ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/వెంకటరత్నమునాయఁడుగారు

వికీసోర్స్ నుండి

విలంబన మయ్యెనేని, భూవసతికి మాఱుగా గృహకల్లోలములు పెచ్చు పెరుఁగునని నేను హెచ్చరించుటచేత, 1908 వ సంవత్సర మధ్యమున సోదరులము వేఱుపడితిమి. నేను జెప్పినచొప్పుననే, మేము వేఱుపడిన పిమ్మట, సోదరులలో వైషమ్యములకు మాఱుగా స్నేహభావ మతిశయించెను. దైవానుగ్రహమున వేఱువేఱుగ మంచియాస్తిని సంపాదించుకొనఁగలిగితిమి. చీఁకటి రాత్రుల వెనుక వెన్నెల రేలు వచ్చెడి విధమునను, వేసవి యెండల పిమ్మట తొలకరి వానలు గుఱియుచందమునను, వెనుకటి యార్థికదుర్దశ తొలఁగిపోయి, మాసంసార పరిస్థితు లంతటినుండియు మిగుల తృప్తికరముగ నుండెను.

1908 వ సంవత్సరాంతమున రాజమంద్రి పురమందిరమున జరిగిన వీరేశలింగ పుస్తకాలయ వార్షిక సభకు నన్నధ్యక్షునిగఁ గోరిరి. నేనపుడు రాజమంద్రి పోయి, పురమందిరమున వీరేశలింగముపంతులు గారిని, రాజ్యలక్ష్మమ్మగారిని సందర్శించితిని. వారిరువురు నపుడు పరిపూర్ణారోగ్య మనుభవించుచుండిరి.

10. వెంకటరత్నమునాయఁడుగారు

1891 వ సంవత్సరమున మొదట మద్రాసులో కలసికొని నప్పటినుండియు, వెంకటరత్నమునాయఁడుగారికిని నాకును మనసు గలిసిన మైత్రి యేర్పడెను. నాప్రియగురువులగు వీరేశలింగము పంతులుగారికిని, ప్రియమిత్రులగు కనకరాజు గంగరాజుగార్లకును నే నెఱిఁగింపనొల్లని సందేహములను రహస్యములను, నాయఁడుగారికి నేను జెప్పి, వారియోజనలను సమాధానములను స్వీకరించు చుండువాఁడను. మతవిషయములందు నాకువారిసహవాస సంభాషణముల వలనఁ గలిగిన లాభ మింకొకరి మూలమునఁ గలుగలేదని చెప్ప వచ్చును. వారికిఁ బ్రియరచయితలగు కార్లయిలు, ఇమర్సను మార్టినోల గ్రంథములు నాకును మంచి ప్రబోధము గావించెను. నాయఁడుగారిని గురువుగఁ బూజించి, సోదరునిగఁ బ్రేమించితిని. ఆదినములలో పలుమాఱు వారితో, "బెజవాడ, బందరు రాజమంద్రీలకు మధ్యగా నున్నది సుమండీ!" యనుచుండు నామాటల కర్థము, నా యభిప్రాయములు నభిరుచులును వీరేశలింగము వెంకటరత్నమునాయఁడుగార్ల మనస్తత్త్వములకు మధ్యస్థముగను, సమన్వయప్రాయముగను నుండుననియే ! కాకినాడ కళాశాలాధ్యక్షపదవి ఖాళి యైనప్పుడు, ఆపనికి నాయఁడుగారిని దరఖాస్తు చేయుఁడని ముందుగ నేనె కోరితిని. ఆకళాశాలాపాలక సంఘమువారు వెనుకటి యధ్యక్షుని కన్యాయము చేయుటవలన, తా మాపనికిఁ బ్రయత్నింప నొల్లమని నాయఁడుగారు ప్రత్యుత్తర మీయఁగా, నేను వారితో వాదించి, దరఖాస్తు చేయునట్లు వారి నొడంబఱిచితిని. అంతట రాజమంద్రిలో నున్న వీరేశలింగము పంతులుగారికి వ్రాసి, వారు కాకినాడపోయి, కళాశాలాధికారులతో నాయఁడుగారిని గుఱించి చెప్పుఁడని వారిని వేఁడితిని. నే నాదినములలో విజయనగరమందలి కళాశాలలో నుంటిని. నాయఁడుగారికి కాకినాడ యుద్యోగమగుటకై గట్టి ప్రయత్నములు చేయుఁ డని యచటి మిత్రులకును వ్రాసితిని. అచటి విద్యాధికులలో పెక్కండ్రకు, పోటీదారులగు వి. యస్. శ్రీనివాసశాస్త్రిగారియెడఁ గాక, నాయఁడుగారియందె యభిమానము గలదు. ఎట్టకేలకు నాయఁడుగారి కీయుద్యోగమైన దని విని, నేనత్యానందభరితుఁడ నైతిని.

