ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/"జనానాపత్రిక"(2)

వికీసోర్స్ నుండి

ఇట్టి ప్రదేశమును ప్రచారమును విడనాడుట నాకు మిగుల కష్టముగ నుండెను. తెలుఁగువారితో పోటీపడి యోడ్రవిద్యార్థులు నాకు గౌరవపూర్వకమగు వీడ్కో లొసంగిరి. విద్యార్థులు మూఁడు నాలుగు విజ్ఞాపనపత్రములును, ఒక బంగారు పతకమును సమర్పించిరి. నన్ను గుఱించి వారు నాలుగుభాషలలోను సిద్ధపఱచి చదివిన పద్యములకు నాకన్నులు చెమ్మగిల్లెను. అత్తయింటికిఁ బోవు క్రొత్తకోడలివలె కన్నీటిధారతో పర్లాకిమిడి మిత్రమండలిని వీడి, నేను విజయనగరము వెడలి పోయితిని.

పర్లాకిమిడి మిత్రులు నాబోధనాకౌశలమును, శీలప్రవర్తనములను మెచ్చుకొని, నా కాసమయమునఁ జేసిన గొప్ప సత్కార మెన్నటికిని మఱచిపోఁజాలను. వీడ్కోలు సమయమున నామిత్రులును కళాశాలా పండితులు నగు శ్రీ బంకుపల్లి మల్లయ్యశాస్త్రులుగారు చదివిన పత్రములోని యీక్రింది పద్యము, నా శీలవర్ణన విషయమున నతిశయోక్తియయ్యును, నాయాదర్శములను బట్టి స్వభావోక్తియు, రుచిరాలంకారభూయిష్ఠమునై నా లేఁత హృదయమున కమితా మోదము గలిగించెను -

                      "చ. కటువగు మాట లెప్పుడు ముఖంబున వెల్వడవెంచిచూడఁ ద
                            క్కటి వ్యసనమ్ములందగులు గానము విద్యలయందె గాక, వేం
                            కటశివుఁ జూచి నేర్చుకొనగాఁ దగు కాలము వమ్ము సేయకుం
                            డుట, దయకోపముం దన కనుంగవనే తగ నిల్పెడున్ దఱిన్ !"

5. "జనానాపత్రిక"(2)

నాకు విజయనగరమందలి యుద్యోగమగుట నామిత్రులకు, సోదరులకును నాశ్చర్య ప్రమోదములు గలిగించెను. దీనిని గుఱించి నాప్రయత్నముల సంగతి వారికేమియుఁ దెలియకుండఁగనె, ఈ యుద్యోగమై నేను విజయనగరము వెళ్లుచున్నానని వారు వినిరి. 14 - 8 - 1904 తేదీని మాతమ్ముఁడు కృష్ణమూర్తి నాకు వ్రాసిన లేఖలో, "నీకు విజయనగరమున నుద్యోగమయినదని వినుటకు నేనమితానంద మందితిని. ఇంతత్వరలో నీకిట్టి భాగ్యము గలుగునని యెవరము ననుకొనలేదు. ఇపుడు నీకు దొరతనమువారి కొలువు సులభముగ లభించును. క్షేమముగ నీ వీపాటికి విజయనగరము ప్రవేశమైతివని యెంచెదను. * * *" అని యుండెను. ఆనెల 10 వ తేదీని వెంకటరామయ్య యిట్లువ్రాసెను : - "నీ 8 వ తేది యుత్తరము మమ్మందఱి నాశ్చర్యమగ్నులఁ జేసినది. మహారాజావారి కళాశాలలో నీ కీ యుద్యోగము లభించినందుకు మేమందఱము సంతస మందుచున్నాము. ఈమార్పు రెండువిధముల మంచిది. నీవు నూఱుమైళ్లుదగ్గఱ పడితివి. నీ కున్నతపదవి లభ్యమయ్యెను. లాభముతోపాటు నీ బాధ్యతయు పెరుఁగుచున్నది. బి. యె. తరగతులకు తర్కము, యఫ్. యేకు ఆంగ్లమును జెప్పుట సులభముకాదు. * *" నాప్రియ గురువులగు స్కాటుదొరగారు, "నీకు విజయనగరమున నుద్యోగమైనందుకు నాకెంతో సంతోషము. ఉన్నత పాఠశాలలోను, రెండవతరగతి కళాశాలలోను గల నానారీతులగు పనికంటె మొదటి తరగతి కళాశాలలో పనియె సంతోషకరము. నీపనిలో చాలభాగము బి. యే తరగతులతోనే యున్న దనుకొందును. నీయుపన్యాసములు సిద్ధము చేసికొనుట మొదట కొంచెము ప్రయాసకర మైనను, దారిని పడినపిమ్మట నీ కంతయు సులువగను. విజయనగరము కళాశాల స్థిరసంస్థయె. నీపని తృప్తికరమైనచో, కాలక్రమమున నీవా కళాశాలాధ్యక్షకపదవి నందఁగలవు, కావున నీకు దొరతనమువారికొలువు సమకూరకున్నను, నీభవిష్యత్తున కేమియు వ్యాఘాతము రానేరదు. * * *" అని వ్రాసిరి.

