ఆత్మచరిత్రము/చతుర్థభాగము : విశ్రాంతిదశ/అకాలమరణము

వికీసోర్స్ నుండి

3. అకాలమరణము

మా తమ్ముఁడు వెంకటరామయ్య కుమాళ్లు ముగ్గురిలోను సూర్యనారాయణ కనిష్ఠుఁడు, మేధావంతుఁడును. అతనికి గొన్ని సంవత్సరములనుండి యేమికారణముచేతనో కాని దేహము పాలిపోవుచువచ్చెను. ఇపుడు 1930 వ అక్టోబరులో చెన్నపురిలో బి. యల్. పరీక్షనిచ్చి, అన్నతోఁ దాను గుంటూరు రాక, సరాసరిగ భీమవరమె వెడలిపోయెను. అతనికి లోకాక తగిలి దేహస్వాస్థ్యము తప్పుచుండెనని మా తమ్ముఁడు వ్రాయుటచేత, నే నా డిసెంబరు తుదిని భీమవరము వెళ్లితిని. వెళ్లిన మఱునాఁడె నేను కుముదవల్లిలో వీరేశలింగవర్థంతి సమయమున నధ్యక్షత వహించితిని. వీరేశలింగము గారివలె మనమును కార్యశూరులమై, దేశోద్ధరణమునకుఁ గండంగవలె నని నేను వక్కాణించితిని.

భీమవరము వైద్యాలయమున సూర్యనారాయణ యపుడు 'కొంకిపురుగు' జబ్బునకు మందు పుచ్చుకొనుచుండెను. ఇంతలో వానికి నంజుగుణముకూడఁ గనఁబడుటచేత, మే మింగ్లీషు చికిత్స మానిపించి, ఆయుర్వేదవైద్యము చేయించితిమి. నరసాపురపు వైద్యులగు రౌతుల గోపాలముగారు భీమవరము వచ్చి చూచి, రోగిని నరసాపురము కొనిరమ్మనిరి. మే మంత జనవరి తుదిని సూర్యనారాయణుని దీసికొని, నరసాపురమున మా తమ్ముఁడు కృష్ణమూర్తి యింటఁ బ్రవేశించితిమి. నా భార్య, సూర్యనారాయణుని యత్తగారును కూడ నరసాపురము వచ్చిరి. చూచుచుండఁగనే యా యువకుని రోగ మతిశయించెను. ఏమంధు కాని వానికి లాభకారి కాలేదు. అంత 7 వ ఫిబ్రవరి రాత్రికి స్పృహతప్పి, మఱునాఁడు సాయంకాలము నాలుగుగంటల కాతఁడు జీవములు కోలుపోయెను !

మరల మాకుటుంబమునకు తీఱని దు:ఖము వాటిల్లెను. పూర్వ కాలమున రాజమంద్రిలో చావుమీఁద చావువచ్చి, మాసోదరులలో కనిష్ఠుఁడును కుశాగ్రబుద్ధియునగు సూర్యనారాయణ యస్తమించెను. ఇపుడు ముప్పదిసంవత్సరములకుఁబిమ్మట మరల మా కుటుంబమున నకాలఘోరమరణ మొకటి సంభవించెను. చనిపోయిన కడగొట్టు తమ్మునిమీఁది ప్రేమమున, వానిని, గొన్ని యంశములందుఁ బోలిన తన మూఁడవ కుమారునికిని మాతమ్ముఁడు సూర్యనారాయణయనియె పేరిడెను.

బి. యల్. పరీక్షలో నిపుడె సూర్యనారాయణ జయమందెను. వీనిని బెంపుచేసికొమ్మని మాతమ్ముఁ డెన్ని సారులో సూచించినను, దురదృష్టవంతులమగు మాయింటఁబడినచొ వీని కెట్టి యనర్థము వాటిల్లునోయనుభయమున మేము ఉపేక్షించితిమి. నా భార్య పట్టుపట్టి, తనయన్న రెండవకూఁతురు మాలతి నిటీవల వీనికిఁ బెండ్లిచేయించెను. వీరివలన ముందెల్లరకు విశేషసౌఖ్యము చేకూరఁ గలదనియు, వారియభివృద్ధిఁగాంచి సంతోషింపవచ్చుననియును, మేము ఉవ్విళ్లూరుచుండువారము. కాని, పర్యవసాన మిటులయ్యెను !

