ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/నెల్లూరునివాసము : రెండవవత్సరము

వికీసోర్స్ నుండి

జేరి చదివెను. నాబావమఱఁది వెంకటరత్నముకొడుకులు నరసింహము బుచ్చిరామయ్యలు చిన్నతరగతులలోఁ జేరిరి.

ఇదివఱకు దొరతనమువారి కొలువులో తెలుఁగు ట్రాన్సులేటరుపదవిలో నుండిన మిత్రుఁడు గోటేటి కనకరాజు కొంత కాలముక్రిందట పక్షవాతరోగమునకు లో నై, పని పోఁగొట్టుకొని, స్వస్థలమగు పాలకొల్లు చేరెను. తాను వెతలఁ బెట్టిన రెండవసతియె యిపు డాతనికి గతియయ్యెను ! కాలవైపరీత్య మిటు లుండును. ఈతనికి నే నప్పుడప్పుడు కొంచెముగ సొమ్మంపుచు సాయము చేయుచుండు వాఁడను.

24. నెల్లూరునివాసము : రెండవవత్సరము

నేను గుంటూరు కళాశాలయం దుండిన చివర యైదేండ్లును, నెలనెలయు నాజీతములో రూపాయి కొక యణావంతున కళాశాల 'సహాయనిధి' లో నిలువచేసికొని యుండువాఁడను ఇటు లైదుసంవత్సరములు సొమ్ము పెరిఁగిన హేతువున, 19-20 వ సంవత్సరము జులై నెలలో నేనచటి యుద్యోగమును విరమించిన సమయమున వడ్డీతోఁ గలసిన నా సొమ్ము మొత్త మంత మొత్తమును కళాశాలాధికారులు తామును జేర్చి, 1730 రూపాయిలు నా కపు డొసంగిరి.

1920 వ సంవత్సరము తుదిభాగమున నాకు నెల్లూరుకళాశాలలోని యొక యుపాధ్యాయునితోఁ గొంత సంఘర్షణము గలిగెను. అనుభవశాలియైనను, ఆయన యుచితజ్ఞత గలిగి మెలఁగ నేర్చినవాఁడు కాఁడు. సమయపాలనవిషయమై యశ్రద్ధ వహించి యుండెడివాఁడు. దీనిని గుఱించి పలుమాఱు నేనాయనను హెచ్చ రించినను లాభము లేకుండెను. నవంబరునెలలో నొకనాఁ డాయన కళాశాల కాలస్యముగ వచ్చి, తాను సకాలముననె వచ్చితి నని చెప్పి, తన సత్యసంధత విషయమై సందియ మందితి నని నామీఁదనె యలుకఁ జెందెను! ఆయనతీరు నాకేమియు బాగుగఁ గనఁబడక, దీనినిగుఱించి తగిన చర్య కై కొనుఁ డని విద్యాలయపాలక వర్గము వారికి విజ్ఞాపన మంపితిని. వా రెటులో మాకు తాత్కాలికసమాధానము కుదిర్చిరి. కాని, పిమ్మట నైనను ఆయన తనలోపములను సవరించుకొన కుండెను.