"జనానాపత్రిక" ప్రచురణవిషయమై కూడ నాకు వెనుకటికంటె నెక్కువ సదుపాయము గలిగెను. నేను విజయనగరము వచ్చిన మఱుసటి నెలనుండియె వీరేశలింగముగారు జనానాపత్రికాధిపతులలో నొకరైరి. ఆయన యిటీవలనే ప్రభుత్వమువారి కొలువునుండి విశ్రాంతి గైకొనిరి. నాతోఁగలసి స్త్రీవిద్యాభివృద్ధికొఱకై యేర్పడిన జనానాపత్రికకు సంపాదకునిగ నుందునని యాయన చెప్పినందున, నేనెంతో సంతోషమున దానికి సమ్మతించితిని. కావున 1904 సంవత్సరము సెప్టెంబరునుండియు 'జనానాపత్రిక' కిరువురమును సంపాదకులముగనుంటిమి. ఆయన యాలోచన ననుసరించి, పత్రిక చందా రెండు రూపాయిలనుండి రూపాయికి తగ్గించితిని. ఇపు డాయన "భౌతిక భూగోళశాస్త్ర సంగ్రహము", "విదేశనారీమణుల చరిత్రము" లను 'జనానాపత్రిక' లోఁ బ్రచురింప మొదలిడిరి. పత్రికయెంతో శోభా యుక్తమయ్యెను. కాని, వీరేశలింగముగారి కలము ప్రహసనముల మీఁదికిఁ బరుగులెత్తుచుండెడిది ! మా యిరువురి సంపాదకత్వమునను పత్రిక వెలువడ నారంభమైన రెండవనెలలోనే, "సావిత్రీ సత్యవతీ సంభాషణము" అను స్త్రీవిద్యను గుఱించిన ప్రహసన మొకటి వారు వ్రాసిరి. దానిలో స్త్రీవిద్యావ్యాపనమును గుఱించి యిటీవల బయలు వెడలిన "సావిత్రీ" "హిందూసుందరుల" లోని వ్రాఁతలను గుఱించి యాక్షేపణము లుండెను. స్త్రీలపేరు పెట్టుకొని పురుషులు పత్రికలలో వ్రాయుట యసమంజస మనియే వాని భావము. ఈవిషయమై రెండుమూఁడు సారులు నేనును నాపత్రికలో మొఱపెట్టితిని. కాని, యీమాఱు ప్రహసనరూపమున బయలుదేఱిన పంతులుగారి తీవ్ర ఖండనమునకుఁ గోపించి, యాపత్రికలలోని రచయితలు ప్రత్యుత్తరము లీయఁజొచ్చిరి. తోడి పత్రికలతో వివాదలు పెట్టుకొనుట నాపద్ధతి కాదు. సామమార్గముననే నాకార్యములు చక్క పెట్టుకొనుచువచ్చితిని. కాని, కోపస్వభావులగు పంతులుగారు నాతోఁగూడి వచ్చుటయే దుర్ఘటమైన యీ పత్రికాసమష్టిసంపాదకత్వప్రథమదశలోనే వారి కడ్డంకులు కలిగింప నేను వెఱచి, ఉదంతములెట్లు పరిణమించునోయని తటస్థముగఁ జూచుచుంటిని.