కర్మాంతరము లయినపిదప భీమవరము వచ్చితిమి. అచటినుండి నేను గుంటూరు వచ్చివేసితిని. నేనిదివఱకు సిద్ధపఱిచిన "వీరేశలింగ సంస్మృతి"ని నాగేశ్వరరావుగారి ముద్రాలయమున నచ్చువేయుటకుఁ దీఱదని వారు వ్రాసిరి కావున, నే నీపుస్తకమును గుంటూరు చంద్రికా ముద్రాలయమున నచ్చొత్తించితిని. ఈ చిన్నపుస్తకమును నిపుడె దివంగతుఁడయిన మా సూర్యనారాయణుని కంకితముచేసి, యొకింత దు:ఖోపశాంతి గాంచితిని. పుస్తకముఖపత్రమున వీరేశలింగముగారి ఛాయాపటముతోఁబాటు సూర్యనారాయణుని చిత్రమును ముద్రితమయ్యెను. అందలి కృతిపద్యము లిచటఁ బొందుపఱుచుచున్నాఁడను.

                ఆ-వె. "కాశిచేరి గంగఁ గాంచనియాత్రయు
                        మోకఁబెంచి ఫలము తాఁకనికృషి
                        అయ్యె, వ్యర్థమయ్యె నల్పాయువుంజేసి
                        నీదు విద్య సుగుణ నికరమయ్యొ !

                    క. కొనుమా యంకితమిది మన
                        యనురాగ శ్రీకొకింత యంకితముసుమీ,
                        తునుమాడి భూనిగళములఁ
                        గనుమా పరమాత్ము పద సుఖమ్ముల సూరీ !"

నాబాల్యస్నేహితులు, కవిపుంగవులునగు శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహముగా రీపుస్తకమునకుఁ దొలిపలుకు వ్రాసిరి.

ఎట్టకేల కీపుస్తకము ముద్రాలయమునుండి వెలువడుటకు నేను సంతోషించుచుండఁగా, మాచెల్లెలు కనకమ్మకు నంజు కనఁబడెనని మాతమ్ముఁడు ఏప్రిలునెలలో నాకు భీమవరమునుండి వ్రాసెను. కావున నేనామెను జూచుటకు భీమవరము వెళ్లితిని. దైవానుగ్రహమున నామెకు నానాట స్వస్థపడెను.

1931 ఏప్రిలునెలలో "పశ్చిమ గోదావరిమండల యున్నత పాఠాశాలల బోధకులసమాజ" వార్షిక సభ ఉండిలో జరిగెను. ఆసభకు నే నధ్యక్షత వహించితిని. ఆ వేసవిలో నా భీమవరముతాలూకాభూములు మూఁడింటిలో పాటిమన్ను పోయించి, వానిని బలపఱిచితిని. దీనికి చాలసొమ్ము వ్యయమైనను, ఆ భూములలో ముందు మంచిపంట పండఁగల దని నాయాశయము.

దుర్దశనొంది పుట్టినింట నుండు మాలతిని జూచివచ్చుటకై సుబ్బారాయనితో నే నీ వేసవి తుదిని వెలిచేరు పయనమైతిని. మార్గమధ్యమున నరసాపురములో మేము రెండురోజులు నిలిచి, అచట నిటీవల ప్రసవించిన మా తమ్ముఁడు కృష్ణమూర్తి మూఁడవకొమార్తె కామేశ్వరమ్మను, ఆమె చిన్ని తనయుని జూచితిమి. అచటినుండి మేము వెలిచేరు బయలువెడలితిమి. గత సంవత్సర మీరోజులలో సూర్యనారాయణయు నేనును వెలిచేరు ప్రయాణముచేసిన దినములసంగతి తలంపునకు వచ్చి, మేము శోకించితిమి. మమ్ముఁ జూచి మాలతి మిగుల విచారించెను. నాభార్య యిక్కడ కిటీవలనేవచ్చి, మాలతిని గుంటూరు కాహ్వానించెనఁట. దానిచెల్లెలు అచ్చమాంబ మాయొద్దనే యుండి యదివఱకు చదువు చుండెను. తప్పక గుంటూరు రమ్మని నేనును మాలతి నడిగితిని. మే మంత భీమవరము వెడలిపోయితిమి.

ఈ వేసవిలో భీమవరములోఁ బ్రసవమైన మాచెల్లెలి రెండవ కొమార్తె సీతమ్మయు దానిపిల్లలును, అక్క నరసమ్మయు దాని కుమారుఁడును, వేసవితుదిని తమతమ తావులకు వెడలిపోయిరి.

