్భస్థపిండమునకును సంబంధమేర్పడును. ఈ విధముగా నేడుమాసములు ముగియునంత ​వరకును జీవాత్మ తన కొత్తదేహములో ప్రవేశించకనే శరీరముయొక్క కట్టుటను మాత్రము చాల అక్కరతో కనిపెట్టియుండును. ఏడవనెల ముగియు సమయమందు జీవాత్మ శిశువుయొక్క శరీరమునందు ప్రవేశించును.

జీవాత్మయొక్క స్పందశక్తి అతివేగమైనది. శిశువుయొక్క ఏడునెలల గర్భవయస్సుగల శరీరము అతికోమలమైనది. అత్యుగ్రమగు జీవాత్మస్పందఆందోళనమునకు సహించుటకు శక్తిలేక క్వచిత్తుగా ఏడవనెలలోనే శిశువు మాతృగర్భము వదలి నేల పడుటయు కలదు.

ఛాందోగ్యోపనిషత్తునందు పంచాగ్ని విద్య యని యొక భాగమున్నది. అందు జీవాత్మ తనయొక్క శుద్ధమానసశరీరము (శుద్ధమనోమయశరీరము) నందుండి మరల భూలోకమందు జన్మించుటకు సిద్ధమైనపుడు ప్రారబ్ధకర్మనిర్ధారము కాగానే మహర్లోకమునుండి (ద్యులోకము) స్వర్గలోకమునకు అతనిని దేవతలు తెత్తురనియు అది మొదటిహోమగుండమనియు; ద్యులోక హోమమువల్ల "సోమో రాజా సంభవతి" అని చంద్రలోకపు వాడు పుట్టుననియు (చంద్రలోకము అనగా భువర్లోకము. అక్కడ పుట్టునది కామమయశరీరము) ; చంద్రలోకము రెండవ హోమగుండమనియు; ఆ హోమమువల్ల పర్జన్యు డను వర్షము పుట్టుననియు; ఆ వర్షమును పృథివీలోకము అను మూడవ హోమగుండమునందు హోమము చేసిరనియు; అందువలన అన్నము పుట్టెననియు ; నాలుగవ హోమగుండమందు దేవతలు హోమముచేసిరనియు; అందువలన రేతస్సు పుట్టెననియు ; అయిదవహోమ ​గుండము స్త్రీశరీరమనియు ; ఆ హోమగుండమునందు రేతస్సును ఆహుతిగా, వేసి దేవతలు హోమముచేసిరనియు ; అందువలన గర్భము కలిగినదనియు చెప్పియున్నది. ఈ భాగమును జాగ్రతగా చదువవలెను. అందువలన భూతసూక్ష్మములగుండా అశుద్ధమనోమయశరీరము (Lower Mental Body), కామమయశరీరము (Astral Body), స్థూలశరీరము (Physical Body) అనునవి జీవాత్మకులభించిన వివర మవగాహన యగును.

సారంగధరసంహిత మొదలగు వైద్యగ్రంథములను పఠించితే గర్భిణీస్త్రీకి ఎట్టి ఆహారము ఇయ్యవలెననియు, శిశువునకు ఎట్టి ఆహారమియ్యవలెననియును విశదముగా తెలియును. శిశువు భూలోకమునందు జన్మించిన పిమ్మట సాధారణముగా ఏడు సంవత్సరముల వరకును జీవాత్మ శీశుశరీరమునందు సుష్ఠుగా ప్రవేశించుట లేదు. గనుకనే శిశుశరీరము చేయు కార్యములకు జీవాత్మకు పూచి లేదు. ధర్మశాస్త్రములును ఇప్పటి చట్టదిట్టములు కూడ శిశువులు ఏడేండ్లునిండునంతకు ముందు చేయు తప్పులను గణింపవు. జీవాత్మ శరీరమందు ప్రవేశించిన వెనుక ఉపనయన మను సంస్కారము జరుగును. ఆ సందర్భము ద్విజాతుల శిశువుల రెండవజన్మము అని శాస్త్రములు చెప్పుచున్నవి. శిశువుకు సప్తమవర్షము వరకును జీవాత్మ చాలమట్టుకు "ఆస్ట్రల్ ప్ళేను" అను భువర్లోకమునందు వ్యవహరించుచు సకృత్తుగా శిశుశరీరమందు ప్రవేశించి తనయునికిని గాన్పించుచుండును. చిన్నబిడ్డలకు భువర్లోకపు చూపులు కనబడుట కలదు. భువర్లోకవాసులగు తన స్నేహితులను శిశుశరీరధారియైన జీవాత్మ చూచుచు, సంతోషవ్యాపార ​ములను శిశుశరీరమున కలుగు నవ్వులవలనను దుఃఖభయభావముల వలనును నిష్కారణఏడ్పువల్లనును కనుపరుచుచుండును. యక్షులు, గంధర్వులు మొదలగు చిల్లర దేవతలు శిశువు లున్నచోట వచ్చి యుండి వారలకు సంతోషము కలుగునట్లు పాటలు పాడుచు ఆటలాడుచుందురు.

శిశువుయొక్క శరీరము ముదురుచు రాగా జీవాత్మ కొంచెము కొంచెముగా ఆ శరీరమునందు తాను ముందరికన్న నధికకాలము వసించుచుండును. చిన్నబిడ్డలకు ఒక విధమైన దివ్యదృష్టి స్వాభావికముగా నుండును. శిశువుయొక్క మెదడు ముదురుచురాగా జీవాత్మ తన అశుద్ధమనోమయశరీరము (Lower Mental Body) ను శిశువుశరీరముతో జతపరుచును. చిన్నబిడ్డలు పెరుగుకాలమందు తలిదండ్రులు వారలను భయపరచకూడదు. బుద్ధిహీనులైన తలిదండ్రులు బిడ్డలు తులుపితనము చేయుచున్నారు, వార్లను పట్టుట కష్టము అని బిడ్డలకు నల్లమందు ఇచ్చి నిద్రపోగొట్టుదురు. తమ సుఖానుభవములకు బిడ్డలు అడ్డపడుచున్నార రని తలచి స్వార్థపరులైన తల్లులు బిడ్డల ఆరోగ్యమును నల్లమందు అను విషమునిచ్చి పాడుచేతురు. ఈ కాలమందు ఎట్టి మహాపురుషులు భూమియందు జన్మించుచున్నారో అనేకులకు తెలియదు. శ్రీ జగద్గురువులవారి యవతారకాలము అతిసమీపముననున్నది. ఆ మహాపురుషులు అవతరించుటకు ముందే అనేకమంది తపోధనులుగానుండినవారు జన్మమును గోరి జన్మించి శిశుత్వ బాల్యము లను అవస్థలను దాటి శ్రీవారియవతారకాలమునకు లోకసేవాధురీణులై యుండవలెనని అనేకులు పక్వజీవులు జన్మించుచున్నారు. కనుక తల్లులు ​తండ్రులు బడియందుపాధ్యాయులు మొదలగు వారు తమకంటె నున్నత దశయందుండు మహాపురుషులు బాలశరీరములం దుందురని యెరిగి వారిని అతి జాగరూకతతో పెంచి చదివించి లోకసేవార్ధము సిద్ధపరిచి ధన్యులుగావలెను.

స్థూలశరీరమునకు ఆహారము ముఖ్యము. "ఆహారశుద్ధౌ సత్త్వశుద్ధిః" అని శ్రీరామానుజాచార్యులవారు బోధించియున్నారు. ధర్మశాస్త్రములలోనును బాలురకును బ్రహ్మచారులకును ఉప్పుకారము లధికముగానుండు ఆహారములను ఇయ్యకూడదు అని విధించియున్నది. "న పలాండుం భక్షయేత్" అని యొక ధర్మశాస్త్రవాక్యమున్నది. మనము భోజనము చేయు పదార్థములు సాత్త్వికములనియు రాజసములనియు తామసములనియు భాగింపబడియున్నవి. శరీర మారోగ్యవంతమై దృఢముగా నుండవలెను. పరిశుద్ధములగు ఆహారమును వ్యాయామమును (Physical Excerise) మంచి గాలియును ముఖ్యములు. సత్త్వగుణ మభివృద్ధికావలెననుట జీవాత్మయొక్క క్షేమకారణము. రాజసతామసగుణములు మృగశరీరములలోనే స్థిరముగ నేర్పడినవి. మనము భుజియించు నాహారములయందు సాత్వికస్వభావపు అణువులు అధికముగానున్న యెడల శరీరముపరిశుద్ధముగా పెరిగి సత్త్వగుణమధికమగును. స్నానము ప్రతినిత్యమును చేయవలయును. లేకున్న స్థూలశరీరమందు రోమకూపములు మురికివల్ల మూతపడిపోవును. శరీరమందుండు విషములు రోమకూపములగుండా స్వేదరూపముగా బయట పడవలెను. కనుక రోమకూపములు బాగుగ పనిచేయు నటులుండుటకు స్నానమావశ్యకము. మద్యపానము, ​మాంసభోజనము, పలాండుభక్షణము, (మద్యము=సారాయి ఫలాండు=ఉల్లిగడ్డ) ఇట్టి వస్తువులను శరీరమునకు ఇచ్చినట్టైతే శరీరముయొక్క పారిశుద్ధ్యము తగ్గిపోవును. జీవాత్మకు అనుకూలమైనవి కావు.

ఈవరకు 111 వ పుటయందు ఛాయాశరీరము అని ప్రస్తావించియుంటిమి. ఇది చేయుపని యేమనియును ఇది ఏ విధముగా నేర్పడుననియు విచారించవలెను. 106 వ పుటయందు మనము చదివిన, 'ప్ళేను' లన్నింటియందును ఏడేసి భాగములు గలవు. అవి అనగా 1. స్థూలమందు పృథివీ తత్త్వస్థితి, 2. స్థూలమందు అప్తత్త్వ స్థితి, 3. స్థూలమందు తేజస్తత్త్వస్థితి, 4. స్థూలమందు వాయుతత్త్వ స్థితి, 5. స్థూలమందు ఆకాశతత్త్వ స్థితి, 6. స్థూలమందు ఆకాశతత్త్వముకంటె సూక్ష్మమైన (అహంకార తత్త్వమునకు ఈడైన) యొక తత్త్వపు స్థితి, 7. స్థూలమందు ఆరవతత్త్వముగా చెప్పినందుకన్న నతి సూక్ష్మమైన (బుద్ధి) తత్త్వముయొక్క స్థితి, అని ఏడు విధములగా నొక్కొక ప్ళేనును విభజింపబడియుండును. శ్రీదక్షిణామూర్తిస్తవమందు "భూరంభాంస్యనలో నిలోంబరమహర్నాథో హిమాంశుః పుమాన్" అని పరమేశ్వరునియొక్క అష్టమూర్తిత్వమును వర్ణించియున్నది. ఇందు నుండి మన కుపయోగమైన అర్థమును స్వీకరించవచ్చును. ఇంతకుముందు 16 వ పుటయందు పంచీకరణమును ప్రస్తావించియుంటిమి. 42 వ పుటయందు పంచతత్త్వములను ఆయాతత్త్వ ప్రధానలోకములను వివరించితిమి. ఇపుడు మనము విచారించవలసినది ​

సప్తీకరణము

అని యొక ముఖ్యమైన సంగతి. పాంచభౌతిక ప్రపంచమునందు అయిదు ప్ళేనులు అని వర్ణించినందు మాత్రమున సప్తీకరణమును నిరాకరించినవారము కాము. 26 వ పుట యందు సత్యలోకమునకు పైన రెండు లోకములున్నవని చెప్పియున్నది. పాంచభౌతిక ప్రపంచపు అయిదుప్ళేనులకుపైన రెండు లోకములున్నవని 26 వ పుటయందు చెప్పబడిన రెండు లోకములును రెండుప్ళేనులు. పాంచభౌతికప్రపంచమందు అయిదు ప్ళేనులు, అంతకు పైన రెండు, ఇవంతయు కలిసి ఏడుప్ళేనులు.

వానిపేళ్లు; 1. ఆదిప్ళేను, 2. అనుపాదకప్ళేను, 3. నిర్వాణిక్ ప్ళేను, 4. బుద్ధిక్ ప్ళేను, 5. మానసిక్ ప్ళేను, 6. ఆస్ట్రల్ ప్ళేను, 7. ఫిజికల్ ప్ళేను, అని యేడుప్ళేనులు. నిహితాన్సప్త సప్త” అను వచనమును మరువకుడు. మరియు, ప్రతిప్ళేనులోనును మిగిలిన ఆరు ప్ళేనుల ప్రకృతికి సంబంధించిన భాగములున్నవి. అనగా ప్రతిప్ళేనులోనును ఏడు భాగములున్నవి. ఏడు ప్ళేనుల యొక్క అంతర్భాగములు ఒట్టుకు ఏడేళ్లు = నలువదితొమ్మిది. దీనికి సప్తీకరణమనిపేరు. ఇందునుగురించి మననము చేసి అవగాహనచేసికొనవలయును. లోకమంతయు నలువదితొమ్మిది భాగములుగా నేర్పడినది కదా. ఇందుకు సమీపార్థముగల పురాణకథ యొకటియున్నది. శ్రీమద్భాగవతము, షష్ఠస్కంధము 18 వ అధ్యాయమునందు మరుత్తుల జన్మకథానువర్ణన మున్నది. అందు కశ్యపఋషిభార్యయైన దితియొక్క గర్భమందుండిన పిండమును ఇంద్రుడు గర్భమును ప్రవేశించి ​


చకర్త సప్తధా గర్భం వజ్రేణ కనకప్రభం ।
రుదంతం సప్తధైకైకం మారోదీరితి తాన్ పునః ॥
(శ్రీమద్భా- 6 స్కం, 18 అధ్యా, 62 శ్లో.)


ఇంద్రు డాసవతితల్లియొక్క యుదరంబును యోగబలంబునం బ్రవేశించి “కాంచనప్రభావిశోభితంబైన గర్భమును (పిండమును) వజ్రాయుధమున నేడు ఖండములుగాఁ గోసి...... క్రమ్మఱ నా ఖండముల నొక్కొక దాని ప్రత్యేకం బేడేసి తునియలు గా దఱిగె” నని యర్ధము. ఇందువలన ఏడు తునక లొక్కొకటియు నేడేసి చిన్నతునకలు, అన్నియు గలిసి నలువదితొమ్మిది తునకలు. ఏడుప్ళేనులనును ప్రతిప్ళేనుయొక్క యంతర్భాగము లైన ఏడేసి సబుప్ళేనులనును (Sub-planes) గుణించితే నలువదితొమ్మిది సబుప్ళేను లైనవి. దీనికి సప్తీకరణము అని పేరు,


ఛాయాశరీరము


ఇది స్థూలశరీరముయొక్క భాగము. స్థూలప్ళేను (Physical Plane) లో ఘనీభూతములైన మూడు భాగములతో మనకు భోగాయతనమైన స్థూలశరీర మేర్పడినది. స్థూలప్ళేనులో సూక్ష్మభాగము లైన మిగిలిన నాలుగు భాగముల ప్రకృతివల్ల కట్టబడినది ఛాయాశరీరము. ఇందులో అంగాంగములు మన స్థూలశరీరము నందలి అంగాంగములవలెనే యుండును. ఛాయాశరీరము స్థూల శరీరములో దూరి యిమిడియుండును. సూర్యబింబమునుండి ప్రాణశక్తులు లోకముపైన నెడతెగక కురియుచుండును. ఆ శక్తులను అకర్షించు శక్తి ఛాయాశరీరమున కున్నది. స్థూలశరీరమునకు ​ఆహారమువల్ల కలుగు బలమునకు సమర్థతకలుగచేయునది సూర్యప్రకాశము. అట్టి సూర్యప్రకాశమునందుండు ప్రాణశక్తి నాకర్షించి ఛాయాశరీరము స్థూలశరీరమున కిచ్చును. ఘాతలుతగిలినవారికి ఆసుపత్త్రిలో శస్త్రవైద్యము చేయునప్పుడు మైకపదార్థములను వాసన చూపుదురు. ఆ ద్రావకశక్తివల్ల స్థూలశరీరమంతయు వ్యాపించి యుండు ఛాయాశరీరమును స్థూలశరీరమును విడిచి బయటికి పారదోలుదురు. పిమ్మట స్థూలశరీరమును కత్తులతో కోసినను మనకు నొప్పి ఎరుకకురాదు. ఛాయాశరీరమువల్లనే దేహబలము, నొప్పులు, మొదలగునవి స్థూలశరీరమునకు అనుభవసాధ్యములు.

స్థూలశరీరము మరణముచెందునపుడు ఛాయాశరీరము స్థూల శరీరమును విడిచి బయటికిపోవును. స్థూలశరీరముండునంతవరకును ఛాయాశరీరముండును. స్థూలశరీరమునకును ఛాయాశరీరమునకును నొక సూక్ష్మసూత్రసంబంధ మున్నది. ఆ సూత్రమును భేదించితే (తెంచితే) స్థూలశరీరమునకు వెంటనే మరణము కలుగును. గర్భస్థ శిశువునకును తల్లికిని సంబంధ మొక నాభినాళసూత్రమున్నది అని మనకందరికిని తెలిసిన విషయము. నాభినాళసూత్రముగుండా తల్లి దేహమందలి రక్తము శిశువుయొక్క శరీరమును ప్రవేశించును. శిశువు గర్భమునందుండు కాలమందు ఏకారణముచేతనైనను శిశువు వును తల్లిని కలిపియుంచిన నాళము తెగితే వెంటనే శిశుశరీరము మరణమును చెందును. అదే విధమున ఛాయాశరీరమునకును స్థూలశరీరమునకును సంబంధముగనుండు సూత్రమును ఎవరైనను తెంచితే స్థూలశరీరము వెంబడే మరణముచెందును. ఇట్టి కార్యము యోగమువల్ల సంపాదించిన శక్తిగలవారిచేతనే గాని యితరులచేత ​గాదు. స్థూలశరీరము మరణముచెందిన కొన్నిఘడియలవరకును జీవాత్మశక్తి ఛాయాశరీరమందుండును. తరువాత ఛాయాశరీరమును జీవాత్మ వదిలి కామమయశరీరమందు నిలుచును. ఛాయాశరీరము స్థూలశరీరము సమీపమందే నిలిచిపోవును. స్థూలశరీరము దహింపబడి స్థూలఅణువులు చెదిరిపోయినపుడు ఛాయాశరీరము నశించిపోవును. అటుగాక శవములను భూస్థాపన చేయు సంప్రదాయముగల జాతులలో స్థూలశరీరము కొంచెముగా కుళ్లి మురిగి నశించుచువచ్చును. స్థూలశరీరములో ఏ భాగము నశించునో - చేయో, కాలో-—ఆ భాగము ఛాయాశరీరమందు కూడ నశించును. స్థూలశరీరము భూమిలో దాగియున్నను ఆ స్థూలశరీరమునకు పైన ఆకాశమందు ఛాయాశరీరము కనబడుచుండును. కొందరు గోరీలు, సమాధు లుండు స్థలములలో ఈ ఛాయాశరీరమును చూచి భూతమో, పిశాచమో, చచ్చినవారు మనలను భయపరుచుటకుగా కనబడుచున్నారని వెఱచి భీతిచెందుదురు. కనుక శవములను దహించుసంప్రదాయయు అనేక కారణములనుపట్టి మంచిది.

ఛాయాశరీరము స్థూలశరీరమువలెనే రూపము కలిగియుండుటవలనను ఛాయాశరీరపు అణువులన్నియు పృధివీతత్త్వపు అణువులే గనుక నీ రెండుశరీరములును ఒకశరీరమనియే వ్యవహరింపబడును. స్థూలశరీరము చెందు అవస్థలన్నియు ఛాయాశరీరమునకు కూడ కలవు.

అణువులకు సామాన్యముగా నొక శక్తిగలదు. వానికి ఎక్కడనుండవలె నని తోచునో ఎక్కడ పోవలెనని తోచునో ఆ ​ప్రకారము పోవుశక్తిగలదు. మనదేహములయందు కొంతకాలముండును. మరికొంతకాలము ఇతరుల దేహములయందు పోయి చేరును. ఇతరుల దేహములయందుండు కాలమునందు వారల చేష్టలనుపట్టి మేలో కీడో గుణములను సంపాదించును. ఏదేహమందున్నను ఆ దేహస్వామియొక్క గుణములకు తుల్యములైన స్పందశక్తులు అణువులకు గలుగును. దేహస్వాముల విహార శయ్యాభోజనచింతనంబులంబట్టి ఆ యా గుణములు మంచివో చెడ్డవో అట్టి స్పందములు దేహమందలి యణువులకు కలుగును. స్థూలశరీరమునందలి అణువులయొక్క స్పందస్వభావములను పట్టి కామమయశరీరమును మనోమయశరీరము (అశుద్ధమనోమయ శరీరము)ను ప్రేరేపింపబడును. అట్లాగే కామమయ మనోమయశరీరంబుల చేష్టలను పట్టి స్థూలశరీరము కార్యములకు ప్రేరేపింపబడును. ఇదే సత్సంగము కావలెననికోరుటకును దుస్సంగము త్యజించవలయుననుటకును గారణములు.

మన అనుభవములో దేశమందు సమాజములున్నవి అనుసంగతి నెరుగుదుము. సమాజములలో మెంబర్లయొక్క అభిప్రాయ బాహుళ్యము ఏ వైపున నున్నదో ఆ వైపున తీర్మానములు జరుగుచుండును. అదే విధముగా స్థూల, కామమయ, మనోమయ దేహములయందు ఏ విధమైన అణువులు మెండుగానుండునో ఆ విధముగా దేహములు నడుచుకొనును. కనుక పారమార్థికతలంపు గలవారలు పై చెప్పిన విహార శయ్యాభోజనచింతనంబులయందు పారమార్థికచింతను జతపరిచి దేహములను శుభ్రముగా నుంచుకొనవలయును. ఈ విషయమందు ​మరికొన్ని సంగతులు సత్సంగమును గురించి వ్రాయునపుడు వ్రాయబడును.

