ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/"ప్రత్యక్ష భగవత్సందర్శనము"

వికీసోర్స్ నుండి

జయమందినటు లందుండెను ! మఱునిమేషమున మనకొక భవ్యదృశ్యమును జూపించుటకే దైవ మొక్కొకప్పుడు మనకనుల నంధకారమునఁ గప్పుచుండునని నేను గ్రహించి, ఆనందపరవశుఁడనైతిని.

ఈ మాఱు నేను టానరుదొర బెదరింపులకు లెక్కసేయ నక్కఱలేదుగదా ! మఱునాఁడు ప్రొద్దున నేను కొండ యెక్కి దొరను జూచినప్పుడు, నావేతనాభివృద్ధి విషయమున క్లార్కుదొరకు వ్రాసెద ననియు, కాలక్రమ పట్టికయందలి నా పనిని గుఱించిన మార్పుమాత్రము స్థిరమనియు నాయన నుడివెను. ఈయనజ్ఞకు నే నొడఁబడ ననియు, వలసినచో నుద్యోగవిసర్జనము చేసి, వేఱొక చోటిలి వెడలిపోయెద ననియు దొరతో నే నంత గట్టిగఁ జెప్పివేసితిని. పర్యవసానము, నేను అట్లు చేయవలదని చెప్పి, దొర తన మార్పునె రద్దుపఱచుకొనియెను !

17 "ప్రత్యక్ష భగవత్సందర్శనము"

నాభార్య గర్భసంబంధమగు వ్యాధికి లోనగుటచేత, గుంటూరులో స్త్రీలకొఱ కిటీవల వైద్యాలయము స్థాపించి జరుపుచుండెడి కుగ్లరు దొరసాని కీమెనుఁ జూపింపనెంచి, గుంటూరు పయనమైతిమి. మొన్న నాతోఁ జెన్నపురినుండి ప్రయాణముచేసి, నావలెనే యిపుడె యల్. టి. పరీక్ష నిచ్చి, గుంటూరులో సంస్కృతపాఠశాలలో నధ్యాపకులుగ నుండు శ్రీ చావలి సూర్యప్రకాశరావు గారియింట బస చేసితిమి. కృష్ణమ్మ నాయఁడుగారు నాతో వచ్చి దొరసానితో నాకుఁ బరిచయము గలిగించిరి. అప్పు డామె నాభార్యనుఁ బరీక్షించి మందిచ్చెను. అపుడపుడు రోగి గుంటూరు వచ్చి తనకుఁ గనఁబడు చుండవలెనని యామె చెప్పుటచేత, మే మంతటినుండి గుంటూరు పోవుచు వచ్చుచునుంటిమి. నిరుడు మద్రాసులో న్యాయవాదిపరీక్షకుఁ జదివిన తమ్ముఁడు వెంకట రామయ్య ఆపరీక్షలో నపజయ మందినట్లు తెలిసి మేము విచారించితిమి. కనకరాజు రెండవ తరగతి న్యాయవాదిపరీక్ష నిచ్చుట సంతోషవార్తయే. బావమఱఁది సీతాపతిరావు మాధ్యమిక పరీక్షలోఁ దప్పిపోయెనని తెలిసెను. ఈసంవత్సరము తా నింట నూరకుండ నొల్లక వెంకటరామయ్య నలువది రూపాయిల జీతము మీఁద రేపల్లె మాధ్యమిక పాఠశాలలోని ప్రథమోపాధ్యాయ పదవిని స్వీకరించుటకు సంతోషించితిమి. ఇపుడు కుటుంబ పరిపోషణము చేయువారు, ఒకరి కిద్దఱ మగుట నా కెంతయుఁ బ్రోత్సాహకరముగ నుండెను.

మాఋణదాత పార్వతీశముగారు మామీఁద వ్యాజ్యెము వేసెనని చెప్పుటకు మాతండ్రి బెజవాడ 26 వ మార్చి తేదీని వచ్చెను. అప్పులను గుఱించి తలంచుకొనినపుడెల్ల నాకు మనస్తాపము గలుగు చుండెను. కాని, యధైర్యపడిన లాభము లేదనియు, ఎల్లకాలము చీఁకటిరాత్రులె యుండవనియు, మాతండ్రి నన్నోదార్చుచుండువాఁడు. మేముమాత్ర మట్టి సుదినములు గాంచ నోఁచుకొనలేదని నేను భయమందుచుండెడివాఁడను.

