ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/నెల్లూరు గాలివాన

వికీసోర్స్ నుండి

టికి వచ్చి కూర్చుండుచు, నాభార్యతో ముచ్చటించుచు, కాలము గడుపు చుండెడిది. ఆమెకుఁ జేత నైనంత సాయము చేయుచుండు వారము. 1925 వ సంవత్సరాంతమున నామె కాలధర్మము నొందెను. చనిపోవునపు డామె కొంచెము సొమ్ము నాభార్యచేతి కిచ్చి, దానితోఁ దన పేరిట నే ధర్మకార్యమైన నెలకొల్పుఁ డని కోరెను. కావున 1926 వ సంవత్సరము అక్టోబరు నెలలో ఆమెపేర ట్రంకురోడ్డుమీఁద పశువులు నీరు ద్రావుట కనువగు నీటితొట్టి నొకటి పురపాలక సంఘము వారిచేఁ గట్టించి, అద్దాని ముఖఫలకముమీఁద "దోరనాల కనకమ్మధర్మము" అని వ్రాయించితిని. ఆ డిశెంబరు నెలలో మా తమ్ముఁడు కృష్ణమూర్తి సకుటుంబముగ చెన్నపురి పోవుచు, మార్గ మధ్యమున నెల్లూరునఁ గొన్ని దినములు నిలిచెను. అంత మా చెల్లెలితోఁ గలసి వా రందఱును చెన్నపురి వెళ్లిరి. న్యాయవాదిపరీక్షలో మొదటితరగతిని మా తమ్ముఁ డపుడు జయమందెను. సెలవులలో మేము గుంటూరు వెళ్లి వచ్చితిమి.

27. నెల్లూరు గాలివాన

నూతనముగ స్థాపిత మయిన కళాశాలలో నా కిపుడు పూర్తిగఁ బను లున్నను, ఎటులొ తీఱికచేసికొని, కథలు వ్యాసములును వ్రాయుచువచ్చితిని. నాకు వలసినంత వ్యవధానము లేకుండుటయె యాకాలమున నేను చిన్నకథ లల్లుట కొకకారణము. చిన్న కథలని నేను వానిరచనమున నశ్రద్ధఁ బూనువాఁడనుకాను. కథాచమత్కృతియందుఁగాని, శైలిసొబగునఁగాని, యేలోపము గనఁబడినను, దానినిఁ దొలఁగించువఱకును, నాకుఁ దోఁచెడిదికాదు ! మొదటిప్రతి వ్రాసిన కొన్నిదినములకుఁగాని నాకథ సిద్ధమయ్యెడికాదు. కథ నెన్నిమాఱులో నేజదివి, వ్రాసినశుద్ధప్రతులను నేను దిద్దుకొనుచు మిత్రులకుఁజూపి దిద్దించుచు, ఇట్లు కథ నునుపుదేఱువఱకును దానిని సవరించుచునే యుండెడివాఁడను. చిన్నకథకైన నేనిట్లు పెద్దపాటుపడుచుండువాఁడను. రచయితను వానిమిత్రులనే రంజింపఁజేయనేరని రచనము, పత్రికలలోఁ బ్రచురమై, రచ్చకెక్కి, బాధ్యతారహితులగు పాఠకుల తలల కెటు లెక్కఁగలదు ? పత్రికలోఁగాని పుస్తకరూపమునఁగాని ప్రచురమగు రచనము నాసొంతసొత్తు కాదనియు, జనరంజకమగు భాషతోను భావములతోను విలసిల్లవలెననియు నామతము. పెద్దలకుఁ జిన్నలకు, విద్యావంతులకు విద్యారహితులకు నందఱకును హృద్యమగు కథాసంవిధానమునఁ జెలంగి, పెటుకు పేలవములుగాని లలితపదములతోఁ గూర్చిన కథయె కథయని యెంచువాఁడను. వాడుకభాష యనియును, గ్రంథస్థభాషయనియును భేదములు భాషపట్ల నంతగఁ గలిపించుకొనువాఁడను కాను. కాని, పలికెడిపలుకుకంటె వ్రాసెడి వ్రాఁత చిరస్థాయి గావున, అద్దాని యాకారమును జిత్రించువిషయమున రచయిత తగిన జాగరూకత వహింపవలెను. వ్యాకరణ సూత్రము లుల్లంఘించుటయు, శ్రుతి కటుప్రయోగము చేయుటయు వ్రాయసకానియందు పెద్దలోపములు. మన జీవిత పద్ధతివలన లోకమందలి నైతికస్థితికిని, మనరచనవలన భాషానైర్మల్యమునకును గళంక నూ పాదిల్లకుండ మెలంగుట మానవధర్మమని నేను విశ్వసించువాఁడను. ఈ ప్రణాళిక ననుసరించియె నే నెప్పుడును రచనమునకుఁ దొడంగువాఁడను. నా నియమములకు వ్యాఘాతము గలుగకుండ నాకు సాయ మొసంగిన మిత్రబృందమునకు నే నెపుడును కృతజ్ఞుఁడను.