ఛాయాశరీరము, స్థూలశరీరము ఈ రెండుశరీరములును భూర్లోకమునకు సంబంధపడినవే అని మరలజ్ఞాపకార్థము చెప్పుచున్నాము. ఛాయాశరీరముగుండా స్థూలశరీరమునకు సూర్యకాంతినుండి ప్రాణశక్తి వచ్చుచున్నదని చెప్పబడెను (120 వ పుట). ఇట్లువచ్చు ప్రాణశక్తి రక్తనాళములయందును నరములయందును ప్రవేశించి, దేహమంతయు వ్యాపించు. స్థూలశరీరములో రొమ్మునందు హృదయము (Heart) అను మాంసపిండమున్నది. ఈ పిండము ఆత్మకు ఉనికిపట్టు (ప్రతిష్ఠితోన్నే హృదయం సన్నిధాయ), హృదయము రక్తనాళములకు జన్యస్థానము, లయస్థానముకూడ. ఒక గుంపునాళములు శుద్ధరక్తమును హృదయమునుండి శరీరమున కంతయు వ్యాపించునట్లు చేయును. మరియొకగుంపు నాళములు శరీరమందంతయు సంచరించినందున మలినములను సంపాదించిన అశుద్ధరక్తమును హృదయమునకుతెచ్చి శ్వాసకోశములగుండా శుద్ధపరిపించి మళ్లీ శరీరమునకంతయు వ్యాపించునట్టు చేయును.

శ్వాసకోశములు రెండు. ఇవి రొమ్మునందు హృదయమును ఆవరించుకొని యుండును. మంచిగాలిని మనము పీల్చినపుడు ఆ గాలి రక్తమునందలి మలినములను శుద్ధిచేయురీత్యాతాను మాలిన్యమును తీసుకొని ఆ మాలిన్యము ఊపిరిగుండా వెలుపటికి తోయును, హృదయముయొక్కయు, శ్వాసకోశముల యొక్కయు వివిధచర్యలను జరుపుటకు వాటికి శక్తినిచ్చునవి నరములు. ​శిరస్సునందు మెదడు అని యొకటియున్నది. గోధుమపిండి ముద్దగా కలిపినట్టు కనుపడును. ఈ మెదటియందు సహస్రారము మొదలగు ముఖ్యమైన భాగములు కొన్నియున్నవి. మెదటినుండి నరములు బయలువెడలును. వీపునందు వెన్నెముకయున్నది. అది ఒక విధమైనగొట్టము. ఆ గొట్టమువెంబడి మెదటినుండి ఒక భాగమువెళ్లును. ఆ మొదటితీగెనుండి నరములు బయలు వెడలును.

నరములలో రెండు విధములు. శ్రీభగవద్గీతీయందు "సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే" అని చెప్పి యున్నది. ఇంద్రియకర్మ లనగా జ్ఞానేంద్రియములు, మనస్సు, ఈ ఇంద్రియములయొక్క కర్మలు నడుపుటకు ఆ ఇంద్రియగోళములకు శక్తి యిచ్చు నరములు ఒక గుంపు. ఇంగ్లీషుభాషయందు ఈ గుంపుకు Cerebro - spinal system అని పేరు. ప్రాణకర్మములనగా — శ్వాసవిడుచుట, ఆహారముజీర్ణమగుట, విణ్మూత్ర విసర్జనము, రక్తమును నాళములగుండా పంపుట, గుండెకొట్టుకొనుట, చర్మమునందలి రోమకూపములయొక్క ఆయామవ్యాయామములు మొదలగునవి. "ఇంద్రియకర్మాణి" అనునవి బహుశః జీవాత్మయొక్క అనుమతిపైన నడుచుకార్యములు. "ప్రాణకర్మాణి" అనునవి అనుమతిలేకనే నడుచునవి. ప్రాణకర్మములు నడుపకపోతే శరీరము బ్రతికియుండదు.

యోగమార్గమునందు చెప్పియుండు షట్చక్రములు మొదలగునవియంతయు నరములయొక్క సమాగమస్థలములు. ఇవన్నియు స్థూలశరీరమందున్నవి. ఈసంగతులవిషయమైన తెలివి దేహములను శుద్ధిచేయువిషయమందు అతిముఖ్యములు. ​

కామమయశరీరము

ఈ శరీరము భువర్లోకమునందు సంచరించుటకుగా జీవాత్మ ఉపయోగించునట్టిది. కామము అన్నపుడు ఏమో ఒకవిధమైన నీచవిషయము అని ప్రకృతకాలమందు అర్థమగును. కామమనగా ఇచ్ఛ. ఇచ్చ నీచముగానుండవచ్చును; ఉన్నతముగా నుండవచ్చును. సాధారణముగా వాసన అను పదమువలె కామము అనుపదము. వాసన, సువాసన లేక తావి, దుర్వాసన లేక గబ్బు, అని రెండువిధములు. అదే విధమున కామమును రెండు విధములు. 1. ధర్మఅవిరుద్ధమైనది, 2. ధర్మవిరుద్ధమైనది. "ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ” అని శ్రీకృష్ణమూర్తిగారి వచనమున్నది.

"కామమయ ఏవా యం పురుషః" మనుష్యులు సాధారణముగా కామమయులే గదా. మనకందరికిని ఏదో ఒక మనోరథము ఎల్లపుడును ఉండును. ఒకటిని తృప్తిపరిచినపుడు మరియొక మనోరథము ఉదయమగును. ఇట్లు మనోరథములయొక్క సమూహములు దయించి వాని నెల్ల జీవాత్మ యనుభవించి విసికితేనే గాని వైరాగ్యము పుట్టదు.


నా౽నుభూయ న జానాతి పుమాన్ విషయతీక్ష్ణతాం ।
నిర్విద్యేత స్వయం తస్మా న్న తథా భిన్నధీః పరైః ॥

(శ్రీమద్భా - 6 స్కం, 5 ఆధ్యా, 41 శ్లో.)


పురుషుండు తాన యనుభవింపక విషయంబుల తీక్ష్ణత్వం బెరుంగ నేరడు. తానే యనుభవించి కాలక్రమంబున నవ్విషయంబులు ​నిస్సారంబు లనియు దుఃఖమూలంబులనియు నెరిగి విరక్తి చెందునట్లు ఇతరుల బోధవల్ల విరక్తిపుట్టదు. విరక్తిపుట్టిన గాని సాధన చతుష్టయసంపత్తి లభించదు. సాధనచతుష్టయసంపత్తి లేనిదే జ్ఞానోదయము లేదు.


వైరాగ్యస్య ఫలం బోధః బోధ స్యోపరతిః ఫలం ।
స్వానందానుభవాచ్ఛాంతిః ఏషైవోపరతేః ఫలం ॥
యద్యుత్తరోత్తరాభావః పూర్వపూర్వంతు నిష్ఫలం ।

(వివేకచూడామణి)


కనుక కామమయశరీరము అత్యావశ్యకము.


భూర్లోకముమొదలైన లోకములయందు - అనగా ఫిజికల్ ప్ళేను (Physical plane) మొదలగు ప్ళేనులయందు, ప్రకృతి సప్తీకరణమైనదని 116 వ పుటయందు చెప్పబడెను. అందువలన భువర్లోకము అగు ఆస్ట్రల్ ప్ళేనునందు కూడ నేడువిధములగు ప్రకృతి స్థౌల్యములనుపట్టి ఏర్పడిన భాగములున్నవి. అట్టి ఏడింటికిని “సబుప్ళేనులు" అని పేరు. స్థూలాతిస్థూలమైనది మొదటి సబుప్ళేను. అంతకంటె తక్కువస్థూలము రెండవసబుప్ళేను. ఇదేవిధమున మూడవది, నాలుగవది, ఐదవది, ఆరవది, ఏడవది అని ఏడు “సబుప్ళేనులు” న్నవి. ప్రతి సబుప్ళేనుయొక్క అణువులు ఎంతో (కొంచముగానో, అధికముగానో) "ఆస్ట్రలుబాడీ” అను కామమయశరీరమునం దున్నవి. అన్ని సబుప్ళేనుల ప్రకృతియును చేరి ఏర్పడినది కామమయశరీరము అని మరల నొక్కి చెప్పుతున్నాము. చాలమట్టుకు మనోభావములు (Emotions) పరిశుద్ధములైన వానిని మనము చింతించు శక్తివచ్చునపుడు పై "సబు ​ప్ళేనుల" ప్రకృతి మన కామమయశరీరములయందు విశేషముగా చేరును. నీచములైన మనోభావములను చింతించుచుండు నపుడు అడుగు "సబుష్ళేనుల” ప్రకృతి యధికముగా చేరును.

మనకందరకును జాగ్రదవస్థ, స్వప్నావస్థ మొదలగు అవస్థలు కలవు. ఒక్కొక అవస్థకు ఒక శరీరము అను అర్థము కాదు. మనము మేలుకొనియుండి లోకవ్యవహారములు జరుపుచుండునపుడుకూడ ఇచ్ఛా, ద్వేషము, దుఃఖము ఇట్టి భావములు వచ్చినపుడు మనము కామమయశరీరమందు పనిచేసినవార మవుదుము. నిద్రాకాలమందు జీవాత్మలు స్థూలశరీరమును వదలి కామమయ శరీరమును ఆశ్రయించి కొంతకాలమును, కామమయశరీరమును కూడ వదిలి మనోమయశరీరములయందు కొంతకాలము నుందురు. కామమయశరీరము స్థూలశరీరమువలెనే స్వతంత్రించి నిలుచు శక్తికలది. జ్ఞానేంద్రియముల కునికిపట్టు. జాగ్రదవస్థయందు బహిఃప్రపంచమును మనము అనుభవించుట ఇంద్రియములగుండానే కదా. ఇంద్రియములలో "సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అని కంటితో బహిఃప్రపంచమును చూచి, ఆనందించినపుడంతయు కామమయశరీరమందుండి మనము పనిచేయుచుందుము. కనుక మనము ప్రాయశః కామమయశరీరవాసులమే. భూలోక మందు శిశువుయొక్క శరీరము కొంతకాలము పరాధీనముగా నుండును. తొట్లలోపడియుండగా తానుగా పక్కలకు పొరలుటగాని, లేచి కూర్చొనుటగాని సాధ్యముకాదు. ఆ శిశువుశరీరము సాధారణముగా ఏడేండ్లవయస్సు అగునంతదాక స్వతంత్రముగా వ్యవహరించదు. అదేవిధముగా కామమయశరీరముకూడ అనేక ​జన్మముల నెత్తి ఆ జన్మములందు సంపాదించిన మనస్సుయొక్క శక్తులు ముదురుపర్యంతమును స్వతంత్రముగా నిలువను శక్తి చెందదు. భూలోకపుశిశువునకు ఆహారముమొదలగువానివల్ల ఏవిధముగా దేహము పెరుగునో అదే విధముగా భువర్లోకపుశిశువు అయిన కామమయశరీరమునకు పటుత్వము రావలెనంటే స్థూలలోకపార్శ్వమునుండి స్థూలశరీరముగుండా ఒక విధమైన శక్తియు సూక్ష్మలోకపార్శ్వమునుండి మనోమయశరీరములనుండి ఒకవిధమైన శక్తియు ఈ రెండును చేరితేనే గాని పెంపులేదు.

జనబాహుళ్యము కామమయశరీరముగుండా పనిచేయుదురు గాని స్థూలశరీరమును వదిలి తానుగా నిలిచిన కామమయశరీరమందు పనిచేయుట అరుదు. ఈ శక్తిగలవారు కొందరే. స్థూలశరీరమును వదిలి కామమయశరీరమునందు నిలిచినవానిని భూలోకదృష్టితో కనుక్కొనుట సాధ్యము కాదు. యోగాభ్యాసముచేసి తద్వారా సంపాదించిన సూక్ష్మదృష్టిగలవారేగాని యితరులు చూడలేరు. అట్టివారి కాశరీరము చాల కాంతివంతముగా కనబడును.

ఇటికలు బండ్లలోతెచ్చి కుప్పలుగా బోసియుంచిన మాత్రమున ఆ యిటికలు గోడలు అనిపించుకోవు. సున్నముతో కట్టిన పిదపనే గదా ఆ యిటికలు గోడలగును. అదే విధముగా కామమయశరీరము భువర్లోకమునందలి సప్తవిధప్రకృతియొక్క సమూహముగా జీవాత్మశరీరములవెంబడి యొక రూపముగా నిలిచినంత మాత్రమున ఆ రూపము కామమయశరీరము అనిపించుకో చాలదు. జీవాత్మ బహువిధములైన ప్రయత్నములవల్ల - అనగా ​ఆహారనియమము, నీచమనోభావములను వదిలి ఉత్తమమనోభావములను చింతించుట, చదువు మొదలగు వ్యాసంగములవల్ల మెదడు స్ఫురత్తుగా పనిచేయునట్టు అయితేనే గాని ఆ రూపమునకు శరీరత్వము రాదు.

భువర్లోకప్రకృతికి ఒక స్వభావము కలదు. భూలోకపు అణువుల వలెనే (123 వ పుట చూడుడు) తమ యిచ్ఛానుసారము స్థలము విడిచి స్థలమునకు పోవు శక్తియు ఇష్టమున్నంతకాలము అచ్చట నుండుశక్తియును గాక జీవాత్మ ఏ విధములైన తలంపులను తలచినను ఏ విధములైన వేషములను వేయవలెనన్నను ఆ వేషములుగా మారుటకును శక్తికలదు. ఈ శక్తిని యోగులు ప్రయత్నపూర్వకముగా నుపయోగించి లోకులకు సహాయముచేయుదురు. శ్రీమద్రామాయణమునందు మనము చదువు ప్రకారము రాక్షసులు కామరూపులు, అనగా ఇచ్ఛవచ్చిన రూపములను ధరించు శక్తిగలవారు. ఇదే కామమయశరీరపు శక్తి. "దివ్యజ్ఞానసారము" అను పేర నొక గ్రంథమును శ్రీ చిట్టమూరు రామయ్యపంతులుగారు వ్రాసి ఇటీవల అచ్చుపడియున్నది. అందు "అదృశ్యసహాయులు" అని యొక అధ్యాయమున్నది. ఆ అధ్యాయమును చదువ వలయును.

కామమయశరీరము స్థూలశరీరముయొక్క ఆకృతిని ధరించును అని చెప్పినపుడు ఒక విశేషమును మరువకూడదు. స్థూలశరీరము స్థిరమై చేతులు చేతులుండుస్థలమునందే యుండును. కాళ్లు, ముక్కు, తల, చెవి మొదలగునవి వాని వాని స్థలములను విడువవు. కామమయశరీరపు అణువులన్నియు సదా కామమయ ​శరీరపు ఎల్లకు లోబడి సర్వకాలమందును స్థలముల మారుచుండును. గట్టిమట్టికిని అడుసుమట్టికిని ఎంత వ్యత్యాసముండునో, అడుసును ఎట్లు ఒక రూపముగా గట్టుట కష్టమో ఆ విధముగా కామమయశరీరము రూపుమారుచుండును. ఒకపుడు చెవి అను అంగమును కట్టియుండిన అణువులు కన్ను అను అంగమును మరు నిమిషమందు కట్టును. కన్ను అను అంగమును కట్టియుండిన అణువులు మరునిమిషమందు, వీపుగానో లేక పిరుదులుగానో లేక అరికాలుగానో ఏర్పడును. కనుక ప్రతి అణువు ప్రతి ఇంద్రియము యొక్క ధర్మమును నడుపగల శక్తిగలిగియుండును. దేహముయొక్క ప్రతి భాగముతోనును నేత్రేంద్రియముయొక్క ధర్మమును నడుపవచ్చును. అట్లుగానే శ్రోత్రేంద్రియముయొక్కయు ఇతర ఇంద్రియముల యొక్కయు ధర్మములను నడుపగలదు.

సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం !

అనినట్టు గా నుండును.

కామమయశరీరమునుగురించి బహుబాహుళ్యముగా వ్రాయవచ్చునుగాని గ్రంథవిస్తరభీతి బాధించుచున్నది.

కామంబులు ఎల్లపుడును గర్హితంబులు కావని 126 వ పుట యందు చెప్పబడెను. ప్రవృత్తి మార్గయాత్రయందు వివిధములైన కామములును జీవాత్మకు సహాయములు. నీచములైన కామములు కూడ సహాయములే, మనోరథములు మనుష్యుని ఆ సమయమునకు తొందరకు లోబరచినను కాలాంతరేణ అనుభవప్రాప్తి కలుగచేసి (127 వ పుటచూడుడు) విరక్తునిగా జేయును. ఉత్తమకామములు మనుష్యుడు కోరిన సుఖమును ఇచ్చి ఆ సుఖములను మునుష్యుడు ​అనుభవించు రీత్యా అంత్యదశకువచ్చినందున దుఃఖకారణములగును. "శ్రీకామ శ్శాంతికాము పుష్టికామ స్తుష్టికామ శ్శ్రద్ధా కామో మేధాకామః ప్రజ్ఞాకామ ఆయుష్యకామ ఆరోగ్యకామ ఏవం భాస్కరస్యారాధనం కుర్యాత్" అని వేదమంత్రములయందు చెప్పియున్నది. మరియు "స్వర్గకామో యజేత" అనియు చెప్పి యున్నది. స్వర్గాది సుఖములను కోరి యజ్ఞయాగాదులను చేసిన వారు ఆక్రతువుల ఫలకాలము అయిపోగానే


త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః
    యజ్ఞై రిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే ।
తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం
    అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ ॥
తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం
    క్షిణే పుణ్యే మర్త్యలోకం విశంతి ।
ఏవం త్రయీధర్మ మనుప్రపన్నాః
    గతాగతం కామకామా లభంతే ॥

(శ్రీ భగవద్గీత)


మూడువేదములనును అధ్యయనముచేసి వానియొక్క సహాయమువల్ల యజ్ఞములను చేసి స్వర్గలోకవాసమును గోరువారు ఆ యాగఫలములవల్ల బహుకాలము స్వర్గసుఖముల ననుభవించి ఆ ఫలము క్షీణించగానే మరల గతాగతకారియైన యుయ్యెలయుబోలె భూలోకంబునుం బ్రవేశింతురు. ఇట్లు పలుమారు స్వర్గమునకు వెళ్లి మరల సుఖానుభవానంతరము భూలోకము బ్రవేశించి విసికి


ప్లవాహ్యేతే అదృఢా యజ్ఞరూపాః అష్టాదశోక్త మనరం యేషు కర్మ

(ముండకోపనిషత్తు)

​ఈ యజ్ఞరూపములగు పడవలు అదృఢములు, కొద్దికాలమే స్వర్గఫలమును ఇయ్యగలవి అని విరక్తిచెందగలరు. అటుగాక ధర్మవిరుద్ధమైన కామములగు వ్యభిచారాది దోషములకు లోబడువారు మన శాస్త్రములలో చెప్పిన నరకములయొక్క అనుభవముల కన్నను అతి దుఃఖదాయకములైన మనోవ్యాకులములను కామలోకమైన భువర్లోకమునందు అనుభవించి ఆ లోకవాసానంతరము ప్రాప్తసద్బుద్ధులై మరల భూర్లోకమునకు జన్మమునకు వచ్చి క్రమేణ వృద్ధికి వత్తురు. మరిగొందరు అనేక జన్మములందు దుష్ట

కామయోజనవల్ల స్వభావతః చెడ్డవారై శ్రీభగవద్గీత 16 వ యధ్యాయమందు చెప్పబడిన ఆసురసంపత్తిని జెందుదురు. వీరందరును కామలోకమందు బహువిధానుభవములను బొంది క్రమేణ కామమయశరీరమును శుద్ధిచేసికొని వృద్ధికిరాగలరు.

భువర్లోకము అను కామలోకమును గురించియు కామమయ శరీరమును గురించియు మాత్రమే ఒక గ్రంథము వ్రాయతగినన్ని విషయములున్నవి. ఐనను కొన్ని సంగతులను మాత్రము చెప్పి ఇంతటితో నిలుపవలయును. మరల నివృత్తిమార్గము అను అధ్యాయమునందు కామమయశరీరమును శుద్ధిచేయుటనుగురించి వ్రాయునపుడు వ్రాతుము.

కామమయశరీరమునకు కూడ మరణావస్థ కలదు. అనగా ఆ శరీరమును కట్టియుండు అణువులు చెదిరిపోయి అవి సంపాదించిన స్పందశక్తులన్నియు కామమయశరీరపు దేహబీజమునందు ఇమిడియుండు సమయము. ఈ విషయమును "సంసారచక్రమను” అంశమునుగురించి వ్రాయునపుడు వ్రాయనగును. ​

మనోమయశరీరములు

"మనో హి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధ మేవ చ” అని యుపనిషత్తులయందు చెప్పియున్నది. ఆ విధముగా మనస్సు రెండు విధములు గనుక మనోమయశరీరములు కూడ రెండు విధములు. 1. శుద్ధమనోమయశరీరము, 2. అశుద్ధమనోమయశరీరము అని (106 వ పుటచూడుడు). “ఫిజికల్ ప్ళేను” నందు ఏడువిధములగు "సబు ప్ళేనులు" న్నవని యిదివరకే చెప్పబడెను. "ఫిజికల్ ప్ళేను" లో నుపయోగింపబడు శరీరములు రెండు అనియును చెప్పబడెను, అవి యేవని మరల జ్ఞాపకార్థము చెప్పెదము. 1. ఛాయాశరీరము, 2. స్థూలశరీరము, ఛాయాశరీరము కూడ స్థూలశరీరమే. "ఫిజికల్ ప్ళేను" లో నుండు ఏడు "సబు ప్ళేనుల" పైకి స్థూలాతి స్థూలము మొదలు మూడు "సబు ప్ళేనులు” ఎక్కునంత వరకును గల పృథివి, అప్పు, తేజస్సు అను తత్త్వముల సంబంధములైన మూడు "సబు ప్ళేనుల" ప్రకృతివల్ల కట్టబడినది స్థూలశరీరము. అంతకుపై వగు నాలుగు "సబు ప్ళేనుల” ప్రకృతివల్ల కట్టబడినది ఛాయాశరీరము (120 వ పుట చూడుడు). "ఫిజికల్ ప్ళేను" నందు ఉండు "సబు ప్ళేను" లలో రెండు విధములైన భాగములు ఏర్పడిన విధముననే "మెంటల్ ప్ళేను” నందును ఏడు "సబుప్ళేనులు" గలవు. ఈ "సబు ప్ళేనులు” కూడ రెండు భాగములుగా భాగింపబడినవి. ఇందులో మొదటిభాగమునకు నాలుగు "సబు ప్ళేనులు" ను రెండవ భాగమునకు మూడు "సబుప్ళేనులు” ను సంబంధపడినవి. పృథివి, అప్పు, తేజస్సు, వాయువు అను తత్త్వముల సంబంధములైనవి నాలుగు "సబు ​ప్ళేను" లు మొదటి తరగతివి. అంతకుపైన సూక్ష్మతరములైన మూడు "సబుప్ళేనులు" రెండవ తరగతివి.

