ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/సభలు, సమావేశములు

వికీసోర్స్ నుండి

యాచారములందు బ్రాహ్మసమాజమువా రేతిన్నని త్రోవత్రొక్కి, దేశోద్ధరణమునకుఁ దోడుపడిరి? పూర్వమందు బౌద్ధమతమువలె ప్రస్తుతమున బ్రాహ్మమతము జంతుహింసనరికట్టనేల ప్రయత్నింప రాదు?

నేను కలకత్తా కాలేజివీధి చౌకునందు షికారుచేయునప్పుడు, నాకు, బరిచితులగు బ్రాహ్మసమాజమిత్రులు గొందఱు సామాన్యముగ నగపడుచుండువారు. వీరిలో "అభినవపత్రికా" ధిపతులగు రామానంద చాటర్జీగారొకరు. వీరు మద్రాసు స్టాండర్డుపత్రిక చదువుచుండువారు కావున, అందలి "చన్నపురి చక్షువులకు బంగాళాపద్ధతులు" అను వ్యాసములు వ్రాయువా రెవరో తెలియునా యని యపుడపుడు నన్నడుగుచువచ్చిరి. ఉపవిలేఖకుల గుట్టు బయలు పెట్టుట వట్టి యలౌకికకృత్యము గాన, నిజము చెప్పుటకును, అనృతమాడుటకును వలనుపడక, నేను, "ఆరచయిత మోముచూడ నాకును గుతూహలమె" అని పలికి, తప్పించుకొనువాఁడను. ఈ మద్రాసురచయిత, బంగాళాజనుల సమాచారములు బాగుగఁదెలియక, వైరభావమున వారల నెగతాళి చేయుచుండెనని చాటర్జీగా రనుచుండువారు. "బ్రాహ్మసమాజము"ను గూర్చిన నా మొదటి వ్యాసములు చదివిన యాయన యొకనాఁడు, "ఈవ్రాఁతకాఁడు తప్పక బ్రాహ్మసామాజుకుఁడె !" యని నాతోఁ జెప్పినను, అందునుగూర్చిన తక్కిన వ్యాసములు చదివి, "ఈ సాహసికుఁడు బ్రాహ్మాసమాజములోఁగూడ నెరసులు వెదకుచున్నాఁడె !" అని మొఱపెట్టెను !

15. సభలు, సమావేశములు.

నేను కలకత్తాలో నిటీవల పరీక్షకుఁ జదువుచుండునపుడు, మా పిల్లవానికి వెలిచేరులో జబ్బు చేసె నని నాకు జాబు వచ్చి, మిక్కిలి యాందోళన మందితిని. నెమ్మది పడుచుండె నని తెలియుటచేతఁ గొంత యూరడిల్లి, యెటులో పరీక్షకుఁ బోయితిని. పరీక్షానంతరమున నేను సరాసరిని గుంటూరున కేతెంచిన కొన్ని దినములకు, పిల్ల వానిని దీసికొని నాభార్య వచ్చెను. వాండ్రను గలసికొనుటకు నేను రెయిలునొద్దకుఁ బోయి, పెట్టెలోని కెక్కి చూడఁగా, పిల్లవాఁడు నన్నానవాలుపట్టి, "నీవు అన్నవు. నాతో చెప్పకుండా తాతత్తా (కలకత్తా) వెళ్లిపోయావా ? అని నామీఁద నిష్ఠురపడెను ! పోల్చలేనిరీతిని బలహీనుఁ డయ్యెను. వెలిచేరులో నుండునపుడు, వానికి మరల దేహము పొంగి జ్వరమువచ్చెను. అప్పటినుండియు వానికప్పుడప్పుడు ఉష్ణము తగులుచుండుటవలన, మధ్యఁ గలిగెడికొంచెము సత్తువయుఁ బోవుచుండెడిది ! అతని బ్రదుకంతయు వ్యాధితోడి పెద్ద పోరాటమె !

సెప్టెంబరు నెలలో నాపరీక్షాఫలితము తెలిసెను. నేను కృతార్థుఁడ నైతి నని మిత్రులు తంతు లంపిరి. స్నేహితులు బంగారయ్య సత్యనారాయణగార్లును జయమందిరి. బంగారయ్య యమ్. యె. పరీక్షలో కలకత్తా విశ్వవిద్యాలయమున నాంగ్లమున మొదటితరగతిలో మొదటివాఁడుగ నుత్తీర్ణుఁ డయ్యె నని విని సంతోషించితిని. సత్యనారాయణయు నేనును మూఁడవతరగతిలో జయమందితిమి. ఆ తరగతిలో నాకు లభించినస్థాన మధికమైనదియె. వయసు మీఱిన పిదప, దూరదేశముపోయి, వ్యయప్రయాసలకు లోనై, తుదకు పరాజయ మందిన యపకీర్తిపాలుగాక, ఏదోరీతిని గెలుపొందుటకె నేను సంతోషించితిని ! నా నూటయేఁబది రూపాయిల లోపుజీత మిపు డొక్కమాఱుగ రెండువంద లగుటయెకాక, సంవత్సరమునకుఁ బది రూపాయిల వృద్ధితో దాని పరిమితి మున్నూఱు రూపాయిలని యిపుడు నిర్ణీత మయ్యెను. కళాశాలలో నన్నాంగ్ల శాఖకు ముఖ్యోపన్యాసకునిగను, నా బదిలీదారగు సత్యనారాయణమూర్తిగారిని తర్కశాస్త్రోపన్యాసకునిగను జేసిరి.