మా రేలంగి వాస్తవ్యుఁడును, ఆ దినములలో నేలూరులో "దేశోపకారి" పత్రికాధిపత్యము నెరపువాఁడును నగు శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారు నన్నుఁ జూచుటకు బెజవాడ వచ్చిరి. కొలఁది కాలములోఁ దాను ముద్రాలయ మొకటి కొని నావలెనే బెజవాడలో నివసించెదనని యాయన చెప్పునపుడు నే నానందపరవశుఁడనైతిని.

రాజమహేంద్రవర ప్రార్థనసమాజ వార్షికోత్సవము వీక్షింపఁ గోరి, నేను బెజవాడనుండి 15 వ ఏప్రిలున బయలుదేఱితిని. మార్గ మధ్యమున నేలూరులో వీరభద్రరావు, కామేశ్వరరావుగార్లు మమ్ముఁ గలసికొనిరి. సాయంకాలము పురమందిరమునకుఁ బోయి చూచుసరికి మఱునాఁడు ప్రొద్దున బీదలకు నన్నదానము చేయు నేర్పాటులు, గావించుచు, శ్రమపడుచుండెడి పావనమూర్తియగు పాపయ్యగారు కానఁబడిరి.

16 వ ఏప్రిలు తేదీని వీరేశలింగముగారు ప్రార్థనసమాజమున ప్రారంభోపన్యాసము గావించిరి. మధ్యాహ్నము పాపయ్యగారి యన్నదానమును, సాయంసమయమున నరసింహరాయఁడుగారి ధర్మోపన్యాసమును జరిగెను. నేను కొన్ని ప్రార్థనలు గావించితిని. మిత్రులు వెంకటరత్నము నాయఁడు రామమూర్తిగార్లు బందరునుండి వచ్చిరి. మఱునాఁటియుదయమున నాయఁడుగారు "తమసోమా జ్యోతిర్గమయ!" అను వాక్యముతో నారంభించి, ధర్మోపన్యాస మొసంగిరి. సాయంకాలమున వీరేశలింగముగారు తాము నూతనముగ నిర్మించిన "ప్రార్థన మందిరము"నుఁ దెఱచిరి. వెంకటరత్నమునాయఁడుగారు తమకు పంతులుగారిదెసఁ గల యసమాన భక్తివిశ్వాసముల నాసమయమున వెలిపుచ్చిరి. మఱునాఁడు సమాజసభ్యుల ఛాయాపటము తీయఁబడెను. మధ్యాహ్నము కూడిన ఆస్తికసభాసమావేశమునందు, ఏతత్సభా నిధికై 500 రూప్యములు విరాళ మొసఁగెదమని మిత్రులు వాగ్దానము చేసిరి. నేను సంవత్సరమునకు డెబ్బదియైదు రూపాయ లీయ నిశ్చయించితిని.

సత్యసంవర్థనిలోఁ బ్రరించుటకై "ప్రత్యక్షభగవత్సందర్శనము" అను శీర్షికతో నొక యాంగ్ల వ్యాసము వ్రాసి, అది వీరేశలింగముగారికి నే నిపు డిచ్చితిని. అది 1897 మార్చి "సత్యసంవర్థని"లోఁ బ్రచురింపఁబడెను. అందలి ముఖ్యాంశము లిటఁ బొందు పఱచుచున్నాను : - "ప్రార్థనసామాజికులకు దైవమే మతము. ఆయనను హృదయదర్పణమందును, ప్రకృతిముఖమునను సందర్శింపనగును. నిజమగు భక్తునికి, ఈశ్వరుఁడు తప్ప వేఱు స్వర్గమోక్షము లెవ్వియు లేవు! భగవత్సందర్శనమే భక్తుని పెన్నిధానము ! అట్టి భగవంతుని సూటిగనే మనము గ్రహింపనగును. మనుష్యుని మనస్సీమ ననేక లోపపాపములు పీడించుచున్నను, మనము దేవుని తిన్నగనే దర్శింపఁగలము. గ్రంథములు, గురుసహాయము మున్నగు పరికరములు భక్తునికిఁ గావలసియున్నను, అవి యెన్నఁడును దేవునిస్థానముమాత్ర మాక్రమింపలేవు. తన మహిమాధికారములు అవతారవిగ్రహాదులకు వదలి వైచినదేవుఁడు, దూరస్థదైవమే ! అట్టిదేవుఁడు మనుజుని జ్ఞానచక్షువునకును దూరస్థుఁడే. ఆదేవునికిని నాస్తికవాదుల కెఱుకఁబడనట్టియు, ఎఱుఁగరానట్టియు నీశ్వరునికిని భేదము లేనేలేదు ! సత్యదైవ మెపుడును మనచెంతనే పొంచియున్నాఁడు. ఇది మనుష్యకోటి కనుభవ సిద్ధవిషయమె.