ఇచ్చట ఒక ముఖ్యాంశమును గమనించవలెను. "ఫిజికల్ ప్ళేను" యొక్క "సబు ప్ళేనులు ” రెండు తరగతులుగా విభజింపబడినవి. "మెంటల్ ప్ళేను" యొక్క “సబు ప్ళేను” లు కూడ రెండు తరగతులుగా విభజింపబడినవి. అయితే ఈ రెంటికిని నొక వ్యత్యాసము కలదు. అది యేమనగా, "ఫిజికలుష్ళేను” నందలి "సబుప్ళేను" లు స్థూలాతిస్థూలము మొదలు మూడు మాత్రము ఒకతరగతియై పైనాలుగు మరియొకతరగతియైనది. "మెంటల్ ప్ళేను” నందు స్థూలాతిస్థూలము మొదలు నాలుగు మొదటి తరగతి. పై మూడును మరియొక తరగతి. నాలుగు, మూడు, అను అంకెలు వ్యత్యస్తములైనవి. ఇది గమనించవలసిన విషయము.

మెంటలు ప్ళేను నందు స్థూలార్ధము అగు నాలుగు "సబు ప్ళేనులు" ను అశుద్ధమనస్సునకు చేరినది. "అశుద్ధం కామసంకల్పజం” అని యుపనిషద్వాక్యము. అశుద్ధమనస్సునకు ఉపాధి అశుద్ధమనోమయశరీరము. ఇందుకు పైని యయిన మూడు "సబుప్ళేను" లకును సంబంధపడినది శుద్ధమనస్సు. "శుద్ధం కామవివర్జితం" అని యుపనిషద్వాక్యము. శుద్ధమనస్సున కుపాధి శుద్ధ మనోమయశరీరము. మనుష్యులకు బంధమునకుగాని మోక్షమునకుగాని మనస్సే కారణము.


మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః ।
బంధాయ విషయాసక్తం సూక్త్యై నిర్విషయం మనః ॥

(అమృతబిందూపనిషత్)

​విషయాసక్తమైన మనస్సు బంధకారణము. నిర్విషయమైనది మోక్షకారణము.

ఇట్లు బంధమోక్షములకు కారణమైన మనస్సును గురించి కొంత తడవు విచారించవలెను. మోక్షకారణమైనది శుద్ధమనస్సు. ఇందునుగురించి విచారము కొంత నిదానించి చేయవచ్చును. నివృత్తిమార్గమును గురించి వ్రాయునపుడు ఈ విచారము రాగలదు. ప్రకృతమందు అశుద్ధమనస్సును గురించిన విచారము సమీచీనము. అశుద్ధం కామసంకల్పజం" అనిన విధమున అశుద్ధమనస్సు కామములవల్ల పెరుగునది. అయినను కామములు గర్హితములు గావు అని 126 వ పుటయందు వ్రాయబడెను. నీచములైన కామములు మొదట దుఃఖములను కలుగజేసి ఆ దుఃఖములను అనుభవించిన తరువాత ఆ అనుభవమువల్ల పుట్టిన మంచి బుద్ధి గుండా మేలైన కామములను మాత్రము సంకల్పించుటకు అవకాశముండును. కామములు మేలైనవైనను నీచములైనవైనను బంధకారణములే. బంధములనగా కట్లు, లేక సంకిళ్లు. సాధారణముగా సంకిళ్లు ఇనుముతో చేయబడును. ఒక వేళ బంగారముతో చేసినను అవి సంక్లిళ్లే కదా. నీచములైన కామములు ఇనుపసంకిళ్ల వంటివి. మేలైన కామములు బంగారపు సంకిళ్లవంటివి. ఇనుముతో చేసినవైనను బంగారముతో చేసినవైనను సంకిళ్లేమో సంకెళ్లే గాని ఆభరణములు గావు. కనుక మొట్టమొదట బంధకారణమైన

అశుద్ధమనోమయశరీరము

ను గురించి విచారింతము. ముందు చెప్పిన విధమున నీ శరీరము "మెంటల్ ప్ళేను” యొక్క దిగువభాగపు నాలుగు "సబుష్ళే ​నుల” లోని ప్రకృతివల్ల గట్టబడినది. ఈ శరీరమునందు (అశుద్ధ) మనస్సు అను అంతరింద్రియము వ్యవహారము జరుపును. అశుద్ధమనస్సు కామసంకల్పజము గనుక కామమయశరీరముతో కలిసియే గాని వేరుగా వ్యవహరించుటకు సాధ్యము కాదు. ఇంద్రియముల కన్నిటికిని స్థూలశరీరమునందు గోళములు గలవు. గోళములనగా నునికిపట్టులు (110 వ పుటచూచుడు). అంతరింద్రియమునకు స్థూలశరీరమందు గోళము మెదడు. మెదడు తలయందున్నది (125 వ పుటచూడుడు). కనుక ఆశుద్ధ మనస్సుయొక్క వ్యవహారమంతయు మాడు శరీరములగుండా జరుగవలయును - అశుద్ధ మనోమయశరీరము, కామమయశరీరము, స్థూలశరీరము. ఇన్నియును అంతరింద్రియమైన మనస్సునకు ఆయుధములు. యోగమార్గమందు కొంతవరకును సిద్ధులు కలుగు పర్యంతమును జాగ్రదావస్థయందు సాధారణజనునికి ఈ మూడు శరీరములును మనస్సుచే జరుగవలసిన వ్యవహారములకు ఆవశ్యకములు. కామమయశరీరమును కట్టిన ప్రకృతి కన్నను మనోమయశరీరమును కట్టిన ప్రకృతి చాల సూక్ష్మమైనది. మరియు చాల చలనస్వభావము కలది. ఈ శరీరము ప్రతిజన్మమునందును జీవాత్మసంపాదించిన శక్తులనుపట్టి పెరుగుచుండు. ఒకటే జన్మమున చిన్నబిడ్డగానుండి పిల్లవాడై యౌవన పురుషుడైనపుడు స్థూలశరీరము పెరుగుచు వచ్చునట్లు అశుద్ధమనోమయశరీరము ప్రతిజన్మమునందును జీవాత్మ చేసిన వ్యాసంగముల ననుసరించి పెరుగుచు వచ్చును.

యుక్తి, చాతుర్యము, జ్ఞాపకశక్తి మొదలగు మనశ్శక్తులు అధికము కాను కాను అశుద్ధమనోమయశరీరము పెరుగుచువచ్చు ​ను. కళలు కాంతులు అధికమగును. ఈ శరీరమందు కరచరణాద్యవయవములు కనబడవు. పెద్ద గుడ్డువలె నుండును. కామమయశరీరమందును స్థూలశరీరమందును ప్రవేశించి వాని రెంటిని అన్ని దిక్కులయందును మించియుండును. యుక్తిచాతుర్యములు అధికము కాను కాను మనోమయశరీరమునకు కాంతి అధికమగును. ఈ శరీరమునందుండు కాంతులే సాధారణ కూలివానికి చదువరికిని గల ముఖప్రకాశమునకు కారణము. మెంటల్ ప్ళేను యొక్క ప్రకృతి అతిసూక్ష్మమైనందున స్పందములు ఆ ప్రకృతియందు ప్రవేశించినపుడు ప్రకృతి చాల కదులును. ఆ కదులుటవల్ల కాంతు లుద్భవించును.

మనోమయశరీరము చింతనమువల్ల పెరుగును. తర్కశాస్త్రములు చదువువారికి వాదించుట సాధ్యము. వాదములు ఎంత యుక్తిసహితములో అంతటి గట్టివాడనిపేరు కదా. ఎదుటి కక్షి వాదములకు సమయస్ఫూర్థిగా ప్రతివాదములను ఉపయోగించువాడు చాల యుక్తిమంతుడని పేరుపొందును. అట్టి వాదములు, సమయస్ఫూర్తియుక్తులు ఇవన్నియు మనోమయశరీరములయందలి అణువులలో స్థూలమై ముతకులుగానుండువానిని ఆ శరీరములయందునుండి వెలుపలికి తోలి వాని స్థానమునందు నాజూకులైనవియును సూక్ష్మములైనవియునగు అణువులను చేర్చుటకు కారణములు. ఇంతే కాక చిత్రపుపనులు - అనగా పటములు వ్రాయుట, పరోపకారార్థముగా చింతించి చింతించి పని చేసి చేసి లోకులందరును తనవంటివారలే యని "ఆత్మవత్సర్వభూతాని" యని ఆచరణకు తెచ్చుకొనుట అను అంశములన్నియు మనోమయశరీరములను వృద్ధిచేయును. ​మనోమయశరీరములు పొటగ్రాపు ఎత్తు పెట్టెల వంటివి. పొటగ్రాపుపెట్టెకు ఎదురుగా వెలుతురునందు ఏ వస్తువున్నను ఆ వస్తువుయొక్క బింబము పొటగ్రాపుపెట్టెలోనుండు అద్దముపైన బడును. అదేవిధముగా లోకమందు అనేకులుచింతించు తలంపులన్నియు ఇతరుల మనస్సులయందు ప్రవేశించును. వెలుపలి నుండి మన మనస్సులోపలికి ఈ విధముగా ననేక తలంపులు దూరుచుండును. అవి దూరిన సంగతి మనకు ఎరుకకు రాదు. మనమే ఎందువల్లనో ఈ తలపులను తలచినాము అని అనుకొందుము. అయితే ఆ తలపు మనది కాదు. ఏకాగ్రమైన మనస్సులయందు ఇతరుల తలంపులు సులభముగా ప్రవేశించవు. కల్లలుగట్టిన తోటలలో ఇతరులు దూరుట కష్టము. కల్లలు లేని తోటలలో ఇతరులు ప్రవేశించుటకు అడ్డి లేదు. ఆ విధముగా ఏకాగ్రము సంపాదించని మనస్సులయందు ఇతరులు తలంపులు ప్రవేశించుట సులభము. మన అనుమతి లేనిదే మన మనస్సులలో ప్రవేశించు తలంపులు మనయొక్క స్వభావమును అనుసరించినవిగా నుండును. మన స్వభావమునందు నీచభావములయం దనురక్తి యున్నయెడల నీచతలంపులు మనమనస్సులయందు ప్రవేశించును. అంతేకాదు. ఇతరుల తలంపులు మన మనస్సునందు ప్రవేశించి ఆ విధమైన కార్యములను చేయుటకు ప్రేరేపించును. అట్టి తలంపులు మనవికాకున్నను వానివల్ల జరిగిన కార్యములయొక్క పూచి మనదే. తలంపులు నీచములుగా నుండవచ్చును. శుభ్రముగా నుండవచ్చును. ఏవిధమైనను పూచి కార్యముచేయువానిదే. ​అశుద్ధమనోమయశరీరమును శుభ్రపరుచువిధమును ఆ శరీరమును ఏవిధముగా జీవాత్మయొక్క లాభమునకుగా నుపయోగించవచ్చును అను విషయములనుగురించి నివృత్తిమార్గము అను అధ్యాయమునందు వ్రాయబడును.

శుద్ధమనోమయశరీరము

ఆమృతబిందూపనిషత్తునందు మనస్సును శుద్ధమనియు అశుద్ధమనియు భాగించినపుడు "అశుద్ధం కామసంకల్పజం" అనియును "శుద్ధం కామవివర్జితం" అనియును చెప్పియున్నది. ఈ వాక్యముల ననుసరించి నీచములైన కామములైనను ఉన్నతములైన కామములైనను అన్నియు కామములే. గనుక కామసహితములైన తలంపు లన్నియును అశుద్ధకామమయశరీరమునకే సంబంధపడినవి అని అశుద్ధకామమయశరీరమునుగురించి వ్రాసినపుడు చెప్పబడెను. లోకమందు ముప్పాతికామువ్వీసముమందికి కామప్రేరితములైన తలంపులే గాని యితరములు అగుబడవు. కామరహితములైన తలంపులు చాల కష్టములు.

"మెంటల్‌ప్ళేను” యొక్క ఏడు "సబుప్ళేనుల" లో సూక్ష్మతరములైన పైమూడు "సబుప్ళేనుల” యొక్క ప్రకృతితో శుద్ధమనోమయశరీరము కట్టబడెను అని 135 వ పుటయందు చెప్పబడెను. ఈ శరీరముయొక్క మనోధర్మములయందు కామము ఏమాత్రమైనను చేరదు. ప్రతి జీవునకును నాలుగు శరీరములు ఈ కాలమందు పనిచేయుచుండును. 1. స్థూలశరీరము. ఇది మరణముచెందు నపుడు ఈ శరీరమునందలి శక్తులన్నియు స్థూల ​భూతసూక్ష్మమునందు ఇముడును. 2. కామమయశరీరము. భువర్లోకానుభవములు ముగిసి నపుడు కామమయశరీరమునకు మరణము కలుగును. అపుడు కామమయశరీరమునందుండినశక్తులన్నియు నాశరీరముయొక్క దేహబీజమునం దిమిడియుండును. ఆవల 3. అశుద్ధమనోమయశరీరము స్వర్గలోకానుభవానంతరము చెదిరిపోవును. అపుడు అశుద్ధమనోమయశరీరపు దేహమునకు బీజమైన "మెంటల్ యూనిట్" అను అణువునం దిమిడి యుండును. 4. శుద్ధమనోమయశరీరము అను అత్యున్నతశరీరము. మొదటి మూడు శరీరములు నశించిన రీతిగా శుద్ధమనోమయశరీరము శిథిలము గాదు. జీవాత్మకు ఇక చాల కాలము ఇది యునికిపట్టు. జీవన్ముక్తి దశకు సామీప్యము వచ్చునంతవరకును ఈ శరీరముండును. కనుక స్థూలత్రిలోకియందలి యుపాధులైన స్థూలశరీరము, కామమయశరీరము, ఆశుద్ధమనోమయశరీరము అను నీ మూడుశరీరములు నశించునపుడంతయు ఆ శరీరముల దేహబీజములు శుద్ధమనోమయశరీరముయొక్క ఆవరణమందు నిలిచి జీవాత్మ నాశ్రయించియుండును. ఇందునుగురించిన వివరములు సంసారచక్రము అను అధ్యాయమునందు వ్రాయనగును.

మనస్సుయొక్క స్వరూపము

వేదాంతములందు "త్రిపుటి" యను నొక సంజ్ఞావాచకము కలదు. త్రిపుటి యనగా మూడింటి సముదాయము. దీని కుదాహరణ మేదనగా, అసద్వస్తువైన జగత్తు దృశ్యము అనగా చూడబడు వస్తువు. చూడబడునదియుంటే చూచువారుండ ​వలెనుగదా. అట్టి చూచువారు జీవాత్మలు, అనగా మనము. చూచువానికి "ద్రష్ట” యనిపేరు. ద్రష్ట చూచును, దృశ్యము చూడబడును, ఈ రెంటికిని చూపు అను సంబంధ ముండవలెను. ఈ చూపుకు "దృష్టి" యని పేరు. ద్రష్టా, దృశ్యము, దృష్టియను మూడును ఇపుడు త్రిపుటి యనబడు. ఇదేవిధముగా మరియొక త్రిపుటి కలదు. "జ్ఞాతా” అనగా ఎరుగువాడు, "జ్ఞేయం” అనగా నెరుగబడు వస్తువు, “జ్ఞానం” అనగా నెరుగునట్టి శక్తి. ఇపుడు ఏర్పడిన త్రిపుటి ఏమనగా "జ్ఞాతా, జ్ఞానం, జేయం" అనునది. ఈ త్రిపుటియందు జ్ఞానం అను నంశము క్రింద నొకభాగము అంతఃకరణము. జీవాత్మలు జగత్తు నెరుగవలెనంటే అంతఃకరణము ముఖ్యసాధనము. బహిఃప్రపంచమందు గల శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు మొదలగునవి విషయములని పేరుగొన్నవి యని ముందేచెప్పబడెను కదా.

విషయములను ఇంద్రియములు గ్రహించును. ఇంద్రియములు గ్రహించినవిషయములను ఆత్మ అంగీకరించవలెనంటే ఆత్మకును ప్రపంచమునకును మధ్యవర్తియొక రుండవలెను; అట్టి మధ్యవర్తి యంతఃకరణము. ఒకానొక రాజువద్దకు అర్జీదారులు పోవలెనంటే రాజుగారికి అర్జీదారుల ప్రార్థనను మనివిచేయు మధ్యవర్తియైన యధికారి యొకమంత్రి యున్నట్టు క్షేత్రజ్ఞుడైన జీవాత్మకును బహిఃప్రపంచమునకును మధ్యవర్తి యంతఃకరణము. ఆత్మ సత్పదార్థము, ప్రపంచము అసత్పదార్థము. ఈ రెంటికిని మధ్యవర్తి యంతఃకరణము. ఇదే యర్థము జ్ఞానవాసిష్ఠమందు చెప్పబడియున్నది. ​


భావ స్సదసతో ర్మధ్యే నౄణాం చలతి యశ్చలః ।
కల్పనోన్ముఖతాయాత స్తద్రూపం మనసో విదుః ॥

(జ్ఞానవాసిష్ఠము)


కల్పనాశక్తికలదియై సత్పదార్థమునకును అసత్పదార్థమునకును సంబంధము కలుగజేయువస్తువు మనస్సు అని తాత్పర్యము.


మనస్సునకు కల్పనాశక్తి యెట్లుకలిగినదంటే పరమేశ్వరుడు సత్ చిత్ ఆనందము అను స్వభావములు గలవాడు. ఈ మూడు స్వభావములలో చిత్స్వభావముయొక్క పరిణామము అంతఃకరణము. ఈ మూడుస్వభావములయొక్క పరిణామములును ప్రకృతియందు అనాదిగానుండు సత్వరజస్తమోగుణములగుండా ప్రతిబింబించి మనకు కనబడు. చిత్స్వభావపరిణామమైన యంతఃకరణమునకు సంకల్పాది శక్తులు సహజములు.


అనంత స్యాత్మతత్త్వస్య సర్వశక్తే ర్మహాత్మనః ।
సంకల్పశక్తికలితం తద్రూపం యన్మనో విదుః ॥

(జ్ఞానవాసిష్ఠము)


సర్వశక్తిమంతుడైన పరమాత్మయొక్క సంకల్పశక్తిచేత నిర్మింపబడిన తత్వమునకు మనస్సని పేరు అని తాత్పర్యము. మరియును,


స ఆత్మా సర్వగో రామ నిత్యోదిత మహావపుః ।
యన్మనో మననీం శక్తిం ధత్తె తన్మన ఉచ్యతే ॥

(జ్ఞానవాసిష్ఠము)


సర్వశక్తిమంతుడైన పరమాత్మకు మననావస్థ సంధించినపుడు ఆశక్తివల్ల అంతఃకరణము పుట్టినది. కనుకనే ఇంతశక్తిమంతమైన ​యంతఃకరణముతో జేయబడు కార్యములే కార్యములు గాని మిగిలినవి కార్యములు గావని జ్ఞానవాసిష్ఠమందు చెప్పబడియున్నది. "యత్కృతం మనసా రామ తత్కృతం విద్ధి చానఘ" -కనుక మనస్సుతో చేయబడిన కార్యమే కార్యము.

ఈ యంతఃకరణ చతుష్టయమందు మనస్సు చిత్తము బుద్ధియను మూటినిని బహిఃప్రపంచవ్యాపారములయందు ప్రవేశపెట్టునది యహంకారమను భాగము.


అహమర్థోదయో యోయం సర్వానర్థైక భాజనం ।
ఏత చ్చిత్తద్రుమస్యాస్య విద్ధి బీజం మహామతే ॥

(జ్ఞానవాసిష్ఠము)


సర్వానర్థకారణమై మనస్సు చిత్తము బుద్ధి యను సంతఃకరణభాగములగు వృక్షమునకు బీజమువంటిది యహంకారము అని తాత్పర్యము. ఈ యహంకారము అనేకజన్మములయందు మననముచేసి యభ్యాసమును పొందిన రీతిన కార్యములను ప్రేరేపించును. ఈ అభ్యాసమునకే వాసన యని పేరు. కనుక మనస్సును శుద్దిచేయవలెనంటే వాసనలను చక్క పెట్టవలెను. మనస్సును శుద్ధిచేయుట అను హవ్యాసమునకు వేదాంతమందు "మనోనాశము” అనియు వాసనలను చక్క పెట్టుటకు వాసనాక్షయము అనియు చెప్పుదురు. విద్యారణ్యకృత జీవన్ముక్తివివేకము అను గ్రంథమునందు వాసనాక్షయ మనోనాశములు అని జంటగానే యుపయోగించి యున్నారు. మరియు యోగవాసిష్ఠమందు, శిఖిధ్వజోపాఖ్యానమందు-


వాసనైవ సదా రాజన్ స్వరూపం విద్ధి చేతసః ।
చిత్తశబ్దస్తు పర్యాయో వాసనాయా ఉదాహృతః ॥

​అనగా వాసనలే చిత్తమునకు స్వరూపము. చిత్తం అను శబ్దము శుద్ధపర్యాయవచనమే అని తాత్పర్యము. కనుక అహంకారమన్నను, మనస్సన్నను, చిత్తమన్నను బుద్దియన్నను వాసనలేగాని వేరుకాదు. అంతఃకరణమును శుద్ధపఱచవలెననినను, బలపఱచవలెననినను వాసనలను గమనించవలెనని యర్థము.

