ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/వీరేశలింగముగారి సాయము

వికీసోర్స్ నుండి

మూఁడేండ్లక్రిందటనే యల్. టి. పరీక్షలో విజయ మందినను, పట్టభద్రులసభ కిదివఱకు నేను వెళ్లియుండలేదు. 1901 మార్చి 27 వ తేదీని నే నాసభకుఁ బోవుటకు మద్రాసు బయలు దేఱితిని. బండిలో నరసింహరాయఁడుగారు మున్నగు మిత్రులు కానఁబడిరి. చెన్నపురిలో స్నేహితులు కొల్లిపర సీతారామయ్య గారియింట నేను బసచేసి, పరశువాక మేగి, వీరేశలింగము బుచ్చయ్యపంతులుగార్లను జూచితిని. మద్రాసు స్టాండర్డు పత్రికా సంపాదకీయ వర్గములోని బి. వరదాచార్యులుగారిని సందర్శించితిని. ఆయన మరల న న్నాపత్రికకు బెజవాడ యుపవిలేఖకునిగ నుండుఁడని కోరి, దినపత్రిక నంపుచువచ్చిరి. స్కాటుదొరను జూచితిని గాని యాయన నా కేమియు సాయము చేతుననలేదు.

మేరీకారిల్లయి వ్రాసిన "వెండెట్టా", "మైటీ ఆటమ్" అను నవలలను ఏప్రిలు నెలలోఁ జదివితిని. "సైతానువెతల" వలెనే 'వెండెట్టా'యును మిగుల మనోహరమగు విషాదాంత కథయే.

అంత మాపాఠశాలకు సెలవు లగుటచేత, మేయి 5 వ తేదీని బతలుదేఱి, ఏలూరుమీఁదుగ రాజమంద్రి వెడలిపోయితిమి. రాజమంద్రి స్టేషను నుండియే యత్తయు భార్యయు కాకినాడ పోయిరి. మాతల్లియు తమ్ములును త మ్మీచర్య చిన్న పుచ్చెనని తలపోసిరి !

46. వీరేశలింగముగారి సాయము

మా చెల్లెలికూఁతుని భారసాల 8 వ మే తేదీని జరుగఁగా పిల్లను దీసికొని తల్లిదండ్రులు అర్తమూరు మఱునాఁడె వెడలి పోయిరి. మా తమ్మునిభార్యను, పిల్ల వానిని మోగల్లునుండి తీసికొని రావలెనని నేను మాతమ్ముఁడును 12 వ తేదీని రాజమంద్రినుండి బయలుదేఱి, మఱునాఁటి ప్రొద్దున్న మోగల్లు చేరితిమి. అందఱు నచట సేమమె. పిల్లవాఁడు బాగుగనే యుండెను గాని, వట్టి బలహీనుఁడు. మావాండ్రను దీసికొనిపోయెద మని మే మనఁగా, మేము బారసాలను వైభవముగ నచట జరిపినఁ గాని తల్లిని పిల్లవాని నిపుడు పంప వలనుపడదనియు, లేనిచో రాఁబోవుసెలవులలో మా యింటికే వారిని మేము తోడుకొనివచ్చి బారసాల చేసికొనవచ్చుననియు, నరసయ్యగారు చెప్పివేసిరి ! కోపస్వభావుఁడగు మాబావ షరతులకు మే మంగీకరించి మరలి వచ్చితిమి.

అంతట సోదరుల మిద్దఱమును రాజమంద్రి వెంటనే విడిచి, వేలివెన్ను మార్గమున గోటేరు పోయి, మా ఋణదాత దర్శనముఁ జేసికొని, తణుకు వచ్చితిమి. అచట నొక యున్నతపాఠశాలను నెలకొల్పు ప్రయత్నములు జరుగు చుండెను. నన్ను దానికి ప్రథానోపాధ్యాయునిగ నుండుఁడని పలువురు కోరిరి. కాని, తగినంత స్థిరత్వము లేని పాఠశాలలోఁ బ్రవేశింప నా కిష్టము లేదు.