1927 వ సంవత్సరారంభమున నా "చిత్రకథామంజరి" రెండవ భాగము మద్రాసున ముద్రిత మయ్యెను. వీనిలోని వన్నియు స్వతంత్రకథలె. ఒకటి ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలోను, మిగిలినవి భారతి, దీనబంధు, పుష్కరిణి, కృష్ణా పత్రికలలోను, ఇదివఱకె ప్రచురింపఁబడెను. ఇదివఱకు నేను హాస్యరసకల్పనతో కథా రచనము చేయలేదు. ఈ పుస్తకములోని 'గణేశను', 'బ్రహ్మానందము' నను కథలు హాస్యరసయుతములు. ఈ విషయమై నా ప్రయత్న మెంతవఱకు సఫలమయ్యెనో చదువరులె నిర్ణయింపఁగలరు. 'గోపాలము', 'రావి యారాటము', 'బిళ్ల గన్నెరుపూవు' లలో కరుణారసమె ప్రథానము. 'బ్రహ్మానందము', 'దేవయ్యశోధన' లలో ప్రకృతమున మనదేశమును గలంచెడి బ్రాహ్మణ బ్రాహ్మణేతర సమస్యను జిత్రించితిని. హిందూ ముస్లిము సమ్మేళనమును సూచించునది 'మంతాజముత్యము' కాకినాడ యందలి దేశీయ మహాసభ మిషగాఁ గొని యల్లిన ప్రేమకథ 'పార్వతి యనుతాపము'. కేవలము స్వవినోదమునకె కల్పించుకొనిన చిన్నికథ 'కాళ్యాణి'.

మొదటి భాగమునందలి కథల వలెనే యివియును వేఱు వేఱు లక్షణములు దాల్చియున్నవి. 'బిళ్ల గన్నెరుపూవు' క్రొత్తరకపు విషాద కథ యని కొందఱు మిత్రుల మతము. 'పులికూన' తుదిని సూచితమైన దండకవిలెను దనకుఁ జూపెదరాయని యొకనాఁ డొక క్రొత్తమనుజుఁడు నెల్లూరులో మాయింటికి వచ్చి యడిగెను ! ఇట్టి కోరికనె తెలియఁ బఱుచుచు నా మిత్రులు రా. పా. గిడిగు రామమూర్తి పంతులుగారు నాకొక లేఖ వ్రాసిరి ! కథా చమత్కృతిచే చదువరులను మోసగించుటయె రచయిత ముఖ్యోద్దేశము గావున, "మిమ్మును మోసగించిన నా గెలుపునకు సంతసించితినని" స్నేహితులు రామమూర్తిగారికి నేను బ్రత్యుత్తర మిచ్చితిని. దేవయ్యశోధనను' వ్రాసి, బ్రాహ్మణ బ్రాహ్మణేతరకక్ష లనెడి కందురీఁగల గుమిని గదల్చుచుంటి నని నామిత్రులు కొందఱు భయపడిరి! కాని, ఆకథయందును 'బ్రహ్మానందము' నందును వారి సందియములకు వలయు సమాధానము గలదు. సద్భావము గల రచయిత యెన్నఁడును పక్షపాతబుద్ధి వహింపఁడు. లోకవిశేషము లందలి సత్యమును బ్రదర్శించుటయె యతని పని కాని, క్షణభంగురమగు జాతి మతవైషమ్యములతో నతనికి జోక్యము లేదు. "పార్వతి యనుతాపము" రచనాచమత్కృతియందును, భాషాసౌష్ఠవము చేతను, నా రచనము లన్నిటిలోను మిన్న యని నా యనుంగుమిత్రు లిరువురి యభిప్రాయము.