స్వభావము

వేదాంతశాస్త్రములయందును, సాధారణముగా దేశభాషలలోనును స్వభావము అనుపదము తరుచుగా నుపయోగించుచున్నారు గదా. "అది వాని స్వభావము" "వారి వారి స్వభావములను మార్చను ఎవరికి సాధ్యము" అను వాక్కులు సాధారణముగా వినుచున్నాము. శ్రీమద్భగవద్గీత 18 వ యధ్యాయము, శ్లోకములు, 42-43-44 లలో వచ్చు "స్వభావజం" అను శబ్దమును, 17 వ యధ్యాయము, రెండవశ్లోకములో వచ్చు "స్వభావజా” అనుపదమును, 18 వ యధ్యాయము, అరువదియవ శ్లోకమునందుండు “స్వభావజేన” అను పదమును, అదే యధ్యాయము, 47 వ శ్లోకమునందుండు "స్వభావనియతం" అను పదమును, అదే యధ్యాయము, నలువదియొకటవ శ్లోకమందుండు "స్వభావప్రభవైః" అను పదమును, అయిదవ యధ్యాయము, పదునాలుగవ శ్లోకమునందుండు "స్వభావ" అను పదమును, మూడవయధ్యాయమునందు ముప్పదిమూడవ శ్లోకమునందుండు "స్వ్రస్యాః ప్రకృతేః” అను పదములవల్ల సూచితములైన అర్థములన్నియు స్వభావమునే తెలుపుచున్నవి. అట్లైతే ​స్వభావమనునది యేమి? అపుడే పుట్టినబిడ్డకు ఎవరును నేర్పించకయే తన తల్లి పాలను పీల్చు శక్తి యెక్కడిది? దీనినే స్వభావమందురు. ఆ శక్తి యెట్లువచ్చినది అనగా ననేకజన్మములందు మృగశరీరములలో నుండినపుడు తల్లిపాలు పీల్చి త్రాగి త్రాగియు నభ్యాసమైనందున కలిగిన శక్తి. దీనినే వేదాంతశాస్త్రజ్ఞులు దేహవాసన యందురు. అనేకతడవలు ఒకకార్యమును ఒక విధముగా చేసి చేసి మరల చేయుచు వచ్చినందున సంపాదింపబడిన వాడుక. ఇదే విధముగా మనస్సునకును వాడుకలు ఏర్పడును. కార్యములను సంకల్పించి, వికల్పించి, అనేక కోట్లమారు లొకవిధమైన తలంపులను తలచినందున వచ్చిన వాడుక. దీనినే వాసనయని చెప్పుదురు. ప్రకృతమందు దృఢముగా తెలిసికోవలసిన విషయ మేమనగా. మనము అనేక జన్మములయందు తమోగుణము, రజోగుణము, అను గుణములచేత ప్రేరేపించబడి చేసిన క్రతువులు, కామములు, కర్మలు, వీటిచేత మన యింద్రియములు, మన యంతఃకరణము, మన దేహములు, ఇవన్నియు నేదోయొక విధముగా తమ యభ్యాసప్రకారము చింతించి, సంకల్పించి, వికల్పించి, నిశ్చయించి, కార్యములను చేయుచున్నవి. అట్టి కార్యములు మొదలైనవాటిచేతను, వాటిఫలాఫలములు, పరికరములు వీట్లచేతను మనము బద్ధులమై మనతో సహ యితరులను కూడ బంధించియున్నా మని తెలిసికొని యిదివరకును బలహీనముగా నుండిన సత్వగుణమును ఇకనైనను బలపరిచి మనకు ఇంద్రియ అంతఃకరణాదులవల్ల కలిగిన బంధములను పోగొట్టుకోనుప్రయత్నము చేయవలయును. ​ఇది మనకు సాధ్యమను సంగతి కర్మయను అధ్యాయమునందు బాహుళ్యముగా వ్రాయబడును. ఆయితే ప్రకృతమందు పైవివరించిన రీతిన ఏవిధమున సత్త్వగుణమును వృద్ధిపరుచుకొని రజస్తమోగుణములశక్తిని తగ్గించవచ్చునో ఆ వివరమును విచారించవలెను. ఇట్టి మహాప్రయత్నము మన అంతఃకరణముతోనే జరుగవలసియున్నది. అంతఃకరణములోకూడ ముఖ్యముగా ననుసంధానకారియయిన చిత్తముయొక్క సహాయముచేత జరుగవలయును. ఆనుసంధానము అనగా నింతకు పూర్వము మనము చేసిన కార్యములవలని ఫలములను మనకు జ్ఞాపకమిచ్చుశక్తి. ఈ శక్తి చిత్తముయొక్క స్వభావము. ఇంతే కాక అనుసంధానము కలుగజేయు చిత్తమునకన్న నధికమైన అధికారముగలది యంతఃకరణముయొక్క భేదములలో కొకటైన బుద్ధియనునది. ఈ బుద్ధియొక్క పని నిశ్చయించుశక్తి. చిత్తము ఇచ్చిన అనుసంధానమును పరిశీలించి నిశ్చయమును కలుగజేయునది బుద్ధి.

మనస్సు సద్వస్తువైన బ్రహ్మమును మనకు అగుపడకుండ మూతవేసిపెట్టును. కనుక దీనికి సద్వస్త్వాచ్ఛాదకమని పేరు. ఏల యనగా బహిఃప్రపంచమందు మనకు కనుపడువస్తువులన్నిటియొక్క నిజస్వరూపమును మన కందనీయక మన యంతఃకరణమును, వాసనలను, అట్టి వస్తువులయొక్క నిజరూపగుణములను మార్చి మనకు కనుపరచును. ఏవిధముగానైతే మన కండ్లకు రంగులు గల అద్దములతో జోడింపబడ్డ ముక్కద్దములను తగిలించుకొని వస్తువులను చూచితిమంటే అద్దములవర్ణమే మనకు కండ్లపడునో అదేవిధముగా బహిఃప్రపంచమును జీవాత్మకు తెలియపరచవలసిన ధర్మ ​మును వహించిన యంతఃకరణము ఆవస్తువులన్నిటిని తన స్వభావములకు మార్చి జీవాత్మకు కనుపరచును. సత్యమును మరుగుచేయును గనుక, అచ్ఛాదకమని పేరు.

అంతఃకరణము (మనస్సు) కొందరికి బలహీనముగను మరికొందరికి బలవంతముగ నుండును. బలహీనమనస్కులు మనకక్కరలేదు. గాని బలవంతమైన మనస్సుగలవారు తమ యభిప్రాయములను ఇతరుల మనస్సులోనికి వారల యెరుకలేకనే ప్రవేశపెట్టవచ్చును. అది యెట్లంటే. జగత్తున కంతయు నొక మనోమయకోశమున్నది. జగత్తునకు అండాండమని పేరు. ఒక జీవాత్మకు పిండాండమని పేరు. అండాండమునందుండు తత్త్వములన్నియు పిండాండమునందు గలవు. అండాండపు మనస్సునకు జగన్మనోమయకోశమని పేరు. ఈ జగన్మనోమయకోశము ఒక మహాసముద్రమువంటిది.


ఏకం వస్తు జగత్సర్వం చిన్మాత్రం వారివాంబుధిః ।
తదేవ స్పందతే ధీభిః వస్తు వారీన వీచిభిః ॥

(శిఖథ్వజోపాఖ్యానం - జ్ఞానవాసిష్ఠం)


జగత్తు చిత్ అను నీళ్లతో నిండిన సముద్రమువంటిది. అలలుకొట్టినపుడు సముద్రమంతయు నే విధముగా నల్లకల్లోలమగునో అదేవిధమున జగత్తుయొక్క మనోమయకోశమంతయు సంకల్పములచే చలించును. అలలు లేనపుడు ఏవిధముగా సముద్రపు నీరు నెమ్మదిగా నుండునో అదేవిధమున శుద్ధసాత్త్వికవృత్తిగల యంతఃకరణము అలలు లేకనే తటాకోదకమువలె నెమ్మదిగా నుండును. కనుక దుర్మార్గప్రపర్తనమునందుండు వారలు దుష్టతలంపులను తలచి ​తలచి దుష్టతలంపులు అను వాయువును పుట్టించుచుంటే ఇట్లు కోటానుకోట్లమంది దుష్టతలంపులు అను చలనహేతువులను పుట్టించుచుంటే జగన్మనోమయకోశము అను సముద్రమందు అలలవలె హెచ్చుతక్కువలు కలుగును. రాజసతలంపుల అలలు రాజసస్వభావముగల వారినందరిని రాజసస్వభావతలంపులు తలచునట్లు చేయును. సాత్త్వికస్వభావముగల తలంపులు సాత్త్వికస్వభావముకల తలంపులు తలచునట్లు చేయును. దీనికి ఉదాహరణము. ఒక కొలనునందు వేయి తామరపుష్పములు తేలుచున్నను ఆ కొలనుయొక్క యొక మూలముండు తామరపువ్వును కోయను ప్రయత్నపడినవాడు ఆ పువ్వును లాగితే ఆమాత్రమునకే కొలనులోని నీళ్లయందు స్తిమితము తప్పి తద్వారా అలలుపుట్టి ఆ అలలు కొలనునంతయు ఆవరించినందున ఆ నీటిపై తేలుచున్న పుష్పములన్నియు చలించునుగదా. కొలనులోనున్న పూలపైకి ఒక పుష్పమునే కదా కదిలించినది. అయినను కదిలింపబడని మిగత పూలన్నియు కదలలేదా! అదే విధముగా జగన్మనోమయశరీరమందు తొందరకలుగచేయుటకు ప్రతిమనుష్యునకును సాధ్యము. మరియొక విధముగా నుదాహరణ మియ్యవచ్చును. కరమలవాని కొలిమియొద్ద ననేక ఇనుపతునకలున్నవి. అవి యొకటితోనొకటి తగలకయే దూర దూరముగానున్నను కొలిమిలో వెలుగుచుండు అగ్నియొక్క తీక్ష్ణమువల్ల కొలిమిలో లేకనే దూరాననుండు ఇనుప తునకలన్నియు వేడెక్కును గదా. ఇది ఎట్లు జరుగుతున్న దనగా కొలిమిలోని అగ్నియొక్క తీక్ష్ణము అందుకు చుట్టునుండు ఆకాశ అణువులలో ప్రసరించి ఆయణువులన్ని వేడిమిని ఆకర్షించినందున ఆ ​యణువులతో పరివేష్టితమైన యినుపతునకలు అన్నియు వేడిమిని ఆకర్షించినవి. అందువల్ల వాటికి ఉష్ణతయెక్కినది. ఒక్కస్థలమందు వెలుగుచున్న అగ్ని తనతో కలియని యినుపతునకలను కూడ యెట్టు వేడిమి పొందునట్టు చేయునో అదే విధమున నొకానొకడు చింతించు తలంపులతో లోకుల యెఱుకలేకయే వారల మనస్సులలో కూడ నొకానొకని మనస్సునందలి సంకల్పములవంటి సంకల్పములు జనించునట్లు చేయవచ్చును. అట్టి వారల మనస్సులలో పుట్టు సత్సంకల్పములలో దుస్సంకల్పములకో మొదటివాడు పూచి చెందవలెను. ఇదేవిధముగా లోకమందు కోటానుకోట్లమంది అనేకవిధములైన నీచచింతనములను చింతించుచుందురు కదా. ఇట్టి నీచ సంకల్పములవల్ల కలుగు చెరుపును వర్ణింప వాచామగోచరముగా నుండును. దీనికి ప్రతిగా సత్త్వగుణప్రధానులైన రాజయోగులు, ఋషులు, దేవతలు మొదలగువారు చెప్పనలవిగానంత తపశ్శక్తి పొందినవా రనేకులు లోకహితార్థముగా తపస్సులు చేసి సత్సంకల్పశ్రేణులను ప్రతిక్షణమునందును లోకమునందు కుమ్మరించుచుందురు. గనుకనే లోకములో నీమాత్రమైనను సుఖము, శాంతము కనపడుచున్నవి. అంతఃకరణపరిశుద్ధియు, చిత్తైకాగ్రతయు లేని పదివేలమంది తలచు దుష్టతలంపుల నంతయును వాటివలన కలుగు చెడ్డఫలములనంతయును తపశ్శక్తి చెందిన మహానుభావు డొక్కడు సమాహితచిత్తముతోఁ జేయు సత్సంకల్పశ్రేణి శుద్ధపరచి లోకమునకు కీడు రానీయక కాపాడును. శ్రీమద్భాగవతము, తృతీయస్కంధముయొక్క కడపట "ఆస్తేయోగం సమాస్థాయ సాంఖ్యాచార్యై రభిష్టుతః । త్రయాణా మపి లోకానాముపశాంత్యై సమా ​హితః" అని యున్నది. కర్దమప్రజాపతియొక్క కుమారుండును శ్రీమహావిష్ణుయొక్క లీలావతారములలో నొక్కడునైన కపిలమహర్షి వారియాశ్రమమందు యోగారూఢుడై ముల్లోకముల శాంతికొఱకుగా యోగమందు (తపస్సునందు) న్నారని యర్థము. కావున మనము కూడ ప్రతిదినమునందును కొంతసేపు లోకహితార్థము సమాహితులమై జపము చేయవలెనని భావము.

జ్ఞాపకశక్తి

ఇది యంతఃకరణశక్తి. అంతఃకరణభాగములైన మనస్సు, చిత్తము, బుద్ధి యను మూటిలో చిత్తముయొక్క స్వభావము అనుసంధానము అని యిదివరకే చెప్పబడెను కదా. అనుసంధానమనగా ఇంతకు పూర్వ మొకనాడు ఇట్టియిట్టి సందర్భములయందు ఈవిధమైన అనుభవము సిద్ధించెనుకదా. నేడును నాటి సందర్భములే తటస్థించియున్నవి గనుక నాడు సిద్ధించిన అనుభవమే నేడును సిద్ధించును అను జ్ఞాపకము. కనుక చిత్తముయొక్క ధర్మము జ్ఞాపకము. కొందరు తమకు దృఢమైన జ్ఞాపకశక్తి కలదని చెప్పుకొందురు. కొందరు తమకు జ్ఞాపకశక్తియే చాలదనుకొందురు. ఇట్టి వ్యత్యాసమునకు కారణ మేమనిన, మనల కందరకును పూర్వజన్మ వాసనలున్నవి. ఆ వాసనలను అనుసరించి కొందరికి కొన్ని వస్తువులయందు, కొన్ని విషయములయందు, కొందరు మనుష్యులయందు, రాగమును, మరికొన్ని వస్తువులు, విషయములు, మనష్యులు, వీర్లయందు రాగములేమియు గానున్నది. అదే విధముగా కొన్ని విషయములు, కొందరు మనుష్యులు, ఇట్టి వాటియందు ద్వేషము ​కూడ నుండును. అట్టి ద్వేషమున్న వాట్లయందు మన మనస్సునకు అక్కర కలుగదు. రాగమున్నస్థలములో నభిమానముండును. మిగతవిషయములలో అశ్రద్ధయుండును. ఏ యే విషయములను మనము అభిమానము, శ్రద్ధ వీట్లతో గమనింతుమో వాటియందు జ్ఞాపకము స్థిరముగానుండును. అభిమానము లేక, శ్రద్ధాహీనులమై మనము చూచు, విను, విషయములయందు జ్ఞాపకము సున్న. ఇది మనయొక్క తప్పు గనుక ఏకార్యమైనను శ్రద్ధతో, అభిమానముతో చేయుచుండు వాడుకను అనగా నిలకడచెందిన మనస్సును ప్రయత్నపూర్వకముగా కలుగచేసికొంటిమంటే జ్ఞాపకము మనకు బలపడును.


శ్రీమద్భగవద్గీతయందు అర్జునుడు చెప్పినది యేమన

చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢం ।
తస్యాహం నిగ్రహంమన్యే వాయోరివ సుదుష్కరం ॥

(భ. గీ. 6-34)


ఓయి శ్రీకృష్ణా నామనస్సు మహా చంచలస్వభావము గలదియు, దేహేంద్రియాదులను క్రోధపెట్టి పరవశతను తెలుపునట్టిదియు, నిగ్రహించుటకశక్యమైనదియు, విషయములయందు దృఢమైన ప్రవేశము కలదియుగానున్నది. దానిని నిలుపుట గాలిని కట్టిపెట్టుట యెంతకష్టమో అట్లు శ్రమగానున్నది అని చెప్పుకొనెను గదా. అర్జునునివంటివానియొక్క మనస్సే యిట్టి స్థితియందుంటే మనవంటివార్ల సంగతి అనుకో నవశ్యముండదు. చంచలమైన మనస్సుతో నేకార్యము చేసినను ప్రయోజనములేదు. గనుక మనస్సును తనయిచ్ఛ వచ్చినట్టు పోనియ్యకూడదు. కోతివలె ఒక ​వస్తువునుండి మరియొక వస్తువుపైకి దాటు అభ్యాసమును చాలించునట్టు చేయవలెను. ఇట్లు చేయుప్రయత్నమునకు ఏకాగ్రతయని పేరు. అనగా మనస్సునకు ఒక వస్తువును చూపి "ఓ మనసా యీవస్తువును విడిచి నా ఉత్తరవు పొందువరకును వేరువస్తువుపైకి పోకూడదు" అని చెప్పవలెను. చిత్తైకాగ్రతతో నేకార్యము చేసినను ఏ విషయమును చింతించినను, ఏవస్తువుగమనించినను, జ్ఞాపకము ధృఢముగా నుండును.

వాసనలను శుద్ధిచేసి కొంటేనే గాని మనస్సు మనకు వశపడదు. మనస్సు వశపడకుంటే మనము చేయు కార్యములకు వీర్యము తక్కువ. వీర్యహీనమైనకార్యములు చేసి ప్రయోజనము లేదు. లోకమందు ఏవ్యవహారమందు మనము ప్రవేశించినను, వ్యాపారము, చదువు, ఉద్యోగము, జపము, తపస్సు ఇట్టి కార్యములలో నేదియైనను ఏకాగ్రతచెందినమనస్సుతో చేసినగాని వేరువిధమున ప్రయోజనాభావమును, కాలహరణమును కలుగును. కనుక మనస్సును ఏకాగ్రముగా నుంచుకొనువిధమును విచారింతము.

చిత్తైకాగ్రత


ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే !
తదస్య హరతి ప్రజ్ఞాం వాయు ర్నావ మివాంభసి ॥

(భగవద్గీత, అధ్యా 2, శ్లో 67)


ఇంద్రియములు విషయములను వెదకుచు సంచరించుచుండగా ఏ ఇంద్రియమునైనను మనస్సు అనుసరించి వర్తించునో అట్టి మనోయుక్తమైన యింద్రియము ఆ మనస్సును ఏవిధముగానైతే ​నీటిమీద సంచరించుచున్న యోడను ప్రతికూలమైన వాయువు ఆయోడను త్రోవతప్పించి ముంచునో ఆ విధముగా తత్త్వజ్ఞానమార్గమునుండి తప్పుత్రోవలయందు లాగును.


జిహ్వైకతోచ్యుత వికర్షతి మానితృప్తా
     శిశ్నోన్యతస్త్వగుదరం శ్రవణం కుతశ్చిత్ ।
ఘ్రాణోన్యత శ్చపలదృ క్క్వచ కర్మశక్తి
     ర్బహ్వ్యస్సపత్న్య ఇవ గేహపతిం లునంతి ॥
సైత న్మన స్తవ కథాసు వికుంఠనాథ
     సంప్రీయతే దురితదుష్ట మసాధు తీవ్రం ।
కామాతురం హర్షశోక భయైపణార్తం
     తస్మిన్ కథం తవగతిం ప్రమృశామి దీనః ॥

(శ్రీమద్భాగవతం-సప్తమస్కంధము, నవమోధ్యాయము)


ఇట్లని పరమభాగవతుండైన ప్రహ్లాదుడు శ్రీమన్నృసింహమూర్తిని ధ్యానించెను. ఈ శ్లోకంబుల తాత్పర్యంబేమన-


తృప్తిజెందక నాయొక్క జిహ్వేంద్రియము ఒక్క పార్శ్వమునను, శిశ్న మొక్క పార్శ్వమునకును, శ్రోత్రేంద్రియ మొక్క ప్రదేశమునకును, ఘ్రాణేంద్రియము మరియొక్క స్థలమునకును, చంచలతయే స్వభావముగాగల నేత్రేంద్రియ మొక్కెడకును, కర్మేంద్రియములు మరియొక్కెడకును, నన్నాకర్షించుచున్నవి. ఈ చిత్రమును విచారించగా లోకమం దనేకభార్యలను బెండ్లియాడిన వానిని ఆ భార్యలందరును ఏకకాలమున తమ తమ యిండ్లకు రమ్మని పీడించిన యట్లున్నది. భార్యేషణ విత్తేషణ పుత్రేషణయను నేషణాత్రయంబుచేతను, హర్షము, శోకము, భయము, మొదలగు ​మనస్స్వభావములచేతను శ్రమపడి దైన్యముచెందినవాడనైనను నేను చేసిన పాపములచే బీడింపబడిన నా మనస్సు కామాతురమైనదై యున్నను ఓ వైకుంఠనాథా, నీయొక్కకథలను వినను ఇచ్ఛగొన్నదిగా గనబడదు గాన నిన్నేవిధమున చెందగలను. నీ చరితంబు లేవిధంబుగ వినగలను. అని తనదైన్యమును, తనయొక్క యింద్రియముల ప్రబలతనును భక్తాగ్రగణ్యుడైన ప్రహ్లాదుడు చెప్పి దుఃఖంచెను.

