ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/తుదకు విజయము

వికీసోర్స్ నుండి

16. తుదకు విజయము

గత మూఁడు సంవత్సరములనుండియు బెజవాడలోని క్రైస్తవ పాఠశాలకు ధన్వాడ అనంతముగారు ప్రథమోపాధ్యాయులుగ నుండిరి. ఆయన సజ్జనులు ననుభవశాలురును. వారియందు నా కమిత భక్తి గౌరవములును, నాయెడ వారి కపారవిశ్వాస వాత్సల్యములును గలవు. ఇపు డాయనను క్రైస్తవమతసంఘమువారు "బైబిలు ఆంధ్రానువాదము సరిచూచు సంఘము!" లో సభ్యునిగ నియమించుటచేత సకుటుంబముగ వారు బళ్లారినగరము వెడలిపోవ సిద్ధముగ నుండిరి. అట్టి యుత్తమమిత్రుని విడిచి నాకును, వారి సతీతిలకమగు సౌభాగ్యవతమ్మ గారిని విడిచి నాభార్యకును, ఈప్రదేశమున నివసించుట మొదట కడు దుర్భరముగఁ దోఁచెను. బోధకులు విద్యార్థులును కోరుటచేత, అందఱు ననంతహారి కొసంగవలసిన విజ్ఞాపనపత్రమును నేనె సిద్ధపఱిచితిని. పాఠశాలకుఁ గ్రొత్తయధికారియైన టానరుదొర విశాల హృదయునివలెఁ గానవచ్చెను. అంత ఫిబ్రవరి మొదటి తేదీని పాఠశాలాభవనమున జరిగిన బహిరంగసభలో అనంతముగారి విజ్ఞాపనాపత్రమును నేను జదివితిని. నూతన ప్రథమోపాధ్యాయుఁడు లాలా బాలముకుందదాసుగారు నా కంటె వయస్సునందును బోధకానుభవమందును జిన్నవారు.

బావమఱది వెంకటరత్నము ప్రథ్మశాస్త్రపరీక్షలోను, తమ్ముఁడు కృష్ణమూర్తియు అనంతముగారి ప్రథమ పుత్రుఁడు రామచంద్రరావును ప్రవేశపరీక్షలోను గెలుపొందిరని విని మిగుల సంతసించితిమి. వెంకటరత్నము పట్టపరీక్షకును, కృష్ణమూర్తి ప్రథమశాస్త్రపరీక్షకును జదువుటకై రాజమంద్రికళాశాలలోఁ జేరిరి. కనకరాజు వెంకటరామయ్యయును ఫిబ్రవరి 3 వ తేదీని మద్రాసునుండి వచ్చిరి. మఱునాఁడు "హిందూమతముయొక్క భవిష్యత్తు"ను గుఱించి కనకరాజు బెజవాడలో నుపన్యాసమిచ్చెను. అం దాతఁడు హిందూమత దివ్యజ్ఞాన సమాజములను గూర్చి సద్భావము తెలిపినందుకు సభను సమకూర్చిన నా కమితకోపము వచ్చెను. ఆరెండు సంస్థలవలనను దేశమునకు లేశమైనను మే లొనఁగూడదని గురువర్యులగు వీరేశలింగముగారివలెనే నేనును ఆకాలమున నమ్మియుంటిని !

మా పాఠశాలనూతనాధికారియగు టానరుదొరకు నాకు నంతగ మనస్సు గలియలేదు. నేను జెప్పుపాఠములలో నా కనిష్టమగు మార్పు గలిగింపవలె నని యాయన యుద్దేశము. ఆయనకు సలహాదారు గోటేటి సాంబమూర్తిగారు. ఇపు డింకొక యుదంతముకూడ జరిగెను. ఏదో పనిమీఁద టానరుదొర బందరు వెళ్లినపుడు, యల్. టీ. పరీక్షా ప్రథమ భాగపు పలితములు తెలిసెను. వెంకటరత్నమునాయఁడు, బాలముకుందదాసుగా ర్లందు కృతార్థులైరి. ప్రథమ భాగ పరీక్షా పర్యవసానము తెలిసిన వెనువెంటనే, రెండవ భాగమునఁ బరీక్ష జరుగుచుండుట సాంప్రదాయము. అందువలన దొరతోఁ జెప్పకయే దాసుగారు నేనును మద్రాసు వెడలిపోయితిమి. దీనికై మాయిరువురి మీఁదను దొరగారికిఁ గోపోద్రేకము గలిగె నని నాకుఁ దెలి సెను. నా విధాయకకృత్యవిషయమై యధికారికి నిర్హేతుకముగఁ గలిగిన యాగ్రహమును నే నేమియు లెక్క సేయలేదు.

