ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/రచనావ్యాసంగము

వికీసోర్స్ నుండి

బండి'కిరాయి' తగ్గుటచేత, స్వల్పలాభము స్వల్పనష్టముక్రింద దిగెను. ఇదే బండ్లమ్మివేయుట కద నని నేను మాతండ్రిని హెచ్చరించితిని. ఒక బండి యమ్మివేయుట కాయన యొడఁబడుటచే, కొంచెమునష్టమునకు దానిని, దానియెద్దులను అమ్మివేసితిమి. కష్టనష్టములు పెరుఁగుచుండుటచేత, రెండవబండిని ఎద్దులనుగూడ పోకడపెట్టితిమి. మా మామగారి సంగతి కూడ నిట్లే జరిగెను. ఉభయకుటుంబములును, ఈ బండ్లవ్యాపారమున మూటగట్టుకొనినది, శ్రమయు ఋణమును మాత్రమే! ఈయప్పు భావికాలమందలి కుటుంబఋణమునకు ప్రాతిపదికము కూడ నయ్యెను !

31. రచనావ్యాసంగము

చెన్నపురినుండి వచ్చిన మఱుసటిదినముననే నా పుస్తకములు సరదుకొని, చెలికాండ్రను జూచివచ్చి మద్రాసులో నారంభించిన వ్రాతపని సాగింపఁబూనితిని. నా గురువర్యులగు వెంకటరత్నముగారిని చూచినపుడు, తెలుఁగులోనికి తర్జుమా చేయు మని యాయన నా కొక యింగ్లీషుపుస్తక మిచ్చెను. అది నేను ముందు వేసికొని, యింటఁ గూర్చుంటిని. తెలుఁగున గద్యపద్యరచనము చేయ నే నుద్యమించి, పోపు విరచిత మగు "సార్వజనికప్రార్థన"ను, 'గ్రే' వ్రాసిన "పెంపుడుపిల్లి" యను గీతమును, పద్యరూపమున ననువదించితిని. చేంబర్సు "నీతిపాఠక పుస్తక" మందలి పాఠములు కొన్ని చదివి తెలుఁగు చేసితిని. వీనిలోఁ గొన్ని కరపత్రములుగఁ బ్రచురించి ప్రార్థనసమాజ పక్షమున జనుల కుచితముగఁ బంచిపెట్టుట మంచి దని తలంచితిని. వీరేశలింగముగారు తెప్పించుకొనుచుండు "ఇండియన్ మెసెంజర్" అను బ్రాహ్మసమాజ వారపత్రికను జదువుటకు వారమువారమును వారిం టికిఁ బోవుచుండువాఁడను. ఆపత్రికలోఁ బ్రచురమగు మంచివ్యాసముల నిపుడు ఆంధ్రీకరింపసాగితిని. కడచిన రెండుసంవత్సరముల నుండియు రాజమంద్రిలో ప్రచుర మగు "వివేక వర్ధనీ" వారపత్రికను దెప్పించి సంతోషమునఁ జదువుచుండువాఁడను. ఇపుడు కొలఁది కాలమునుండి యాపత్రిక పడిపోయెను. మా చేతులలోనే యిట్టి వార్తాపత్రిక యొకటి యుండినచో, నే నిటీవల వ్రాయుచువచ్చిన పద్యములు వ్యాసములు నందుఁ బ్రచురింపవచ్చునుగదా ! నావలెనే ప్రార్థన సమాజమిత్రులును వ్రాసెడి వ్యాసములు, సభలలోఁ జదివెడి యుపన్యాసములును, ఇట్టి వార్తాపత్రికలలో ముద్రింపవచ్చును.