కావున జిహ్వాదీంద్రియములు ఒక్కొకటియు నొక్కొక్క దారిన లాగుచుండగా వాటిని నిరోధించను శక్తిలేని మనస్సుగల వాడు భక్తియోగముగాని, జ్ఞానయోగముగాని, కర్మయోగముగాని అనుష్ఠించలేడు. ఇంద్రియముల వెంబడి పరువెత్తనీయక మనస్సును తనకు (జీవాత్మకు) ఇష్టమైన యొక వస్తువునందు నిలుపు శక్తి జీవాత్మ సంపాదించుకోవలెను.

మనస్సును ఏకాగ్రముగా జేయవలెనను ప్రయత్నముచేయు వారలకు ఉపాసకు లని పేరు. ఉపాసకులలో ననేక భేదంబులు గలవు. అనాదియైన త్రిగుణములయొక్కయు వాటియొక్క త్రివృత్కరణభేదంబుల వలనను ఎదో యొకగుణమును ముఖ్యముగా గలవారలు. త్రివృత్కరణ మనగా మూడింటగుణించుట. పంచీకరణము అనగా నైదింటగుణించుట. ప్రకృతమందు గుణత్రివృత్కరణము ఏమని విచారించవలెను.

సత్త్వగుణము ముఖ్యమై రజోగుణము కొద్దిగను తమోగుణము కొంతయు కలిగియుండు జాతి యొకటి. రజోగుణ మధికముగను సత్వగుణము తమోగుణము ఇవి కొంచెముగా గలిగి ​యుండు జాతి మరియొకటి. తమోగుణము అధికమై సత్త్వగుణము రజోగుణము కొంచెముగా గలిగియుండు జాతి మరియొకటి. ఏజాతియందు చూచినను మూడుగుణములు కనబడుచుండు స్థితికి గుణత్రివృత్కరణమని పేరు. అది యెట్లనగా


రజస్తమశ్చా భిభూయ సత్త్వం భవతి భారత ।
రజస్సత్త్వం తమశ్చైవ తమస్సత్వం రజ స్తథా ॥

(భ. గీ. 14-10)


ఓయి అర్జునా సత్త్వగుణము అనునది రజోగుణముమను తమోగుణమునును అణచి తనయొక్క స్వభావములగు జ్ఞానము, సుఖము వీట్లను కలుగజేయును. రజోగుణమనునది సత్త్వగుణమునును తమోగుణమునును అణచి తన స్వభావములగు కర్మలను ప్రేరేపించును. అదే విధముగా తమోగుణము సత్త్వగుణమును రజోగుణమును అణచి తన స్వభావములైన అజాగ్రత, ఆలస్యము, నిద్ర, సోమరితనము అను స్వభావములను కనపరుచును. తమోగుణము ముఖ్యముగా వివేకము అను వాసననైనను కనబడనీయదు.


యోగశాస్త్రజ్ఞులు మనస్సునకు రెండు అవస్థలను చెప్పియున్నారు. వ్యుత్థాన దశ యొకటి. నిరోధ దశ రెండవది. ఇందులో వ్యుత్థానము అను దశయందు మూడు భాగములు గలవు. క్షిప్తము, మూఢము, విక్షిప్తము అనునవి. క్షిప్తమనగా నెల్లపుడును రజోగుణము అధికముగానున్నందున నా రజోగుణ స్వభావములనే చూపెడుస్థితి. మూఢమనగా తమోగుణ మధికముగానున్నపుడు ప్రమాదము ఆలస్యము నిద్ర యిట్టి స్వభావములనే చూపునట్టి స్థితి. విక్షిప్తమనగా సత్త్వగుణము అధికము ​గా నుండగా నేకాగ్రతను చెందినను అపుడపుడును రజోగుణప్రేరితమై ఆ రజోగుణముయొక్క స్వభావములైన విషయములలో ప్రవేశింపించు స్థితి.

నిరోధదశ యనగా సత్త్వగుణము అధికముగా నుండుటచేత నేకాగ్రత చెందిన మనస్సు ఇటునటు కదలక "యథా దీపోనివాతస్థో నేంగతే జ్వలతే పునః" గాలిలేని స్థలమునందుండు దీపము కదలకయే వెలుగుచుండు రీతిని నిలిచి యుండుట. ఈ స్థితికే యేకాగ్రచిత్తమని పేరు.

సాధారణముగా లోకవ్యవహారములయందు కాలము గడుపు జనులు తమ మనస్సులు పరువులిడుచుండుటను కనుక్కోలేరు. చంచలము మనస్సుయొక్క స్వభావము. ఐనను పరువులిడు స్వభావము గల జంతువులను స్వేచ్ఛగా పోనీయక నొక స్తంభమునకు కట్టిపెట్టితిమంటే ఆ జంతువు అట్టి కట్టును విడిపించుకొని స్వేచ్ఛగా బరువులిడను చేయుప్రయత్నములు మెండు. గంతులు వేయును. స్తిమితమువదలి కట్టినత్రాళ్లుతెంచుకొని పోవుప్రయత్నములు చేయును. ఆ జంతువును స్తంభమునకు కట్టకమునుపుకూడ గంతులువేయు స్వభావము ఆ జంతువున కుండినది. అయినను మనము శ్రద్ధతో ఆ స్వభావమును గమనించలేదు. అదేవిధముగా లౌకిక జనులయొక్క మనస్సులు బహుశా పరువెత్తు స్వభావము కలవే. ఇట్లుండ నెవడైనను ప్రయత్నపూర్వకముగా తన మనస్సు నేకాగ్రముగా నుంచవలెనని పాటుపడితే అపు డతనికి తన మనస్సు అతి చంచలమని తెలియును. ఇదివరకును మనస్సును నింద్రియములను నిరోధించను ఏ ప్రయత్నము చేయలేదు గనుక ​నిపుడు అతనికేమి తోచుననగా, భాపురే, నామనస్సు అతి చంచలమే. దీని నేవిధమున నొక స్థలమందు నిలుపగలనని యాశ్చర్యము, చింతయు కలుగును. అయితే యిందు చిత్రమేమియులేదు. మనము రైలుబండిలోనుండి ఆ బండి ఘంటకు నలువదిమైళ్ల వేగముతో బరువెత్తుచుండ నాబండియందు సుఖముగా కూరుచుండు మనకు ఆ వేగము తెలియరాకున్నను మనము ఆబండిలో లేక పొలములో నిలబడియుండి వేగముతో బరువెత్తు రైలుబండిని చూచితే, భళీ, యీ బండి యింత వేగముతో బోవుచున్న దా యని విస్మయము చెందుదుము గదా. అదే విధమున మన మనస్సు అతివేగముతో నొక వస్తువుపైన యైనను కొంతకాలము నిలువక బరువెత్తుచుండిన కాలమందు మనమైన జీవాత్మలును ఆ మనస్సువెంబడి పోవుచుంటిమి. అటు గాక మనస్సు వేరు; నేను వేరు; మనస్సనునది నాయొక్క యింద్రియము; నేను మనస్సున కధిపతిని అని యెరిగి మనస్సును నిలుకడ నుంచను ప్రయత్నపడినపుడు రైలుబండిలో నుండి వేరైన పిమ్మట ఆ బండియొక్క వేగమును మనము తెలిసికొనిన విధముననే మనస్సుయొక్క వేగమును కూడ తెలిసికొందుము; అందువల్ల భయపడవలసిన యవశ్యములేదు. అధైర్యముచెంద నవశ్యములేదు. ఒకానొకడు ఒక గుఱ్ఱమును గొని దానిని సవారిచేయను తలచినపుడు అది ఎడము ఇయ్యక యజమానుని తన్నను కరువను ప్రారంభించిన మాత్రముననే అధికముగా ద్రవ్యము సెలవు చేసి కొన్న గుఱ్ఱమును యే యజమానుడైనను విడిచి పెట్టునా? విడిచిపెట్టడు గదా. అయితే ఆ గుఱ్ఱమును నయమున భయమున నభ్యాసమునకు లోబరచి తన స్వాధీనము ​చేసికొనును గదా. ఆ రీతిగనే మనమును మనస్సును నయమున మనకు లోబరుచుకోవలెను.

చిత్తమును జయించుటకు రెండుమార్గములు కలవు. మొదటిది యుక్తి. రెండవది హఠయోగమునందు చెప్పిన మార్గములు. అందులో మొదటిమార్గమైన యుక్తిని ముందుగా విచారింతము. యోగసూత్రములయందు “అభ్యాసవైరాగ్యాభ్యాం తన్నిరోధః” అని చెప్పియున్నది. "అభ్యాసేన తు కాంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే" అని శ్రీభగవద్గీతయందును చెప్పియున్నది. కనుక కించిత్తు వైరాగ్యము చెంది మనోనిగ్రహమున కభ్యాసము నారంభించవలెను. మనస్సును నిరోధించుటకుగా మనకు కావలసిన వైరాగ్యము మిగుల కష్టమైనది గాదు. దుశ్చరితములను మాత్రము నిలుపుకోగల శక్తి యొక్కటి సంపాదించుకోవలెను. మరియును తాను పొందవలెనని ఇచ్ఛయించిన వస్తువును ఏ విధమున నైనను పొందెదను అను మనోదృఢముండవలెను. ఈ మనోదృఢము మిక్కిలి సహాయకారి. పాఠశాలలయందు చదువు బాలురు తమ పరీక్షలయందు తేరి తద్వారా పురోవృద్ధికి రావలెనను దృఢతరమైన యిచ్ఛగొనియుందురుకదా. అట్టి బాలురు తమ పాఠములను హెచ్చరికతో వల్లింతురు. చింతనము చేయుచుందురు. వల్లించునపుడును మనస్సునందు వికారములు పుట్టకయుండవలెను. ఇంద్రియ సుఖములయందు ఆశగాని ఆటలయందు అభిలాషగాని కలిగినయెడల వల్లింపు, చింతన ఇవి బాగుగ జరుగవు. సుఖముల యందును ఆటలయందును తత్కాలమునకు ఇచ్ఛలేమి యొక విధమైన వైరాగ్యము. ఈ మాత్రపు వైరాగ్యముంటే వల్లింపు, చిం ​తన ఇవి బాగుగ జరుగును. ఒక పుస్తకము నెత్తికొని యతి ఆదరముతో చదువనారంభింతురు. ఒక పుటయందు యిరువది పంక్తులుండును. చదువుచు రాగా కండ్లు పుటను చూచుచు పెదవులు ఆ శబ్దముల నుచ్చరించుచుండినను ఆ పుటలో నాలుగు పంక్తుల వరకును చదువరియొక్క మనస్సు కంటితోనును పెదవులతోను కలిసి పనిచేయుచుండి అయిదవ పంక్తి మొదలు తాను (అనగా మనస్సు) ఆ పుటను ఆపుస్తకమునును వదిలి యెక్కడికో యొక యూరికి గాని, లేక నిన్నటిదినము ఆ చదువరి విన్నయుపన్యాసములనైనను, లేక తాను ఆడిన యాటలనుగాని, లేక తనకు స్నేహితులుగానుండు స్త్రీపురుషుల యిండ్లలో తినిన పిండివంటలను గాని తలచి యానందించుచుండును. మనస్సు ఈ ప్రకారము విహరించుచుండగా కండ్లు పుస్తకమును విడిచి పోవు. పెదవులు పంక్తివెంబడి పంక్తియు చదివి ఆ పుట ముగించును. మనస్సు తప్పించుకొని పరుగెత్తిపోయిన వివరము చదువువాడు గమనించలేదు. అయితే తాను చదివిన పుటయందలి విశేషములు ఏవియని చింతన చేయ నారంభించిన యపుడు ఆ పుటయందు గల మొదటి నాలుగు పంక్తులయందు చెప్పియుండు సంగతులు మాత్రము చింతన కుపయోగించును గాని మిగిలిన భాగము కొంచెముగాని అవగాహనయై యుండదు. సర్వప్రయత్నములగుండా తాను పరీక్షలో తేరవలెనని యుద్దేశించియుండు విద్యార్థి యేమి చేయవలెనంటే, తాను యే పుటను చదువుచుండెనో అదే పుటను మరల నారంభించి అనగా మొదటి పంక్తి మొదలు చదువనారంభించి జాగరూకతతో గమనించుచు చదువవలయును, అపుడు ఏమి ​జరుగునంటే మనస్సైనది తన దొంగతనము నీ విద్యార్థి తెలిసికొన్నాడని యెరిగి యిటు అటు పోక ఏడు ఎనిమిది పంక్తుల వరకును విద్యార్థియొక్క నేత్రేంద్రియము, వాగింద్రియము, వీట్లతో కలిసి పనిచేయుచు తొమ్మిదవ పంక్తి యొద్ద నుండి మరల స్వేచ్ఛగా పోవును. రెండవతూరి చదువునపుడు విద్యార్థి తనలో తాను సంతోషపడి మనస్సు తనను వదిలి యెక్కడికిని పోలేదని సంతోషించి యుండును. అట్టి సంతోషముతో చదువుచున్న తన యజమానుని ఏమరిచి మనస్సు మరల పరువెత్తి పోవును. ముందరి వలెనే ఆ పుటను చదివి ముగించిన విద్యార్థి ఆ పుటలో తాను చదివిన విషయమును చింతనచేయ నారంభించినపుడు ఎనిమిదవ పంక్తి వరకును అవగాహనయై యుండును. అపుడు విద్యార్థి తన మనస్సు యొక్క దొంగతనమును తెలిసికొని మరల నాపుటలో మొదటి పంక్తి నారంభించి చదువుచు రావలెను. మొదటిపంక్తినే యేల నారంభించవలెనంటే, దొంగతనము చేసి పరువెత్తిపోయిన మనస్సును దండించు నిమిత్తమై. ఇట్లు పలుమారు దండించితేనే గాని మనస్సు తనయొక్క చాంచల్యమును వదలచాలదు. జీవాత్మ తన కధిపతి యను నర్థము నంగీకరించదు. కావున నీ విధముగా విద్యార్థియైనవాఁడు తాను మనస్సునకును ఇంద్రియములకును యజమానుఁడను సంగతి తెలిపి నట్టైతే మూడవ తూరి చదువ నారంభించినపుడు మనస్సు అతిభక్తితో తనకధిపతియైన విద్యార్థిని మోసపుచ్చి యిటు అటు పరువెత్తదు. ఇంద్రియములును మనస్సును విద్యార్థిని అనుసరించి పనిచేయును. ఏ సమయమందు విద్యార్థి యేమరునో అప్పుడు తన యిష్టమైన విషయములపైకి వెళ్లెదనని మన ​స్సు పొంచువేయుచుండును ; గాని విద్యార్థి యేమరక జాగరూకడై యుంటే మనస్సు పరువెత్తక ఆ పుస్తకపుటయందే నిలుకడచెంది యుండును. ఈవిధముగా పలుమారు అనేక సంవత్సరములకాలము ప్రతిదినమును, ఏమిపని చేయుచున్నను ఏమరకయే నిశ్చితాత్ముడై మనస్సునకు అంకుశము వేసి వేసి స్వాధీనము చేసికొనవలెను. ఎపుడు మనస్సు తననిజమైన స్థితిని కనుక్కొనునో అపుడు తన యజమానుడైన జీవాత్మను ఏమరిచి మోసపుచ్చు ప్రయత్నమును వదలుకొనును.


యత్కృతం మనసా రామ తత్కృతం విద్ధి చా నఘ ।
యత్త్యక్తం మనసా రామ తత్త్యక్తం విద్ధి సర్వదా ॥

(జ్ఞానవాసిష్ఠం)


తాత్పర్యము——మనస్సుతో చేయబడిన కార్యమే కార్యము. మనస్సుతో చేయబడిన త్యాగమే త్యాగము. జ్ఞానేంద్రియములును కర్మేంద్రియములును బహిఃకరణములు. మనస్సు అంతఃకరణము. బహిఃకరణములును (అనగా వెలుపలి ఆయుధములును) అంతఃకరణమును (అనగా దాగి, లోపలనుండు ఆయుధమైన మనస్సును) కలిసి చేసిన కార్యమే కార్యము. కనుక మనస్సును ఏకాగ్రముగా నుంచవలెను. అనగా మనస్సును నిరోధించవలెను. అనగా మనస్సును మనము ఏవస్తువుపైన నిలిచియుండుమని నియమించితే ఆవస్తువుపైననే నిలిచియుండునట్టు అలవాటు చేయవలయును. చిత్తైకాగ్రత అని వ్యవహరింపబడు చిత్తజయమునకు అనేక మార్గములున్నను సాధారణజనులు సులభముగా సభ్యసించను సాధ్యమైన ​మార్గము పైవివరించిన విద్యార్థి పుస్తకమును చదువు రీతియే. అందువల్ల నేవిధమయిన చెరుపును సంభవించదు.

జపమాల

కొందరు తమ ఆహ్నికక్రియలు జరుపునపుడు మంత్రములను ఆవర్తిచేతురు. 108 తడవలు లేక 128 తడవలు లేక 1000 తడవలు ఈ ప్రకారము ఒకానొక మంత్రమును జపింతురు. అప్పుడు లెక్క పెట్టి జపించవలెనను ఇచ్ఛతో రుద్రాక్షమాల, లేక తులసిపూసలమాల, స్ఫటికమాల, పొగడములమాల, యిట్లు అనేక విధములైన పూసలను దారములో గుచ్చి యైనను లేక తామ్రము వెండి బంగారము ఇట్టి లోహముల తంతెలతో కట్టియైనను ఏర్పరచబడిన మాలల నుపయోగింతురు. మంత్రమును జపముచేయు విధానము లనేకములు గలవు. మంత్రము అను శబ్దమునకు అర్థ మేమనగా "మననా త్తారణా చ్చైవ మంత్ర ఇత్యభిధీయతే” అనగా మననము చేయుటవల్ల అట్టి మననము చేయువానిని తరింపజేయు శక్తికలది గనుక మంత్రమనబడును. మంత్రములు శబ్దస్వరూపములు. దేవతా విషయములు. ఋషి ప్రోక్తంబులు, ఛందోబద్ధంబులు. అనగా ప్రతి మంత్రమును ఏదో యొక దేవత నుద్దేశించియుండును. "ఓం నమః శివాయ" యను మంత్రమునకు దేవత మహేశ్వరుడు. "ఓం నమో నారాయణాయ" యను మంత్రమునకు దేవత శ్రీమన్నారాయణమూర్తి. "ఓం నమో భగవతే వాసుదేవాయ" యను మంత్రమునకు శ్రీమాన్ వాసుదేవుడు దేవత. అన్ని మంత్రములకు అక్షర ​సంఖ్యలు గలవు. ప్రతి మంత్రమునకును ధ్యానశ్లోక మొకటి కలదు. మంత్రములను జపించుకొనుటకు పూర్వము అంగన్యాసము, కరన్యాసము, దిగ్బంధము, అను తంత్రములు గలవు. అవి ముఖ్యములు. అంగన్యాస కరన్యాస దిగ్బంధములు చేసికొని ధ్యానశ్లోకముపఠించి ఆ ధ్యానశ్లోకమునందు వివరించిన ప్రకారము ఆమంత్రపు దేవతయొక్క రూపమును గురూపదిష్టమార్గమున భావించవలెను. గురూపదిష్టమనగా గురువులవారిచేత ఉపదేశకాలమందు చెప్పబడిన విధముగా నని యర్థము. మంత్రమునకు సంబంధించిన దేవతయొక్క రూపమును, కండ్లు, ముక్కు, చెవులు, నొసలు, చెక్కిళ్లు, కపాలము, ముఖవిలాసము, ఇత్యాది వివరములు ఖచితముగా నేర్పడునట్టుగా మునస్సుతో నేకాగ్రచిత్తము అను శక్తితో రూపము స్ఫుటముగా కట్టుకొని అట్టి మనోమయరూపము గల దేవతకు ఉపాసకుడు జపించు మంత్రమును సమర్పించుకోవలెను. పై వివరించిన జపము నోటిమాటలకు అతి సులభసాధ్యముగాని యనుష్ఠానమునకు అతి శ్రమసాధ్య మను సంగతి ప్రయత్నముచేసినపుడు తెలియవచ్చును. మనస్సులో నొక భాగముతో భగవంతునియొక్క రూపమును, వివరముగా, స్ఫుటముగా, ఆభిరూప్యము నిచ్చి భద్రముగా నిలుపుకొని యుండవలెను. ఇది మాసిపోవునట్లు ఏమర కూడదు. మనస్సుయొక్క మరియొక భాగముతో మంత్రమును జపించవలెను. ఒక స్థలమునందు క్షణమాత్రమైనను నిలుపుట కసాధ్యమైన మనస్సు నొకవస్తువుపైన నిలుపు శక్తిని సంపాదించికొని ఆ మనస్సుయొక్క మరియొక భాగముతో మంత్రమును మననము చేయవలెనంటే అతి కష్టసాధ్యము. ఇంతేకాక ​తాను జపించు మంత్రము ఎన్నితడవలు జపించినదని లెక్కపెట్టుకోవలెనంటే మనస్సులో మరియొకభాగ మేర్పరిచి ఆ భాగముతో లెక్క పెట్టవలెను. అపుడు ఎన్ని పనులు ఏక కాలమందు జరుగవలెనో యోచింతము. మనస్సుయొక్క ఒక భాగముతో, ఏకాగ్రచిత్తముతో కట్టిన శ్రీమద్భగవంతునియొక్క విగ్రహమును పోగొట్టుకోక, నిలుపుకొని యుండుట మొదటిది. మఱియొక భాగముతో నేకాగ్రముగ మంత్రమును మననము చేయుట రెండవది. జపమాల చేతంబూని దానియందలి పూసలు లెక్కకు సరిగా త్రిప్పుచువచ్చుట మూడవది. అధమపక్షము ఈ మూడు కార్యములును ఏక కాలమందు జరుగవలెను. ఇది కష్టతరము. అనేక సంవత్సరముల యభ్యాసమువల్ల కలుగు శక్తివల్లనే గాని సాధ్యము కాదు. అందువల్లనే జపమాలికలు అనేక తరహాలవి. మనస్సుయొక్క జయము కొంచెముగా గలవారలు ఉపయోగించను సాధ్యమైన మాలలో పదునారుపూసలు మాత్ర ముండును. నూటయెనిమిది తడవలు మంత్రమును మననము చేయుటకు విశేషకాలమవును, అంతకాలము మనస్సు నేకాగ్రముగ నుంచుకొనుట చాల కష్టము. పదునారు తడవలు మంత్రమును మననము చేయుటకు స్వల్పకాలము చాలును. ఇది చక్కగా, దృఢముగా, అంతరాయము లేకయే, జపము చేయుశక్తి గలిగిన తరువాత ముప్పదిరెండు పూసలమాల నుపయోగించవచ్చును. అది చక్కగా, నిశ్చలముగా, నిరంతరాయముగా, సాధ్యమైన తరువాత ఏబదినాలుగుపూసలమాల నుపయోగించవచ్చును. ఈ ప్రకారము తనయొక్క మనస్సును ఉపాసకుడు తనయొక్క అంత ​రాత్మతృప్తి చెందునటులజయించి, ఏకాగ్రపరిచి, మనసా రూపమును కట్టుశక్తిని, కట్టినరూపమును నిలుపుకొనుశక్తినిని, నిశ్చలముగా సంపాదించుకొనిన పిమ్మట మనస్సును ఏకకాలమందు రెండు మూడు నాలుగు పది వస్తువులపైన ప్రత్యేక ప్రత్యేకముగా నిలుపుశక్తిని సంపాదించికొనవచ్చును. ఇట్టి శక్తికే సప్తావధానము, దశావధానము, శతావధానము అనిపేళ్లు. ఈ శక్తులు అతి కష్టసాధ్యములు. ఇట్లుండగా ననేకులు జపములు చేయువారల మనస్సేకాగ్రముగా నున్నదో లేదో భగవంతునికే తెలియవలెను. నూటయెనిమిది పూసలమాలలను ఉపయోగించుచు, రుద్రాక్షలతోకవచములు కీరీటములు చేసికొని, చేత నక్షమాల బూని, ఆ మాలను ఇతరులు చూడకూడదని గోముఖము అను నొక తిత్తియందు మాలబూనిన చేతిని చొప్పించి, బహిరంగస్థలములయిన నదీతీరములు, ఉద్యానములు మొదలగు స్థలములయందు అనేకులు తనను చూచుచుండగ జపముచేయుచు, అట్టి విచిత్రస్థితిని పొటగ్రాపులగుండా లోకమందు