ఆ డిశంబరు చివరరోజులలో మాచెల్లెలితోను, ఆమె పిల్లలతోను గలసి తిరుపతియాత్ర చేయ మేము సంకల్పించుకొంటిమి. కాని, ఆరోజులలో జరిగెడి నెల్లూరు "మడలప్రాథమిక పాఠశాలోపాధ్యాయుల" ప్రథమసమావేశమునకు నన్నధ్యక్షత వహింపుఁడని యేతాత్సామాజికకార్యదర్శులు కోరుటచేత, యాత్రకు మా యాఁడువాండ్రను పిల్లలను బంపివైచి, నేను పురమున నిలిచి సభాకార్యక్రమము జరిపించితిని. "ఉపాధ్యాయగౌరవపరిరక్షణ" మను శీర్షికగల యుపన్యాసము నే నాసందర్భమునఁ జదివితిని. దానిసార మే మనఁగా, "ప్రాథమికవిద్య జాత్యభివృద్ధికి మూలాధారము. ప్రాథమికపాఠశాలలలో రెండు తరగతులు గలవు. దేశీయ పద్ధతుల ననుసరించి పూర్వపురీతిని విద్య నేర్పెడి బడులు మొదటి జాతిలోనివి. ఈతరగతి విద్యాలయ కార్యక్రమమునఁ గొన్ని మార్పులతో, నూతనోపకరణముల సాహాయ్యమున విద్యాబోధనము నెఱపెడివియె రెండవతరగతి విద్యాలయములు. ఈపాఠశాలలలో బోధకుని కనేక కష్టములు గలవు. అతనికి తగిన జీతము లేదు. బోధనాభ్యసనపాఠశాలలో నతఁడు మొదటఁ గడపవలసిన కాలపరిమితి యిటీవల సంవత్సరమునుండి రెండు సంవత్సరములు పొడిగింపఁబడినది. బోధకులకు పరీక్షాధికారులకును వైషమ్యములు గానవచ్చుచున్నవి. దేశభాష తెలిసినవారే కాక, ఆభాష మాతృభాషగాఁ గల స్వదేశీయులును పరీక్షాధికారు లగుట ముఖ్యము." '

నిరుడు శీతకాలమున నేను "కమలాక్షి" యను చిన్న నవలను గుంటూరునందు రచించితిని. ఇపు డది యీశీతకాలపు సెలవులలోఁ జదివి, దానిలోఁ గొన్ని మార్పులు చేసి, నామిత్రులును, కళాశాలలో నాంధ్రపండితులును నగు శ్రీ సుబ్రహ్మణ్యశర్మగారికిఁ జూపితిని. అది ప్రచురించుటకు యోగ్యముగ నుండె నని వా రభిప్రాయపడిరి.

మా కళాశాలా విద్యార్థులకు శరీరవ్యాయామ మేమియు లేకుండుటకు నేను వగచితిని. అనుదినమును డంబెల్సుతో కసరతు చేయుఁ డని నేను నావిద్యార్థులకు బోధించి, కొన్ని దినములు వారిచే నావ్యాయామము చేయించితిని. కొన్ని దినములవఱకును వా రాసాధకము చేసి, పిదప మెల్ల మెల్లగ దానిని మానివేసిరి.

ఒకనాఁడు కళాశాలాపఠనాలయపుగదిలో విద్యార్థులకేకలు విని, నేను వారిని వారించితిని. అంతట నొక విద్యార్థి ప్రేరేపణమునఁ దక్కినవారిలోఁ గొందఱు నాతరగతిలోనికిఁ గొన్నిరోజులవఱకును రాకుండ సమ్మె కట్టిరి. పిమ్మట నేను తరగతిలో వారితో మాటాడి సమ్మెలో నుండువారిని క్షమించితిని. అంత పరిస్థితులు యథాప్రకారముగ నడువఁ జొచ్చెను.

1921 సం. ఫిబ్రవరి మాసమధ్యమున "యూనివర్సిటీ కమీషను" వారు మాకళాశాలను సందర్శింప వచ్చిరి. ఇంక ముందు కళాశాలలో తెలుఁగునకుఁ దోడుగ ఉర్దు, అఱవము, సంస్కృతమును బ్రారంభింతు మని మేము చెప్పితిమి. వారు దీని కంగీకరించిరి.

ఆఫిబ్రవరినెల తుదికి మూఁడునెలల జీతములు మాకళాశాలలో బోధకుల కీయవలసి యుండెను. ముందుకూడ నిటులె యుండునేమో యని నేను భీతిల్లితిని.