1915 వ సంవత్సరము తుదిభాగమున మేము క్రొత్తపేట వదలి, ఆరండలుపేటలో న్యాపతి హనుమంతరావుగారి చిన్న యింటఁ బ్రవేశించితిమి. ఈ పేటలోని యిండ్లు విశాలస్థలములందు దూర దూరముగఁ గట్టఁబడుటచేత మిగుల వాసయోగ్యముగ నుండెను. హనుమంతురావుగారు నాకుఁ జిరపరిచితులగు సాధుపురుషులు. వారి యింటి దాపుననే కొండ వెంకటప్పయ్యగారు బస చేసియుండిరి. చాల కాలమునుండి నాకు వీరును స్నేహితులె. మేము మువ్వురము తఱచుగఁ గలసికొని మాటాడుకొనుచుండువారము. 1913 వ సంవత్సరమునుండియు వెంకటప్పయ్యగారు చాల రాబడి గల తమ న్యాయవాదివృత్తిని వదలివైచి, దేశసేవాపరాయణు లయిరి. హనుమంతరావుగారు న్యాయవాది యుద్యోగము విరమింపకున్నను, దేశహితైక కార్యనిమగ్నులైయుండిరి. వారిపుడు గుంటూరు పురపాలక సంఘాధ్యక్షులుగ నుండి, తమవృత్తియందుకంటె పరోపకారకార్యములందె యెక్కువ శ్రద్ధ వహించియుండిరి.

స్త్రీవిద్యాభివృద్ధికై ప్రత్యేకపాఠశాల యొకటి, నెలకొల్ప వలెనని కొంతకాలమునుండి వెంకటప్పయ్యగారు మిత్రులు నేనును ఆలోచించుచుంటిమి. కొన్ని వత్సరములక్రిందటనే రోమనుకెతోలికు మతసంఘమువారు వేటపాలెము విడువనెంచి, అందలి తమతోఁటయు భవనములను అమ్మఁజూపఁగా, వెంకటప్పయ్యగా రవి చౌకగాఁ గొనిరి. ఇపుడీవేటపాలెపుతోఁటలో "శారదా నికేతనము" అను పేరుతో మహిళావిద్యాలయ మొకటి స్థాపింప పంతులుగా రుద్య మించిరి. ఆగృహములను దమవశముచేసినచో, తమసంఘమువారు వానియందు ఆదర్శప్రాయమగు నొక స్త్రీపాఠశాల నెలకొల్పెదరని టెన్నెంటుకన్యయు, ఆమె యేర్పఱిచిన "హిందూవివాహ సంస్కరణసంఘము" వారును అభిప్రాయపడిరి. ఇది నాకు రుచింపలేదు. వెంకటప్పయ్యగారు నాతో నేకీభవించిరి. ఆగృహములందొక యువతీ గురుకులము స్థాపించి జరుపుభారము వెంకటప్పయ్యగారె వహించుట కర్తవ్యమని మిత్రు లభిప్రాయపడిరి.

బెజవాడ ప్రార్థనసమాజమువారికిఁ గొంతస్థలము నీయుఁడని "రామమోహనపుస్తకాగార" స్థాపకులలో నొకరును, బెజవాడలో నాపూర్వశిష్యులునగు పాటిబండ సుబ్రహ్మణ్యముగా రా భాండాగారసమాజమువారి నడిగిరి. ప్రార్థనసమాజోపయోగార్థమై కొంత స్థలము ప్రత్యేకించుట న్యాయమని నేనును జెప్పితిని. అంతఁ గొంత స్థలము ప్రార్థనసమాజమున కొసఁగఁబడెను. దీనినిగుఱించి ధర్మకర్త సుబ్రహ్మణ్యముగారు దస్తావేజు వ్రాసియిచ్చిరి.

ఇపుడు "గుంటూరు ప్రార్థనసమాజము"నకు గూడ నొకమందిర మేర్పాటుచేయుటకై నాప్రోత్సాహమునఁ బ్రయత్నములు సాగెను. మద్ది రాధాకృష్ణయ్యగారు కొంత విరాళ మొసంగెద మనిరి. నేనును పెద్ద మొత్తమీయనెంచితిని. గతవత్సరమున కలకత్తాలో సాధారణ బ్రాహ్మసమాజసాధనాశ్రమమున సకుటుంబముగ నివసించి మత విద్య నేర్చిన గుంటూరుమండల వాస్తవ్యులు పాలపర్తి నరసింహముగా రిపుడు గుంటూరు తిరిగి వచ్చిరి. వారిని గుంటూరు ప్రార్థనసమాజ ప్రచారకునిగ నియమించి, వారిపోషణమునకుఁ జందాలు వేసికొని కొంత గౌరవవేతన మీయ మేమేర్పాటు చేసితిమి. 1916 మార్చి నెలలో అరండలు పేట మునిసిపలు ఎన్నికలలో వెంకటప్పయ్యగారిని అభ్యర్థిగ నిలువుఁడని మిత్రులు కోరఁగా, వారు సమ్మతించిరి. ఆ యుద్యోగ మాయనకు లభించుటకై మిత్రులము పనిచేసితిమి. మార్చి తుదిని జరిగిన యెన్నికలలో వెంకటప్పయ్యగారు సభ్యులైరి.