నాయఁడుగారు కాకినాడకు వచ్చినప్పటినుండియు, అచటి మాయుభయుల మిత్రులును నన్ను విజయనగరమునుండి కాకినాడకు తరలి రమ్మని ప్రోత్సహించుచు వచ్చిరి. నారాకశ్రేయోదాయకమని నాయఁడు గా రెంచినచో, ఆయనయే దానిని గుఱించి ప్రశంసింతురని నేను సమాధానమిచ్చి యూరకుండువాఁడను. ఇటు లుండఁగా, విజయనగరనివాసమునందు నా కంతకంతకు విసుగుపుట్టి, ఆరోగ్య ప్రదమగు గోదావరీమండలప్రాంతములకు రాఁగోరితిని. కనాస మే యున్నత పాఠశాలలోనైన ప్రథమోపాధ్యాయపదవిని స్వీకరించుటకు సంసిద్ధముగ నుంటిని. ఇటులుండఁగా, తమ పాఠశాలలో ప్రథమోపాధ్యాయునిపని ఖాళి యయ్యెననియు, దానిని గుఱించి నాతో మాటాడెదమనియు నాయఁడుగారు 1907 ఫిబ్రవరి 7 వ తేదీని నా లేఖకుఁ బ్రత్యుత్తరము వ్రాసిరి. వారు కోరినట్లు నేను వచ్చి మాటాడితిని. కాని, వారిసంభాషణధోరణిని బట్టి నా కా యుద్యోగ మీయ వారి కిష్టము లేనట్లు గ్రహించితిని. మఱుసటి సంవత్సరారంభమున నేను గుంటూరు కళాశాలకు వచ్చివేసితిని.

ఇటీవల వీరేశలింగముపంతులుగారు రాజమంద్రిలో "హితకారిణీ పాఠశాలను"ను నెలకొల్పి, దాని నభివృద్ధిపఱిచిరి. ఇపుడా యాస్తిక పాఠశాలకు ప్రథమోపాధ్యాయుఁడు గావలసివచ్చెను. పూర్వమున, ఆస్తిక పాఠశాలా స్థాపనమునుగూర్చి వీరేశలింగము గారును, శిష్యులమగు మేమును ఎంతో యాత్రపడితిమి. కాని, పరిస్థితుల వైపరీత్యమువలన నాకాలమం దాసంస్థ యేర్పడలేదు. ఇపుడు పంతులుగారిచే స్థాపితమైన విద్యాశాల దినదినాభివృద్ధి నొందుట విని మిగుల సంతసించితిని.

1908 నవంబరులో నీ పాఠశాలవిషయమై నాయఁడుగారి యొద్దనుండి నా కొక జాబు వచ్చెను. అం దిటు లుండెను: నాయీ "చేటభారతము"నకు నాయఁడుగారినుండి ప్రత్యుత్తరమురాలేదు. నాకిపుడు గుంటూరు కళాశాలలో హాయిగనుండినను, రాజమంద్రిలో బ్రాహ్మసమాజ సంస్థలోఁ బనిచేయ నామనస్సు ఉఱ్ఱూతలూఁగు చుండెను. కాని, రాజమంద్రి కేగిన ప్రతిష్ఠాభంగమగునని యొకమూలభయము ! సిగ్గుకోరికల మధ్యనూఁగులాడుచుండు నేనెటులూరకుందును? కావున, నాయఁడుగారికి 9 - 12 - 08 తేదీని నేనింకొక లేఖవ్రాసితిని. దీనికిని వారియొద్దనుండిగాని, వీరేశలింగము పంతులుగారి యొద్దనుండిగాని నాకు జాబురానేలేదు ! ఆపాఠశాలకు వేఱొకప్రథానోపాధ్యాయుఁడు నియమింపఁబడెనని నా కంత దెలి సెను.

ఇది జరిగిన కొన్ని నెలలకు నేను వీరేశలింగముగారిని గలసి కొనినపుడు, ఈసంగతిని గుఱించి ప్రస్తావనరాఁగా, ఆస్తిక పాఠశాలలో నుద్యోగముచేయ నాకిష్టములేనట్లు నాయఁడుగారు తమకుఁ జెప్పివేసిరనియు, అందుచేతనే తాము మఱియొకరిని నియమించితి మనియును వారనిరి. తమతోఁగలసి యేదేనిధర్మ సంస్థలో నిపుడు పనిచేయఁ దలంచుకొంటినని నేను వ్రాసినయుత్తరమున కాయన, 9 - 1 - 09 తేదీని ప్రత్యుత్తరమిచ్చుచు, జరిగినది మఱచిపోయి రానున్న దానిని గుఱించి యోజింపుమనియు, నేనుగూడ రాజమంద్రి వచ్చివేసినచో నేదోయుద్యోగమునఁ బ్రవేశింపవచ్చుననియును వారు వ్రాసిరి.

