ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/క్రొత్తప్రదేశము

వికీసోర్స్ నుండి

సరిగా లిఖింప మానివేసితిని. తీఱికసమయముల దొకింత వ్రాయుచు పిమ్మట కొంతకాలమునకు దినచర్య పుస్తకముల నుంచుటయే విరమించివేసితిని. కళాశాలను వేసవిసెలవులకు 2 వ మేయి తేదీని మూసిరి. పుస్తకములు, విలువగల సామానులు నొక మిత్రునింట వేసి మేము కాకినాడ బయలుదేఱితిమి.

2. క్రొత్తప్రదేశము

1902 వ సంవత్సరము వేసంగిలోఁ గొన్నిదినములు మాబావమఱఁది వెంకటరత్నముగారియింట నేను గడపితిని. ఇపుడాతఁడు కాకినాడలో కలెక్టరు కచేరిలో గుమాస్తాగా నుండెను. మాయప్పు త్వరలోఁ దీర్చి వేయుట యుక్తమని నా కాతఁడు బోధించెను.

మేయి నెలలో చివరభాగమున నేను రాజమంద్రి వెళ్లితిని. మా రాజమంద్రి నివేశస్థలములు అమ్మివేసి ఋణములు తీర్చుట మంచిదని నేను సోదరులకుఁజెప్పితిని. ఈవిషయమున పెద్దతమ్మునికి నాకు నభిప్రాయభేదమేర్పడెను.

ఈ సెలవులలో నేను జదివిన పుస్తకములలో ఫ్రెంచిరచయిత వ్రాసిన "స్త్రీరాజ్ఞి" అను పుస్తక మెన్నఁదగినది. నానాదేశపు స్త్రీల లక్షణము లాతఁడు వర్ణించి, తాను బరిణయము కాంక్షించినచో, సుదతులందఱి సౌందర్యమును దాల్చిన స్త్రీ పుడమినుండుట యసంభవము గాన, తాను బహభార్యత్వమున కొడంబడెద నని నుడివెను. దీనిలోనుండి గైకొనిన "గాబ్రియలు సోదరి" వృత్తాంతమును జనానాపత్రికలోఁ బ్రచురించితిని. నేను పర్లాకిమిడి వచ్చినప్పటినుండియు, 'జనానాపత్రిక' కు నేనును, మాతమ్ముఁడు వెంకటరామయ్యయును సంపాదకులముగ నుంటిమి. అదివఱలో 'సత్యసంవర్థని'కి పత్రికాధిపతిగ నుండిన హేతువున, ఆతఁడు మంచివ్యాసములు వ్రాయుచు, ఈపత్రికను రాజమంద్రిలో నడపుచువచ్చెను. ఆ సంవత్సరము మేయినెల సంచిక మొదట ప్రచురించిన "జానకమ్మ" కథ ఆతఁడు వ్రాసినదియే. 20 వ జూను తేదీని నేను, భార్యయును పర్లాకిమిడికి బయలుదేఱితిమి. మార్గమధ్యమున సింహాచలమున మఱునాఁడు ప్రొద్దున దిగి, ఆలయము చూచి, పిమ్మట పర్లాకిమిడి వెడలిపోయితిమి. ఈమాఱు రాజవీధిలో కళాశాలకు సమీపముననుండు మేడ భాగమున మేము ప్రవేశించితిమి. ఈక్రొత్తయిల్లు మాకన్నిరీతుల ననుకూలముగ నుండెను. కళాశాలకుఁ జేరువ నీ విశాలమగు గృహమున నివసించుటచేత మా కెంతో హాయిగనుండెను.

ఎట్లో శ్రమపడి పొదుపుగ గడుపుకొని, శీఘ్రమే ఋణ విముక్తుల మగుటకు దంపతులము గట్టిపట్టుపట్టితిమి. పర్లాకిమిడిలో ధాన్యము, కాయగూరలు, కట్టెపుల్లలు మున్నగునవి మిగుల చౌక. కావున వెనుకటి కంటె నిపుడు నాచేత సొమ్ము మిగులుచుండెను.

నే నిపుడును, 'జనానాపత్రిక' తోఁబాటు నితరపత్రికలకును వ్యాసములు వ్రాయుచువచ్చితిని. ఈ ఫిబ్రవరిలో చనిపోయిన మన్నవ బుచ్చయ్యపంతులుగారిని గుఱించి మార్చి జనానా పత్రికలోఁ గొంత ప్రస్తావించి, "సంఘసంస్కారిణీ" పత్రికకొక యాంగ్లవ్యాసము వ్రాసితిని. అది గాటుగనుండెను. దానినిగుఱించియు, చనిపోయిన మాతమ్మునిగూర్చియు ప్రస్తావించుచు మిత్రుఁడు వెంకటరత్నము నాయఁడుగారు నా కాదినములలో వ్రాసినయుత్తర మిందు ప్రచురించుచున్నాఁడను : -

మహబూబు విద్యాలయము

సికిందరాబాదు

22 - 4 - 1902

"భాతృవరా !