మార్చినెల చివరరోజులలో కొందఱు స్నేహితులతోఁ గలసి నేను గుడ్లూరు పోయితిని. శర్మగారు ఎఱ్ఱాప్రెగడను గుఱించి యుపన్యాసము చేసిరి. నేనుగూడ మాటాడితిని.

హరిద్వారమునుండి వచ్చిన గోపాలదాసు బ్రహ్మచారియను సాధువు నాకొకనాఁడు నెల్లూరను గనఁబడి, నాచేత నొక కాకితములో చదరపుగడులు గీయించి, ఆగడులలోఁ నా పుట్టిన సంవత్సరము, మాసము, దినము, మున్నగునవి నేను రహస్యముగ వ్రాసి, ఆకాకితమును ముణిచి నాజేబులో నుంచుకొమ్మని చెప్పెను. అంత నా కాకితములోని సంగతులు క్రమము తప్పక యతఁడు చెప్పఁగా, పదునాఱు అంశములలోను పదునాలుగు సరిగ నుండెను ! తన రెండు పొరపాటులును ప్రమాదమునఁ గలిగినవెయని యతఁడు వాక్రుచ్చెను. దీనినిబట్టి యతఁడు పరులయూహలు సరిగ గ్రహింపఁ గలవాఁ డనుకొంటిని. భవిష్యత్తును గూర్చి యాయన చెప్పిన జోస్యములో నేమాత్రమును సత్యము లేకుండెను.

కావలి కొక జ్యౌతిష్కుఁడు వచ్చెనని తెలిసి, 2 వ యేప్రిలున శర్మగారు, నేను నచటి కేగితిమి. మఱునాఁ డాయన నింకొక గ్రామమునఁ గలసికొంటిమి. నేను కాకితముమీఁద వ్రాసికొని జేబులో నుంచుకొనిన యిరువదిప్రశ్నలును వెంటవెంటనే యాయన యొక పలకమీఁద వ్రాసి చూపించెను ! ఇది నా కాశ్చర్యము గొలిపెను. కాని, వాని కాయన యిచ్చిన ప్రత్యుత్తరములలో ననేకములుమాత్రము సరిగ లేవు.

మహాత్మాగాంధిగారు 7 వ తేదీని నెల్లూరు దయచేసిరి. కళాశాలా క్రీడారంగమునందలి మైదానమున గొప్పబహిరంగసభ జరిగెను. ఆయనకు రెండు స్వాగతపత్రములు నెల్లూరిపౌరులు నివేదించిరి. పలువురు సొమ్ము నగలును విరాళ మిచ్చిరి. ఆ సందర్భమున వచ్చిన కొండ వెంకటప్పయ్యగారు మాయింట బసచేసిరి.

8 వ యేప్రిలునఁ గూడిన కళాశాలాపరిపాలకవర్గసభలో వెనుకటి యుపాధ్యాయుని లోపములను గూర్చి నేను జెప్పితిని. కార్యదర్శి నరసింహాచార్యులుగారు నా వాక్యములు బలపఱిచిరి. మా కిద్దఱికి నింక పొసఁగ దని సభ్యులు గ్రహించి, ఆయనను కళాశాల వీడుఁడని చెప్పివేయుటకు తీర్మానము చేసిరి. ఆబోధకుని యవస్థకు నేను మిగుల చింతిల్లినను, ముందు కళాశాలలో పని క్రమముగ జరుగఁగల దని యాశించితిని.

