ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/"మహలక్ష్మి మరణము"

వికీసోర్స్ నుండి

సుఖదినము లొసంగెనే యని సంతోషమున ననుకొను చుంటిమి. మా మాటలను వెక్కిరించుటకో యన, ఆనిమేషముననే మాపెరటిలోనుండి కేకలు నేడ్పులును వినవచ్చెను ! పొరుగింటికిఁ బోయి వచ్చుచు, పెరటిలోని మా పెద్దబావిగట్టు దాటఁబోయి, మాపినతల్లి యాకస్మికముగ నీటిలోఁ బడిపోయెను ! వెంటనే మేము త్రాళ్లును గడలును వేయించితిమి. లాభము లేకపోయెను. అంతట పొరుగున నుండు నొక యువకుఁడును, మాతమ్ముఁడు సూర్యనారాయణయును నూతిలో నుఱికిరి. కాని, వీ రామెను వెలికిఁ దీయునప్పటికే యామె ప్రాణము లెగిరిపోయెను ! ఆమెకు మరల నూపిరి వచ్చుటకై యెన్నియో సాధనములు చేసితిమి. వేఁడిమి గలుగుటకై పాదములకు నరచేతులకును కర్పూరతైలము రాచితిమి. ప్రాణము రాలేదు. ఆరాత్రి యంతయు మే మామెశవము గనిపెట్టుకొని యుంటిమి. పాపము, మాముసలిముత్తువతల్లి మాతోడనే యుండెను. ఆమె దు:ఖ సముద్రమున మునిఁగిపోయెను ! వెనువెంటనే మా మేనమామలకు వేలివెన్ను తంతి నిచ్చితిమి. కూలివాని నంపితిమి. కాని, బంధువు లెవరును సకాలమున రాలేకుండుటవలన, మఱునాఁడు మేమె యామెకు దహనాదికర్మలు జరిపితిమి.

44. "మహలక్ష్మి మరణము"

1900 డిశెంబరు 30 వ తేదీని మరణించిన మాపినతల్లి, నాకంటె నాలుగైదుసంవత్సరములు మాత్రమే పెద్దది యగుటచేత, చిన్న నాఁడు వేలివెన్నులో నాకు సావాసురాలుగ నుండెడిది. బాల్యమున మాయుభయులకును మాతాతగారు పద్యములు లెక్కలును జెప్పుచుండువారు. దురదృష్టవశమున నీమెకు మంచి వివాహసంబంధము దొరక లేదు. వరునికి, ఆస్తిగాని విద్యగాని యంతగ లేవు. యౌవనమున దుర్వృత్తులలోఁ జేరి యాతఁడు తన స్వల్పభూవసతి కొల్లగొట్టెను. భార్యాభర్తలంత స్వగ్రామము విడువ వలసినవా రయిరి. మా పినతండ్రి యనేకగ్రామములలో బడులు నెలకొల్పి, కొన్ని నెల లచటనుండి, తన కచట బాగుగ జరుగుచుండలే దని యసంతృప్తి నొంది, మఱియొక ప్రదేశమున కేగుచుండువాఁడు ! ఇవ్విధమున ననేకగ్రామములు తిరిగినను, ఆయనపరిస్థితు లెంతమాత్రమును జక్కపడలేదు ! అప్పుడప్పుడు వా రిరువురును రాజమంద్రి వచ్చి కొంతకాలము మాతోఁ గడపి, మరల నెచటికైన వెడలిపోవుచుండు వారు.

నేను వారిసాహాయ్యమునకై కొంతకాలము నెలకుఁ గొంచెము సొమ్ము పంపుచుండు వాఁడను. వా రెటులో తమకు లభించిన కొలఁది యాదాయముతో కాలము గడపుకొనుచువచ్చిరి.