మేము 1905 వ సం. వేసవి సెలవులు గడుపుటకు చల్లని సముద్రతీరపట్టణమగు భీమునిపట్టణము వెళ్లితిమి. అక్కడకు నాతమ్ముఁడు కృష్ణమూర్తి మాతల్లిని, వెంకటరామయ్యభార్యను, చెల్లెలు కనకమ్మను, తనభార్యను గొనివచ్చెను. మాకుటుంబములో నిపుడు పిల్లలు బయలుదేఱుచుండిరి. వెంకటరామయ్యకుమా ళ్లిఱువురును, కనకమ్మపుత్రిక లిద్దఱును, కృష్ణమూర్తికొమార్తెయు నిపుడు మాతో నుండిరి. భీమునిపట్టణము మిగుల రమ్యమగు చిన్నపురము. రెండు ప్రక్కలను పట్టణమునంటి సముద్రము కలదు. సాయంకాలమునందు మే మందఱమును గలసి సముద్రతీరమున షికారుపోవుచుండువారము. మావలెనే యాచల్లనిప్రదేశమున దినములు గడుపుట కచటి కేతెంచిన విజయనగరము కళాశాలాధ్యక్షులగు రామానుజాచార్యులుగారు తమ రెండవకొమార్తెతో నడచివచ్చుచు నిత్యమును మా కెదురుపడుచుండువారు. కొందఱి మిత్రులప్రోత్సాహమున భీమునిపట్టణములో జరిగిన బహిరంగసభలో స్త్రీవిద్యావ్యాపనమును గుఱించి నేనొక యుపన్యాసము చేసితిని. రామానుజాచార్యులుగారు అధ్యక్షులుగనుండి నాయభిప్రాయములను సమర్థించిరి. ఆ సంవత్సరము డిసెంబరులో నేను రాజమంద్రి పోయి, అచట నిపుడు నివాస మేర్పఱుచుకొనిన వీరేశలింగము పంతులుగారిని సందర్శించి, వా రక్కడ నూతనముగ స్థాపించి జరుపుచుండు 'స్త్రీవిద్యాలయము'ను 'జనానాతరగతుల'ను జూచి సంతోషించి, వీనినిగుఱించి "జనానాపత్రికలో వ్రాసితిని. ఆనెల 15 వ తేదీని, విదుషీమణియు, అబలాసచ్చరిత్రరత్న మాలా" గ్రంథకర్త్రియు, కొమఱ్ఱాజు లక్ష్మణరావుగారి యక్కగారునునగు శ్రీమతి భండారు అచ్చమాంబగారు లోకాంతరగతులైరి. ఆనెల జనానాపత్రికలో నామెనుగుఱించి యించుక ప్రస్తావించి, మఱుసటినెలలో సచిత్రవ్యాసమొకటి పంతులుగారు వ్రాసిరి.

వీరేశలింగముపంతులుగారి రచనా సామర్థ్యము లోకవిదితము. ఇట్టిప్రతిభావంతు లయ్యును, ఒక్కొక్కపుడు వారు చిన్న చిన్న సంగతులయందే పరులతో వాదమునకుఁ గాలు ద్రవ్వుచుండువారు. 1905 సం. ఏప్రిలు - మేయి "జనానాపత్రిక" సంచికలో, "జనానాపత్రిక - సావిత్రి" అనుశీర్షికతో మరల వెనుకటి విషయమును ప్రస్తావించి, వారిట్లు వ్రాసిరి : - "గత సంవత్సరము అక్టోబరు జనానాపత్రికలో ప్రకటింపఁబడిన 'సావిత్రీ సత్యవతీ సంభాషణము' పైని నవంబరు డిసెంబరు నెలల సావిత్రీ పత్రికలోఁ గొన్ని యపాత్రపు వ్రాఁతలు వ్రాయఁబడినవి. అవివేకుల దూషణములకు బదులు వ్రాయుట యుచితము కాదని భావించి, మే మావ్రాఁతల నుపేక్షించి యూరకుంటిమి. దురభిమానులైన మాప్రతిపక్షు లది మాయసమర్థతగా భావించి, యీనెల 'యార్యమతబోధిని' లో, 'మన్యము వెంకట సుబ్బమ్మగారిచ్చిన పత్రికకును, వేసిన పందెమునకును మాఱుపలుకఁ జాలక పంతులవారును తదనుచరులును, గతించినదానికి చింతిల్లుచు మాఱకుండి'రని జయఘోషమిడుచున్నారు. ఆజయమును వీరే కైకొననిండు. * * * "ఈవిధముగ పంతులుగారు మరల కత్తిదూసి, ప్రతిపక్షులతోడి యుద్ధమునకు సన్నద్ధులైరి. శాంతముగఁ బనులు చక్కపెట్టుకొనుచు, పత్రికాపుత్రిక నెటులో పండ్రెండేండ్లవఱకును బెంచిన నేను, పంతులవారి శౌర్యోద్ధతివలన పత్రిక కేమిహాని వాటిల్లునో యని లోన భీతిల్లుచుంటిని.

