ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/ప్రాథమిక పరీక్ష

వికీసోర్స్ నుండి

"మా జనకుని పవిత్ర జీవితము మాసోదరు లందఱికిని పరస్పర ప్రేమముఁ బురికొల్పును గాక! మా తండ్రి కీలోకమున సమకూరని శాంతి సౌఖ్యములు పరాత్పరుని సన్నిధానమునఁ బ్రసాదిత మగునుగాక!"

నా ప్రసంగానంతరమున మిత్రులు పెద్దాడ సాంభశివరావు గారు మా జనకుని సౌజన్యమును గూర్చి ముచ్చటించిరి. అగ్రాసనాధిపతియగు పాపయ్యగారు మానాయన సుగుణములను బ్రశంసించిరి. ఎన్నఁడుగాని తనకుమారులు చెడువార లనియు నాస్తికు లనియు మాతండ్రి మొఱలిడలేదని వారు చెప్పిరి. అమిత సహన సౌజన్యములు గలిగి మాజనకుఁడు మనుచుండెడివాఁడని పాపయ్యగారు వక్కాణించిరి.

31. ప్రాథమిక పరీక్ష

మాతండ్రి చనిపోయిన చాలకాలమువఱకును, నా కాయనను గుఱించి భయంకరమగు కలలు వచ్చుచుండెడివి. మా కిపుడు కష్టపరంపర సంభవించె ననియు, మాతల్లి మున్నగు వారును మృతి నొంది రనియు నేను సుషుప్త్యవస్థయందు భ్రమనొందుచుండువాఁడను. ఇపుడు సంవత్సరపు తుదిదినము లగుటచేత మా పాఠశాలకుఁ బరీక్షలు చేయఁజొచ్చితిమి. నామిత్రులు వెంకటరత్నము నాయఁడుగారు కృష్ణామండలపూర్వభాగమునకు ప్రాథమిక పరీక్షాధికారిగ నియమింపఁబడిరి. ఆయన నన్నును, మఱికొందఱు స్నేహితులను సహాయ పరీక్షాధికారులుగ నియమించిరి. అందువలన నించుక ధనలాభమె కాక, మనసునకుఁ గొంత విరామమును, వారియొక్కయు నితర స్నేహితులయొక్కయు నమూల్య సహపాస భాగ్యమును నాకు లభించెను. నేను 4 వ డిశంబరు తేదీని, బెజవాడనుండి కంకిపాడు బయలుదేఱి, నాయఁడుగారి నచట సాయంకాలము గలసికొంటిని. చెన్నాప్రగడ భానుమూర్తిగారు నిడుగొంది నరసింహముగారును, వారికి సహాయకులుగ నుండిరి. రాత్రి చాలసేపటివఱకును నాయఁడుగారు తమ బందరు వృత్తాంతములు నాకుఁ జెప్పిరి. క్లార్కుదొర తనను నోబిలు కళాశాల విడిచిపొమ్మను సందర్భము వారు సవిస్తరముగఁ దెల్పి, ఆస్తికపాఠశాలా స్థాపనమున కిది యదను గాదని పలికిరి.

ప్రాథమిక పరీక్ష నితర గ్రామములోఁ జేయఁబోవుటకు నాకు సెలవు దొరకుట దుర్లభమయ్యెను. పాఠశాలలోని పని, "జనానాపత్రిక" పని, ఇపుడు పునర్ముద్రణ మగుచుండు "గృహనిర్వాహకత్వము" అచ్చుప్రతులు సవరించు పనియును గలసి, నా కెంతో ప్రయాసము గలిగించెను.

13 వ డిశంబరు విద్యాశాల సంవత్సరపు తుదిదినము. ఆరోజున వేవేగమే పాఠశాలా పరీక్షలు పూర్తి పఱచుకొని, నేను స్టేషనునకు వెళ్లితిని. చెన్న పురికిఁ బోవుచుండెడి కనకరాజు గంగరాజుగార్లను జూచి, నైజాము పోవుబండి యెక్కి, మదిరలో దిగితిని. ఆరాత్రియంతయు నాయఁడుగారు నేనును బండిపయనము చేసి, మఱునాఁటి యుదయమునకు నందిగామ చేరితిమి. రెండు రోజులలో నచటి పరీక్షలు పూర్తిచేసి, జగ్గయ్యపేట వెడలిపోయితిమి. 16 వ డిశెంబరున నచట పరీక్ష జరిగెను. ఇపు డక్కడ పూర్వ మిత్రుఁడు అయ్యగారి సుబ్బారాయఁడుగారు ఉద్యోగమున నుండిరి. వారి యింట నేను బసచేసితిని. బెజవాడయందలి వెనుకటి సౌఖ్య దినములు మా కప్పుడు జ్ఞప్తికి వచ్చెను. మఱునాఁడు బెజవాడ చేరితిమి. 19 వ తేదీని నేను రెయిలెక్కి రాజమంద్రి వెడలిపోయితిని. ఆప్రదేశమున మానాయన సంతోషానన మిపుడు గానరాక నేను మిగుల వగచితిని.