వార్తాపత్రికా స్థాపనమును గుఱించి నే నంతట కొందఱు సమాజమిత్రులతోఁ బ్రస్తావించితిని. వారు దాని నామోదించిరి. మే 27 వ తేదీని మృత్యుంజయరావు నేనును వీరేశలింగముగారితో మాటాడి, గోదావరియొడ్డున షికారుపోవుచు, పత్రికాస్థాపనమును గుఱించి మాటాడుకొంటిమి. మిత్రునితో నే నిట్లు చెప్పితిని : - "వీరేశలింగముపంతులుగారు తాము విరమించిన వివేకవర్థనీ స్థానమున చింతామణి యను మాసపత్రికను నెలకొల్పఁ దలఁచుకొన్నారు. మనబోటివారు వ్రాయు వ్యాసము లందుఁ బ్రచురింపరు. బొంబాయి బంగాళాదేశములలోని ప్రార్థన సమాజములకు స్వంత వార్తాపత్రిక లున్నవి. మనకుఁగూడ నొక పత్రిక యుండుట కర్తవ్యము. ముందుగా నొక చిన్నపత్రిక నేర్పఱిచి, దానిని క్రమముగఁ బెంపు చేయవచ్చును. ప్రార్థనసమాజమే దీని యాజమాన్యము వహింపవలెను. ఈ పట్టణమున నుండు సభ్యులు కార్య నిర్వాహక సంఘముగ నేర్పడి పత్రికను సాగింపవచ్చును." మృత్యుంజయరావు నాతో నేకీభవించెను. అంత మే మిరువురము పత్రికను గుఱించి మాటాడుకొని, చందాలు పోగు చేయఁదలంచితిమి. భావోద్రేకమున నా కారాత్రి మంచి నిద్దుక పట్టలేదు.

ఒకటి రెండు రోజులు జరిగినపిమ్మట, మే మిద్దఱము మరలఁ గలిసికొని పత్రికాస్థాపనమును గుఱించి సంభాషించితిమి. ఆఱునెలలవఱకును తాను దానిని బోషింతునని నామిత్రుఁడు చెప్పినప్పుడు, అటులైన పత్రిక తప్పక వెలయఁగల దని నే ననుకొంటిని. మఱునాఁటిసాయంకాలము మే మిరువురము వీరేశలింగముగారి యింటికిఁ బోయి, నూతనపత్రికను గుఱించి వారితో మాటాడితిమి. దీని కాయన మిగుల సంతోషించి, మావలెనే యౌవనమున దాను "వివేక వర్ధనీ" పత్రికను బ్రకటించినసందర్భము జ్ఞప్తికిఁ దెచ్చుకొని, ఆపత్రిక వెనుకటిప్రతులలోనివ్రాఁతలు కొన్ని మాకుఁ జదివి వినిపించెను. పత్రిక నెలకొల్పుటకుఁ జేయవలసిన కార్యక్రమము మాకుఁ దెలియఁబఱచెను. వలసినచో నేను పత్రికాధిపతిగ నుండెద నంటిని.

ఆమఱునాఁటి యుదయమునుండియె నూతనపత్రికాస్థాపన విషయమై నేను దలపోయసాగితిని. వివేక వర్థినిని బ్రారంభించుటకు వీరేశలింగముగారికిఁ గల యాశయములె మా దృష్టిపథమునను వెలసి యుండుటచేత, పేరున నించుక మార్పు చేసి, నూతనపత్రికకు "సత్య సంవర్థిని" యని నామకరణము చేసితిని. క్రొత్తపత్రిక కంతట "విజ్ఞాపనము" వ్రాసి 6 వ తేదీని నే నది పంతులుగారికిఁ జూపించితిని. అది బాగుగ నుండె ననియు, కొంచెము తగ్గించినయెడల, అదియే పత్రికలో ప్రథమవ్యాసముగ ముద్రింపవచ్చు ననియుఁ బంతులుగారు చెప్పఁగా, నే నెంతో సంతోషపడితిని. అప్పటినుండియు నేను "సత్య సంవర్థనీ" పత్రికకు వ్యాసములు వ్రాయుటతోఁ గాలము గడిపితిని. "అను తాపము" అనువ్యాసము నే నీసమయమున రచించి, సవరించి, పత్రికకు సిద్ధపఱిచినదియె.