ఈకారణమునఁ గాకపోయినను, వేఱొక కారణముచే 'జనానాపత్రికా' ప్రచురణమున కిపుడు వ్యాఘాతము సంభవించెను. శరీరాస్వస్థతవలనను, విద్యాలయాదిసంస్థలలో నిమగ్ను లై యుండుటచేతను పంతులుగారు 'జనానాపత్రిక' ను 1905 సంవత్సరము జూలయి నుండియు తమ 'చింతామణీముద్రాలయము'నఁ బ్రచురింప నుపేక్షించిరి ఆఱునెలలవఱకును పత్రిక జరుగనేలేదు. 13 వ సంపుటము 1, 2 సంచికలను 1906 వ జనవరి - ఫిబ్రవరినెలలో, వెనుకటి మద్రాసు అల్బీనియనుముద్రాలయమున నేనంత ముద్రింపించితిని. అప్పటినుండి నేనే 'జనానాపత్రిక'ను నడిపితిని.

పత్రికాప్రకటనమునం దింకొకరి సాయము నే నేమాత్ర నుపేక్షించినను, పత్రికకు ముప్పు వాటిల్లుచునేయుండెను. ఇపుడు పంతులువారియొద్దనుండి 'చింతామణి' ముద్రాలయమును గొని, రాజమంద్రిని దానిని జరుపుచుండెడి సత్యవోలు గున్నేశ్వరరావు గారితో 'జనానాపత్రిక' విషయమై నాకుఁ గలిగెడి యిక్కట్టులను గుఱించి 1906 అక్టోబరులో నేను బ్రస్తావింపఁగా, తాము సంతోషపూర్వకముగ నే తత్పత్రికకు యజమానులై, స్త్రీవిద్యాభివృద్ధికొఱ కేర్పడిన యీపత్రిక కాంధ్రదేశమున నత్యధికప్రచారము గలిగింతుమని చెప్పి, అ నవంబరునుండియు 'జనానాపత్రిక' ను తమరే రాజమంద్రిలోఁ బ్రచురింప మొదలిడిరి. నేనుమాత్రము ఆపత్రికకు యథా ప్రకారముగ సంపాదకునిగనుండి, వ్యాసముల నంపుచువచ్చితిని. కాని, నాకుఁ జెప్పకయే, తమ కుండెడి కొన్ని చిక్కులవలన, వారు 1907 జూలయినుండియు ఆపత్రిక ముద్రణమును విడిచిపెట్టిరి. కళాశాలలో పనియెక్కువయై, చికమకలు పడుచుండు నేను వెనువెంటనే పత్రికను వేఱొక ముద్రాలయమున కంపనుపేక్షించితిని. అంత, కొలఁదిమాసములకు నేను విజయనగరమునుండి సంసారము తరలించుట వలన, 'జనానాపత్రికా' ప్రచురణ మంతటితో నిలిచిపోయెను. ఇట్లు 12 సంవత్సరములు నాపోషణమునఁ బెరిఁగిన యాపత్రిక, పదునాలుగవయేట నకాలమరణమునకు లోనయ్యెను.

6. విజయనగరనివాసము

మొత్తముమీఁద విజయనగరము కళాశాలలోని పని నాకెంతో హర్ష దాయకముగ నుండెను. ఇపుడు నేను బోధించవలసినవి కళాశాల శాఖలోని తరగతులు మాత్రమే. దినమునకు రెండుమూఁడు గంటలు మాత్రమే నేను బనిచేయవలసివచ్చెను. నాపనితీఱిన పిమ్మట నే నింటికిఁ బోయి హాయిగ విశ్రమింపవచ్చును. కాని, తీఱిక సమయమును నేను వ్యర్థపుచ్చువాఁడనుకాను. బోధింపవలసిన సంగతులు గ్రహించుటకై సదా నేను ఉద్గ్రంథపఠనము చేయువాఁడను. పట్టపరీక్ష తరగతికి బోధించుట కై తర్కశాస్త్రగ్రంథములు సమగ్రముగఁ జదువ నారంభించితిని. ఆంగ్ల సాహిత్య బోధనమున కవసరమగు గ్రంథములును నేను బఠియించితిని. నూతనగ్రంథపఠనము నాకు నిత్యకర్మానుష్ఠానమే గాక, విశేష వ్యసనముకూడ నయ్యెను ! ఆకళాశాల కంటియుండు పుస్తక భాండాగారము మిగుల గొప్పది. నాబో