ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/గుంటూరునందలియుద్యోగము

వికీసోర్స్ నుండి

7. గుంటూరునందలియుద్యోగము

నేను విజయనగరమున నుండు కాలమునందే, పర్లాకిమిడి విజయనగరములలో నాశిష్యులగు శ్రీ బుఱ్ఱా శేషగిరిరావుగారి నాయకత్వమున 'ఆంధ్రవిద్యార్థుల' ప్రధమసమావేశము విజయనగరమున జరిగెను. ఇపుడు కాకినాడ కళాశాలాధ్యక్షులగు వెంకటరత్నము నాయఁడుగా రాసభ కధ్యక్షులు. ఈ సమావేశసందర్భమున విద్యార్థులలో నధికసంచలనము కలిగెను.

విద్యార్థులలో నధికసంచలనము కలిగిన యింకొకసందర్భ మానగరమునఁ గొలఁదికాలములోనే తటస్థించెను. బంగాళాదేశీయుఁడును, సుప్రసిద్ధవక్తయునగు విపినచంద్రపాలుగారు, ఈమాఱు రాజకీయోపన్యాసము లిచ్చుచు, నాంధ్రదేశసంచారము చేయుచు విజయనగర మేతెంచిరి. అచ్చటి పురపాలకోద్యానవనమునం దాయనగాటగు ప్రసంగములు కొన్ని జరిపిరి. దేశస్వాతంత్ర్యమును గూర్చియు, స్వదేశోద్యమమును గుఱించియు నుపన్యాసము లాయనచేసిరి. ఒకనాఁడు పెక్కండ్రు కళాశాలా విద్యార్థులు భావోద్రేకమున బడియెగవేసి, ప్రసంగమును వినుట కేగిరి. దీనికి వారలను శిక్షించు విషయమున రామానుజాచార్యులుగారు మిగుల జాగ్రత్తగ నుండి రని నే నాయనను కొన్ని దినముల పిమ్మట నభినందించితిని. పిమ్మట పాలుగారు రాజమంద్రి వెళ్లి యచట నుపన్యాసము లీయఁగా, రాజమంద్రి కళాశాలా విద్యార్థులు ఉద్రేకపూరితులై, 'వందేమాతర' చిహ్నములు గల బిళ్లలు టోపీలును ధరించి కళాశాల కేగినందుకై, ఆకళాశాలాధ్యక్షులగు మార్కు హంటరుగారు వారికి విధించిన కఠినశిక్షలవంటి కఠిన పద్ధతులకుఁ గడంగక, మా కళాశాలాధ్యక్షులు సమబుద్ధి నూనుట చేత నే అచట నేమియు నుపద్రవములు వాటిల్లకుండెను. కళాశాలలో పని నాకు బాగుగనుండినను, పట్టణనివాసమె నా కంతకంతకు దుస్సహమయ్యెను. వేసవికాలము సమీపించిన కొలఁది, నీటియెద్దడియు, దోమలబాధయు నధిక మగుచుండెను. ఈబాధ లెపుడు తీఱునా యని నేను వేచియుంటిని. నరసాపురమునను, పిఠాపురమునను పాఠశాలలలో ప్రథమోపాధ్యాయపదవి ఖాళీపడిన దని తెలిసి, నేను దానికై ప్రయత్నింపవలె నని యెంచితిని. ప్రథమతరగతి కళాశాల విడిచి మరల పాఠశాల కేగుట, స్వర్గలోకసుఖములు విడనాడి, భూలోకనివాసమునకు దిగుటవలె నుండును. కాని, యీదూరప్రదేశమందలి కష్టముల కోర్చి గొప్పపదవి ననుభవించుట కంటె, స్వదేశమున సామాన్యస్థితినుండి సౌఖ్యమందుట మంచిదికదా. పిఠాపురము సంగతి యడుగఁగా, వెంకటరత్నమునాఁయడుగారు తమ కళాశాల కంటియుండు పాఠశాలలో ప్రథమోపాధ్యాయపదవిని గుఱించి మాటాడెదను రమ్మని నాకు వ్రాసిరి. నే నంత కాకినాడ పోయితిని. మాబావమఱఁది సకుటుంబముగ నచట నుండెను. మే మచటికి వచ్చుట, వా రందఱికిని సంతోషదాయక మని వారు చెప్పిరి. నాయఁడుగారిని గలసి మాటాడితిని. కాని, యిటీవల కళాశాల తరగతులకె బోధనము చేయుచు వచ్చిన నాకు పాఠశాలలో ప్రథమోపాధ్యాయ పదవి నిచ్చుట కాయన కొంత యనుమానించెను. ఇట్టి పరిస్థితులలో స్థానము గదలుట యయుక్తమని నేను దలపోసి యూరకుంటిని.