వేసవి సెలవులు గడప నేను గుంటూరు వెడలిపోయిన కొలఁదిదినములకె నాకు నెల్లూరునుండి జాబు వచ్చెను. ఆ యుపాధ్యాయుఁడు జరిగినదానికి విచారించుచుండి రనియు, ఆయనను కళాశాలలో నుంచుట కొడఁబడుఁ డనియు, నా పూర్వసహపాఠియు నిపుడు నెల్లూరులో సబు జడ్జియు నగు సోమంచి నీలకంఠముగారు నాకు వ్రాసిరి. గుంటూరిలోని నా పూర్వమిత్రులు జంధ్యాల నాగభూషణముగారుకూడ నిటులే నన్నుఁగోరిరి. కావున మొదట నాకిష్టములేకుండినను, పిమ్మట నా యుపాధ్యాయుని కళాశాలలో నుంచవచ్చు నని కార్యదర్శికి నేను వ్రాసితిని. గుంటూరిలో నేను వెనుకఁగట్టిన యింటికి వసారా దింపి, యిల్లు పూర్తిపఱిచితిని, మందిరముకూడ సిద్ధమయ్యెను.

గుంటూరిలో "మండలప్రాథమిక విద్యాబోధకుల" సమావేశ సందర్భమున నేను 15 వ మేయిని అధ్యక్షత వహించితిని. నా ప్రారంభోపన్యాసమున, బోధకవృత్తి గౌరవనీయమైన దని చెప్పి, సందర్భానుసారముగ గాంధిమహ్మాత్ముని సహాయ నిరాకరణోద్యమమును గూర్చి యుపాధ్యాయుని కర్తవ్యము తెలియఁబఱిచితిని. సభ జయప్రదముగ జరిగెను. జీతములు సరిగా నీయకుండుటచేత తాము ఉద్యోగములు వదలుకొందు మని బోధకులు అదివఱకు చేసికొనిన తీర్మానము నా సలహా ననుసరించి విరమింపఁ బడెను.

ఈ దినములలోనె మిత్రులు వెంకటప్పయ్యగారి రెండవకొమార్తె పార్వతమ్మవివాహము జరిగెను. మాతమ్ముఁడు వెంకటరామయ్యద్వితీయపుత్రుఁడు సుబ్బారాయనికి, అతని మేనమామ మంత్రిరావు వెంకటరత్నముగారి పుత్రిక లక్ష్మీకాంతమ్మకును తణుకులో వివాహము జరిగెను. ఆముహూర్తముననె మా పెదతండ్రికుమారుఁడు వీరభద్రుని జ్యేష్ఠపుత్రుఁడు సాంబశివరావునకు వంగూరి శంకరముగారి పెద్దకొమార్తె మాచరమ్మనిచ్చి పెండ్లి చేసిరి.

1921 వ సంవత్సరము జులై నుండియు మాకళాశాలలో ప్రకృతి గణితశాస్త్రములు నేర్పుట కేర్పాటు లయ్యెను. నా మఱఁదలు లక్ష్మమ్మరెండవకుమారుఁడు పోడూరి నారాయణరావు నెల్లూరు కళాశాలలో రెండవతరగతిలోఁ జేరి యిపుడు చదివెను. నా పెద్దమఱఁదలు చామాలమ్మ పెద్దయల్లుఁడు ర్యాలి శేషగిరిరావు, ఇదివఱకు ఏలూరు పాఠశాలలో నుపాధ్యాయుఁడుగనుండి, యిపుడు నెల్లూరు పాఠశాలలోఁ జేరి, తనభార్య రామమ్మతో వచ్చియుండెను. 21 వ సం. ఆగష్టునెలలో శ్రీ వెంకటగిరి రాజాగారి జ్యేష్ఠపుత్రుఁడు శ్రీ కుమారరాజావారి వివాహ మహోత్సవమునకుఁ బిలుపురాఁగా, కొందఱు మిత్రులతోఁ గూడి నేను వెంకటగిరిపోయి, దివాను రాజాచారిగారియింట విడిసి యుంటిని.

ఆనెల చివరభాగమున మోపాడు ప్రాజెక్టులోనుండి నీటి వసతి యేర్పడిన భూములు కొన్ని వేలమునకు రాఁగా, నేను చింతలదేవి పోయి, 31 ఎకరములభూమి కొంటిని. నాలుగైదు వత్సరములలో నీభూమినంతను మాగానిక్రింద మార్పించి, ఎక్కువలాభము నందఁగల నని నే నాశించితిని.