"ఇట్టి భగవత్సందర్శనము ప్రజ్ఞాన్వితులకేకాని పామరజనులకు సాధ్యము గాదని యెవరైనఁ జెప్పవత్తురేమో. మనశ్శక్తులలో వ్యక్తిగత భేదము లున్నను, జ్ఞానసంపాదన విషయమునమాత్రము మనుజు లందఱు నొకకుటుంబములోనివారె. పండితపామరు లుభయులు నీశ్వరు నొక విధముగనే గ్రహింపఁగలరు. ఒకవిధముననే సాక్షాత్కారము చేసి కొనఁగలరు. ఈశ్వరసాక్షాత్కారము భక్తు లందఱికిని సుసాధ్యమగు కార్యమే."

రాజమంద్రిలో నుండు రోజులలో వీరభద్రరావుగారిని వీరేశలింగముగారి కెఱుక పఱచితిని. రావుగారి కొక ముద్రాలయము కొని పెట్టెదమని పంతులుగారు సెలవిచ్చిరి. వీరభద్రరావుగారు కొలఁది కాలములో బెజవాడ వచ్చునట్టును, మేమిరువురమును గలసి యచట నొకవార్తాపత్రిక నెలకొల్పునట్టును మే మేర్పఱుచుకొంటిమి.

18. "ప్రాచీన నవీన సైతానులు"

యల్. టి. ప్రీక్షలో గెలుపొందినపిమ్మట, ఉపాధ్యాయవృత్తి విరమింపవలసివచ్చునని మరల నే నెన్నఁడును మొఱలిడలేదు. బెజవాడ పాఠశాలాధికారులు నా కిపు డైదురూపాయిలు వేతనాభివృద్ధి చేయుటచేత, నాజీత మెనుబదిరూపాయిలయ్యెను. పాఠశాలలోని బోధన, పత్రికలకు వ్రాఁతపనియును నేను క్రమముగ నెరవేర్చు చుంటిని. వెనుకటివలెనే యీవేసంగి నేను రాజమంద్రిలో గడపితిని.

రాజమంద్రిలో నుండు దినములలో నేను సమాజకార్యములు దీక్షతో జరుపుచుండువాఁడను. ఆస్తికపుస్తకాలయమందలి పుస్తకములు సరిచూచి, మిత్రుల నడిగి నూతనగ్రంథములు తెచ్చి యందుఁ జేర్చితిని. సత్యసంవర్థనికి వ్యాసములు వ్రాసితిని. అప్పుడప్పుడు వీరేశలింగముగారిని గలసికొని, వారితో వితంతూద్వాహములనుగుఱించి ముచ్చటించు వాఁడను.

ఆ వేసవిని నేను జదివిన పుస్తకములలో మేరీ కొరెల్లీకన్యా విరచితమగు "సైతానువెతలు" అను నాంగ్లనవల ముఖ్యమైనది. అందు నాగరికాగ్రగణ్యయగు నింగ్లండుదేశమందలి పెద్దలోపములు రచ్చకీడ్వఁబడినవి. ఒక యాంగ్లేయజాతి యన నేల, మానవకోటి యంతయు నీ గ్రంథరాజముయొక్క యుపాలంభనమునకు గుఱియయ్యెను ! ఇచట ప్రదర్శితమైన సైతాను బైబిలులోని సైతాను గాఁడు. ఈతఁడు నవనవోన్మేషకాంతులతో మనచెంతనే విహరించుచు, విద్యానాగరికతలతో విలసిల్లెడి వినూతనశకపురుషుడు !