నా మిత్రులును, గుంటూరుకళాశాలలో నుపన్యాసకులు నగు పసుపులేటి వెంకటకృష్ణయ్యనాయఁడుగా రిటీవల చనిపోయిరి. ఆ యుద్యోగ మిపుడు ఖాళియయ్యె నని విజయనగరము కళాశాలా విద్యార్థియు, నా కిటీవల పరచితుఁడును నైన గుంటూరు వాస్త వ్యుఁడు జొన్నవిత్తుల గురునాధముగారు నాతోఁ జెప్పి, విజయనగరమున దోమలబాధ యను నరకము ననుభవించెడివారికి గుంటూరు నివాసము స్వర్గలోక సదృశమని నుడివిరి. నే నంత గుంటూరు కళాలాధ్యక్షుఁ డగు డాక్టరు ఊలుదొరగారి కొక యర్జీనంపి, సిఫారసు చేయుఁడని నామిత్రులగు శ్రీ అనంతగారికి బెజవాడ వ్రాసితిని. కొద్ది రోజులలోనే నాకు జవాబు వచ్చెను. నాకు వెంకటకృష్ణయ్యనాయఁడుగారి యుద్యోగ మొసఁగెదమనియు, వారు చెప్పెడిపాఠము లన్నియు నేను జెప్పవలెననియు, జీతము 125 రూపాయిలు మాత్రమె యిచ్చెదమనియు వారు వ్రాసిరి. 1907 వ సంవత్సరము శీతకాలపు సెలవులలో నేనును మాతమ్ముఁడు వెంకటరామయ్యయును, చూచివచ్చుట కై గుంటూరువచ్చి, ఊలుదొరగారితో మాటాడితిమి. కళాశాలలో నాకు 130 రూపాయిల జీత మిచ్చుట కాయన యొప్పుకొనెను. ఆరోగ్యవిషయమున గుంటూరు చక్కగనుండినటుల మాకుఁదోఁచెను. ఇపుడు మాతల్లికి నంజువ్యాధి పొడసూపెను. నరసాపురము కాపురమువచ్చిన నాసోదరులయొద్ద నామె నివసించు చుండెను. మామాట యటుంచి, తల్లి యారోగ్యమును గుఱించి శ్రద్ధ వహించుట యిపుడు నాముఖ్యవిధిగఁ దోఁచెను. నంజువ్యాధిరోగులకు గుంటూరు మంచిది. మాతల్లిని గుంటూరు కొనివచ్చి యిచటామెకు దేహస్వాస్థ్యము గలిగించి, మేము హాయిగ నుండుట శ్రేయమని మాకుఁదోఁచెను. కావున నేను గుంటూరియుద్యోగము స్వీకరించితిని. ఈ సంగతి విజయనగరము కళాశాలాధ్యక్షునితోఁ జెప్పుటకు వారియింటి కేగితిని. నేను మొదటితరగతి కళాశాల విడిచి, రెండవతరగతి కళాశాలకు వెళ్లుటయు, దోమలకును బూరకాళ్లకును భయపడి విజయనగరము వదలివేయుటయు ఆయన కమితాశ్చర్యము గొలిపెను. నాయందు తమకు సదభిప్రాయము గలదనియు, నన్నున్నతదశకుఁ గొనివచ్చెద మనియు వారు చెప్పినను, నేను నా మనోనిశ్చయమును విడువలేదు. అందుచేత 1908 వ సంవత్సరారంభమున నేను విజయనగరము విడిచిపెట్టితిని.

