ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/బంధువియోగము

వికీసోర్స్ నుండి

3. బంధువియోగము

గోపాలపురమున బాలభోగములందు లగ్న మానసుఁడనై నే నుండునపుడు, పిడుగువంటివార్త యొకటి మాకు వినవచ్చెను. మాపెద్దమేనమామ చామర్తి వెంకటరత్నముగారు కడచిన వేసవి తుది దినములందు కలపవర్తకమునకు భద్రాచలపరిసరములకుఁ బయనము గట్టెను. ఒకసాహుకారునొద్ద రాజమహేంద్రవరమున గుమాస్తాగా నుండి, అతనితో నిపుడు కలపవర్తకమున భాగస్వామియై యెక్కువగ డబ్బు సంపాదింపఁగోరి, బందుమిత్రులు వల దని వారించిను వినక మన్యప్రదేశముల కాయన ప్రయాణ మయ్యెను. కాని, గమ్యస్థానము చేరిన కొలఁదిదినములకే యాయన జ్వరపీడితుఁడై, ఉద్యమము విరమించుకొని యింటిమొగము పట్టెను. రాజమంద్రియందలి ఘనవైద్యు లెవరుగాని యాయనకు దేహస్వాస్థ్యముఁ గలిగింపనేరకుండిరి. ఇపు డాయన ప్రాణావశిష్టుఁ డయ్యె నని మాకు జాబు వచ్చెను. ఆ వానకాలమున మా తల్లిని మువ్వురు బిడ్డలను దీసికొని మానాయన పడవలో బయలుదేఱెను. అపుడే బొబ్బరలంకలాకు తెగిపోవుటచేత, ఈవలిపడవ లావలకుఁ బోవుటలేదు. మా తండ్రి మమ్మందఱిని యావలి పడవలో నెక్కించి, తాను వెనుకకు మరలెను. మిక్కిలి యలజడితో మే మంతట రాజమంద్రి చేరి, మా మేనమామ యదివఱ కొకటిరెండు దినములక్రిందటనే చనిపోయె నను దు:ఖవార్త వింటిమి. మా తల్లివిచారమునకు మేర లేకుండెను. మా మువ్వురు మేనమామలలోను ఈయనయే జ్యేష్ఠుఁడును ప్రయోజకుఁడును. కోప స్వభావుఁ డయ్యును, ఆయన కోమలహృదయము గల సత్పురుషుఁడు. చదువుకొనక దుస్సహవాసముల మరగి కాలము వ్యర్థపుచ్చెడి మా మూ డవ మేనమామయగు వెంకయ్యగారిమీఁదఁ గోపించునపు డెల్ల నేనును భీతిల్లుచుండినను, నన్నాయన గారాబముతోఁ జూచుచుండువాఁడు. మా తల్లితోఁ గలసి వెళ్లి రాజమంద్రిలో వారియింటనే నుండినరోజులలో, నన్నాయన పెద్దబజారున నుండు తన కొట్టునొద్దకుఁ గొనిపోయి, తనకు నాచేత మా తల్లి వ్రాయించిన యుత్తరములు పొరుగు వారలకుఁ జూపించి, నా విద్యాకౌశలమును వారికి వర్ణించి చెప్పుచు, ఎఱ్ఱనిపంచెలు చిలుకల రుమాళ్లును నాకుఁ గొనిపెట్టుచుండువాఁడు. సాయంకాల మాయన యింటికి వచ్చునపుడు పిల్లలమగు మాకు మిఠాయిపొట్లములు తెచ్చి యిచ్చుచుండును. శ్యామలదేహవర్ణముతోను, చంచలవిశాలనేత్రములతోను నొప్పుచుండి, ఆయన మా జననిని మిక్కిలి పోలియుండెను. ఆయన యకాలమరణము మమ్మందఱిని దు:ఖార్ణవమున ముంచివేసెను.

కొన్నిదినములు రాజమంద్రిలో నుండి పిమ్మట గోపాలపురము వెడలిపోయినమేము, ఐదాఱునెలలలోనే మరల నచ్చటికి రావలసి వచ్చెను. పుత్రశోకార్తుఁడైన మా మాతామహుఁడు మనోవ్యధచే శీఘ్రకాలములోనే మంచ మెక్కెను. మేము వచ్చినపుడు, ఆ వృద్ధుఁడు మాట పడిపోయి యుండినను, మా మాటలు వినునపుడు ఆయనకు స్పృహవచ్చెను. చిన్నపిల్లలమగు మమ్మును గౌఁగలించుకొని, కన్నుల నీరు విడిచెను. తన పేరిఁటివాఁడును, ప్రియపౌత్రుఁడును నగు మా తమ్ముఁడు వెంకటరామయ్య నాయన అక్కున నదిమినపుడు, దు:ఖోద్రేకమున నపుడే యాయనప్రాణము లెగిరిపోవు నని యందఱు భీతిల్లిరి. ఒకటిరెండుదినములలో మా తాత కాలగతి నొందఁగా, ఇంట నందఱును దు:ఖవిహ్వలులైరి. మా తాతగారు వేలివెన్నులో నివాస మేర్పఱచుకొని, క్రోశ దూరమందలి సత్యవాఁడ కనుదినమును కరిణీకఁపుఁ బనులమీఁదఁ బోవుచుండెడివారు. ఆయనకు చాప లల్లుట, విసనకఱ్ఱలు కట్టుట మొదలగు చిన్న పనులయం దాసక్తి. ఈ పనులు నెరవేర్చుచు, ఆయన నాకును మా పిన్నికిని పద్యపాఠములు చెప్పుచుండువాఁడు. పసివాఁ డగు మా తమ్ముఁడు వెంకటరామయ్యకును ఆయన దాశరధీశతకములోని పద్యములు నేర్పెను. ఇట్టి ప్రియబాంధవుని వియోగము మాకు కడు దుస్సహముగ నుండెను.

4. రేలంగి

నా యెనిమిదవయేట అనఁగా 1878 వ సంవత్సరమున, మా తండ్రి యుద్యోగము చాలించుకొని స్వస్థలమగు రేలంగి చేరెను. రేలంగి రెండేండ్లక్రితమువఱకును మేము నివసించిన గ్రామమైనను, ఇపు డది నాకన్నులకుఁ గ్రొత్తగ గానిపించెను. అచట మాపెద్ద పెత్తండ్రి గంగన్న గారిపుత్రికలు, పుత్రుఁడు వీరభద్రుఁడును నా కిపుడు సావాసు లైరి. వీరిలో పెద్దది యగు రత్నమ్మ నాకంటె పదియేండ్లు పెద్దదియై, తాను నేర్చిన "లంకాయాగము" రాత్రిపూట శ్రావ్యముగఁ బాడి, నా కానందము గలిపించుచుండును. నా కీరీతిని రామాయణ కథ విపులముగఁ దెలిసి, నా మనోవీథిని గొప్పయాశయములు పొడమెను. రెండవది యగు చిట్టెమ్మ నాకంటె కొంచెము పెద్దది యై, గ్రామమందలి మాయీడు బాలబాలికలతోడి యాటపాటలకు నన్నుఁ గొనిపోవుచు వచ్చెడిది. వీరభద్రుఁడు నా పెద్దతమ్మునికంటె కొంచెము పెద్దవాఁడై, వాని కీడుజోడై యుండెను.