  • * * పరలోకప్రాప్తిఁజెందిన సోదరుని యకాలమరణము, జీవించియున్న మనబోంట్లకు హృదయనిర్భేదకము. కొఱగాని బ్రతుకు ప్రమిద యడుగువఱకును గాలువత్తివలె చిరకాల ముండును. పవిత్రాత్ములు మాత్రము ముందు వెడలిపోయెదరు. ఇట్లు తలంచుకొన్ననే మనము కొంత యుపశమనము గాంతుము. లేకున్న, లోకమంతయు నయోమయమును, హృదయము తాప పరిపీడితమును నగును. ఒకకంట నీరు విడుచుచునే, మనము విశ్వాసమునఁ బాటుపడుచు, దైవముమీఁద భారమువేసి, ధైర్యమున పనులు నెరవేర్చు కొనవలయును.

"మీకు లభించిన పరీక్షాధికారి పదవి తొలఁగిపోయె నని వింటిని. మీ కారోగ్యము సరిగా నున్నచో, దీనికై నాకంతగ విచారము లేదు. మీజీవితధర్మము బాలురకు ప్రబోధము కలిగించుటయే కాని, పరీక్షించుట కాదని మీరు ఊరడిల్లవలయును. మీకు వలసిన శక్తి సౌభాగ్యములు పరమేశ్వరుఁ డొసంగుఁగాక !

"బుచ్చయ్యపంతులుగారిని గుఱించి మీరు "సంఘసంస్కారిణీ" పత్రికకు వ్రాసిన వ్యాసము మద్రాసు బ్రాహ్మసామాజకులలోఁగొందఱికిఁ గడుపుమంట కలిగించెను. కాని మీవ్రాఁత సత్యమునకు దూరముగా దని నావిశ్వాసము. "ప్రేమాస్పదులగు వీరేశలింగము పంతులుగారి చరిత్రము మీరు శీఘ్రముగఁ బ్రచురించెద రని విని సంతసించితిని. * * ఈవిషయమున మీకుఁ గావలసిన సాయము సంతోషపూర్వకముగఁ జేయుదును. * * *

ర. వెంకటరత్నము."

నేను మద్రాసు స్టాండర్డుపత్రికకు పలుమాఱు వ్రాయుచుంటిని. స్థానికవార్తలు వ్రాయ నాయభ్యాసముకాదు. "గంజాము, విశాఘపట్టణమండలముల వింతలు" అను శీర్షికతో నప్పుడప్పుడు నేను వ్రాయు సంగతులు మిత్రులు శ్రీ గిడుగురామమూర్తిపంతులుగారు వినోదమునఁ జదివి నన్నభినందించు చుండువారు. గంజాము మండలము వారికి మనుష్యులయందు కంటె దున్న పోతులను బెంచుటయం దెక్కువ శ్రద్ధయనియు, చిన్న వెండిబేడకాసు లాప్రాంతమునఁ జెల్లవనియు, కాళ్లు పట్టించుకొనుట వారి కభ్యాసమనియు, ఓడ్రులు రాత్రులం దొడలికి నూనిరాచి పసుపుఁబూసికొని వేకువనే చెఱువులో స్నానము చేయుదురనియు పత్రికకు వ్రాయుచుండు వాఁడను.

ఇచటి హీనజాతులలోనివారు కొందఱు పాటుపడుటమాని, వీథులలోని యెంగిలాకులు నాకుచు కాలక్షేపముఁజేయుట నాకు విషాదము గలిగించెను. 20 వ జూలయి ఆదివారము ప్రార్థన సమాజ సమావేశమున నేను "సోమరితనము"ను గుఱించి ధర్మప్రసంగము చేయుచు, ఇట్టి సోమరుల నీచకృత్యములను గర్హించితిని. ఓడ్రసమాజములలోఁగూడ మాటాడుటకు నా కాహ్వానము వచ్చెడిది. సాంఘిక సమస్యలనుగూర్చి సంభాషించుట నా కెంతో ముచ్చట. ఆపట్టణమందలి బహిరంగ సభలు సామాన్యముగ మాకళాశాలా భవనముననే జరుగుచుండెడివి. ప్రసంగింపు మనియో, అధ్యక్షతవహింపు మనియో

1902. ఎడమనుండి కుడివైపునకు: 1. పంక్తి. రాయసం వెంకటశివుడు, వెంకటరామయ్య, కృష్ణమూర్తి,

కాళకూరినారాయణమూర్తి, 2. పంక్తి. కామేశ్వరమ్మ, రత్నమ్మ, రత్నమ్మ నరసింహులు,

మహలక్ష్మి, కనకమ్మ నరసమ్మయును. 3 పంక్తి. సీతమ్మ, ఆమెతల్లి కామమ్మ.