ప్రచురించుచుందురు. ఇట్టి మహానుభావులు నిజముగా నేకాగ్రచిత్తములతో పైవివరించిన ప్రకారము మనోరూపమును అభిరూప్యముతో కట్టి, స్థిరముగా నుంచుకొని, మంత్రమును మననముచేసి, మాలతో పూసలను కూడ తప్పిపోకయే తోయుచు వచ్చు శక్తి గలిగియుంటే వారికి నానమస్కారంబుల సమర్పించెద. శిష్యుని మనస్సుయొక్క ఏకాగ్రతనుతెలిసిన గురువులు శిష్యులకు జపమాలను ఇచ్చుట సంప్రదాయము. ఇందుకు మాలాసంస్కారమనిపేరు. ​

చిత్తజయోపాయములు

చిత్తజయమున కుపాయంబులు హఠయోగాది త్రోవలలో ననేకంబులుండినను అతి జాగరూకతతో, సద్గురువులవారి యుపదేశప్రకారము అభ్యసించితేనే గాని యామార్గముగుండా శ్రమకలుగకమానదు. ఇంగ్లీషుభాషయం దనేకపుస్తకములు ఇటీవల ప్రాణాయామాది మార్గంబుల మనస్సును జయించు ఉపాయములను గురించి వ్రాసియున్నారు. వాటియందు చెప్పిన ప్రాణాయామముల నభ్యసించను ప్రయత్నించితే తొందర కలుగవచ్చును. కొందరు అభ్యసించి కష్టము పడియున్నారు.

అనేక జన్మములయందును మనస్సు తానే అధిపతియని తప్పభిప్రాయమును చెందియుండి స్వేచ్ఛాసంచారము చేసి చేసి స్వతంత్రము చెందియున్నది గనుక అట్టి స్వతంత్రము మరువ చేయవలెనన్న ననేక కాలము పైవివరించిన యభ్యాసమును చేయుచురావలెను. ఒకానొకఁడు పదిసంవత్సరముల కాలము స్వేచ్ఛావిహారముచేసి తద్వారా దేహమునకు జబ్బు గలుగజేసికొని యుండును. అందువల్ల అనారోగ్య మధికమై వాతరోగము, కాళ్లు, కీళ్లు, నొప్పులు మొదలయిన జబ్బులను అనుభవించుచుండును. అట్టివాడు తనకు సంభవించిన అనారోగ్యతను పోగొట్టుకోవలెనని ఔషధములు పుచ్చుకొన ప్రారంభించును. ఒక వారమురోజులు ఔషధము పుచ్చుకొని తనకు ఆలోపలనే ఆరోగ్యము కలుగలేదని చింతించితే ఆరోగ్యము కలుగునా? పదిసంవత్సరముల కాలము కొంచెము కొంచెముగా నిరంతరము వృద్ధిపొందుచుండిన జాడ్యమునకు ఒక సంవత్సరకాలమైనను విరుగుడు ఔషధము ​సేవన చేయవద్దా? ఈ విషయము దేహధారులమైన మన కందఱకును తెలిసినదే కదా. అదే ప్రకారము అనేక జన్మములయందు స్వేచ్ఛగా పోయిన మనస్సును నిరోధించుటకు దీర్ఘకాలము, ఎల్లపుడును, ప్రయత్నము చేయుచు రావలెను. దీర్ఘకాలమనగా ననేకసంవత్సరముల కాలము. ఎల్లప్పుడును అనగా చదువునపుడుగాని, జపముచేయునపుడు మాత్రముగాని కాదు. ఏపని చేయుచుండినను సరే అపుడంతయు. ఇదియే ఎల్లపుడు అని అ అర్థము. దుర్మార్గమునందు అభ్యాసపడిన గుఱ్ఱమును అతి జాగరూకతతో సవారిచేయువాఁడు నడ, గాలపు, కాంటరు ఇత్యాది గతిభేదములతో గుఱ్ఱమును సవారిచేయుచుండినను ప్రతి నిమిషమును గుఱ్ఱము తనను క్రింద తోయునేమోయని అతి జాగ్రతగా నుండును కదా. ఆ విధమున మనస్సు మనను ఏకాలమందు ఏమార్చునో యని యతి జాగ్రతగా నుండవలయును.

చిత్తైకాగ్రత నారంభించువారికి కొన్ని శ్రమలు గలవు. మనుష్యులకు పిండాండమనియు లోకము (జగత్తు) నకు అండాండమనియు పేళ్లు. అండాండము అను జగత్తుయొక్క మనోమయకోశము అను సముద్రమందు ఎవడో ఒక జీవాత్మయొక్క మనస్సునందు పుట్టిన మంచి తలంపులు అను అలలవల్ల, అదేవిధముగా దుష్టతలంపు లనునట్టి యలలవల్లకూడ స్తిమితము తప్పును అని చెప్పబడియున్నది కదా. ఆవాక్యములకు నిజమైన యర్థము ఏమనగా—ఎక్కడనో యేవూళ్ళోనో యెవడో ఒక్కడు ఏదో ఒక విధమయిన తలంపులను తలచిన ఆ తలంపులు ప్రతి తలంపును ఒకరూపమును దాల్చి వెంబడే ఆతలంపునకు అనుగుణమైన యొక ​చేతనము ఆరూపమందు ప్రవేశించి ఆచేతనము ఆ మనోరూపముతో సహ జగన్మనోమయకోశము అను మహాసముద్రమందు అతివేగముతో విచ్చలవిడిగా సంచరించుచుండును అనియును; అట్లు సంచరించుసమయమందు ఆతలంపుతో సమానమైన గుణముగల తలంపులు తలచు స్వభావముగల జనులయొక్క మనస్సుల యందంతయు తనతో సమానమైన గుణముగల తలంపులను పుట్టించుచు, తనవంటిరూపములను అనేకములను, అట్టిరూపముల యందు నివసించగలచేతనము లనేకములను, పుట్టించుచుండు నని తాత్పర్యము. దివ్యజ్ఞానసమాజపువారి పుస్తకములలో నీరూపములకు థాట్ ఫారమ్సు (Thought-forms) అని పేరు. మనము సదా కాలమును మనస్సునం దేదో యొక విషయము తలచుచుందుము. తలచు తలంపులన్నియు మన స్వంత తలంపులు కావు. ఇతరుల తలంపులు అనేకములు పుంఖానుపుంఖములుగా మన మనస్సునందు అనుమతి లేకయే ప్రవేశించును. మనస్సు నేకాగ్రముగా నుంచుట కారంభించు సమయమందు ఇట్టి పరుల తలంపులు అనేకములు మనకు విదితములగును. కనుక మనముగా ప్రయత్నపూర్వకముగా తలంచని తలంపులకు స్థలమియ్య కూడదు. అపుడే యేకాగ్రత సాధ్యము.

మరియు చిత్తైకాగ్రతకు కొంచెము ప్రయత్నము అవశ్యము. ఈప్రయత్నము మనస్సునకు సంబంధించిన ప్రయత్నముగాని దేహమున కేవిధమైన సంబంధమునులేదు. సంతోషము, దుఃఖము, కోపము మొదలగు గుణములు మనస్సునకు సంబంధించినవే యైనను స్థూలశరీరముకూడ ఆ యా గుణములు పుట్టినపుడు తనలో ​నొక విధమైన మార్పును చూపును. సంతోషము కలిగినపుడు చిరునవ్వును ముఖమునందు శాంతియు కనపడును. కోపము వచ్చినపుడు ముఖమునందు రక్తమధికముగాఁ జేరి ముఖము మట మట లాడుచుండును గదా. ఇందువల్ల మనస్సునందుఁ పుట్టిన మార్పులు మనస్సులోనే నిలువక స్థూలశరీరమందు కూడ అట్టి మార్పులను చూపును అని తెలిసికొనవలెను. అదే విధముగా చిత్తైకాగ్రత నారంభించవలెనన్నపుడు స్థూలశరీర మొకవిధముగ బిగుతును చెందును. శరీరమందుండు మాంసకండలు బిగువెక్కి కనుబొమలు ముడిపడి ఎవనితోనో శత్రువుతో కొట్లాడ నుద్దేశించు వానివలె ముఖమునందును, శరీరమునందును, మెడయందును ఒక విధమైన బిగుతు గలుగును. ఇది కూడదు. కొంతదూరము అనగా పదినిమిషములు ప్రయత్నము చేయునప్పటికి మెడనరములును, వీపులోనును నొప్పి కలుగును. క్రమేణ తలనొప్పి పుట్టును. ఇట్టి దురవస్థల కవశ్యములేదు. శాంతముగా, సుఖముగా, సంతోషముగా ననుష్ఠాన మారంభించి నడుపవలెను. మనస్సును అంతకంటె బలశాలియైన కరణముచే జయించవలెనే గాని మనస్సునకంటె బలహీనమైన స్థూలశరీరముచే జయించుటకు సాధ్యముగాదు. గనుక స్థూలశరీరమందు వికారములు పుట్టకూడదు.


ఆధ్యాత్మ విద్యాధిగమః సాధుసంగమ ఏవ చ ।
వాసనాసంపరిత్యాగః ప్రాణస్పంద నిరోధనం ।
ఏతా స్తాయుక్తయః పుష్టా స్సంతి చిత్తజయే కిల ।

(జీవన్ముక్తివివేకము)

​ఆత్మవిద్యా గ్రంథములను చదువుట, సత్పురుషులతో సహవాసము చేయుట, కామము, క్రోధము, మదము, మాత్సర్యము మొదలగు దుర్గుణములు మనసమీపమందు రానియ్యక తొలఁగించుట,

ప్రాణాయామము, ఇవి మొదలయిన యుక్తులు చాల కలవు. ఈ యుక్తులలో ప్రాణాయామ మొక్కటి తప్ప మిగిలిన వేవియు భయోత్పాదకములు గావు. ప్రాణాయామము మాత్రము కొంచెము జాగ్రతగా నభ్యసించవలసిన విషయము గనుక ప్రాణాయామాభ్యాసము ప్రకృతమందు వదిలి మిగిలినయుక్తులను అభ్యసించవచ్చును. హఠయోగరీతిన మనస్సును జయించు ఉపాయములను కొంత విచారింతము. తరచుగా హఠయోగమందు ప్రాణాయామము అనునది యొక ముఖ్యమైన యుపాయము. ఇది చాల దుఃఖమును కలుగజేయును. శిష్యునియొక్క గుణాగుణములను బహుకాలము గమనించుచువచ్చిన సంప్రదాయజ్ఞుఁడైన గురువువల్ల నియ్యబడిన రీతిని ప్రాణాయామాభ్యాసము చేయవలెను. వేరువిధముగా ననేక చిల్లర పుస్తకములలో చెప్పిన ప్రకారము ప్రాణాయామమభ్యసించితే దేహమునకు రుగ్మత కలుగవచ్చును. అజీర్ణము, తలనొప్పి, దుష్టస్వప్నములు, పిచ్చిపట్టుట, ఇట్టి దుఃఖములు కలుగువచ్చును. జాగ్రతగానుండవలెను. రెండవది, హఠయోగులలో కొందరు స్వస్తికాది ఆసనముల గూర్చొని తమ యెదుట నొక శూలమును భూమియందు నాటి ఆ శూలమును రెప్పపాటు లేకుండ ఒకముద్రతో చూచు నభ్యాసము చేయుచుందురు. మరికొందరు తమ యెదుట తెల్లనిగోడమీఁద నొకనల్లని చుక్కపెట్టి ఆ చుక్కను రెప్పపాటు వేయకయే చూచుచుందురు. ఈ ​రెండు అభ్యాసములయందును చెరుపు నిష్కర్షగా కలదు. రెప్పపాటు లేక చూచుచుండునప్పటికి కండ్లు అలసటచెంది కండ్లలో నీరుకమ్మును. అంతటితో నాయభ్యాసము వదలకనే యాచరించుచుంటే కొన్నాళ్లకు కండ్లనరములు బలహీనములై వికారరూపములు కండ్లపడును. తలనొప్పి విడువదు. అట్టి తలనొప్పి మరవ గొట్టుటకుగా బంగి మొదలగు ద్రవ్యముల నుపయోగించుదురు. ఈ విధముగా చెడుపు కలుగును. హఠయోగాభ్యాసములు దేహదార్ఢ్యమును అనుసరించియుండును. మన యింట కట్టియుంచిన ఆవు తన కట్టు వదుల్చుకొని పరువెత్తినపుడు ఆ యావును మరల దాని స్థలమునకు చేర్చుటకు రెండుమార్గములు గలవు. ఆవియే వన, మంచి లేత పచ్చి గడ్డిని ఆ యావునకు చూపి ఆ గడ్డియందలి మోహముచే నా యావు మన సమీపమునకు రాగా మెల్ల మెల్లగా నా యావు కంఠమందు త్రాడు గట్టి తొటిగుండా దాని స్థలమునకు తీసుకొని వెళ్లి కట్టుట యొక మార్గము. లేక మంచి కఱ్ఱ చేతబూని ఆ యావును తరిమి తరిమి అది అలిసి నిలిచినపుడు దానిని పట్టి కట్టు మార్గ మొకటి. ఈ రెండు మార్గములలో మొదటి మార్గము యుక్తిమార్గము. అందువల్ల మనకుగాని ఆవునకుగాని శ్రమలేదు. రెండవ మార్గము హఠమార్గము. ఆవునకు శ్రమ మనకు అతిశ్రమ. ఈ రెండవమార్గము సుఖదాయకము గాదు. కనుక చిత్తమును గూడ యుక్తిచే నిరోధించుట యత్యావశ్యకము. అతిసులభము. ఆవునుపట్టి కట్టగోరినవాడు తానుగాని ఆవుగాని శ్రమబడకనే పచ్చిగడ్డియొక్క సహాయముతో ఆవును కట్టినట్లు ఆత్మవిద్యాభ్యాసము, సాధుసంగము మొదలగు ​నభ్యాసములచే చిత్తము జయించుట యుక్తిసాధ్యము అని పేరు. అదే యావును కఱ్ఱతో కొట్టి అలిపించి తాను అలిసి పిమ్మట పట్టి కట్టినరీతి హఠయోగాభ్యాసములతో మనస్సును స్వాధీన పరుచుకొనుట. మనస్సునే స్వాధీనపరుచుకొందురో లేక పిచ్చిపట్టితే మనస్సును పోగొట్టికొందురో తెలియదు. ఇట్లు పిచ్చిపట్టి చెడిపోయిన వారనేకులు గలరు. సులభమై, శ్రమగాని చెరుపుగాని లేని మార్గమునే యవలంబించవలెను.

చిత్తైకాగ్రతవలని లాభములు

లోకులు ఎవరో యే ఊళ్లోనో తలచినతలంపులు రూపములు గొని, జగన్మనోమయకోశమయిన మహాసముద్రమందు ఆ రూపములందు ప్రవేశించిన చేతనములతో సహ విచ్చలవిడిగా సంచరించుచు తమ స్వభావమువంటి స్వభావము గల తలంపులు తలుచుయోగ్యత గలవారల మనస్సులయందు తమ స్వభావమువంటి తలంపులు పుట్టించును అని 169 వ పుటలో చెప్పబడెను గదా. ఎపుడు మనయొక్క మనస్సు ఏకాగ్రతను చెంది యుండునో అపుడు జగన్మనోమయకోశమందు సంచరించు (థాటుఫారంను) చేతనములచే ప్రాణమును పొందిన మనోరూపములు మనవద్దకు రావు. అదియెట్లన్న, నేకాగ్రతచెందిన మనస్సు జాగరూకతతోనుండును. గనుక ఆ దుష్టతలంపులు, మన సమీపమునకు రావు. ఒకానొకడు మిగులవెలగల ద్రవ్యములను తన యింటియం దుంచికొని యుంటే కావలివార్లను నియమించి ద్రవ్యములను కాపాడుకొనును. కావలివారలు మేలుకొని యుండు సమయమందు ​సాహుకారుని యింటిలో దొంగలు ప్రవేశించుటకు వీలుండదు. ఏకాగ్రత చెందిన మనస్సు కావలివానితో సమానము. ఇతరుల దుష్టతలంపులు చోరులతో సమానము. ఇతరుల దుష్టతలంపులు మనయొక్క మనస్సును ప్రేరేపించి దుష్టకార్యములు చేయునుద్యమమును కలుగజేయుట మానును.

మరియొక యుదాహరణమున్నది. అది యేదన కుమ్మరవాని చక్రము అతివేగముతో తిరుగుచుండు సమయమందు మనమెవరైనను నొక రాతిని ఆ చక్రమునకు తగులునట్టు రువ్విన యెడల నా రాయి అతివేగముతో తిరుగుచున్న చక్రమునకు తగలగానే ఆ చక్రపువేగముచే రువ్విన వాని పార్శ్వమునకే తిరిగి వచ్చును.