ఇది జరిగిన మఱుసటిసంవత్సరమున నాయఁడుగారియొద్దనుండి నా కొకజాబు వచ్చెను. దాని నిందుఁ బొందుపఱుచుచున్నాను :

కాకినాడ,

10 - 4 - 1910

తెలుఁగు సంవత్సరాది.

"భాతృవరా !

మనకుఁ బ్రియ మగు నీ సంవత్సరాదిపండుగనాఁడు, వెనుకటి సంగతులు మఱచిపోయి, ముందు మరల నున్న మీప్రేమ కాస్పదునిగఁ జేయరా ? ఇపుడు , నే నే సమాధానము నీయను ! ఏసాకును జెప్పను ! క్షమాపణమే నేను వేఁడుచున్నాను !

"ఆకాశము అంధకారబంధురమైనను, గృహములోపల ప్రకాశముగనే యున్నదిసుఁడీ !

ర. వెంకటరత్నము"

దీనికి నా ప్రత్యుత్తరమిది : -

గుంటూరు

14 - 4 - 1910

"ప్రియమైననాయఁడుగారికి,

మీయుత్తరము చేరినది. ప్రేమపూర్వకముగ మీరు చాఁపిన కరమును సంతోష పూర్వకముగ నేను గ్రహించుచున్నాఁడను. * * * కాని, మీరే నన్ను క్షమింపవలెను. మీ యీకడపటి యుత్తరమును నా వెనుకటిచర్యలను విమర్శించిచూడఁగా, మొదటినుండియు నాదే తప్పిదమని నేను గ్రహించుచున్నాను. అహంభావపూరితునికి న్యాయవిచక్షణ మసాధ్యము. అత్యాశాపీడితుఁడనై నే నిదివఱకు వ్యవహరించినట్లు నా కిపుడు ద్యోతక మగుచున్నది. నాకు తగినశాస్తి "జరిగినది జరుగనిండు. నలువది సంవత్సరములప్రాయము దాఁటి, ఒకరికొకరు నూఱుమైళ్లదూరమున నున్న మనబోటి యిఱువురు మనుష్యులు, ఒండొరులను కుమ్ముకొనక, కనీసము క్రొత్తవారు మెలంగెడి రీతినైన నింక మర్యాదతో సంచరించుట కభ్యంతర ముండఁగూడదు. నే నెట్టి తులువనైనను, ఇంకముందు మనోవాక్కర్మలయందు నిగ్రహము పూనియుందు ననియును, మీయొక్కయు, నితరుల యొక్కయు చిత్తశాంతిని తొలఁగింప కుందుననియును నమ్మించు చున్నాను.

రా. వెం. శి."

11. ఉద్యోగప్రయత్నములు

నేను గుంటూరు కళాశాలలో నాపనులు సక్రమముగ నెరవేర్చు చుంటిని. అధ్యక్షులగు డాక్టరు ఊలుదొరగారు నాయందు ప్రేమగౌరవములు చూపుచుండెడివారు. విద్యాబోధనమునందును కళాశాలా పరిపాలనమునందును, వారి సమర్ధత నా కంతగఁ నచ్చకున్నను, సత్యసంధత న్యాయవిచక్షణ విధి కార్యనిర్వహణములం దాయన యుత్తమోత్తముఁడని, నేనేకాదు, చూచినవారందఱును విశ్వసించియుండిరి. ఆయన మునిసత్తమునివంటి పవిత్రవర్తనమున నొప్పువాఁడు. అట్టి సుజనుఁ డేమత మవలంబించినను, ఏసంఘమున నుండినను, ఆయాసంస్థలకు వన్నెయు వాసియుఁ గలువగలసినదే ! ఆయనమంత్రులగు నొకరిద్దఱు బోధకులు తమదుర్మంత్రముల నాయన కుపదేశించి, ఆయనను పెడదారులను ద్రొక్కించెడివారు. ఇది చూచి నాకు విచారము కలిగెడిది. కాని, యితరుల కార్యములలో జోక్యము కలిగించుకొనక, నాపనులు చక్క పెట్టుకొనుటయే నీమముగఁ జేసికొని నేనె