ఆ సంవత్సరమున గోదావరి మండలసభలు అమలాపురమున జరుగవలసి యుండెను. నన్నా సభలకు స్నేహితు లాహ్వానించిరి. సాంబశివరావు కామేశ్వరరావుగార్లతోఁ గలసి నేను 26 వ మేయి తేదీని అమలాపురము బయలుదేఱితిని. మండల రాజకీయసభకుఁ బోయి, "స్టాండర్డు" పత్రిక యుపవిలేఖకునిగ వార్తలు వ్రాసి యా పత్రిక కంపితిని. 28 వ తేదీని సంఘసంస్కరణసభ జరిగెను. దానికి గోటేటి శివరావుగా రధ్యక్షులు. 'వేశ్యాజననిషేధము' 'వితంతూవివాహప్రోత్సాహము' లను గుఱించిన తీర్మానములు నేను బ్రతిపాదించితిని. గోదావరిమండలస్థాయి సంఘములో నన్నొకసభ్యు నిగఁ జేరు మని యెంద ఱెంతగఁ జెప్పినను నేను సమ్మతింపలేదు ! వేఱుమండలమున నివసించునా కీ మండలసమాజసభ్యత్వము బరుపులచేటని నేఁ దలంచితిని. దీనికి నన్నుఁ గొందఱు నిందించిరి. మఱునాఁడు విద్యావిషయక సభ జరిగెను. 30 వ తేదీని మే మందఱము బయలు దేఱి రాజమంద్రి వెడలివచ్చితిమి.

1 వ జూను తేదీని నేను మా బంధువులను జూచుటకు కాకినాడ పోయితిని. నా కచట నొక వైద్యునితోఁ బరిచయము కలుగఁగా, తల్లికిని భార్యకును వారియొద్దఁ గొంతమందు పుచ్చుకొంటిని. అచట నున్నదినములలో 'రాజాగారి కళాశాల'లో నొక యుద్యోగము ఖాళీయగుననియు, నా కది లభింపఁగల దనియు మిత్రులు చెప్పిరి. 20 వ తేదీని మరల మేము బెజవాడ ప్రవేశించితిమి.

సంఘసంస్కరణోద్యమ ప్రచారమునకై నేను గొందఱు మిత్రులతోఁ గలసి, 6 వ జూలయిని బాపట్ల బయలుదేఱితిని. మార్గ మధ్యమున మమ్ముఁ గొందఱు మిత్రులు గలసికొనిరి. మే మందఱము నచట నుపాధ్యాయులగు బొప్పూడి వెంకటప్పయ్యగారియింట బస చేసితిమి. డిస్ట్రిక్టుమునసబుగారు బహిరంగసభ కధ్యక్షులు. విన్నకోట కోదండరామయ్య రాజగోపాలరావుగార్లు ప్రారంభించిన చర్చలో మే మందఱమును పాల్గొంటిమి.

పూర్వము పాఠశాలకార్యక్రమము సాగించుటలో అనంతముగారికి సామాన్యముగ నేను సహాయము చేయుచుండు వాఁడను. ఇపు డాయన, సాంబమూర్తిగారు మున్నగు క్రైస్తవ బోధకుల సలహా పుచ్చుకొనుచు, వారల చేతనే కాలనిర్ణయపట్టిక మున్నగునవి సిద్ధము చేయించుట. నాకును తక్కిన యుపాధ్యాయులకును నసమ్మతముగ నుండెను. పాఠశాలలో జరుగుచుండెడి దుర్నయములను గుఱించి నే నొక పెద్దయుత్తరము వ్రాసి, అనంతముగారికి 18 వ జూలయిని బంపితిని. ఆరోజునను మఱునాఁడును జబ్బుగా నుండుట చేత నే నింటనే యుంటిని. మిత్రులతోఁ గలసి యొకసాయంకాలమున ననంతముగారు నన్నుఁ జూడవచ్చి, కాలనిర్ణయ పట్టికను నన్నుఁ దయారుచేయు మనిరి. నే నందుకు సమ్మతింపనందున, సరియైన యేర్పాటులు జరుగకుండుటకు నేనే కారణముగదా యని వారనిరి ! కాని, యందఱియెదుటను నేను నిజము విప్పిచెప్ప సాహసింప కుంటిని.

