ఆత్మవిచారము (పూర్వభాగము)/4వ అధ్యాయము
నాలుగవయధ్యాయము
లబ్ధ్వా సుదుర్లభ మిదం బహుసంభవాంతే
మానుష్య మర్థదం అనిత్య మపీ హ ధీరః ।
తూర్ణం యతేత నపతే దనుమృత్యు యావత్
నిశ్రేయసాయ విషయః ఖలు సర్వతః స్యాత్ ॥
మానుష్యం
ధాతువర్గతరుగుల్మలతామృగాది వ్యక్తులందు అనేక లక్షల జన్మంబులు ఎత్తినపిదప సంపాదింపబడిన మనుష్యజన్మము అతి దుర్లభము. "బహుసంభవాంతే” అనేకజన్మములకు తరువాత యని యర్థము. ఇట్టి దుర్లభమగు మనుష్యశరీరమునందు పరమలాభ మొకటి యున్నది. అది అనగా మనస్సు. "బ్రహ్మావలోకధిషణం" అని 53 వ పుటలో నచ్చుపడియుండు శ్లోకమందున్నది. కనుక మానవజన్మంబునకు పరమార్థంబు బ్రహ్మావలోకనంబే. అట్టి పరమార్థోద్దేశము కలిగిన మానవజన్మ మెత్తితిమి. ఇది "అర్థదం” పురుషార్థములను సంపాదించి యియ్యగలది. అయితే ”అనిత్యం" చాలకాలముండునది కాదు. రోగములు నొప్పులు లేక బ్రతికితే శక్తిమంతులుగా డెబ్బది యేండ్లు బ్రతుకవచ్చును. ఇట్టి డెబ్బదిసంవత్సరములలో కూడ నెన్ని సంవత్సరములు నిజముగా నుపయోగమో వారి వారి చర్యలను పట్టి నిర్ధారించవలయును. ఇట్లు దోషయుక్తమయ్యు లాభకరమైన మానుష్యము అనగా (మనుష్యత్వము) సంభవించిన పిదప బుద్ధిశాలియైన మనుష్యుడు "నిశ్శ్రేయసాయ” మోక్షప్రాప్తికిగా నతి శీఘ్రముగా ప్రయత్నపడవలెను. "విషయః ఖలు సర్వతః
స్యాత్” అనగా శబ్దస్పర్శరూపరసగంధాత్మకంబులును కర్మగతివిసర్గఆనందాత్మకంబులు నగు అనుభవములు మృగాదుల శరీరంబులలో నుండినపుడు కూడ ననుభవించితిమి. "జ్ఞానం హితేషా మధికో విశేషః” అనిన ప్రకారము మృగములకును మనుష్యులకును భేధము జ్ఞాన మొక్కటేగదా.
పురుషార్థములు
మనుష్యశరీరధారియైన జీవాత్మకు ఈ శరీరముగుండా పొందగల ప్రయోజనములు నాలుగు - ధర్మము, అర్థము, కామము, మోక్షము అని. ధర్మాది పురుషార్థసిద్ధికిగా మనుష్యులు వారి వారి గుణములను పట్టియు స్వభావసిద్ధమైన చేష్టలను పట్టియు
వర్ణములు
తిర్యగ్యోనిగితే స్సర్వో మానుష్యం యది గచ్ఛతి ।
స జాయతే పుల్కసో వా చండాలో వాప్యసంశయః ॥
మృగాదులశరీరంబులలో యాత్రచేయుచున్న తైజసవైశ్వానరాత్మలు మనుష్య దేహమునందు ప్రవేశించుటకు సిద్ధమయినపుడు వారలు అదివరకును అనుభవించుచుండిన గుణములయిన క్రూరభావము, ఓర్వలేమి, కొట్టాడుస్వభావము, ఇట్టి గుణములను కలిగి నిబంధనలకు లోబడని స్వభావవంతులైనందున పుల్కసుడు చండాలుడు అను జన్మములందు పుట్టుదురు. అనేకజన్మములు అట్లుండి పిమ్మట శూద్రజన్మమునకు వత్తురు. తరువాత వైశ్యుడు, తరువాత క్షత్రియుడు, తరువాత బ్రాహ్మణుడు ; ఇట్లు క్రమక్రమముగా
జాతులలో పైపైకి ఎక్కుదురు. అనగా వారల గుణములు కర్మలు స్వచ్ఛములగును. ప్రకృతమందు పుల్కసజీవాత్మలు బ్రాహ్మణ శరీరములలో నుందురు. అట్లే బ్రాహ్మణజీవాత్మలును ఇతర వర్ణ శరీరములలో నుందురు. "స్త్రీషు దుష్టాను వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః” అని అర్జునుడు చెప్పిన ప్రకారము ఇది వర్ణసంకరమైన కాలము. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీరలకు ద్విజులని పేరు.