                   "ప్రేమాతిశయమునఁ బెంచిన మమ్ము
                    దు:ఖవారిధియందుఁ ద్రోచి తానైదు
                    వత్సరంబులకె జీవము వాసి దివికిఁ
                    జనిన మా చిన్ని పాపని కిది యిడుదు".

ఇటు లనుచు నేను, "ఎవ్వని యకాలమరణమువలన జనించిన యపారదు:ఖము నుపశమింపఁజేసికొన నాచేత నీకథలు కల్పితము లయ్యెనో, ఎవ్వాని జీవితస్మరణయె యిటీవల నాచే విరచితములగు 'ట్టికథలకు సందర్భములు వెలయించెనో, అకాలమృత్యువు వాతఁబడిన యా మాగారపు చిన్ని మేనల్లుని కీకథలపొత్త మంకిత మొనర్చి యొకింత మనస్సంతుష్టిఁ గాంచుచున్నాఁడను" అని యీపుస్తక పీఠికయందు వ్రాసితిని.

కొలఁదికాలములోనే మే మీనగరమును విడువ నున్నారమని యెఱింగి నేను, మేము నివసించెడి దండువారివీధిలో నాభార్య కోరిక మీఁద నామెపేరిట నొక నీటికొళాయి స్తంభము కట్టించితిని. "రాయసం రత్నమ్మగారిధర్మము" అని యందలి ముఖఫలకముమీఁదఁ జిత్రింపఁబడియెను.

ఈ సంవత్సరము మార్చినెలలో మా మేనల్లుఁడు బుచ్చిరామయ్యకు సన్నిపాతజ్వరమువచ్చి మూఁడువారములు వేధించెను. వ్యాధి యింటిలోని యితరపిల్లలకు సోఁకకుండ మేము జాగ్రతపడితిమి. దంపతుల మిరువురమును రాత్రులు నిద్దుర గట్టిపెట్టి, రోగికిఁ బరిచర్యలు చేసితిమి. దైవానుగ్రహమునను, ఋషిసదృశ శీలుఁడగు శ్రీమాతులుల్లా వైద్యశిఖామణి వైద్యప్రభావమునను రోగి యొక నెలలోనె పరిపూర్ణారోగ్యవంతుఁ డయ్యెను.

ఇదివఱకు ఆంధ్రమండలములలో బ్రాహ్మమతప్రచారము సలిపి, నేత్రావరోధము గలిగి యిపుడు మంచమెక్కిన హేమచంద్ర సర్కారుగారి సంరక్షణమునకై నేను గొంత ధనసాహాయ్యము చేసితిని. నా మిత్రులు, కవిపుంగవులునగు బ్ర. శ్రీ. చిలకమర్తి లక్ష్మీనరసింహముగారి షష్ఠిపూర్తి సందర్భమున వెలువడిన వారి సంపూర్ణగ్రంథావళికి నా శక్తికొలఁదిని తోడుపడి, సంతుష్ట హృదయుఁడ నైతిని.

ఆ సంవత్సరము వేసవి సెలవులలో వెలిచేరులో మా బావమఱఁదియింట జరిగిన రెండు శుభకార్యములలో నొకటి, జబ్బుపడి లేచిన బుచ్చిరామయ్య కుపనయనమహోత్సవము. ఆతనిని మరల సంపూర్ణారోగ్యవంతునిగఁ జేసి, తలిదండ్రుల కొప్పగింపఁ గలిగినందుకు మేముభయులము ముద మందితిమి. ఆ వేసవిని నా భార్య, కొండ వేంకటప్పయ్యగారి పత్నీపుత్రికలతో బెంగుళూరు వెళ్లి, అ చల్లనిప్రదేశమున కాలము గడిపెను. నేను మా తమ్మునితోను, ఆతని పిల్లలతోను భీమవరమునందుండి, అచట మా సోదరులము గట్టుచుండు క్రొత్తయింటి పనులు పూర్తి చేయించుచుంటిని. ఆ సంవత్సరము విజయదశమిపండుగ నాఁడు ఆ గృహప్రవేశ మహోత్సవము జరిగెను.

ఆంధ్రవిశ్వవిద్యాలయమువా రిపుడు తమపరీక్షలు చేయఁ దొడంగి, ఇంటరుమీడియేటుపరీక్షలో నాంగ్ల సాహిత్యమున నన్నొక ముఖ్యపరీక్షకునిగ నియమించిరి.