ఈమాఱు మద్రాసులో నాకాతిధ్యమొసఁగినవారు శ్రీ భూపతిరాజు వెంకటపతిరాజుగారు. వీరును మిత్రుఁడు సాంబశివరావును ఒకబసలోనే యుండి న్యాయవాదిపరీక్షకుఁ జదివెడివారు. నా పరీక్ష. పచ్చయ్యప్పకళాశాలలో జరిగెను. సైదాపేటలోని నా పూర్వగురువులగు వైద్యనాధయ్యగారు నా పరీక్షాధికారి యని ముందుగఁ బ్రకటింపఁబడినను, తుదకు స్కాటుదొరగారు నన్నుఁ బరీక్షించిరి. నేను క్రమముగనే బోధించితిని గాని, నా బోధనాసమయమందు స్కాటు, వైద్యనాధయ్యరుగా ర్లొకచోటఁ గూడి, నన్ను గుఱించియు, నాకును వీరేశలింగముపంతులుగారికినిఁ గల సంబంధ బాంధవ్యములను గుఱించియును గుసగుస లాడుకొనుచు, నాబోధన సంగతి మఱచిపోయినట్లే కానఁబడిరి ! పరీక్షానంతరమున నేను స్కాటుదొరబసకుఁ బోయి నాకు వారితోఁగల చనవుచేత నాపరీక్షా పర్యవసాన మే మని యడిగితిని. వారు మౌనముద్ర నూనియుండిరి. ఈమాఱుకూడ నేనీ పరీక్ష తప్పినయెడల, నేను బోధకవృత్తిని విరమించి, న్యాయవాదిపరీక్షకుఁ జదువవలసివచ్చు నని స్కాటుదొరతోఁ జెప్పివేసితిని. ఆయన యూఁకొట్టుచు సమాధాన మీయకుండెను. నేను వృత్తి మార్చుకొనుటయే నాకు మేలేమో యనికూడ స్కాటుమహాశయుఁ డనెనే కాని, పరీక్షాఫలితమును గుఱించి బొత్తిగఁ బ్రస్తావింపఁడు ! వీరి ధోరణిని బట్టి మరల నాకుఁ బరీక్షలో నపజయము తప్పదని నిర్ధారణచేసికొని నేను ఖిన్నుఁడనైతిని. నా విజయము నిశ్చయమని రాజుగారు మాత్ర మోదార్పుపలుకులు పలికిరి.

మద్రాసులోనే యల్. టి. పరీక్షాఫలితము విని మఱి యచటి నుండి కదలుట నా కాచార మయ్యెను. కాని, రెండుమూఁడుదినము లచటనే నిలచినను, ఆపరీక్షాపర్యవసానము తేలకుండుటచేత, నేను బెజవాడ వెడలిపోయితిని.

టానరుదొరకు నాయెడ దురభిప్రాయ మని యిదివఱకే సూచించితిని. ఇన్ని యేండ్లనుండియు నేను బోధించెడి గణిత శాస్త్రము నింకొక యుపాధ్యాయుని కిచ్చివేసి, నాకు వేఱొకపాఠ మొప్పగింప వీరిసంకల్పము ! ఈ మార్పువలన నాకుఁ గలిగెడి యవమానమునకై యుద్యోగము చాలించి పోయెదనని నేను జెప్పివేయ నుద్యమించితిని. ఎన్నాళ్లు వేచియుండినను నా పరీక్షాపర్యవసానము తెలియ దయ్యెను. మిత్రుల విజయవార్తలు మాత్రము వినవచ్చుచునే యుండెను. దీనినిఁబట్టి మరల నపజయ మందితినని నేను నిర్ధారణ చేసికొంటిని. పరిస్థితు లిటు లున్నను, తమపాఠశాల విడిచిపోయెదనని టానరుదొరతోఁ జెప్పివేయ 4 వ మార్చిని నేను బ్రయత్నించితిని. కాని యట్లు చేయుట కానాఁడవకాశము కలుగ లేదు.

