ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/సోదరీనిర్యాణము

వికీసోర్స్ నుండి

కాని, నేను శాంతము వహింపవలె ననియు, పూర్వాచారపరాయణులగు తలిదండ్రులపోషణమున నుండెడి యీ విద్యాభ్యాసకాలమున, బొట్టు జుట్టు మొదలగు బాహ్యవిషయములను గుఱించి యనగత్యముగ నేటి కెదురీదవల దనియు, సంస్కారప్రియులగు స్నేహితులు నాకు హితోపదేశము చేసిరి. అంతటినుండి యీవిషయములందు నే నెంతో జాగ్రతతో మెలంగితిని. కాని, నాకుఁ బ్రియతరములగు మతవిషయిక గ్రంథములు మనసార పఠించి, నాయభిప్రాయముల నితరులకు బాహాటముగఁ దెలుపుటకు పరిపూర్ణావకాశ ముండుటవలన, నేను వెనుకటికంటె నధికోత్సాహమున బ్రాహ్మమతగ్రంథములు చదివితిని. ఇంతియ కాదు. మిత్రులు కనకరాజు జగన్నాధరావు నేనును బ్రాహ్మ సమాజ ముఖ్యసూత్రములు విశ్వసించితి మని ప్రతిజ్ఞ చేసికొంటిమి. మావలెనే యింకఁ గొందఱు మిత్రులును మమ్ముఁ జేరినచో, మేము రాజమంద్రిలో బ్రాహ్మసమాజము నెలకొలుప నుద్యమించితిమి !

17. సోదరీనిర్యాణము

చిన్నితమ్ములను చెల్లెండ్రను ఎత్తికొని యాడించుట చిన్ననాఁటనుండియు నా కెంతో ముచ్చట. ఏడ్చుచుండెడి నెలగ్రుడ్డులను సైతము శమింపఁజేయురహస్యము బాల్యముననే నాకుఁ బట్టువడినటు లుండెను. శిశువులను శాంతింపఁజేయ నేను బడెడి శ్రమను జూచి, మాపెద్దపెదతల్లి నన్ను "పెంపుడుతల్లీ !"యని నవ్వుల కనుచుండెడిది. పాలు ద్రావునపుడును భుజించునపుడును దక్క మిగతకాలము, చిన్ని తమ్ములు చెల్లెండ్రును సామాన్యముగ నాచెంతనే గడపెడివారు. వారి నెటుల లాలింపవలయునో బుజ్జగింపవలయునో, మాయమ్మకు వలెనే నాకును దెలిసియుండెను. బాల్యమందు వారలకు నే నిడిన ముద్దుపేళ్లకును, ఉల్లాసము గలుగునట్టుగ వారితో నేను భాషించెడి చిన్ని పలుకులకును, మితి లేకుండెను. కావుననే నాయెడల వారలుకును, మించిన ప్రేమానురాగము లుండెడివి.

1888 వ సంవత్సరము ఆగష్టు 24 వ తేదీని జన్మించిన మాచిన్ని చెలియలు లక్ష్మమ్మ అను వెంకటరత్నమ్మ నాకు బహి:ప్రాణమె ! చామనచాయమేనితో నొప్పి, బక్కపలుచనియాకారము గల యాబాలిక, శైశవముననే తనసోగకనులతో ననుఁ జూచుచు, తన నెత్తికొనుమని నామీఁదికి వాలుచుండును. నాకుఁ జేత నెంతపని యుండినను, చెల్లెలిని దీసి యాడించుచుందును. తనతో నే నాడెడి ముద్దుపల్కులయర్థము తాను గ్రహించినట్టుగనే, ఆశిశువు, మృదుమంద హాసము చేయుచు, తనచిన్నిచేతులతో నామొగము నిమురుచుండును. దానికి నాకును భాష నపేక్షింపని వింతప్రేమ మమరియుండెను. దూరమున నామాట వినఁబడఁగనే యాబాలికి, తనమో మెత్తి, నన్నుఁ జూచి, నాముద్దులు గైకొనుట కాయత్తపడుచుండును !