పలుమాఱునాకుఁ బిలుపు వచ్చుచుండెడిది. కావున నిచటికి వచ్చినది మొదలు వ్రాయుటయందేకాక మాటాడుటకును నాకుఁ బ్రోత్సాహము కలుగుచుండెను. ఓడ్రదేశము వచ్చినను వారిభాషనేర్చుకొన నాకభిలాష యేమియులేదు. ఇచటి జనులకందఱికిని తెలుఁగు బాగుగ వచ్చుటయే దీనికొక కారణము. ఎన్ని దేశములు గ్రుమ్మరినను, ఆంధ్రవ్యక్తి సామాన్యముగ కుమ్మరపురుగువలె నన్యభాషాపంకిల మేమియు నంటించుకొనకయే తిరుగుచుండును.

ఈపురమందలి బాలికా పాఠశాలలను బరీక్షించుట కిచటికి విచ్చేసిన గౌకన్యతో నేను బరిచయము కలుగఁజేసికొంటిని. ఆమె మంచి విద్యావతి. నాయందును, 'జనానాపత్రిక' యందును ఆమెకు సుగృద్భావ మేర్పడెను.

సెప్టెంబరునెలలో నే నొకసారి గోదావరిజిల్లా వెళ్లితిని. గోటేటి రామభద్రరాజుగారికి మేము మరల పత్రము వ్రాసి యిచ్చితిమి. కుటుంబమును స్థానము తప్పించినఁగాని మాస్థితిగతులు చక్కఁబడవని మేము నమ్మితిమి. కావున త్వరలో రాజమంద్రి నివేశన మమ్మివేసి, క్రొత్తగ మునసబుకోర్టు పెట్టిన భీమవరమునకు మాతమ్ముఁడు వెంకటరామయ్య వెళ్లునట్లును, తనచదువు తేలువఱకును కృష్ణయ్య యొక్కఁడే రాజమంద్రిలో నివసించునట్లును, మేమేర్పఱుచుకొంటిమి. మాతల్లి నాతో 6 వ సెప్టెంబరున పర్లాకిమిడి చూచి పోవుటకు బయలుదేఱెను.

మఱునాఁడు మేము పర్లాకిమిడి చేరితిమి. తెక్కలి వాస్తవ్యులగు కల్యాపాండాగారను వైద్యశిఖామణి మాముగ్గురకు మందిచ్చుటకు సమ్మతించిరి. నాకు జీతము సంవత్సరమున కైదురూపాయిల వృద్ధిమీఁద 120 రూపాయిలవఱకు నేర్పాటయ్యెనని విని సంతోషించితిమి. ఎన్ని సంవత్సరములకైన నూఱురూపాయిలుకాని బెజవాడ పాఠశాలలోని పనికంటె నిచటి యుద్యోగమే మేలని మే మానంద మందితిమి.

3. పరిస్థితులలోని మార్పు

20 వ సెప్టెంబరున మాతమ్మునియొద్దనుండి వచ్చిన యుత్తరములో, అత్తవారియింట మా చిన్న చెల్లెలు కామేశ్వరమ్మ జబ్బుపడెనని యుండెను. మఱునాఁటిజాబు రోగి మఱపు చెఱపు మాటలాడు చుండెనని తెలిపెను. 24 వ తేదీని వచ్చిన లేఖనుబట్టి, చెల్లెలింకను వ్యాథిపీడితయని తెలిసెను. తాను వెడలిపోయెదనని మాతల్లి యంతట పట్టుపట్టెను. ఒకవిద్యార్థి నామెకుఁదోడిచ్చి, మఱునాఁటి రెయిలుమీఁద మాతల్లిని అట్లపాడు పంపివేసితిని. తొందరపనులచే నేను వెళ్ల లేక పోయినను, నామనస్సు మాచెల్లెలిలిమీఁదనే యుండెను. కొలఁది నెలలక్రిందటనే మేము మ ముద్దులతమ్మునిఁ గోలుపోయితిమిగదా ! ఇంతలో నింకొక యుపద్రవము మమ్ము తఱుముకొనివచ్చుటకు నేను భీతిల్లితిని.

కొద్దిరోజులలోనే మాచెల్లెలికి వ్యాధి ప్రబలెనని తెలియుటచేత నేను గోదావరిజిల్లాకు బయలుదేరిపోయితిని. నేను వెళ్లి చూచునప్పటికి రోగి చాల బలహీనస్థితిలో నుండెను. మాతల్లి, తమ్ములు, కొందఱు బంధువులును, అట్లపాడు వచ్చియుండిరి. ఒక మంగలి వైద్యము చేయుచుండెను. ఎన్ని దినములకును జ్వరము తగ్గదయ్యెను. లంకణములు కట్టుటవలన రోగి మిగుల బలహీనయయ్యెను. మేమంత నొక యాలోచన చేసితిమి. మా తమ్ములకుఁ బరిచయముగల పట్నాయకు