ఆ రాత్రి నాకుఁ గంటికిఁ గూర్కు రాలేదు. ఆకఱవుకాలములో, మాటపట్టింపులకై మరల పరీక్షలో నోటువడిన నే నెటు లాకస్మికముగ నుద్యోగవిసర్జనము చేసి, కుటుంబపరిపోషణము చేసికొనఁగలనా యని రేయెల్లఁ దలపోసితిని. అట్లు చేయకున్న నేను పరాభవ మందుట స్పష్టముగదా. ఎటులో నేను మద్రాసు పోయి, బి. యల్. పరీక్షకుఁ జదివి, కంటక సదృశమగు న్యాయవాదివృత్తి నవలంబించి, సంసారసాగర మీదవలెనని నేను సమకట్టితిని !

నా నిర్థారణ మీనాఁడు పాఠశాలాధికారికిఁ జెప్పివేయ నే నుద్దేశించి, 5 వ మార్త్చి యుదయమున విద్యాశాలకుఁ బోవుచు, మార్గమధ్యమున తపాల కచేరిలోని కట్టె యడుగిడితిని. జవాను నాచేత నంత రెండు జాబులు వేసెను. మిత్రులు వెంకటరత్నమునాయఁడు గారియొక్కయు, గురువులు వెంకటరత్నముగారి యొక్కయు నభినందనము లందుఁ గలవు.

ఈక్లిష్టపరిస్థితులలో వారు నన్నభినందించుటకుఁ గారణ మే మని సందియమంది, జాబులు చదువుకొనఁగా, పరీక్షలో నేను జయమందినటు లందుండెను ! మఱునిమేషమున మనకొక భవ్యదృశ్యమును జూపించుటకే దైవ మొక్కొకప్పుడు మనకనుల నంధకారమునఁ గప్పుచుండునని నేను గ్రహించి, ఆనందపరవశుఁడనైతిని.

ఈ మాఱు నేను టానరుదొర బెదరింపులకు లెక్కసేయ నక్కఱలేదుగదా ! మఱునాఁడు ప్రొద్దున నేను కొండ యెక్కి దొరను జూచినప్పుడు, నావేతనాభివృద్ధి విషయమున క్లార్కుదొరకు వ్రాసెద ననియు, కాలక్రమ పట్టికయందలి నా పనిని గుఱించిన మార్పుమాత్రము స్థిరమనియు నాయన నుడివెను. ఈయనజ్ఞకు నే నొడఁబడ ననియు, వలసినచో నుద్యోగవిసర్జనము చేసి, వేఱొక చోటిలి వెడలిపోయెద ననియు దొరతో నే నంత గట్టిగఁ జెప్పివేసితిని. పర్యవసానము, నేను అట్లు చేయవలదని చెప్పి, దొర తన మార్పునె రద్దుపఱచుకొనియెను !

17 "ప్రత్యక్ష భగవత్సందర్శనము"

నాభార్య గర్భసంబంధమగు వ్యాధికి లోనగుటచేత, గుంటూరులో స్త్రీలకొఱ కిటీవల వైద్యాలయము స్థాపించి జరుపుచుండెడి కుగ్లరు దొరసాని కీమెనుఁ జూపింపనెంచి, గుంటూరు పయనమైతిమి. మొన్న నాతోఁ జెన్నపురినుండి ప్రయాణముచేసి, నావలెనే యిపుడె యల్. టి. పరీక్ష నిచ్చి, గుంటూరులో సంస్కృతపాఠశాలలో నధ్యాపకులుగ నుండు శ్రీ చావలి సూర్యప్రకాశరావు గారియింట బస చేసితిమి. కృష్ణమ్మ నాయఁడుగారు నాతో వచ్చి దొరసానితో నాకుఁ బరిచయము గలిగించిరి. అప్పు డామె నాభార్యనుఁ బరీక్షించి మందిచ్చెను. అపుడపుడు రోగి గుంటూరు వచ్చి తనకుఁ గనఁబడు చుండవలెనని యామె చెప్పుటచేత, మే మంతటినుండి గుంటూరు పోవుచు వచ్చుచునుంటిమి.