1889 వ సంవత్సరము వేసవికాలమునకుఁ బూర్వమె దాని శరీరమున విషవ్యాధి యంకురితమయ్యెను. చూచుచుండఁగనే శిశువు కృశించి, మూలుగ నారంభించెను. నే నిలు సేరి యెదుట నిలిచినపుడు, నన్నుఁ దన నిడుద కనులెత్తి చూచి, తన నెత్తుకొమ్మని చేతులు నాదెసఁ జాచుచుండును. తా నమితవేదనకు లోనయ్యును, నాచేతుల నుండు నించుకసేపును హాయిగ నుండునట్లు కానఁబడు చుండును.

ఏమందులు నెట్టిచికిత్సలును ఆశిశువుపట్ల నిష్ప్రయోజనము లయ్యెను. వేసవివడ సోఁకిన చిగురుటాకువలె ననివారిత వ్యాధిపీడిత యైన యాబాలిక కమలిపోయెను. బాలికకు మృత్యు వాసన్న మయ్యెననియె గాక, దాని యపారవేదన కొకింతయైన నుపశమనము గావింప నేరకుంటి మనియు మేము దుర్భర మనోవ్యధకు లోనైతిమి.

మెల్లగ లేఁజివురు వెట్టుచుండు నాయాత్మ కీసందర్భమునఁ గలిగిన కఠినశోధనమునుగూర్చి యొకింత ప్రస్తావించెదను. ఆగస్టు 14 వ తేదీని నాదినచర్యపుస్తకమున లిఖితమైనవాక్యము లిచట నుల్లేఖించుచున్నాను : -

"నేఁడు మధ్యాహ్నము నేను కళాశాలనుండి యింటికి వచ్చునప్పటికి, ఇంట నెవరును లేకుండిరి. మాసొంతపెరటిలోనికిఁ బోయి చూడఁగా, అతిఘోరదృశ్యము నాకుఁ గానవచ్చెను. చనిపోవుచుండు మాకడగొట్టుచెల్లెలిచుట్టును మాతల్లి తమ్ములు చెల్లెండ్రును జేరి విలపించుచుండిరి. శుష్కించిపోయిన యాబాలిక శరీరమునుండి చిన్నదీపకళికవలె ప్రాణము రెపరెప మని యారిపోవుచుండెను ! ఆ కళేబరమునుండి యుచ్ఛ్వాస మొకటిరెండుసారులు వింటిమి. తుదిమరణవేదన ననుభవించి, ఆశ్రుపూరితములగు మాకనులయెదుటనె యా చిన్నిప్రాణ మంత నస్తమించెను.

"దు:ఖ మేమియో యెఱుంగని మా చిన్ని తమ్ముడు సూర్యనారాయణ, మే మందఱము విలపించునంతసేపును దూరమున నూరకు చూచుచుండి, శవము గొనిపోఁబడునపుడు అకస్మాత్తుగ నేడువసాగెను !

"ఇపుడు మృత్యువునోటఁ బడిన మాముద్దుచెలియలు సరిగా నొకవత్సరమె యీభూలోకజీవిత మనుభవించెను.

"కుటుంబమున తలిదండ్రులకును గొమరితకును, అన్న యక్కలకును జెల్లెలికిని, ఎడఁబాటు కలిపించిన యీదిన మెంతటికఠిన దుర్దినము ! హృదయశల్యమగు నిట్టి కష్ట మాపాదించిన యీ నికృష్టదినము నా కెన్నటికైన మఱపువచ్చునా ?

"విపత్తు సంభవించిన నాఁటిరాత్రియె నా యాంతరంగికమిత్రమగు నీదినచర్యపుస్తకమునకు నామనోవేదనను వినిపించుచున్నాఁడను. నేను సంతాపనిమగ్నుఁడనైయున్నాను. దు:ఖాతిరేకముననే నాహృదయము మొద్దుపాఱియున్నది. నే నెవరినో నాకుఁ దెలియదు ! నేఁడు మధ్యాహ్నము మాకు సంభవించిన కష్టమున కర్థము గ్రహింపనేరకున్నాను. చెల్లెలి చావనఁగ నేమి ? నాకన్నులు పొడివాఱిపోయినవి. ఇందువలన నాహృదయము దు:ఖార్ద్రము గా దనుకొనకుమీ ! గాఢ సంతాపాసలమె నానయనముల తేమ నార్చివైచినది ! కాన, నాగుండియ రాతిగుండె యైపోయినది.