నేను గుంటూరువచ్చు సరికి, నా బెజవాడ మిత్రుఁడును "దేశాభిమాని" పత్రికాధిపతియు నగు దేవగుప్తాపు శేషాచలపతిరావుగారు, క్రొత్తపేటలోఁ దమయింటికి సమీపముననుండు వేలమూరివారి యింటిలో నొకభాగమున నాకు బస కుదిర్చి యుంచిరి. గుంటూరు కళాశాలోపాధ్యాయులలోఁ గొందఱు నా కిదివఱకె స్నేహితులు. సుందరేశయ్యరు, కృష్ణమాచార్యులు, వెంకటరెడ్డిగార్లు నాకుఁ బరిచితులె. విజయనగరము వదలి గుంటూరు వచ్చుట, నాకు పరులయిల్లు వీడి స్వగృహమునఁ బ్రవేశించుటవలె నయ్యెను. ఇచ్చటి ప్రజలపద్ధతులు, ఆచారములు నాకుఁ జిరపరిచితములె.

కళాశాలయందలి పనియె నాకు మిగులఁ గష్టముగఁ దోఁచెను. ఇదివఱ కీపాఠశాల బోధకులగు నా పూర్వికుల పాపపుణ్యముల ఫలము నే ననుభవింపవలసి వచ్చెను. ఈవిద్యాశాలలో వెనుక వెంకటకృష్ణయ్యనాయఁడుగారిపని తెంపులేక యుండెను. కళాశాల తరగతులకు ఇంగ్లీషు, తెలుఁగు తర్జుమా, శారీరశాస్త్రము, ప్రాచీనదేశ చరిత్రమును, ప్రవేశతరగతిలో నింగ్లీషును, ఆయన చెప్పుచుండువారు. సంచితకర్మ సంచయమువలె నివియన్నియు నా మెడ కిపుడు చుట్టుకొనియెను. చరిత్రశాస్త్రమున పట్టపరీక్ష నిచ్చిన బోధకులు హిందువులలోను, క్రైస్తవులలోను పలువురున్నను, చరిత్ర మెఱుఁగని నేనే, కళాశాలతరగతుల కది బోధింపవలయును. దీనికిఁ గారణము నాపూర్వికుఁ డట్లు చేసెను. కళాశాలాధ్యక్షు లగు డాక్టరు ఊలుదొరగారు సత్య సంధుఁడును, ఋషిసత్తముని బోలిన జితేంద్రియుఁడును, ఐనను, ఆయన న్యాయ మనుకొనిన పథమునుండి మనుష్యమాత్రు లెవరు నాయనను గదలుపలేరు.

ఇచటికి వచ్చునప్పటికి నాకు మరల ప్రార్థనసమాజాధ్వర్యము సిద్ధ మయ్యెను. నేను బూర్వము బెజవాడలో నుండునపుడు, కృష్ణా, మండల సభా సందర్భమున, వెంకటరత్నమునాయఁడుగారు, నేను మిత్రులును సంస్కృతపాఠశాలలో సమావేశమై నెలకొల్పిన సమాజమె యిపుడు దినదినాభివృద్ధి గాంచుచుండెను. శ్రీయుతులు చల్లా శేషగిరిరావు, చట్టి దుర్గయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణగార్లు దీని నిపుడు నడుపుచుండిరి. ఇపుడు నే నీబృందమునఁజేరి పనులు సాగించితిని.

8. జననీ సంస్మరణము

నేను గుంటూరు వచ్చిన కొలఁది దినములకే, మాతల్లికి వ్యాధి హెచ్చెనని తెలిసెను. ఆమెనిచటికిఁ దీసికొని వచ్చుట కేమియు వలను పడకుండెను. ఆమెవ్యాధి ప్రకోపించెనని నాకొకనాఁడు తంతిరాఁగా, సకుటుంబముగ నేను నరసాపురము పోయితిని. నంజు ముదిరినను, మాయమ్మ స్పృహతో నుండెను. ఇంతదూరమున నుండు నేను, అవసానసమయమునఁ దన్ను వీక్షింప వేగముగ వచ్చినందు కామె యమితసంతోష మందెను. అంతకంత కా మెవ్యాధి ప్రబలి, 1908 మార్చి 15 వ తేది రాత్రికి ధాతువు క్షీణించెను. చివరిని మేషమువఱకును స్పృహగలిగి, సంతానమందఱును తన్నుఁ బరివేష్టించియుండఁగా, వారినిఁ జూచి సంతోషించుచు, భగవన్నామ సంకీర్తనముఁ జేసికొనుచు, తెల్లవాఱునప్పటికి మాయమ్మ పరలోక ప్రాప్తిఁ జెందెను.