ఆ సంవత్సరము అక్టోబరు నెల చివరభాగమున నెల్లూరులో పెద్ద తుపాను సంభవించెను. మేముండెడి యింటిసామానుకొట్టులో నింటనుండు చిన్న పెద్దలందఱుమును ఆరాత్రి తల దాఁచుకొంటిమి. మా మఱఁదలు చామాలమ్మ కుమారుని కడపటిపిల్లవాఁడు, కొన్ని నెలలవాఁడు, వానియక్క లిద్దఱును, తల్లియును, మాతోనె యుండిరి. గాలితాఁకుడున కింటిపెంకులు దొరలిపడుచుండెను. దూరపుచెట్ల కొమ్మ లెగిరివచ్చి గుమ్మములయొద్ద పడుచుండెను.

పది నిముషముల కొకమాఱు గాలిహెచ్చుచు, బందిపోటు దొంగల గుమివలె తలుపులు గుభేలున గొట్టుచుండెను ! ఆరాత్రి మేము జీవింతుమని తోఁపలేదు. తెల్లవాఱునప్పటికి పురమంతయు మ్రోడుపడిన వృక్షమువలెఁ దోఁచెను. ఎచటఁ జూచినను పడిపోయిన గోడలు, కూలిపోయినచెట్లు, రాలినకొమ్మలు రెమ్మలును ! ఈ గాలి వానను వర్ణించుచు "ముద్దుకృష్ణ" అను నొక కథనువ్రాసి, "భారతి" కంపితిని. దీనిలో ప్రకృతి వైపరీత్యమునకుఁ బ్రతిగా మనుజులప్రేమము వర్ణింపఁబడియెను. ఈ గాలివానవలన నెల్లూరుపురము పాడుపడెను. మా కళాశాల కమితనష్టము వాటిల్లెను. చుట్టుపట్టులనుండి యిండ్లు వాకిండ్లు పోయినవాండ్రు తండోపతండములుగ వచ్చి, కళాశాల వసారాలలో నివసించిరి. కొన్నిదినములవఱకును వా రెచటికిని గదల నేరకుండిరి. వారు వెడలిపోయినపిమ్మట, ఎంత పరిశుభ్రపఱిచినను, అడుగుపెట్టుట కాప్రదేశ మయోగ్యముగ నుండెను. ఇంతలో జనసమ్మర్దముచేత పట్టణమున విశూచియారంభమయ్యెను. ఏవీథులలోని చెత్త చెదారము లందె నిలిచి యుండెను. పురపాలకసంఘమువారి పరిచారకులు తమ పనులు మానివేసిరి. పట్టణము బొత్తిగ వాసయోగ్యము గాకుండెను.

కొన్నిదినము లపుడు కళాశాల మూసివేసి, మేము గుంటూరు ఏలూరు పురములు వెడలిపోయితిమి. చుట్టుపట్టుల కళాశాలలలోని విద్యార్థులు కొంద ఱపుడు, గుంటూరు కళాశాల కేతెంచి, ఆటలలోను, నుపన్యాసములలోను నొండొరులతో పోటీలు సలిపిరి. గుంటూరుకళాశాలలో ఉపన్యాసముల పోటీలు జరుపు సంఘమునకు నే నధ్యక్షునిగ నియమింపఁబడితిని. అపుడు రాజమంద్రి కళాశాలా విద్యార్థులు గెలు పొందిరి. వారలలో మా తమ్మునికుమారుఁడు సూర్యనారాయణ యొకఁడు.

ఆ సంవత్సరము నవంబరు తుదివారమందు ఆంధ్రవిశ్వవిద్యాలయమునకు కేంద్రస్థానము నిశ్చయించువిషయమున మద్రాసు శాసననిర్మాణసభయెదుట సాక్ష్య మిచ్చుటకుఁ గొందఱు కోరఁబడిరి. వారిలో నేనొకఁడను. రాజమంద్రినగరమె యీ గొప్పగౌరవమునకుఁ దగియున్నదని నేను గట్టిగఁ జెప్పితిని. కొందఱు బెజవాడ యనియు, కొందఱు విశాఖపట్టణము, అనంతపురముననియుఁ జెప్పిరి. నెల్లూరుమండలమున గాలివానకు నిస్సహాయు లయిన పిల్లలను సంరక్షించుటకై శరణాలయ మొకటి స్థాపింప నెంచి, మిత్రులము కొందఱము ఇసకా చెంచయ్య, జానకీబాయిగార్ల ద్వారా ధర్మ సంస్థ నొకటి యారంభించితిమి. పాప మీ యిసకాదంపతులు శ్రమ యనక, దిక్కులేని పసిపిల్లలకు భోజనాదిసౌకర్యము లొనఁగూర్చిరి. అంత నీసంస్థ నుద్ధరింప పురప్రముఖు లొక సమాజముక్రింద నేర్పడిరి.