ఏకాగ్రచిత్తము పరిపూర్ణముగాఁ జెందిన మనస్సు అతివేగముగా తిరుగుచున్న కుమ్మరవానిచక్రముతో సమానము. ఇతరుల దుష్టతలంపులు రాళ్లవంటివి. గనుక నేకాగ్రత చెందిన మనస్సుల యందు మన యనుమతిలేనిదే అవి ప్రవేశించవు. మోక్షాపేక్ష గలవారలు జపము, ధ్యానము, మొదలగు అనుష్ఠానములు చేయువారల యనుష్ఠానములు పరిపూర్ణముగ సాధించను ఏకాగ్రచిత్త మత్యావశ్యకము. అటుగాక మోక్షాపేక్షలేక కేవల లౌకిక వ్యవహారముల లోనే ఆసక్తిగలవారలకు కూడ ఏకాగ్రచిత్త మత్యావశ్యకము. వ్యాపారము చేయువారయి ఏకాగ్రచిత్తముతో తమలెక్కలను చూచుకొన్నట్లైతే తప్పులు కలుగవు. తాము క్రయమునకు తెచ్చుకొన్న సరుకులు నూర్లకొలది తమ అంగళ్లలో నుండగా వాటియొక్క వెలలు పుస్తుకములు చూడకయే చెప్పగలరు. కేవలము ఐహికచింతతోనే యుండువారు. ఏకాగ్ర ​చిత్తముతో నొక పుస్తుకము చదివినను ఆటపాటలు చూచినను అటుపిమ్మట ననేకసంవత్సరములు గడిచిన పిమ్మట కూడ ఏనాటకపాత్ర మెక్కడ ఉండెను, ఎవడు ఏ పాటలు పాడెను అను మొదలుగా గల వివరములను చక్కగా జ్ఞాపకముంచుకొందురు. మరియు నేకాగ్రమైన చిత్తముతో మన స్నేహితులను తలచి ఏవైనను తలంపులను పంపితే ఆ తలంపులు అట్టిస్నేహితుల మనస్సులలో ప్రవేశించి తమను తమ స్నేహితులు తలచుకొనుచున్నారేమో అని అనుకొందురు. అది యెట్లంటే. -

భావపరివర్తనము

ఇంగ్లీషులో "థాటుట్రాన్స్పరన్సు" అని చెప్పుదురు. "థాటు” అనగా భావము, "ట్రాన్స్పరన్సు" అనగా పరివర్తనము. అనగా మనయొక్క మనస్సులోని భావమును ఇతరుల మనస్సులో పలికి వారలకు తెలియకనే చొచ్చునట్లు చేయుట. ఇది భావపరివర్తనము. లోకులు ఒకరి యభిప్రాయములను గాని భావములను గాని యితరులకు తెలుప గోరినపుడు ఏ విధముగా తెలుపింతురని విచారింతము. (1) తన యభిప్రాయములను ఎదుటివానికి తెలుపవలెనంటే ఆ యభిప్రాయములు మనయొక్క మనోమయశరీరము నుండి స్థూలశరీరమందుండు వాగింద్రియమునకు దిగిరావలెను. పిమ్మట ఆయభిప్రాయము మాటలగా రూపెత్తవలెను. మొదటివాడు ఎదుటివానితో మాటలాడుట యొకరీతి. (2) లేక యెదుటివాడు మొదటివానియొక్క సమక్షమమందు లేక దూరాన నుంటే తనమనస్సునందలి యభిప్రాయములును ఒక దూతగుండానో లేక ​యొక యుత్తరము(జాబు)గుండానో తెలుపవచ్చును. (3) ఎదుటివాడు అతి దూరాననుంటే సమాచార మత్యవసరమైతే, తంతి సమాచారము పంపవచ్చు. దీనినే టెలిగ్రాము అని వాడుదురు. (4) టెలిగ్రాములు పంపడమునకు తంతులు అవశ్యము. తంతులయొక్క యొక కొనయందు సమాచారములను పంపువాడు కొన్ని గుర్తులుగల శబ్దములనుచేయును. ఆశబ్దములు తంతియొక్క కొనన నుండు ఆపీసులో విద్యుచ్ఛక్తివల్ల వినును. ఆశబ్దములను చేర్చి వ్రాసుకొని వానియొక్క అర్థమును ఒక సమాచారముగ వ్రాసి మనస్నేహితునికి టెలగ్రాపు ఆఫీసువారు పంపుదురు. (5) మరియొక విధమైన టెలగ్రాపు కలదు. తంతులు లేని టెలిగ్రాఫు అని పేరు. అది యెట్లన్న, ఒకానొక అత్యున్నత ప్రదేశమందు కొన్ని స్తంభములను కట్టి ఆ స్తంభములపైన విద్యుచ్ఛక్తి గల వస్తువులను ఉంచుదురు. ఆయున్నతస్థలమునకు సమీపమున భూమియందు ఒక గది కట్టి అందులో కొన్నివిద్యుచ్ఛక్తి యంత్రములను స్థాపించి కొన్ని సూదులను ఉంచుదురు. ఇట్లు అనేక స్థలము యందు ఆఫీసులు ఉంచుదురు. ఈ విధముగా భూమికి సమీపమందుండు గదిలోని విద్యుచ్ఛక్తియంత్రమందు మనమాటలకు ఏర్పడిన కొన్నిగుర్తులను కొట్టితే ఆగుర్తులు మనముండు స్థలమందుండు ఆపీసునుండి వెడలి ఇతరస్థలములయందు ఉండు ఆపీసులలోని సూదులను చలింపచేయును. ఆచలనములు అను సంజ్ఞలను మాటలగా వ్రాసికొని సమాచారములుగా మార్చుదురు. ఇందుకు తంతులు అవశ్యములేదు. ఉన్నతప్రదేశములయందు అత్యున్నతములైన స్తంభములు మాత్రము కొన్ని ఆవశ్యము. అనేక వేల ​మైళ్లలో నుండి పైవివరించిన తంతె లేని టెలిగ్రాపుల సమాచారములు రావచ్చును. దూరము ఒక లెక్క కాదు.

తంతులు లేకయే విద్యుచ్ఛక్తి ఏవిధముగా నొక యూరినుండి మరియొక యూరికిపోవునను ప్రశ్న మనస్సునందు కలుగవచ్చును. అందుకు సమాధాన మేమన, విద్యుచ్ఛక్తి యనగా వర్షాకాలమందు మేఘడంబరసమయమందు మేఘముతో మేఘము తగిలినందున పుట్టు ప్రకాశమునకు మెరుపులు అనిపేరు. మెరుపులు అను మాటకు సంస్కృతమందు విద్యుత్ అని పేరు. మెరుపులు, మెరుములు, మించులు, అను పదములన్నియు నొకటే యర్థమును తెలుపునవి. ఆమెరుపులయందు ఒక శక్తికలదు. ఒక నిమిషమునకు అనేక వేల మైళ్ల దూరము పోవుశక్తి. విద్యుచ్ఛక్తి సర్వకాలమందును ఆకాశమందు నిండియుండును. పృథివీతత్త్వపు పంచీకృత భాగములలో పృథ్వీవాయువుతత్త్వముయొక్క ప్రకృతి ఆకాశమునందు నిండియుండును. పృథ్వీవాయువు అను ప్రకృతిపరిణామము విద్యుచ్ఛక్తికి ముఖ్యమైన యుపాధి. మన యూరి యందుండు "తంతెలులేనిటెలిగ్రాపు" ఆఫీసునందు మనము చేయు చిహ్నములు మన యూరి సమీపమందుండు అత్యున్నత స్తంభములకు ఎక్కి అ స్తంభముల నావరించియుండు పృథ్వీఆకాశము అను తత్త్వభాగములో ప్రవేశించి ఒక నిమిషమునకు అనేక వేల మైళ్ల దూరమందుండు "తంతెలేని టెలిగ్రాఫు ఆఫీసు” స్తంభముల యొద్దకు పోయి అక్కడ నుండు ఆఫీసులోనుండు సూదులను కదలించును. ఆ ఆఫీసులోనుండువారు ఆ సంజ్ఞలను మాటలగా నర్థముచేసికొని సమాచారములను సిద్ధపరచి పంపుదురు. ఈ పై చెప్పిన ​అయిదు విధములైన త్రోవలకును భౌతికవస్తువుల సహాయము కావలెను. భౌతికవస్తువులనగా మనయింద్రియములకు, ప్రకృతము ముఖ్యముగా కండ్లకు, గోచరమగు వస్తువులు. అదృశ్యమగు ద్రవ్యమైన మనస్సు చేతనే సమాచారములను పరివర్తనము చేయు త్రోవ యొకటి కలదు. పరివర్తన మనగా నొక స్థలమునుండి మరియొక స్థలమునకు మార్చుట. అదే పైన ప్రస్తావింపబడిన "భావపరివర్తనము”. ఏకాగ్రచిత్తమును సాధించిన వారల భావములు, అనగా తలంపులు, అతి ఆభిరూప్యము చెందిన రూపములుగా కాగలవు. ఆభిరూప్యమనగా రూపము బాగుగా నేర్పడుట. ఆ విధమున నాభిరూప్యము చెందిన భావములు ఏకాగ్రచిత్తము సాధించినవాని మనస్సునందు పుట్టి, రూపెత్తి, అతడు ఉద్దేశించిన వారి మనస్సునందు ప్రవేశించును. వారలమనస్సులయందు ఆ భావము బాగుగా నేర్పడును. రామతీర్థుడను యోగాభ్యాసి యొకడు తన మనస్సును స్ఫుటముగా నేకాగ్రముగా చేసికొని వాని యింటి యందు ఒక సమయమందు కూర్చుండును. అతని స్నేహితుడైన లక్ష్మణస్వామి యను మరియొక యోగాభ్యాసి అనేక నూర్ల మైళ్ల దూరముననుండు తన యింటియందు అదే ఘంట, అదే నిమిషమందుకూర్చుండును. రామతీర్థుడును లక్ష్మణస్వామియు ఏతత్పూర్వమే నిబంధనలు జేసికొని ఫలానాఘంట సమయమునకు మన మిద్దరమును నొకగదిలో నేకాగ్రచిత్తులమై కూర్చొందము. ఒకరు తలచిన తలంపులు (భావములను) మరియొకడు తెలిసికొన ప్రయత్నముచేసి యేకాగ్రచిత్తుఁడై తన మనస్సును నిర్విషయముగా నుంచుకొందమని నిశ్చయించుకొందురు. ఇట్లు దృఢనిశ్చయులై కూరు ​చున్న తరువాత రామతీర్థుడు ఒక భావమును తలచి దృఢముగా మరియొక తడవ తలచి లక్ష్మణస్వామి మనస్సులో చొప్పింపించును. రామతీర్థుడు తలంపులను తలచునపుడు లక్ష్మణస్వామి మనస్సును నిర్విషయముగా నుంచుకొనును. పిమ్మట లక్ష్మణస్వామి తన వంతున తలంపులను తలచి భావరూపములను రామతీర్థునికి పంపును. అపుడు రామతీర్థునియొక్క మనస్సు నిర్విషయముగా నుండవలెను. అట్లయితే లక్ష్మణస్వామి తలంపులను రామతీర్థుడు తెలిసికొనును. ఈ ప్రకారము రామతీర్థుడు లక్ష్మణస్వామి యను పేళ్లు వహించిన అభ్యాసకులు వారు వారు తెలిసికొనిన విషయములను ఒకరికొకరు టపాలా ద్వారా ఉత్తరము వ్రాసి సంతసింతురు. ఇది యభ్యాసమనబడును. ఇట్టి యభ్యాసము ప్రతిదినమును చేసి దృఢపడిన పిమ్మట తన మనస్సునందలి భావమును ఇతరులమనస్సులలో చొప్పింపజేయుట సులభముగానుండును. ఏకాగ్రచిత్తము అను శక్తిని సంపాదించికొనిన వారికే మనస్సును నిర్విషయముగా నుంచుకొనుట సాధ్యము కనుక ఏకాగ్రచిత్తము ముఖ్యసాధనము. యోగశాస్త్రమందు

పరేంగితజ్ఞానము

అని యొక సిద్ధినిగురించి చెప్పియున్నారు. ఏకాగ్రచిత్తము గలవారు తమ మనస్సును నిర్విషయముగా నుంచుకొన్నపుడు వారెవరి ఇంగితమును (భావమును అనగా తలంపును) ఎరుగవలెనని యనుకొందురో వారిభావము నిర్విషయముగా నుండు తమ మనస్సునందు ప్రవేశించును. ఉదాహరణము. పోటగ్రావు నెత్తు ​వాడు తనయొక్క కామీరా యను నద్దమును సిద్ధపరచియుంచి యుంటే ఆయద్దమునకు ఎదురుపడు ఏవస్తువైనను ఆయద్దములో, తన ఇష్టమున్నను లేకున్నను, తన రూపము ముద్రింపఁబడక నూరకుండును. ఆ విధముగా నిర్విషయమనస్సు పరుల ఇంగితములను, అనగా భాషములను, తలంపులను, తెలిసికొనవచ్చును. ఇదే పరేంగితజ్ఞానమనుసిద్ధి. ఏ విధముగానైతే లోకమునందు ఇతరుల యనుమతి పొందకయే వారల సొమ్ము మనస్వాధీనము చేసికొంటే అట్టి చర్యకు దొంగతనము అని పేరు వచ్చునో అదే విధమున పరేంగితజ్ఞానమును సిద్ధిని సంపాదించినవారలు ఇతరుల మనస్సులోని భావములను వారి యనుమతిలేనిదే గ్రహించకూడదు. గ్రహించితే సొమ్మును గ్రహీంచినపుడు ఏ విధముగా నది దొంగతన మనబడునో అదే ప్రకారము ఇంగితాపహారము గూడ దొంగతన మగును. ఇది మహాదుష్కర్మ. అయితే ఈ సిద్ధిని లోకోపకారార్థముగా నుపయోగించ వచ్చును.

జీవాత్మ యజమానుడు. శరీరము ఒక రథమువంటిది. రథమును ఆరోహించి యా రథస్వామిగా నుండు వాడు జీవాత్మ. రథమునకు గుఱ్ఱములు కట్టుదురు గదా. ఆ గుఱ్ఱములే కదా రథమును లాగునవి. గుఱ్ఱములకు కళ్లెములు వేసియుందురు. ఆ కళ్లెముల జేతబూని సారథి గుఱ్ఱములను తోలును. అవి పరువెత్తగా రథము పరువెత్తును. రథమునెక్కిన యజమానుడు తన కార్యముల నెరవేర్చుకొనును. రథస్వామి జీవాత్మ, సారథి బుద్ధి, కళ్లెములు మనస్సు, ఇంద్రియములు గుఱ్ఱములు. అనగా మనస్సనునది యింద్రియములను సరియైన దారిన నడుపవలెను గాని ఇంద్రియముల ​వెంబడి మనస్సు పరువెత్తకూడదు. అట్లు కాక గుఱ్ఱములు విచ్చలవిడిగా పరువెత్తునపుడు సారథి కళ్లెముల లాగిపట్టక గుఱ్ఱములు పోవుదారిన పోనిమ్మని కళ్లెముల వదల పెట్టడు కదా. అదే విధమున నింద్రియములను వాటి త్రోవన పోనియ్యక మనస్సు ఆ యింద్రియములను ఆపుటకు బుద్ధిసహాయము కావలెను. అందువల్లనే "సర్వాదృష్టీః పరిత్యజ్య నియమ్య మనసా మనః" అని జ్ఞానవాసిష్ఠమందు చెప్పియున్నది. అనగా సర్వేంద్రియముల వ్యాపారములను వదలుమని మనస్సును మనస్సుచేత నియమించవలె నని యర్థము. ఇంద్రియములను వాటి వ్యాపారములలో ప్రవేశించక నియమించి మనస్సు తానును బహిఃప్రపంచమందు వేటలాడబోకయే స్థిరముగా ఏ విధమైన చలనమైనను లేక యుండుటకు నిర్విషయ మనస్సని పేరు.

నిర్విషయమైన మనస్సు నిశ్చలముగా పొటగ్రాపులు దీయువాని పెట్టలోనుండు అద్దమువలె నెమ్మదిగా నుండును. పొటగ్రాపువాని యద్దము తానుకదలక ఊరకుండగా ఆ యద్దమున కెదురుగానుండు వస్తువుల బొమ్మలు ఆ యద్దమునందు ప్రతిఫలించునవి కదా. ఆ రీతిననే నిర్విషయముగా మన మనస్సున్నపుడు ఇతరుల మనస్సునందలి ఇంగితములు, అనగా భావములు, అట్లనగా తలంపులు కొంచమైనను శిథిలముగాకయే నిర్విషయమైన మనస్సునందు ప్రతిబింబించును. ఇదే పరేంగితజ్ఞాన మను సిద్ధ సిద్ధి.

సహాయము చేయ బూనుకొనువానికి లోకు లందరును స్నేహితులే కదా. గనుక నతడు దుఃఖమునొందినవార్ల సమక్షమమునకు వెళ్లను జంకవలసినది అవశ్యము కాదు. ఒక వేళ తాను ​తన స్థూలశరీరముతో వారి సమీపమునకు వెళ్లను జంకినను తన యిల్లువిడిచి కదలకనే తాను తన సంకల్పరూపములు అను దూతలను లెక్కలేనన్నిటిని పంపి దుఃఖాక్రాంతుల మనస్సునకు శాంతి పుట్టునట్టు చేయవచ్చును. అది యేవిధముగానంటే సహాయము చేయ తలచుకొనువాడు తనయింట కూర్చొని మనస్సును ఏకాగ్రముగా జేసికొని ఎవరికి సహాయము చేయవలెనని యిచ్ఛయించునో ఆ పురుషుడో, స్త్రీయో వారియొక్కరూపమును మనసా చింతించి తన మనస్సుతో వారి రూపమును చక్కగా భావించుకొనవలెను. పిమ్మట ఆ పురుషునియెదుటనుండి అతనికి తాను స్నేహితుడుగానుంటే ఏ విధముగా నిరాటంకముగా నతని రహస్యములనుగురించి మాటలాడునో ఆ ప్రకారము తన మనస్సునందు నిలుపుకొన్న డుఃఖియొక్క రూపముతో అతిప్రేమ, ఆదరము, వీట్లను కనుపరిచి మాటాడవలయును. అట్లు మాటలాడుటకు నిర్ధారణచేయునట్టిసమయ మెటువంటిదిగా నుండవలెనంటే సహాయము పొందగల మనుష్యుఁడు కొంతవఱకు మనశ్శాంతితో నుండు సమయముగా నుండవలెను. అనగా పగట్లో మనుష్యులందరును హవ్యాసములతో మునిగియుందురు. రాత్రి భోజనానంతరము శయనించుటకు పూర్వము కొంతకాలము సుమారు అరఘంటసేపు శయనించుప్రయత్నములో నుందురు గనుక నా సమయము చాలమట్టుకును శాంతిసమయము. అట్టిసమయమందు సహాయముచేయ నుద్దేశించిన మేకాగ్రచిత్తుడు ఆ దుఃఖిని తలచి ప్రేమించి, ఆదరించి, స్నేహించి, ఊరడించి తాను తన మనస్సునందు కట్టుకొనిన యాదుఃఖియొక్క రూపముతో తన ​యూరడింపు మాటలు నన్నియు మాటలాడవలయును. ఈకార్యముయొక్క ప్రయోజన మేమిగా పరిణమించు ననిన, దుఃఖియొక్క మనస్సునందు కొంత కొంతగా కొన్నాళ్లకు దుఃఖము తగ్గును. ఏమి యిది యాశ్చర్యము ; ఈ విధమైన మన సహాయముతో నింతప్రయోజనము కలుగునా యని శంకింపవలదు. ఇందుకు శ్రీమహాభారతము ఆదిపర్వమందు మరియొక విధమైనదృష్టాంత మున్నది. పాండవులును కౌరవులును శ్రీద్రోణాచార్యులవారివద్ద నస్త్రవిద్యాభ్యాసము చేయుచుండినపుడు ఏకలవ్యు డను బోయవా డొకడు అస్త్రవిద్యార్థియై ద్రోణాచార్యులవారి నాశ్రయించి అస్త్రవిద్య చెప్పియిమ్మని వేడుకొనెను. వారు విద్యను చెప్పి యివ్వననిరి. అంత ఏకలవ్యుడు తన యర్యణమునకు వెళ్లి అచ్చట ద్రోణాచార్యులవారి రూపమొక్కటి మట్టితో సిద్ధపరిచి ఆరూపమునకు పూజలుచేసి దానినే గురువుగా భావించి అస్త్రములు నభ్యసించుచు వచ్చి నిజమైన ద్రోణాచార్యులవారిగుండా వారియొక్క శిష్యులు నేర్చుకొన్న విద్యల నన్నిటిని తానును నేర్చెనని విందుముకదా. ఈ కథయందు ఏకలవ్యుడు ఏకాగ్రచిత్తుడై ద్రోణాచార్యులవారిని స్మరించి తాను లాభము పొందెను. అదేప్రకారము మనమందరమును ఏకాగ్రచిత్తత సంపాదించి పరహితమును చేయవలెను. ఎప్పుడైనను పరపీడనమునకు గాని స్వహితమునకు గాని మనశ్శక్తిని ఉపయోగించకూడదు. ఈవిధముగా పరులకు మితిలేనంత సహాయము చేయుశక్తిని, భూతానుకంపయను గుణమును, ప్రియవాదిత యనుగుణమును అభ్యసించి పరమేశ్వరుని దూతలుగా ప్రచ్ఛన్నులుగా సేవించవచ్చును. ​మనమందరమును పురుషోత్తముడైన ఈశ్వరునియంశలము అను సంగతిని నమ్మితిమంటే ప్రకృతము భూలోకములో నుండు జీవాత్మలందరును, మరణము చెంది భువర్లోకము, స్వర్గలోకము అనులోకములలో వసించుచుండు జీవాత్మలందరును అన్నదమ్ములే కదా యనునమ్మకము దృఢముగా నేర్పడవలెను. జాతి, కులము, గోత్రము, స్త్రీపురుషభేదము లన్నియు స్థూలశరీరమును అంటియుండునవేగాని ఆత్మను ఆశ్రయించినవి కావు. గనుక చిత్తైకాగ్రతను సంపాదించికొనినవారు వాస్తవముగా, మాటలతో మాత్రము గాదు, భావమునందు సహ ఏకాగ్రచిత్తముతో “సర్వేజనా స్సుఖినోభవంతు" అని ప్రకృతము భూలోకమందు నివసించుచుండు జీవాత్మల నుద్దేశించియు, "లోకా స్సమస్తా స్సుఖినో భవంతు” అని భువర్లోక స్వర్గలోకములయందుండు జీవాత్మల నందర నుద్దేశించియు మనఃపూర్తిగా ప్రేమాదరములతో దీవించవలెను. చిత్తైకాగ్రత పొందినవార లనేకులు రాజయోగులు ఈ ప్రకారముగా మనల నందరిని యెల్లపుడును దీవించుచుండువారు. అందువల్ల మనలకు సంభవించవలసినచెరుపు కొంతమట్టుకు తగ్గును. మనమును అదేవిధముగా భ్రాతృభావము చూపవలెను. చిత్తైకాగ్రతనుగురించి యిక ముంచు 'భక్తి' 'ధ్యానము' అను నధ్యాయములలో మరికొన్ని సంగతులు వ్రాయబడును.