"ముద్దులచెలియలా ! నీ వెచటి కేగితివి ? జ్ఞానప్రసారకములగు నీకనుగలువలు, నీవిశాలవదనకమలము, నీసుకుమారశరీరకోరకమును - ఆహా, ఐదునెలలనుండి నిను వేఁచినవ్యాధివలన నెట్లు కమలిపోయినవి ! ఇప్పటికి నీవెతలు పరిసమాప్తి నొందినవి. ఆహా ! చిరంజీవిని వైన నీ వెంతటికీర్తి గడించియుందువోగదా ! అయ్యో, ఇది యెంత రిత్తకోరిక !

"నశరీరులైన మానవులకు అశరీరులగు జీవులతోఁ బ్రస్తావింప సాధ్య మయ్యెనేని, ప్రియసోదరీ, ఈతరుణమున నిన్నొకింత ప్రశ్నింపఁ గాంక్షించుచున్నాఁడను. అతిబాల్యముననె ప్రేమాతిరేకమున నీవు నన్ను 'అన్నా' యని పిలిచెడిదానవు. చెల్లీ ! దు:ఖభూయిష్ఠమగు నీభూలోకమున నీ వేల యావిర్భవించితివి ? నీ విపుడు మృత్యువువాతఁబడి మటుమాయ మైపోయితివిగదా. విఫల మనోరథుఁడనగు నాకు నీయెడఁగల ప్రేమాతిశయము నెట్లు నీ కింక వ్యక్తపఱుపఁగలను ? ఎవ్విధమున నీస్మారకచిహ్న మిచట నెలకొల్పనగును ?"

18. నూతన దృక్పథము

నూతన మతాన్వేషణమునుగుఱించి 1889 వ సంవత్సరమధ్యమున నాకుఁ గలిగిన యుత్సాహోద్రేకములు, ఆ సంవత్సరానంతరము వఱకును నా మనస్సును గలఁచివైచినవి. ఇదమిద్ధ మని నేను నమ్మవలసినది వైష్ణవమా క్రైస్తవమా, సంస్కరింపఁబడిన హిందూమత ధర్మములా, ప్రార్థనసమాజవిధులా; - యని నే నా యాఱునెలలును తల్ల డిల్లి తిని. ఈవిషయమై సత్యనిరూపణము చేసికొనుటకు స్నేహితులతోఁ జెలిమి చేసితిని, సావాసులతోఁ జర్చలు సలిపితిని, సభలలో నుపన్యాసములు వింటిని, సద్గ్రంధపఠనముఁ గావించితిని. వీనియన్నిటి పర్యవసానము, ఆ సంవత్సరాంతమున నేను బ్రాహ్మమతధర్మవిశ్వాస మలవఱచుకొంటిని. అప్పటినుండియు నేను మతాన్వేషణమునకై మరల తత్తరపడలేదు. ఉన్నతపర్వతాగ్రమున నిర్మితమగు గృహరాజమువలె, నామతవిశ్వాసము లింతటినుండి స్థిరములు సుందరములునై విరాజిల్లెను. మతగ్రంథపఠన మతపరిశోధనములు చేయుటకును, ఆత్మాభివృద్ధి ఆత్మపారిశుద్ధ్యములు గాంచుటకును వలసిన పరిశ్రమము ఇంతటితో నంతరించిన దని నేను జెప్పుటలేదు. వీని యన్నిటికిని మఱింత యనుకూల మగు నావరణ మేర్పఱిచెడి దృఢత్వ స్థిరత్వములు నా మతవిశ్వాసముల కిపుడు లభ్యమయ్యెననియే నేను జెప్పుచున్నాను.

నా దృష్టిపథమునఁ గలిగిన యీపెద్దమార్పు, 1889 డిశంబరు 31, 1890 జనవరి 1 వ తేదీలదినచర్యలలో స్పష్టముగ వివరింపఁబడెను. అందలి ముఖ్యభాగము లిచట నుల్లేఖించుచున్నాను :