6 వ డిసెంబరున ఆంధ్రవిశ్వవిద్యాలయసభ సమావేశమై, పరీక్ష నిచ్చినవారలకు పట్టము లొసంగిరి. శ్రీ గవర్నరుగా రధ్యక్షులు. శ్రీ రఘుపతి వెంకటరత్నమునాయఁడుగారికి డాక్టరుబిరుదము నొసఁగుఁడని బందరు నోబిలుకళాశాలాధ్యక్షుఁడు జానుస్టను దొర యాంగ్లమునను, వేదము వెంకటరాయశాస్త్రులుగారికి "కళాప్రపూర్ణ" అను బిరుద మీయుఁడని యాంధ్రమున నేనును ఆసమయమున నుపన్యాసములు చేసితిమి.

ఆ డిశెంబరునెలలో నేనును కొందఱు నెల్లూరుమిత్రులును, మేము నూతనముగ నెలకొల్పిన శరణాలయములో దీనబాలురను బాలికలను జేర్పించుటకై చుట్టుపట్టుల గ్రామములకుఁ బోయివచ్చితిమి. ఇట్లు శరణాలయమున సుమా రిరువదిపిల్లలు చేరిరి.

డిశెంబరు చివరభాగమున మద్రాసులో దేశీయమహాసభ జరిగెను. దీనితోఁబాటు సంఘసంస్కరణసభలు మున్నగునవికూడ జరిగెను. నేను భార్యయు, తమ్ముఁడు వెంకటరామయ్య, మఱఁదలు శ్యామలాంబయు చెన్నపురి పోయితిమి. దేశీయసభలో సభ్యురాలగు చామాలమ్మ కొకకుటీర మీయఁబడెను. అందు మేము వంటచేసికొని భుజించి నివసించితిమి. కాంగ్రెసులో సంపూర్ణస్వాతంత్ర్యమును గుఱించిన తీర్మాన మామోదింపఁబడెను.

28. ఉద్యోగవిరామము

1928 వ సంవత్సర ప్రారంభమున గూడూరులో మండల విద్యాశాలలకు సంబంధించిన యాటలపోటీలు జరిగెను. ఆసమయమున నేను గూడూరు వెళ్లి, మాపిల్లలకుఁ బ్రోత్సాహము గలిగించితిని.

నేను గుంటూరుకళాశాల వీడి నెల్లూరునకు వచ్చునపుడె, యిచట నైదువత్సరములు మాత్రమె యుండి యంతట నుద్యోగ విరామముచేతు నని మనస్సున సంకల్పించుకొంటిని. మెల్లూరుపురమున కళాశాలను నెలకొల్పి, దాని నభివృద్ధికిఁ గొనివచ్చుట మిగుల ప్రయాసకరకార్య మయ్యెను. 1920 వ సంవత్సరమధ్యమున పదునెనిమిది బాలురతో నారంభమయిన కళాశాల, 1928 వ సంవత్సరమున సుమారు 200 విద్యార్థులతో విరాజిల్లుచుండెను. ప్రతిసంవత్సరమును పెక్కండ్రు ఇంటరుమీడియేటు పరీక్షలో గెలుపొందుటయెగాక, వీరిలోఁ గొందఱు మొదటితరగతిలోఁ గూడఁ గృతార్థు లగుచువచ్చిరి. బోధకులును తగిన నైపుణ్యానుభవములు గలవారలే.

విద్యాబోధనమందు కళాశాలాపరిస్థితు లిట్లు ప్రోత్సాహకరముగ నుండినను, ఆర్థికవిషయముమాత్రము మిక్కిలి యసంతృప్తికరముగ నుండెను. కళాశాలకగు వ్యయములో విద్యార్థులజీతములు పోఁగా, మిగిలినదానిలో కొంత దొరతనమువారును, తక్కినది కళాశాలాధిపతులగు శ్రీ వెంకటగిరిరాజావారును వహింపవలయును. కళాశాల కేటేటఁ గావలసిన పుస్తకపరికరాదుల కగు వ్యయములో సగము దొరతనమువారును, మిగిలినది రాజాగారు నీయవలయును.