ఆ శీతకాలపు సెలవు రోజులలో నేనును తమ్ముఁడును చెల్లెలు కామేశ్వరమ్మ వివాహ సంబంధమునకు వెదకితిమి. అట్లపాడు సంబంధమే యేర్పాటు చేయఁదలఁచితిమి. దు:ఖాతిరేకమున వగచు మాతల్లికి ననుదినమును భాగవతము చదివి యర్థము చెప్పుచు, ఆమెను గొంత సేదదేర్చితిని. మా మఱఁదల కింకను, దేహస్వాస్థ్యము గలుగనేలేదు. ఐనను నేను భార్యాసమేతముగ 5 వ జనవరిని బెజవాడకు బయలు దేఱిపోయితిని.

మరల ప్రాథమిక పరీక్షలు జనవరి ప్రారంభమున నారంభించుటచేత నే నింత త్వరగ బెజవాడ రావలసివచ్చెను. నా భార్యయు, అత్తగారును బంధువులను జూచివచ్చెద మని యేలూరులో దిగిరి. కావుననే నాయఁడుగారు మున్నగు పరీక్షా స్నేహితులకు, ఇంట రెండవ భాగమున నుండు మిత్రులు వీరభద్రరావుగారే యాతిధ్య మొసంగిరి. నాయఁడుగారి సహాయకులగు దుగ్గిరాల రామమూర్తిగారు మొదలగు మిత్రులు మాయింటనే విడిసియుండిరి.

ఆకాలమునందలి నా శీల విశేషములు తేటపడుటకై, 1899 జనవరి 13 వ తేది సంక్రాంతిపండుగనాఁటి దినచర్య నిచట నుల్లేఖించుచున్నాను : -

"ఈనాఁ డంతయు విషయవాంఛలే నన్ను వేధించినవి! అనగత్యముగనే నేను వానికి లోఁబడుచున్నాఁడను. దేవా, వీనిబాధనుండి నా కెపుడు విముక్తి కలిగించెదవు? నేను కర్మకాండలోఁ జొప్పించి యెంత సలుపుచున్నను, నామనసునకు నయవినయాదిసుగు ణములు పట్టువడకున్నవి ! విషయవాంఛలు నాకు వారసత్వపు టాస్తివలె నయ్యెను. ఇంతకాలమునకైన పాపిష్ఠ చక్షువులకు వైరాగ్య మొనఁగూడకున్నది! భగవానుఁడా, నాకు హృదయపారిశుద్ధ్యము ప్రసాదింపుము."

ప్రాథమిక పరీక్షలమూలమున నాకు నిత్యసహవాసులైననాయఁడుగారితో పలుమాఱు ఆత్మీయవిషయములను గుఱించి ముచ్చటించు చుండువాఁడను. నావలెనే తానును గొన్ని లోపములకు లోనగు చుంటి నని యాయన మొఱపెట్టువాఁడు. సమయపాలన విషయమునం దాయన వెనుకఁబడి యుండిరి. మనవలెనే యితరులును లోపములకు లోనయిరని వినుటవలన, మనసున కొకింత శమనము గలుగుచుండును.

16 వ తేదీని మేము ప్రాథమికపరీక్షకై రేపల్లె వెళ్లినప్పుడు, అచట నిరుడు ప్రధానోపాధ్యాయుఁడుగ నుండిన తమ్ముఁడు వెంకటరామయ్యకును నాకునుగల పోలికలను గుఱించి యచటివారు చెప్పుకొనసాగిరి. సోదరుఁడు విడిసియుండు గృహము నా కచటివారు చూపించిరి. అతని మిత్రుఁడగు లక్ష్మీనారాయణగా రను నుపాధ్యాయుఁడు మాకు విందొనర్చెను.

ఒక్కొకనాఁడు ముమ్మరమగు పనితో నేను నలిఁగిపోవుచు వచ్చితిని. సెలవుదినములలో నా కీపను లెక్కువగ నుండెడివి. 22 వ జనవరి ఆదివారమునాఁడు నే నెన్నియో సభలకుఁ బోవలసి వచ్చెను. ఆనాఁడు సంఘ సంస్కరణ సభను జరిపితిమి. మా సమాజాదరణమున స్త్రీల సభలు సమకూర్చుటకును, బాలికాపాఠశాల నొకటి నెలకొల్పుటకును మేము నిశ్చయించుకొంటిమి. ఆఱువేల నియోగి సభా సమావేశములు రెండింటికిని నేను బోయితిని. కొంత శ్రమపడి బావమఱఁది వెంకటరత్నమునకు నియోగి సమాజమువారి వేతనమును సంపాదించితిని. ఇదిగాక నేను వ్రాసిన ద్రౌపది చరిత్రకు నేఁడు శుద్ధప్రతి వ్రాసితిని.