ఆశ్రమములు
"బ్రహ్మచారీ గృహస్థ శ్చ వానప్రస్థో యతి స్తథా” అని 1. బ్రహ్మచర్యము, 2. గార్హస్థ్యము, 3. వానప్రస్థము, 4. సన్న్యాసము అని ఆశ్రమములు నాలుగు. జనసముదాయమునందు శూద్రుని ధర్మము పరిచర్య. అట్లే ఒక మనుజునియందు బ్రహ్మచర్యముయొక్క ముఖ్యధర్మము పరిచర్య. జనసమూహమందు వైశ్యుడు భూమియందు పయిర్లు పెట్టి పెంచి యితరులకు ఆహారద్రవ్యముల నిచ్చి వారలను కాపాడును. అట్లు గార్హస్థ్యమందు మనుజుడు ఇతర ఆశ్రమములవారలను
ఆహారద్రవ్యముల నిచ్చి కాపాడును.
జనసమూహమందు బ్రాహ్మణుడు తాను విరక్తుడై ఇతరులకు చదువు చెప్పి తెలివిని యిచ్చు విధమున ఆశ్రమముల యందు సంన్యాసి విరక్తుడై యితరులకు జ్ఞానదానము జేయును. ఇవ్విధంబున వర్ణాశ్రమధర్మములు లోకమందు పరస్పరోపకారులగా నుండుటయే కాక జీవాత్మలవృద్ధికి గారణమై యుండును.
ఈ వర్ణాశ్రమధర్మములను మరికొంత జాగ్రతగా పరిశీలించి చూచితే స్వార్థకములు కొన్నియు పారమార్థికములు కొన్నియుగానున్నవి. అనగా ధర్మము అర్థము కామము అనునవి స్వార్థకము గానును మోక్షము అనునది పారమార్థికముగానును ఉన్నవి. స్వార్థపరిశ్రమమునకు ప్రవృత్తిమార్గము అనియును పారమార్థికపరిశ్రమము, (పరార్థపరిశ్రమము) వీట్లకు నివృత్తిమార్గము అనియును పేళ్లు. ద్వితీయాధ్యాయము చివరను ప్రవృత్తి నివృత్తిమార్గములు అను పదములను ప్రస్తావించితిమి. ప్రవృత్తిమార్గము నివృత్తిమార్గము వీట్లును గురించి ఇకముందు వ్రాతుము.
మార్గప్రదర్శకులు
అనగా మార్గమును చూపువారు. క్రొత్తగా పశ్వాదుల శరీరములను వదిలి మానవశరీరములయందు ప్రవేశించిన మనుష్య లకు ఆహారము ఆవాసము మొదలగునవి సంపాదించుకొనుటకు శక్తిలేని కాలమందు అనేక దేవతలు ఋషులు పితృదేవతలును సహాయులు గానుండిరి. కనుక మనుష్యులు కొంతమట్టుకు దేవతలకు ఋషులకు పితృదేవతలకు ఋణస్థులు అయిరి. ఈ మూడు ఋణములనును ఉత్తరోత్తర మనుజులు తీర్చుకోవలెను. వీరికి మహాపీఠము అనియు పేరు. వీరిలో
స్వాయంభువమనువు
మొదటివారు. వారి తరువాత పృథుచక్రవర్తి మొదలగువారు. ఈ తరగతి మార్గప్రదర్శకులు మనుష్యుల దేహసౌఖ్యములకుగా ముఖ్యముగా శ్రమపుచ్చుకొనినవారు. పూర్వాధ్యాయాంతమందు మనుష్యులు తేనెలనిచ్చు వృక్షములవల్ల జీవించుచుండిరనియు జనసముదాయముయొక్క ఉపయోగార్థముగా దేవతలచే నియ్యబడిన ఆ వృక్షములను కొందరు ఆక్రమించు కొనిరనియు ఆ పాపఫలముగా ఆ వృక్షములు మాసిపోయెననియు చదివితిమి.