ఇటు లుండఁగా, మాచెల్లెలి ప్రసవసమయమున సాయము చేయుటకై మాపినతల్లి రాజమంద్రి వచ్చియుండెను. ఇంకఁ గొలఁది దినములు జీవించి యుండినచో, ఆమె తనభర్తయుండు గ్రామమునకు వెడలిపోయెడిదియే. కాని, యీశ్వరోద్దేశము వేఱుగ నుండెను ! 1901 వ సంవత్సరము జనవరి జనానాపత్రికలో నేను వ్రాసిన "మహలక్ష్మిమరణము" అను వ్యాసము, మాపినతల్లిని గుఱించినదియే. దానిలో నిటు లుండెను : -

'మంచివారికి మరణము ముందు' అను విదేశీయపుసామెతయు, 'సుకృతీ గతాయు:' అను స్వదేశలోకోక్తియు నొక యర్థమునే యిచ్చుచున్నవి. * * * "ఈ మధ్య స్వర్గస్థురాలైన శ్రీమతి మహలక్ష్మి హిందూ సద్వనితలలో నొకతె. * * * చనిపోవువఱకు నీమెకుఁగల బాధలు పలువురి కంతగాఁ దెలియవు. ఈమెహృదయము సముద్రమువలె గాంభీరమైన దని చెప్పవచ్చును. * *

"దేశాచారముచొప్పున నీమెను బాలప్రాయముననే యొక యువకుని కిచ్చి వివాహము చేసిరి. ఆచిన్న వాని విద్యాభివృద్ధి కెన్ని ప్రయత్నములు జరిగినను, తుద కతనికిఁ జదువు లభింపలేదు. * * కొంతకాలమునకు మహలక్ష్మి పతితోఁ గాఁపురము చేయునారంభింపఁగా, వాని యవగుణము లామెకు బోధపడెను ! * * ఆతని దుస్వభావము దుస్సహవాసములమూలమున మఱింత విజృంభించెను. సతిసుగుణము లాతనిమనస్సును ద్రిప్పఁజాలకపోయెను. దుశ్చేష్టల వలనను దుస్సాంగత్యమువలనను అతఁడు తన శరీర సౌష్ఠవమును గోలుపోయి నిరు పేద యయ్యెను. * * మహలక్ష్మి భర్తయెడఁ గొంచెమైనను కోపద్వేషములు వహింపక, అఱుగఁదీసినకొలఁది సువాసన లీను చందనమువలె బాధించు పతియెడ నమితదయతో నొప్పియుండెను.

"మహలక్ష్మి తన భర్తదుర్నయములను గుఱించి చుట్టములతోఁగాని చెలికత్తెలతోఁగాని ప్రస్తావింపదు. * * తన్నాతఁడు ప్రియురాలని భావింపకున్నను, వానికి హితబోధనము చేయుచు, వాని శ్రేయస్సునే కోరుచుండును. ఇదియేకదా నిజమైన పాతి వ్రత్యము !

"మహలక్ష్మి యిపు డీలోకము విడిచిపోయెను. ఎవని లోపములు గప్పిపుచ్చవలె నని యాసుదతి యహర్నిశము ప్రయత్నించెనో, అట్టి భర్తను వీడి తానే ముందుగ పరలోకప్రాప్తిఁ జెందెను. * * ఈమానినివలె ప్రశాంతియు నిర్మలప్రేమము నలవఱచుకొనిన సతీమతల్లులు స్వర్గలోకసుఖముల నందుటకు సందియము లేదు !"

ఈ 'జనానాపత్రిక' సంచికయె యింక రెండు మరణములు ప్రస్తావించెను. విక్టోరియా మహారాణిగారు జనవరినెల 22 వ తేదీని స్వర్గస్థు లయిరి. ఆనెలలోనే బొంబాయి ఉన్నతన్యాయస్థానమున న్యాయాధిపతులును దేశప్రముఖులును నగు రానడీగారు కీర్తి శేషులయిరి.