నిరుడు బెజవాడలో నాయొద్ద నాలుగవ తరగతిలోఁ జదివిన నాతమ్ముఁడు సూర్యనారాయణ, ఈసంవత్సరము బెజవాడ రానని జనవరి తుదివారములో నాకుఁ దెలియఁబఱిచెను. మాతండ్రి చనిపోయిన పిమ్మట బెంగపెట్టుకొని, తల్లిని విడిచి యిచ్చటికి వచ్చుటకు వాఁ డిచ్చగింపకుండెను.

యూనిటేరియను మత సంఘమువారి ప్రచురణము లనిన నాకిదివఱకు తలనొప్పిగ నుండెడిది. యూనిటేరియను గ్రంథకర్తయగు ఆరమ్‌స్ట్రాంగు వ్రాసిన "జీవాత్మ పరమాత్మలు" అను గ్రంథమును బాగుగ విమర్శనము చేసినవారికి బహుమతి నిచ్చెదమని ఆ మతసంఘమువా రిపుడు ప్రచురించిరి. మిత్రుఁడు రాజగోపాలరావునొద్ద నే నాపుస్తక ప్రతిని ఎరవు పుచ్చుకొని చదివితిని. అది రమ్యముగ నుండెను.

26 వ జనవరి తేదీని వెంకటరత్నమునాయఁడుగారు బందరునుండి వచ్చిరి. ఉద్యోగాన్వేషణమునకై వా రిపుడు హైదరాబాదు పోవుచుండిరి. ఇట్టి సుశీలుఁడు ప్రతిభావంతుఁడును క్రైస్తవ మతసంఘమువారి కొలువున నుద్యోగముఁ గోల్పోయెనే యని నేను విషాద మందితిని.

మరల నేను న్యాయశాస్త్ర పుస్తకములు విప్పితిని. మాతండ్రి చిన్ననాఁ డెంత బోధించినను నే నాచదువుదెస పెడమొగము పట్టియెయుంటిని. ఆయన చనిపోయిన పిమ్మట నా కా చదువునందు విపరీతాభిరుచి జనియించెను !

32. మనస్తత్త్వ పరిశోధక సంఘము

మాతండ్రి చనిపోయిన మొదటి దినములలో దు:ఖాతిరేకమున నాకు మతి తొలఁగిపోవునటు లుండుచువచ్చెను. మొన్న మొన్నటి వఱకును ఆరోగ్యానందము లనుభవించి మనుచుండెడి జనకుఁ డింత వేగమె మటుమాయ మగుట నా కాశ్చర్య విషాదములు గొలిపెను. మృత్యువుతో మన మనోవృత్తు లన్నియు నశించునా, లేక పిమ్మటకూడ నవి వేఱు పరిస్థితులలోఁ గార్యకలాపము సాగించునా యని నేను దలపోయువాఁడను. నేనా దినములలో నొకప్పుడు రాజమంద్రిలో "ఇండియన్ మెస్సెంజరు" పత్రిక చదువుచుండఁగా దానిలో "లండను మనస్తత్త్వ పరిశోధక సంఘము" వారి యొక్క నూతన గ్రంథ విమర్శనము కానఁబడెను. అది నే నతి కుతూహలమునఁ జదివియుఁ దనివి నొందక, ఏతత్గ్రంథకర్తయగు రిచర్డుహాడ్జిసను గారికి తమపుస్తకప్రతి నాకుఁ బంపుఁడని అమెరికాకు వ్రాసితిని. ఆయన నాకుఁ బంపిన పుస్తకము ప్రేమపూర్వకమగు లేఖయును, 1899 సంవత్సరము జనవరి 30 వ తేదీని నా కందినవి. ఆసాయంకాలమునుండియే నే నాగ్రంథపఠన మారంభించితిని. రాత్రులందును, పగలు పాఠశాలలో తీఱిక సమయమందును, నే నా పుస్తకమును జదువుచుండువాఁడను. అందలి "జి. పి. సందేశములు" అనుభాగము అత్యద్భుతముగ నుండెను. ఈవార్తలే యధార్థ మైనచో, మనస్సునకు మరణానంతరదశ కల దనుట స్పష్టము. హాడ్జిసనుగారికి నేను బుస్తకపువెల నంపుచు, పైపరు దొరసానిగారిని మాతండ్రిని గూర్చి ప్రశ్నలడుగుటకై యాయన జాబులు నే నంపవచ్చునా యని వ్రాసితిని.