గాంధిమహాత్ముని ప్రేరణమువలన నిపుడారంభమైన సహాయ నిరాకరణోద్యమమునఁ జేరుటకై మా కళాశాలా విద్యార్థులలో నధిక సంచలనము గలిగెను. ఇట్టి రాజకార్యవిషయములలో జోక్యము గలుగఁ జేసికొనవల దని నేను నా విద్యార్థులకు గట్టిగ బోధించితిని.

ఆదసరాసెలవులలో మేము గుంటూరు పోయి, జబ్బుగనుండిన మా తోడియల్లుఁడు సత్తిరాజు వెంకటరత్నమును జూచుటకు ఏలూరు వెళ్లితిమి. మా రెండవతోడియల్లుఁడు పోడూరి కృష్ణమూర్తిగారు కూడ నాసమయమున సకుటుంబముగ నేలూరు వచ్చిరి. అక్టోబరు 9 వ తేదీని వెంకటరత్నము చనిపోయెను. ఇతఁడు ప్రవేశపరీక్ష వఱకు మాత్రమె చదివి, జీవితకాల మంతయు నేఁబది యఱువది రూపాయిల జీతము గల మాధ్యమిక పాఠశాలలో బోధకుఁడుగ నుండినను, స్వయంకృషివలనను, పొదుపరితనముచేతను నెంతయో ధనమును, పలుకుబడిని సంపాదించి, ఏలూరిలోనే తన జీవితమంతయుఁ గడపెను. ఇతఁడు చనిపోయిన మఱునాఁడె వైద్యపరీక్షకై యితని కుమారుఁడు కృష్ణారావు చెన్నపురికిఁ బ్రయాణము గట్టెను. ఆ పరిక్షలో నతని కపుడు జయము గలిగెను.

మా చెల్లెలి రెండవకుమార్తె సీతమ్మ ప్రసవముకాలేక బాధనొందుచున్న దని నాకు డిశెంబరు 5 వ తేదీని కాకినాడనుండి తంతివచ్చెను. నేను మఱునాఁటి రెయిలుమీఁద కాకినాడ చేరునప్పటికె సీతమ్మ సుఖప్రసవ మయ్యెననియు, మగపిల్లవాఁడు కలిగె ననియును నాకుఁ దెలిసెను. వారిని గుఱించి కొన్ని యేర్పాటులు చేసి, నేను నెల్లూరు వచ్చివేసితిని.

డిసెంబరు సెలవులలో పోడూరి వెంకయ్యగారి రెండవ చెల్లెల్లిపెండ్లి, నెల్లూరిలో మాయింటనె జరిగెను. ఆ వివాహసందర్శనార్థమై వచ్చిన మాతమ్ముఁడు వెంకటరామయ్య, భార్య, పిల్లలును మాతోఁ గలసి మద్రాసువచ్చిరి. ఆనగరమున వినోదములు చూచుచుఁ గొన్ని దినములు గడపి, మే మంత గుంటూరు వెడలి పోయితిమి.

25. కథావిరచనము

1922 వ సంవత్సరము ఫిబ్రవరి 12 వ తేదీని మాతమ్ముఁడు కృష్ణమూర్తియొద్దనుండి నాకు తంతిరాఁగా, నేను మఱునాఁడు కొండపల్లి పయనమయితిని. కొండపల్లికిఁ జేరువనుండు వెలిగలేటిలో కృష్ణమూర్తి పెద్దయల్లునికి మిగుల జబ్బుగనుండెననియె యావార్త. కాని, నేనచటికిఁబోవునప్పటికె యా యువకుఁడు చనిపోయెననియు, అతనికుటుంబము, మాతమ్ములు, ఆఁడువాండ్రును వారిగ్రామము జగన్నాధపురము వెడలిపోయిరనియు నేను వింటిని. చనిపోయిన