మా పినతల్లియుత్తరక్రియలు రాజమంద్రిలో మాయింటనే జరిగెను. తనచెల్లెలు చనిపోయిన యాఱవనాఁడు మాతల్లికి ప్రబలమగు మూర్ఛలు గానఁబడెను. అందువలనఁ గొన్ని దినములకుఁ గాని యా మెకు శక్తియు స్పృహయు రాకుండెను. కర్మాంతరము లైన పిమ్మట బంధువులు వెడలిపోయిరి. తనభార్యనగల సంగతి తేల్చినచోఁ దాను బోయివచ్చెద నని మాపినతండ్రి మాతో ననినపుడు నా కెంతో కోపము వచ్చినను, పిదప పరితాపము కలిగెను. తన భార్య కొంచెమునగలును జేత వేయించుకొని యాయన మన్యములలోనికి వెడలిపోయి మరల మాకంటఁ బడలేదు ! కొంతకాలమునకుఁ బిమ్మట మన్యములం దెచటనో యాయన చనిపోయె నని వారి బంధువులు చెప్పిరి.

నాతమ్ముఁడు వెంకటరామయ్య తిరిగి న్యాయశాస్త్రపరీక్షకు చెన్నపురి పోవలసివచ్చెను గావున, అతఁడు తిరిగి వచ్చువఱకును రాజమంద్రిలోని మాతల్లి సంరక్షణమునకై నాభార్య నచట నుంచి, నే వొకఁడనే 1900 జనవరిలో బెజవాడ వచ్చితిని. తమ్ముఁడు కృష్ణమూర్తి ప్రథమశాస్త్రపరీక్షలో తప్పెను. అతని చదువు సాములరీతి నా కేమియుఁ దృప్తికరముగ లేదు. 26 వ తేదీని అనంతముగారు బళ్లారినుండి బెజవాడకు వచ్చిరి. మే మందఱము రెయిలుదగ్గఱ వారిని గలసికొని పాఠశాలలో వారికొక విజ్ఞాపనము సమర్పించితిమి. మావిద్యాలయమున నలుగురు ప్రవేశ పరీక్షలో గెలుపొందిరి. తమ్ముఁడు సూర్యనారాయణ యాపరీక్ష నిచ్చెనని విని యానందభరితుఁడ నయితిని.

నా కిపుడు మరల గుండెమంటలు ప్రబల మయ్యెను. నేనే వంట చేసికొనుచువచ్చుటచేత, భోజనసౌకర్యము లేదు. అందువలన నాదేహమున నిస్సత్తువ యేర్పడెను. మాతమ్ముఁడు మద్రాసులో పరీక్ష నిచ్చి రాజమంద్రికి మరలివచ్చుటచేత, నాభార్య 11వ ఫిబ్రవరిని బెజవాడ తిరిగివచ్చెను.

45. "చిత్రకథామంజరి"

నేను దొరతనమువారి కొలువులోఁ జేర నిపు డాశింపఁ జొచ్చితిని! ఫిబ్రవరి 25 వ తేదీని నాకు స్కాటుదొరగారు వ్రాసిన జాబులో, నేను డైరక్టరుగారి కర్ఝీ పెట్టుకొనినచో, తాము చేయవలసినసాయము తాము చేతు మని యుండెను. మఱునాఁడు వీరేశలింగముగారియొద్దనుండికూడ లేఖ వచ్చెను. స్కాటుదొరగారి నాయన చూడఁబోఁగా, రాజమంద్రి కళాశాలలో నొక తాత్కాలికోద్యోగము చేయ నాకు సమ్మతమా యని దొరగా రడిగిరఁట. వెంటనే నే నొకయర్జీ నంపి, నా కీవిషయమున సాయము చేయుఁడని యుభయులను గోరితిని. ఈయూరు విడిచి రాజమంద్రి వెడలి పోవ మాయిద్దఱికి నిష్ట మే.