నష్టేషు మధునా సార్థం కల్పవృక్షే ష్వ శేషతః ।
విషాదవ్యాకులా స్తా వై ప్రజా స్తృష్ణాక్షుధా ర్దితాః ॥
తాసాం వృష్ట్యుదకా నిహ యాని నిమ్నగతానివై ।
వృష్ట్యావరుద్ధై రభవన్ స్రోతః ఖాతాని నిమ్నగాః ॥
అట్లు మాసిపోయిన వృక్షములను చూచి ప్రజలు దుఃఖించిరనియు అపుడు వర్షములు కురియుట కారంభిచెననియు అనేక విధములైన ధాన్యములు స్వధాగా భూమిలో ఫలించెననియును ఏళ్లు కాలువలు మొదలగునవి యంతయు ఏర్పడెననియును రోషమోహమోసములు ప్రజలయం దుద్భవించెననియు ఆ రోషాదులయొక్క దుష్ఫలములగా తేళ్లు పాములు మొదలగు విషజంతువులు ఉద్భవించెననియు మొదలుగా గల వివరములు శ్రీ మార్కండేయపురాణమునందు చెప్పియున్నది. మరియు
బ్రహ్మాణం శరణం జగ్ముః క్షుధార్తాః పరమేష్ఠినం ।
దుగ్ధేయం గౌస్తదా తేవ సస్యాని పృథివీ తలే ॥
ప్రజలందరును ఆకలితో కష్టపడి బ్రహ్మదేవునిగురించి ప్రార్థించిరి. అపుడు పృథుచక్రవర్తి యవతరించిరి. భూమి గోరూపముగా నవతరించెను. ఆ గోవుగుండా తమకు ఆహారార్థము కావలసిన ధాన్యాదులను పృథుచక్రవర్తి పాలుపిండినట్టు పిండించెను. ఆ గోవునకు కామధేనువని పేరు. పృథుచక్రవర్తి భూతలమును మిట్ట పల్లములు తీర్చి జనులకు "హస్తసిద్ధి” అను విద్యనేర్పిరి. చేతుల గుండా పనులు చేసి వడ్ల, తట్ర, కుమ్మర, కరమల, కంసల మొదలగు శిల్పవిద్యలను నేర్పిరి. ఈ విధముగా జీవనము అప్పటి నుండి ఆరంభము. తదనంతరము గుణకర్మవిభాగములవల్ల వర్ణవివరములు ఏర్పడెను.
కల్పవృక్షము కామధేనువు అను పేర్లు ఎందువల్ల కలిగెనని పై కథవల్ల మనకు తెలియుచున్నది. ఇదంతయు మనుజులయొక్క శరీరపోషణార్థము చేసిన పరికరములు. జీవాత్మలు స్వాభావికముగా ప్రపృత్తిమార్గమందు చరించవలసినకాలము గనుక త్రివర్గము అను సంజ్ఞావాచకమువల్ల నెరుగదగిన ధర్మ అర్థ కామ ములను అనుభవించి ప్రవృత్తిమార్గయాత్ర ముగించిన పిదప నివృత్తిమార్గయాత్ర నారంభించుటకు కావలసిన సంగతుల నంతయు ప్రజలకు తెలియపరచునట్టు శ్రీస్వాయంభువమనువుగారు ధర్మశాస్త్రమును వ్రాసిరి. ఈ శాస్త్రమునకు మనుధర్మశాస్త్రమని పేరు. ఇట్లు వ్రాసిన శాస్త్రము నందలి నిబంధనలను అనుష్ఠించి యితరులు అనుష్ఠించుటకు నిదర్శనముగా ప్రవృత్తిమార్గప్రవీణులైనటువంటి గృహస్థులనును, నివృత్తిమార్గప్రవీణులై నటువంటి నైష్ఠికబ్రహ్మచారులనును స్వాయంభువమనువు ఒకస్థలమందు చేర్చి యుంచియున్నారు.
తత్రాష్టాశీతి సాహస్రా మునయో గృహమేధినాం ।
పునరావర్తినో బీజభూతాః ధర్మప్రవర్తకాః ॥
సప్తర్షి నాకవీథ్యంతర్దేవలోకం సమాశ్రితాః ।
తానంత ఏవ మునయః సర్వారంభవివర్జితాః ॥
తపసా బ్రహ్మచర్యేణ సంగత్యాగేన మేధయా ।
తత్ర గత్వా పతిష్ఠంతే యాన దాభూతసంఫ్లువం ॥
యతో వేదాః పురాణాని విద్యోపనిషద స్తథా ।
శ్లోకాః సూత్రాణి భాష్యాణి యచ్చ కించన వాఙ్మయం ॥
వేదానువచనం యజ్ఞో బ్రహ్మచర్యం తతో దమః ।
శ్రద్ధోపవాసశ్చ తథా స్వాత్మనో జ్ఞానహేతవః ॥
(యాజ్ఞవల్క్య స్మృతి)