పైనచెప్పినరీతిగా మనస్సును నిలకడగా నొకవస్తువుపైన నిలిపినపుడు మనయుత్తరవు లేకనే మనస్సైనది ఆవస్తువును వదిలి వేరువస్తువులయొద్దకుగాని, విషయములవద్దకుగాని వెడలకనే, గాలి ​లేనిస్థలమందు కదలకయే వెలుగుచున్న దీపమువలె స్తిమితముగా నుండును. ఆస్థితికే "మనోనాశము " అనిపేరు.


యత్తు చంచలతా హీనం తన్మనో మృత ముచ్యతే ।
ఏష ఏవ మనో నాశ స్త్వవిద్యా నాశ ఏవచ ।
యద్య త్సంవిద్యతే కించి త్తత్రాస్థా పరివర్జనం ॥

(జ్ఞానవాసిష్ఠము)


ఇందుకు తాత్పర్యము.—


చంచలత్వహీనము అనగా చంచలత్వము అను స్వభావమును పోగొట్టుకొన్న మనస్సును శాస్త్రజ్ఞులు "మృతం" చచ్చినది అందురు. అనగా అట్టిమనస్సు నశించినది అనబడును. అట్టిస్థితికే మనోనాశము అని పేరు.


ఒకానొకడు తనమనస్సును తాను జయించినాడా లేదా అని తనశక్తిని పరీక్షించవలె నని యభిలాష కలవాడైతే


త్యజ న్నభిమతం వస్తు య స్తిష్ఠతి నిరామయః ।
జితమేవ మన స్తేన బాహ్యప్రసర ముజ్ఝతా ॥

(జ్ఞానవాసిష్టము)


తనకు అదివరకును చాల యిష్టమైన పదార్థమును వదిలి యీవస్తువును వదలినానని ఎంతమాత్రమైనను చింతలేకయే యెవడుండగలడో వానిమనస్సు నిజముగా జయింపబడినదే యని యర్థము.

మనస్సు ఈ ప్రకారము జీవాత్మకు స్వాధీన మైనపుడు జీవాత్మ తానై ప్రయత్నించి చింతించవలె నని యిచ్ఛయించిన విషయమునే చింతించును. ఒకానొకసమయమందు "బలవా నిం ​ద్రియగ్రామో విద్వాంస మపి కర్షతి" యను వచనప్రకారము ఇంద్రియములు మహాబలము కలవి గనుక మనస్సు ఏమరియున్న సమయమందు మనస్సును విషయముల పార్శ్వమునకు లాగవచ్చును.


ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ।

(శ్రీమద్భగవద్గీత)


ఇంద్రియములు నిలుకడ కలిగియుండనీయక క్షోభ కలుగచేసెడి స్వభావముగలవి. మనస్సును గూడ బలాత్కారముగా విషయములయందు ప్రవర్తింపను ఆకర్షించు స్వభావము కలవియని ప్రసిద్ధముగా తెలిసినవిషయము అని తాత్పర్యము.


ఇట్టి దురవస్థ ప్రాప్తించినసమయమందు జీవాత్మ తన ముఖ్య కరణమైన మనస్సును ఏకాగ్రపరిచి ఆ యింద్రియముల చేష్టలనుండి త్రిప్పి తన పురోవృద్ధి కభిమతముగ నుండు విషయమునందు నిలుకడగా నిలుపవచ్చును. ఇచ్చట నేకాగ్రతను సంపాదించిన ఫలము తెలియుచున్నది.


దిగ్బంధము


దిగ్బంధము అనుశబ్దమున కర్థమేమనగా దిక్కులయందు బంధము. అనగా నొకానొకడు ఉండుస్థలమునకు చుట్టును ఒక రక్షాబంధము కట్టుట. రక్షాబంధము అనగా తనను తాను రక్షించుకొనుటకై తనకు చుట్టు ఒక గోడవలె నిగ్రహశక్తిగల ఒక పొలిమేరను కట్టుకొనుట. ఒకానొకడు చాల ధనమును పెట్టెలలో పెట్టికొనియుంటే ఆ ధనమును ఇతరులు దొంగలించుకొని ​పోక యుండునట్టు ఒక గదిలో పెట్టి తలుపు మూసి తాళము వేసి యుంచితే ఆ ధనము భద్రముగా నుండునుగదా. ఆ పెట్టెలు ఉండు స్థలమునకు నలుదిక్కులయందును గోడలు గట్టి భూమిదిశను. భద్రపరచి అదే విధమున పైదిక్కు అనగా ఆకాశము (మేఘముల మార్గము) నుండి కూడ దొంగలు రాలేకుండునటుల ఆ గోడలపై, దళముగ కప్పువేసియుంచితే ధనము ఉండు పెట్టెలు భద్రపరుపబడినవి అనుకొనవచ్చును. అనగా ధనముగల పెట్టెలకు తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము, అధఃప్రదేశము, ఊర్ధ్వప్రదేశము అను అన్ని దిక్కులయందుండియు ఎవరైనను వచ్చి ఆ ధనమును స్పర్శించకుండునటుల భద్రపరచుట. స్వల్పమైన ధనమును గలవాఁడు ఆ ధనమును ఒక పెట్టెయందుంచి తాళమువేస్తే ఆ ధనమునకు దిగ్బంధముచేసినట్టు అర్థము. అదే విధమున ఒకానొకడు తనగదిలో కూర్చొని ఆ గదితలుపు గడియవేసికొని యితరులను రానియ్యక ఏదో ముఖ్యమైన హవ్యాసముతో నుంటే అతడు తనకు దిగ్బంధము చేసికొనియున్నాఁడు అనవచ్చును. అదే విధముగా మనస్త్రీలు అతి వెలగల నగలను ధరించి తాము నిద్రించు సమయమందు ఒకగదిలో ప్రవేశించి ఆ గదియొక్క తలుపును గట్టిగా భద్రపరుచుకొంటే దిగ్బంధము చేసికొన్నార నదగును.

లేక మానవంతులయిన స్త్రీలుగాని పురుషులుగాని తమవద్ద ధనములేకపోయినను ప్రతిమనుష్యునకును స్వభావతః పుట్టియుండు మానధనము ఏ పురుషుడైనను స్త్రీయైనను అపహరించగల ప్రయత్నములు చేయునట్టు తమకు తెలిసినట్టైతే అట్టి దుర్మార్గులు తమను స్పర్శించుటకు అనుకూలము లేకుండునటుల తాము ఒక ​గదిలో దూరి తలుపును భద్రపరిచకొంటే తాము దిగ్బంధము చేసికొన్నట్టు అర్థము.

అథవా ఒక మహామంత్రమును జపించువాడు ఆమంత్రముయొక్క ప్రయోజనము పొందను ఆశించితే అట్టి ప్రయోజనమునకు విఘ్నము కలుగచేయవలెను అను ఉద్దేశమును మాత్రమే మనస్సునందు గల దుష్టచేతనములు తనయందు ప్రవేశించిగాని తనసమీపమునకు వచ్చిగాని ఆ మంత్రప్రయోజనమును తనకు అందనీయక చేయుట అసాధ్య మగునట్లు తనచుట్టు మెంటల్ ప్ళేను అణువులతో ఒక వలయమును ఏర్పరచుకొనుటకు దిగ్బంధము అని పేరు.

ప్రతిమంత్రమును జపముచేయువాడు అంగన్యాసము, కరన్యాసము, రక్షా, దిగ్బంధము, ధ్యానము అను నంశములను అనుష్టించును అని యింతకు ముందే చెప్పబడెను కదా. ప్రతిమంత్రముయొక్క యుపాసనావిధానమునందును “ఇతి దిగ్బంధః" అని యొక యంశము కలదు. పైవివరించిన ప్రకారము దుష్టచేతనములు తనయొక్క మనస్సున ప్రవేశించనీయక చేయు బందోబస్తుకు దిగ్బంధము అని పేరు.

దుష్టచేతనములలో ననేకజాతులు గలవు. శ్రేష్ఠమయిన మంత్రములను జపముచేయునపుడు ఆ మంత్రముల ప్రభావమువల్ల లోకమందలి దుర్మార్గస్వభావము గల చేతనములకు శ్రమ కలుగును. అట్టిశ్రమకు కారణమైన మంత్రమును జపము చేయనీయక అభ్యంతరము కలుగజేయుట దుష్టచేతనముల కభీష్టము. గనుక మనము చేయు జపములకు ప్రత్యవాయము కలుగచేయు చెడ్డచేత ​నములు ఒక జాతివి. మనము జపతపములు కొద్దిగా జేసి తన్మూలముగా కొంతమట్టుకును సత్త్వగుణము నార్జించుకొని యున్నయెడల అంతమాత్రమునకే మనయందు విరోధమును చూపుచు మనయొక్క సత్వగుణమును శిథిలపరచుటకుగా మన మేమరి నిద్రపోవుసమయమున మనశరీరమునందు ప్రవేశించి చెడుపు కలుగజేయు నుద్దేశముగల చెడ్డచేతనములుగూడ కొన్ని గలవు. కనుక కొంత మట్టుకు మనము చెడ్డచేతనములబాధను నివారించుటకై రాత్రులయందు నిద్రించుటకు ముందు దిగ్బంధము చేసికొని నిద్రించుట యొక సంప్రదాయము.

మరియు దుశ్చేష్ట లగు కల్లు, సారాయి, నల్లమందు, భంగి మొదలగువాటిని యుపయోగించుట, వ్యభిచారము మొదలగు దుర్నడతలకు లోబడుట, మొదలుగా గల దుస్స్వభావములు గలిగియుండి తనను తాను దిద్దుకొనుటకు ప్రయత్నపడువారలు ప్రాయశః దుష్టచేతనములబాధలకు భయపడవలసినది. దుష్కార్యములు చేయుచున్న కాలమందు భువర్లోకసంచారులగు దుష్టచేతనములు దుస్స్వభావముగలవానికి సహాయభూతములుగా నుండిరి. చెడ్డపనులు మానుకోవలె నని ప్రయత్నముచేయ నారంభించగానే ఆ చెడ్డచేతనములకు ఇన్నాళ్లును ఆశ్రయముగా నుండిన దుర్మార్గుడు సన్మార్గము నవలంబించితే తమకు ఆశ్రయము లేకపోవునుగదా యని దుఃఖించు చేతనములు అతని ప్రయత్నములను కొనసాగనీయక చేయు నుద్దేశముతో సకల ప్రయత్నములు చేయును. పై ప్రస్తావించిన చెడ్డచేతనములు దుర్మార్గమువదలి సన్మార్గము నవలంబించువాని శరీరములకు కీడును కలుగ జేయును. ​గనుక మహనీయులగువారు అట్టివారికి క్షేమము కలుగజేయవలెనని దిగ్బంధముచేసి బలహీనులను కాపాడుదురు. దిగ్బంధమునకు కవచము అనియును వేరు.

కవచము అనగా నొకవిధమైన అంగసంరక్షణవస్తువు. వీరులు యుద్ధరంగమందు ప్రవేశించు సమయమందు శత్రువుల బాణములు గాని, కత్తులు, కటారులు, ఈటెలు, బల్లెములు మొదలగు పదును ఆయుధములుగాని తమ శరీరములకు తగిలి అవి తమ చర్మమును భేదించి గాయపరచనీయకుండునట్లు కత్తులు మొదలగు నాయుధముల కభేద్యమైన లోహము తమ శరీరమునకు అంగీవలె చేయించి ఆ అంగీని తొడుగుకొని కృపాణహస్తులై యుద్ధరంగములోనికి వెళ్లుట పూర్వాచారము. ఆధునిక కాలమందు కూడ ఈ యభ్యాసము ఉన్నది. మన కండ్లకు అగపడు శత్రువులు భౌతిక శత్రువులు, దృశ్యశత్రువులు, అనియును వారల ఆయుధములకు భౌతిక ఆయుధములు, దృశ్యఆయుధములు, అనియును పేళ్లు. దృశ్య (కనబడు) శత్రువులయొక్క దృశ్య (కనబడు) ఆయుధములను నిరాకరించుటకు వీరులు దృశ్య (కనబడు) కవచములను ధరించిరి. దుర్మార్గచేతనములు అదృశ్యములు. మన కండ్లకు కనబడవు. గనుక మనము ధరించు కవచములు అదృశ్యములుగా నుండవలెను. ఇట్టి అదృశ్యములైన కవచములను తమ శిష్యులయొక్క శరీరములను ఆవరించునటుల కట్టునట్టి గురువులగు పెద్దవారు తమయొక్క చిత్తములను ఏకాగ్రపరిచికొని ఆ మనస్సుతో కవచమును చింతించి చింతించి జగన్మనోమయకోశము యొక్క అణువులతో నొక కవచమును కట్టుదురు. జగన్మనోమయ ​కోశముయొక్క అణువులు మహర్లోకము లేక స్వర్గలోకము యొక్క అణువులు. ఇవి అతి బలవంతములు. మనోమయకోశపు అణువులకంటెను బలహీనములైన స్థూల అణువులు మనోమయకోశపు అణువులతో నేర్పరచబడ్డ కవచమును భేదించుకొని ప్రవేశించ చాలవు. చెడ్డస్వభావముగల ఆదృశ్యచేతనములయొక్క శరీరములు భువర్లోకపు అణువులతో కట్టబడినవి. మహర్లోకస్వర్గలోకముల అణువులకంటె భువర్లోక అణువులు స్థూలములు. మహర్లోక స్వర్గలోక అణువులతో కట్టబడిన కవచములు భద్రములు.

కవచములను మహనీయులు కట్టి శిష్యులకు భద్రము కలుగజేయుట యొకవిధము. శిష్యులే అనగా మనవంటివార్లమే కవచములను కట్టుకొనుట మరియొకవిధము. నారాయణ కవచము, శివ కవచము, అను పేళ్లను వినుచున్నాము గదా. నారాయణ కవచమునకు గాని, శివ కవచమునకు గాని, సంబంధించిన మంత్రములు చాల మట్టుకు అచ్చుపడియున్నవి. అయితే మంత్రముల పదములు మాత్రము కవచములు కావు గదా.


అకృత్వా శత్రుసంహారం అగత్వాఖలభూశ్రియం ।
రాజాహం ఇతి శబ్దా న్నో రాజా భవితు మర్హతి ॥


అనగా నొకానొకడు తనను లోకులు రాజు అని వ్యవహరించవలెనని యాశ గొన్నయెడల అతడు రాజ్యము సంపాదించుకొని శత్రు రాజులను యుద్ధమందు ఓడించి వార్లవల్ల కప్పములు గొంటేనే గాని వృధా పేరునకు మాత్రము నేను రాజును అనుకొన్న మాత్రాన రాజు కాచాలడు అని వివేకచూడామణి యను గ్రంథమందు చెప్పఁబడియున్నది. ​అనగా తాత్పర్యము. - వృధామాటలతోనే గాక వస్తుతఃసహ కవచ ముండవలెను. పండితులును భక్తులునగు నేనేకుల యభిప్రాయమందు కవచమంత్రములను చదివినంత మాత్రముననే కవచమువల్ల కలుగు లాభములు కలుగునని నిశ్చయము. అట్లు కాదు. కేవల మంత్రపారాయణమువల్ల యత్కించిత్ ప్రయోజన ముండవచ్చును గాని కవచధారణము వల్ల కలుగునంత ప్రయోజన ముండదు. కవచమును గురించి చెప్పు మంత్రములలో ఫలితార్థ శ్లోకములయందు "యస్సదా ధారయే న్మర్త్యః శైవం కవచ ముత్తమం" అనియు "స్థితే తే చ కవచే దేహే” "వీరశ్రేష్ఠో వీరభద్రో బభూవ ధారణాద్యత" "యద్ధృత్వా వామదేవశ్చ దేవల శ్చ్యవన స్స్వయం" ఇది మొదలగు విధములగా కవచ ధారణమును గురించి చెప్పబడి యున్నది. ధారణము అనగా మనము అంగీ తొడుగుకొన్నట్టు ఒక వస్తువును సిద్ధపరచి తొడుగుకోవలెనని యర్థము. ఇందును గురించి దివ్యజ్ఞానసమాజపు పుస్తకముల యందు చాల విపులముగా వ్రాయబడి యున్నది. సర్వ విధములైన కవచములును కట్టుకోవలసినందుకు ముఖ్యమైనది అంతఃకరణశుద్ధి, చిత్తైకాగ్రత, భూతానుకంప, మొదలగు పరోపకార చింతారూపకములైన తలంపులు. అన్ని కవచముల కన్నను పరిశుద్దాంతఃకరణము, భూతహితేచ్ఛ మొదలగు మంచి గుణములు శ్రేష్ఠములు. కనుకనే "సర్వభూత హితే రతాః” మొదలగు విధములుగా నుపదేశ మియ్యబడినది. పరిశుద్ధాంతఃకరణులు దైవభక్తిని ముందిడికొని గురువుల వారియనుజ్ఞ పొంది కవచములు కట్టి ధరించుకోవలెను. కేవల కవచమంత్రపారాయణము మా ​త్రము చాలదు. కవచములను కట్టు విధములను గురువులగుండా ఉపదేశము పొందవలెను.


సంఘే శక్తిః కలౌ యుగే


అనగా కలియుగమునందు సంఘమునందు శక్తి యున్నది. సంఘమనగా అనేకులు ఏకగ్రీవముగా ఏకోద్దేశముతో చేరి పని చేయుట. ఇట్లు పలువురు ఏకాభి ప్రాయముతో చేరి జరుపు నుద్యమములకు సమాజములు, సొసైటీలు, అని సంజ్ఞా వాచకములు. బ్రహ్మవిద్యా సమాజము, ప్రార్థనసమాజములు, అని అనేక విధములైన సమాజములు వేర్వేరు ఉద్దేశములతో నేర్పడియున్నవి.


అనేకులు ఏకగ్రీవముగా, ఏకాభిప్రాయముతో చేరి యేదో ఒక కార్యము చేయవలెనన్న అందుకు ముందుగా ఆ సమాజపు వారందరును ఒక స్థలములో ఒక సమయమందు చేరి తాము చేయవలెనని యుద్దేశించి యుండు కార్యము సఫలము కావలెనని ఏకాభిప్రాయముతో చింతించి, చింతించి, తాము చేయబూనుకొన్న కార్యము అనుకూలించవలెనని ప్రార్థన చేయుచు అదే సమయమందు తాము చేయనుద్దేశించిన కార్యము తమ యుద్దేశప్రకారము సిద్ధించినట్టు భావించుకొని అట్లు సిద్ధించినందుకు పరమేశ్వరునికి కృతజ్ఞతను చూపి, నాటిమట్టుకు పైచెప్పిన జపచర్యను నిలుపవలెను. మరల మరుసటిదినము ముందుదినమున చేరినట్టే అందరును కూడి ముందు దినమున జరిపిన ప్రకారమే జపము చేసి మనోమయరూపములను పుట్టించవలెను. ఇట్లు జాగరూకతతో కొన్ని మాసముల కాలము జరుపుచు వచ్చి తరువాత కార్యము ​నారంభించిన యెడల ఆ కార్యము అతిశీఘ్రములో తమ యిష్టానుసారము అనుకూలించును. దేవాలయముల జీర్ణోద్ధారములు, దుర్నడతయందుండు జనులను దిద్దుట, మొదలగు ప్రయత్నములు పైవివరించిన సంఘసంకల్పమువల్ల సిద్ధించును.

సంఘసంకల్పసమాజమందు చేరిన వారందరును ఒకటే స్థలమందు కూడవలెనను నవశ్యము కూడ లేదు. వారు వారు వారి వారి యింట్లో కూర్చొని జపము చేయవచ్చును. అయితే అందరు నొకటే సమయమందు అనగా ప్రతి నిత్యమును ఉదయము తొమ్మిదిఘంటలకు ప్రారంభించుట అంటే అదే తొమ్మిదిఘంటలకు ప్రతి నిత్యమును ప్రతి వాడును సంఘసంకల్పమును ప్రారంభించవలెను. మరియు నొకరు ఏవిధముగా తలచుచున్నారో అదేవిధముగా నందరును తలవవలయును. ఇట్లు ఒకటే సమయమందు సంఘసభ్యులందరును వారి వారి యింట గూర్చొని విసుకుచెందక బహుదినములు జపము చేయుచురాగా ప్రతి జప్తయొక్కయు సంకల్పరూపములు (thought forms). అనేకములై శక్తిమంతములై, తుల్యరూపములుగలవై, తుల్యస్వభావవంతములై మరియు తుల్యశక్తిమంతములునై అవి గుంపులు గూడి సభ్యులు ఉద్దేశించిన కార్యమునకు తోడ్పాటులై ఆ కార్యములను చెడుప తలచిన వార్లను ఆవేశించి విరోధభావములను ప్రబలనీయకయు, సహాయభావమును పుట్టించియు ఉద్దేశమును నెరవేర్చునట్లు చేయును. ఇది మా అనుభవము. ఎవరైనను ప్రయత్నము చేసి పరీక్షించవచ్చును. చీమల బారి దినప్రతిదినమును ఒక బండపైననడుచుచు రాగా బహుకాలమిట్లు నడిచిన పిదప ​ఆ బండపైన చీమలబారి నడిచిన గుర్తు ఏర్పడునని లోకోక్తి. అదే విధముగా నేకాభిప్రాయము గలిగి, ఏకోద్దేశముతో, ఏకకాలమందు; ఏక విధమైన, యుద్యమము చేయువారు చీమలవలె బలహీనులైనను వారు చేయబూనుకొన్న కార్యమున కెన్ని ప్రత్యవాయములున్నను అవి యెంత బలవంతము లైనను మహాకాఠిన్యముగల రాతిబండమీఁద గుర్తు లేర్పడినట్లు అనగా బలహీనము లైన చీమలశక్తికి రాతిబండ దోవ యిచ్చినట్లు ఆటంకములన్నియు తొలగి పోవును. ఉద్దేశించిన కార్యము సిద్ధించును.

ఈ విధమున సంఘసంకల్పశక్తిచేత లోకులకు తాము చేయగోరిన యుపకారములను చేయవలయును. ఇది భ్రాతృ భావము.