క్రొత్తయేర్పాటులచొప్పున పాఠశాలలో నాకుఁ బని హెచ్చి తీఱిక తక్కువ యయ్యెను. నా దేహమున నిటీవల నసిగా నుండుటలేదు. సంవత్సరముల కొలఁది వార్తాపత్రికల పనులు చేయుటకు నే నెంతయు విసిగియుంటిని. 1901 వ సంవత్సరము జూను 'జనానాపత్రిక'లో స్వవిషయము అను శీర్షికక్రింద నే నిట్లు వ్రాసితిని : - "ఈ పత్రికతో మా 'జనానాపత్రిక' కెనిమిది సంవత్సరములు గడచినవి. జూలయినెలలో 9 వ సంవత్సరము ప్రవేశ మగును. * * * ఇంగ్లీషుమాసపత్రిక లెంత చక్కఁగ నుండునో చూడుఁడు ! వేల కొలఁది చందాదారు లుండుటచేతనే యాపత్రికలు చౌకగ నమ్మఁబడు చున్నవి. అందలి విషయములు బొమ్మలును రమ్యముగ నుండును. మనదేశమం దన్ననో, పత్రికాధిపతి తన తీఱిక కాలమును, సొమ్మును పత్రిక కుచితముగ నీయవలసినదే ! పత్రికకు వ్యాసములు వార్తలు మున్నగునవి ముఖ్యముగ నాతఁడే వ్రాయవలయును. ఇతరు లతనికి సాయము చేయరు ! పత్రికలను చందాదారుల కంపుట, ఉత్తర ప్రత్యుత్తరములు నడుపుట, సొమ్ము వసూలు చేయుట, మొదలగు పత్రికపను లన్నియు నాతనిమీఁదనే పడును ! కావున పత్రికాసంపాదకత్వము సంతోషజనకము గాక, యతని కొక శిక్షగా నగుచున్నది !

"ఇట్టి బానిసపనుల కీ జనానాపత్రికాధిపతియు లోనైయున్నాఁ డని వేఱె చెప్పనక్కఱలేదు ! ఎల్లకాలము నేకరీతిని కష్టపడుటకు మానవప్రకృతి యోరువఁ జాలదు ! * * * కాఁబట్టి మా కీ సత్కార్యమున సహాయము చేయుఁ డని యార్యులను విద్యాధికులను వేఁడుచున్నాము."

ఇపుడు చెన్నపురిలో ముద్రాలయమును నెలకొల్పి జరుపుచుండు వీరేశలింగము పంతులుగారిని, "జనానాపత్రిక" ముద్రణాదికార్యకలాపమును గైకొనుఁ డని కోరుచును, నేను పత్రికా సంపాదకునిగ నుందునని చెప్పుచును నే నొక లేఖ వ్రాసితిని. ఆయన దీనికి సమ్మతించి, తాము స్థాపింపనున్న యొక వార్తాపత్రికకు ఆంగ్ల వ్యాసములు వ్రాయుఁడని జూలయి 22 వ తేదీని నాకు లేఖనంపిరి. మఱునాఁడే వారికి వందనము లర్పించుచు నేను బ్రత్యుత్తర మిచ్చితిని. కాని, వెనువెంటనే బ్రాహ్మసమాజమువారి ముద్రాలయమునుండి నా పత్రికను దీసివేయలేకయు, పాఠశాలలోని పనితొందరవలనను, నే నొక నెల యాలసించి, ఆగష్టు 23 వ తేదీని పంతులుగారి కీ విషయమున జాబు వ్రాసితిని. దీనికి పంతులుగారు 28 వఆగష్టున పెద్ద ప్రత్యుత్తర మిచ్చిరి. నేను జేసిన యాలస్యమునకు నామీఁద వారి కాగ్రహము జనించెను. వా రిపుడైనను మా పత్రికకు సాయము చేయ సిద్ధముగ నుంటి మనుటచేత, నేను సెప్టెంబరుసంచిక మొదలు మాపత్రికను వారి కొప్పగింప నిశ్చయించుకొని, 30 వ ఆగష్టున మొదటివ్యాసము వ్రాసి వారి కంపితిని. 1901 సెప్టెంబరునుండియు "జనానాపత్రిక" వీరేశలింగముగారి 'చింతామణిముద్రాలయము'న నచ్చొత్తింపఁబడెను. సెప్టెంబరు పత్రికలో నే నిట్లు వ్రాసితిని : - "తెలుఁగుజనానాపత్రిక" విషయమై మేము పడుచుండు కష్టములు చూచి స్త్రీవిద్యాభిమానులలో నగ్రగణ్యులగు శ్రీ కందుకూరి వీరేశలింగముపంతులుగారు మా పత్రికను నడుపుభారము కొంత తాము వహించెద మని దయతో వాగ్దానము చేసియున్నారు. ఈ సాహాయ్యమునకు వారి కెంతయు కృతజ్ఞులము. ముందునుండి మా పత్రిక వారి ముద్రాక్షరశాలలో ముద్రితమై చెన్నపురినుండి ప్రకటింపఁబడును. చందాధనము చెన్నపురికిని, వ్యాసములు మున్నగునవి బెజవాడకును, బంపవలయును. * * *