ఇట్టి మునీశ్వరసంఘమునుండియే అన్ని శాస్త్రములును వేదములును భాష్యాదులును మనుష్యుల యుపయోగార్థము వచ్చుచున్నవి. ఈ విధమున ఋషులకు మనుష్యుల మైన మనము ఋణగ్రస్తులము. ఈ పుస్తకమునందు 4 వ పుటలో మరీచ్యాది ఋషుల గుండా ప్రవృత్తిధర్మము నుపదేశింపించి సనకాదులగుండా నివృత్తి ధర్మము అను మోక్షోపాయమును పరమకారుణికుడైన భగవంతుడు మనుష్యుల శ్రేయః ప్రాప్తికొరకు కలిగించినారని చదివినాము. ఇపుడు చెప్పినయాజ్ఞవల్క్యస్మృతిలోని శ్లోకములవల్ల మనకు
నిదర్శనములగా మునీశ్వరసంఘమున్నదని తెలిసినది. సృష్టికర్త యైన బ్రహ్మదేవుడు తాను సృష్టించిన లోకములయొక్కయు అందలి ప్రజలయొక్కయు యోగక్షేమముల నుద్దేశించి ఇంతకన్న నధికమైన ప్రయత్నములను చేసియున్నారు. ఎట్లనగా
తతో మా మీశ్వరః సృష్ట్వా జ్ఞానే నాయోజ్య చాసకృత్ ।
విససర్జ మహాపీఠం లోకస్యాజ్ఞానశాంతయే ॥
యథా హం ప్రహిత స్తేన తథా స్యేచ మహర్షయః ।
సనత్కుమార ప్రముఖా నారదాద్యాశ్చ భూరిశః ॥
ద్వంద్వాని సంప్రవృత్తాని విషయార్థం మహీభుజాం ।
దండ్యతాం సంప్రయాతాని భూతాని భువి భూరిశః ॥
తతో యుద్ధం వినా భూసాః మహీం పాలయితుం క్షమాః ।
న సమర్థా స్తదాయాతాః ప్రజాభిః సహదీనతాం ॥
తేషాం దైన్యాపనోదార్థం సమ్యగ్దృష్టి క్రమాయచ ।
తతో స్మదాధిభిః ప్రోక్తా మహత్యో జ్ఞానదృష్టయః ॥
అధ్యాత్మవిద్యా తేనేయం పూర్వరాజసువర్ణితా ।
తదనుప్రసృతా లోకే రాజవిద్యేత్యుదాహృతా ॥
రాజవిద్యా రాజగుహ్య మధ్యాత్మజ్ఞాన ముత్తమం ।
జ్ఞాత్వా రాఘువ రాజానః పరాం నిర్దుఃఖతాం గతాః ॥
(యోగవాసిష్ఠము, 2 భా. 11 అధ్యా - 3 -18 )
కాలక్రమమున ఆహారావశ్యకత అధికము కానుకాను భూవ్యవసాయమందు కాలము అధికముగా గడపవలసి వచ్చినందున కలహములు, కడుపుమంటలు, కొట్లాటలు, ఘాతలు కలుగుచు వచ్చినందునను కాలదోషములైన ఎండ, గాలి, వాన, చలి మొదలగు బాధలు కలుగుచు వచ్చినందునను రాజులు తమ
దేశములయెల్లలకు వెలుపటినుండి తమ ప్రజలకు కలుగుచుండిన శ్రమలను యుద్ధములు లేక నివారించుటకు అశక్తులైరి. తమ రాజ్యములలోనే తమ ప్రజలలో పరస్పరవైషమ్యములను దండన వినాగా నివారించుటకు వీలు లేకపోయెను. కాబట్టి రాజులును ప్రజలును దైన్యముజెందిరి. అట్టి సందర్భమందు మేము రాజులకును ప్రజలకును ధర్మములనుపదేశించి జ్ఞానవంతులనుగా చేసితిమి. ఆ యుపదేశమునకు అధ్యాత్మవిద్య యని పేరు. దానినే రాజవిద్య, రాజగుహ్యమందురు. (ఇది వసిష్ఠులవారు చెప్పినది.) శ్రీమద్భాగవతము, పంచమస్కంధము, ఏకవింశాధ్యాయమందు సూర్యుని తేజస్సువంటి తేజస్సుగల సనత్కుమారాది ఋషులు పృథుచక్రవర్తికి జ్ఞానోపదేశము చేయవచ్చిరని చెప్పియున్నది. ఆ అధ్యాయమును చదివితే రహస్యార్థములు కొన్ని వివరమగును.
ఈ మార్గదర్శకసంఘమువారు లోకమునందెల్లమతముల యందును వివిధానుభవములను ఆ యనుభవముల సారాంశప్రాప్తి వల్ల బుట్టిన తేజస్సు, ఓజస్సు, సహస్సు లను సిద్ధులనుపొందిన వారిని చేరదీసి తమ సంఘములోచేర్చికొని లోకమందు అజ్ఞానావృతమైన ప్రజను జ్ఞానవంతులుగాచేసి బంధవిముక్తులనుగా చేయుదురు. మానుష్యము అను నీయధ్యాయమునందు కొన్ని సంగతులను సూచించితిమి. రాబోవు అధ్యాయమునందు మానుష్యమునుపొందిన జీవాత్మ సూక్ష్మలోకములందు సంచారము చేయుటకుగా ఏ శరీరములను ఉపయోగించును మొదలగు విషయములను గురించి వ్రాయనగును.