నూతన పత్రికా వ్యాసంగమున నే నిట్లు తనిలియుండుటకుఁ గారణమారయఁగా ఆనాఁటి నామనస్తత్త్వ సమాచారము నాకు స్ఫురణకు వచ్చుచున్నది. నాశరీరదౌర్బల్యము సంగతి మాటిమాటికి నా మనస్సున కింకను దట్టుచు, నాబాధలను బెనుచుచుండెను. ఈ బాధలు నే లెక్క గొనక మఱచిపోవుటకు, నామనస్సున కపుడు నిరంతర పరిశ్రమ మేదియో యొకటి యావశ్యక మయ్యెను. ప్రార్థన సంఘ సంస్కరణ సమాజ ప్రణాళికలు నామనసున కట్టి వ్యాసంగము కొంత గలిపించినమాట వాస్తవమే. కాని, సమాజసభలు వారమున కొకటి రెండు గంటలు మాత్రమే జరుగుచుండెను. సభాప్రసంగము లందును, సఖులతో సంభాషణమునందును, ఉపన్యాసాదుల యందును నేను దఱచుగఁ బొల్గొనుచుండెడివాఁడను. కాని, యిట్టి చర్య లనుదినమును జరుగుట కవకాశము లేదుగదా.

ఇదిగాక, ఉపన్యాసములు, వాదోపవాదములును నా కంతగ రుచెండివికావు. మీఁదుమిక్కిలి నా సంస్కరణ వ్యాపనమునకుఁ గూడ నివి కొంత ప్రతిబంధములని నాకుఁ దోఁచెను. వ్యాసరచనయు పత్రికావిలేఖనమును ముఖ్య కర్తవ్యములుగ నా కగఁబడెను. దీనికి హేతువులు లేకపోలేదు. తగినంత వేగముగను విస్పష్టముగను సభలలో నేను నా భావములను వ్యక్తపఱుప లేకుండెడివాఁడను. తెలుఁగున మాటాడునపుడు ఇంగ్లీషుపదములు దొరలుచుండెడివి ! భావోద్రేరమున నా వచోధోరణి కుంటుచు నడుచుచుండెడిది. పదలాలిత్యాది సొంపులు లేక, నాభాష పరుషముగను, పలుకులు కటువులుగను నుండెడివి. ఇట్టి వాక్శక్తి లోపమువలన, హృదయమున లేని కాఠిన్యమునకును, మనసున లేని కాపట్యమునకును, నేను ఉత్తరవాది నగుచు వచ్చితిని.

నిశబ్ద మగుచోటఁ గూర్చుండి కలము చేతఁ బట్టినప్పుడు, ఉపన్యాసవేదికమీఁదను సభామధ్యమునను నాకుఁ గానవచ్చెడి తొట్రుపాటులు తొలఁగిపోయెడివి. భావమును వ్యక్తపఱిచెడి భాషయు, అభిప్రాయముల కనువగు పదసంఘటనమును, వ్రాఁత లభింపఁజేసెడిది. కలము చేతఁ బూనినపుడు, అవమాన మేమియుఁ గలుగకుండ మన తలంపులు మనము మార్చుకొనవచ్చును. మిత్రుల పరిహాసములకును, వైరుల వ్యాఖ్యానములకును నెడ మీయకుండ వెనువెంటనే మన వాక్యములు మనము సరిచేసికొనవచ్చును. కావున నన్ని విధములను వ్రాఁతపనియె నాకుఁ గర్తవ్యముగఁ గానఁబడెను.

32. పత్రికాస్థాపనము

"సత్యసంవర్థని"ని బ్రచురింప వీరేశలింగముగారు మిత్రులును సమ్మతించిరి కాన, ఆ పత్రికాస్థాపనవిషయమై వలయు ప్రయత్నములు నేనంతట చేసితిని. "వివేక వర్థనీ"పత్రికకు వెనుకటి వ్యవహారకర్త యగు శ్రీరాములుగారితో నేను జూలై 2 వ తేదీని కలసి మాటడఁగా, పత్రికను నడుపురీతిని నా కాయన చెప్పి, తానే యాపని చేసిపెట్టెద ననెను. పత్రికను టపాలో నంపువిషయమై మాటాడుట కానాఁడె నేను టపాలాకచ్చేరికిఁ బోయితిని. సబుకలెక్టరువొద్ద కేగి, నేను "సత్యసంవర్థనీ" పత్రికాప్రచురణకర్త నని కాగితముమీఁద సంతకముచేసి వచ్చితిని.