" * * * శ్రీ పంతులుగారు మా పత్రికను చౌకగనే ముద్రింపించెదమని సెలవిచ్చిరి. పత్రికాప్రకటనము, చందాల వసూలు, మున్నగు కష్టకార్యము లన్నియు నుచితముగఁ జేయ పంతులుగా రంగీకరించిరి. వీరి యౌదార్యమునకు వందనములు చేయుచున్నాము. * * *

"శ్రీ వీరేశలింగముగారి యాదరణమున నీపత్రిక వర్థిల్లఁగలదని యెంచుచున్నాము."

మొదటినెలనుండియే వీరేశలింగముగారు మా పత్రికకుఁ దాము వ్యాసములుకాడ వ్రాయుచువచ్చిరి. సెప్టెంబరు అక్టోబరు సంచికల యందలి "శ్రీ అలెగ్జాండ్రామహారాజ్ఞి చరిత్ర"యు అక్టోబరు సంచికలోని "ఉత్తమమాత" యును, వీరు వ్రాసినవియే. ఈ సాయమే కాక, తమయొద్దనుండు ప్రతిమల దిమ్మెలు మా పత్రిక యుపయోగమునకు వీ రొసంగుచుండెడివారు.

47. ఉద్యోగప్రయత్నము

వీరేశలింగముగారి సాయమున "జనానాపత్రికా" ప్రచురణ భారము నాబుజములనుండి చాలవఱకు తొలఁగిపోయెను. అనంతముగారే మరల బెజవాడపాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగను, అధికారులుగను వచ్చినను, ఈమాఱు వారి పరిపాలనము నా కంతగ నచ్చలేదు. ఆయనపేరు చెప్పి పెద్దయుపాధ్యాయులమీఁద చిన్నవార లధికారము చెల్లించుట కడు దుస్సహముగ నుండెను ! నాయెడ ననంతముగారి వైఖరి యిట్లు మాఱిపోవుట చూడఁగా, నే నీపాఠశాలలో నుండుట వారి కిష్టము లేకుండునట్లు తోఁచెను! కావున నే నీసంవత్సరాంతమున వేఱుపాఠశాలకుఁ బోఁయి, స్వగౌరపరక్షణము చేసికొనుట కర్తవ్యముగఁ గానిపించెను. అంత మాసిన న్యాయశాస్త్రపుఁజదువులు మరల నేను విప్పితిని. వెనుకటిచుఱుకుఁదనము లేకున్నను, ఒకరీతిని నే నాపుస్తకములు తిరుగవేసితిని.

మాతల్లికిఁ దఱచుగ వ్యాధి వచ్చుచుండుటవలనఁగూడ నా మనస్తాప మతిశయించెను. 4 వ సెప్టెంబరున మా తమ్మునియొద్ద నుండి వచ్చినయుత్తరములో, ఇటీవల చేసిన జబ్బులో నీరసముచేత ధృతిచెడి యామె యేడ్చెనని యుండెను !

అప్పుడప్పుడు నేను సమావేశపఱుచు సభలు మున్నగునవి నామనస్సున కొకింత యుపశమనము గావించెను. 7 వ సెప్టెంబరున ముగ్గురు స్నేహితులము మరల బాపట్లకు దండయాత్ర సాగించితిమి. మిత్రులు విన్నకోట కోదండరామయ్యగారు సంస్కారపక్షమువారి వాదమును వ్యక్తపఱిచిరి. పూర్వాచారపరుల పక్షమున నూజివీడు వాస్తవ్యులగు సూర్యనారాయణశాస్త్రిగారు, ప్రసంగించుచు, పూర్వ