ఏప్రిలు నెల 2 వ తేదీని "యువజన సాహితీసంఘము" వారి యాజమాన్యమున పురపాఠశాలలో నొక బహిరంగసభ జరిగెను. అపుడె బారిష్టరు పరీక్షనిచ్చి స్వదేశము తిరిగివచ్చిన శ్రీఉన్నవ లక్ష్మీనారాయణగారు సభ కగ్రాసనాధిపులు. నేను "బంగాళా వారి యాచారములను" గుఱించి యాంధ్రమున నొక యుపన్యాస మిచ్చితిని. ఆంధ్రులకును బంగాళీయులకును గల తారతమ్యములు హాస్యరసయుక్తముగ నే నిట్లు వర్ణించి చెప్పితిని : - తెలుఁగువారల రుచులలో పులుసు కారములు ప్రధానములు. బంగాళావారికి తీపి ప్రియము. ఆంధ్రుఁ డనుదినము తిను మిరెపుకాయలు చింతపండును బంగాళీయునికి మాసమునకైన నక్కఱలేదు! వారు నేయి వేసికొనరు. అగ్రవర్ణములవారును మత్స్యభుక్కులె. నే నొకసారి కొందఱు తెలుఁగునేస్తులతోఁగలసి యొక బంగాళావారియింట విందు గుడిచితిని. అందఱు ముగించునప్పటికైన నా భోజనప్రారంభము కాలేదు. విస్తరిలో నుండు వస్తువు లెవ్వియు నా నోటికిఁ బోకుండెను. మనకు వెలగపండు ప్రియము, బంగాళీయులకు మారెడిపండు. వారికిఁ బ్రీతి వేఁప, మనకు కఱివేఁప. గుమ్మడికాయ మనము వండుకొందుము, వారు దాని తీగకూర చేసికొందురు. శుక్లపక్షముతో తెలుఁగు వారికిని, కృష్ణపక్షముతో బంగాళీయులకును మాసారంభమగుచున్నది. మనపాఠశాలలలో నున్నత మగు తరగతి యాఱవది; వారి దేశమున పెద్దది మొదటి

1916. "అబ్బావు"

తరగతి. పెద్దవస్త్రములను ధరించువారు తెలుఁగువారలలో నాఁడువారును, బంగాళావారిలో మగవారును. అక్కడ పుణ్యాంగనలు రంగుచీరలె ధరింతురు. తెల్లని కోకలు గట్టువా రా దేశమున వెలయాండ్రు. కాని, మనకును వారికిని సామాన్యగుణములును లేక పోలేదు. హిందూశాస్త్రపద్ధతులు, సంప్రదాయములును హిందువు లందఱికిని ముఖ్యములే.

గుంటూరిలో డిప్యూటి కలక్టరుపదవి నందిన శ్రీ జయంతి రామయ్యపంతులుగారి ప్రోత్సాహమున మే మిపు డానగరమున "ఆంధ్రసాహిత్యపరిషత్తు" సభ జరుపఁదలంచితిమి. 14 వ మార్చిని నా యధ్యక్షతక్రింద జరిగిన బహిరంగసభలో, సమ్మానసభ యొకటి యేర్పడెను. కొండ వెంకటప్పయ్యగారి నధ్యక్షులుగను, ఉలుగుండము రంగారావుగారిని నన్నును కార్యదర్శులగను నెన్నుకొనిరి. మే మంత చందాలు పోగుచేసి, సభలకుఁ గావలసిన వసతులు గలిపించితిమి.

ప్రతినిధులకు పురవిద్యాలయమున విడిదలు భోజనములు నేర్పాటు చేసితిమి. విద్యార్థుల స్వచ్ఛందసేవాదళము మంచి సాయము చేసెను. ఏప్రిలు 22-23-వ తేదీలందు కళాశాలాభవనమున బహిరంగ సభలు జరిగెను. బొద్దనాయకూరు జమీందారులు అధ్యక్షులు. వేదము వేంకటరాయశాస్త్రిగారు, రాజా మంత్రి ప్రెగడ భుజంగరావుగారు మున్నగు ప్రముఖులు విచ్చేసిరి. సభలు జయప్రదముగ జరిగెను.

16. 'అబ్బావు' మరణము

గుంటూరు సభలు ముగియఁగనే మా పిల్ల వానిని, ఇక్కడఁ జదువుచుండు మా తమ్ముని కుమారుఁడు నరసింహమును దీసి