వేసవిచివర 24 వ జూను తేదీని నేనును భీమవరమునుండి బయలుదేఱితిని. దారిలో కైకలూరులో నేనొకరోజు నిలిచి, మఱఁదలి కుమారుఁడు కృష్ణారావును అతనిభార్యను పిల్లలను జూచితిని. మఱునాఁడు వెలిచేటి నారాయణతో బయలుదేఱి గుంటూరు చేరితిని. కాల్ధరి భూమిలో నైదుయకరములు నే నీ సంవత్సరము పాలికి కవులిచ్చుటచేత, 1931 వ సంవత్సరము చివర భాగమున రెండు మూఁడు సారులు నేను గుంటూరునుండి బయలుదేఱి యాగ్రామమునకుఁ బోవలసి వచ్చెను. కాని, ఆ భూమిలోని ఫలసాయము నా పయనపు కర్చులకె సరిపోయెను ! ఆర్థికసంబంధ మగు చిక్కులు దేశమం దంతట నలమికొనెను. ఇంటి వ్యయము కొంత తగ్గింప నేను బ్రయత్నించి, సంవత్సరముల నుండి తెప్పించుచుండెడి వార్తాపత్రికలను నే నిపుడు నిలిపివేసితిని.

ఇపుడు గుంటూరునకు వచ్చిన మాలతి "శారదానికేతనము"నఁ జేరి చదువుచు, తన దు:ఖమును గొంత మఱపునకుఁ దెచ్చుకొను చుండెను. ఆ సంవత్స రాంతమున నా భార్యయు మాలతియును "అఖిలభారత మహిళాసభలు" చూచి వచ్చుటకై చెన్నపురి పోయిరి.

1932 వ సంవత్స రారంభమున, గాంధీమహాత్ముఁడు సీమ నుండి వచ్చిన తోడనే, మరల "సత్యాగ్రహోద్యమము" దేశమున ప్రారంభ మయ్యెను. శ్రీ నాగేశ్వరరావుగారు మున్నగు నాంధ్ర ప్రముఖులు మరల కారాగృహములు కేగిరి.

"వీరేశలింగసంస్మృతి" రచియించుసందర్భమున నేను తిరుగవేసిన నాపూర్వదినచర్యపుస్తకములు, పూర్వపత్రికలు, వ్యాసోపన్యాసములును సాయముచేసికొని, నేను 1931 వ సం. సెప్టెంబరు అక్టోబబరునెలలలో నా "ఆత్మచరిత్రము" ను వ్రాయఁదొడంగితిని. అంతకంతకు నాకు దృష్టిమాంద్యము హెచ్చుచుండుటవలన, ఈరచనా కార్యము తృప్తికరముగ సాగలేదు. ఐనను, అక్టోబరునెలలో నేను భీమవరము వెళ్లునప్పటికి నాచరిత్రమునందలి ప్రథమభాగము శుద్ధప్రతి వ్రాసి, భీమవరము నరసాపురముల కదితీసికొనిపోయి, నాసోదరీసోదరులకును, ఒకరిద్దఱు మిత్రులకు నది చదువనిచ్చితిని. అంత నా నవంబరు డిసెంబరు నెలలలో మిగిలిన మూఁడుభాగములును బూర్తిపఱిచితిని. వాని శుద్ధప్రతిని వ్రాయుటకే నా కెంతో ప్రయాసకలిగెను.

1932 వేసవిని దంపతుల మిరువురమును భీమవరములో నుంటిమి. మాతమ్ముఁడు వెంకటరామయ్య కుటుంబమును మేమును గలసి మాక్రొత్తయింట నివసించితిమి. ఇంటఁ గొన్ని మరమ్మతులు చేయించితిమి. నాభూముల శిస్తులు పోగుచేయుచును, భూముల వమరకపఱచుచును, నేను వేసవిని భీమవరప్రాంతములందుఁ గడపితిని.

ఇటీవలనే ఢిల్లీలోజరిగెడి దేశీయమహాసభ కేగుటకుఁ బ్రయత్నించుటవలన నానగరమునఁ గారాగారాబంధితులై విడువఁ బడియు, మరల జూనునెలలో గుంటూరులో రక్షకభటులచే బంధితులయిన కొండ వెంకటప్పయ్యగారి దేహారోగ్యవిషయమై యాయనబంధువులు మిత్రులును మిగుల నలజడిపడిరి. వెంకటప్పయ్యగారిభార్యకును దేహములో రుగ్ణత హెచ్చెనని మాకుఁ దెలియవచ్చెను.

4. హరిజనోద్యమము

1931 వ సంవత్సరమధ్యమున నేను రచించిన "వీరేశలింగసంస్మృతి" ఆంధ్రవిశ్వవిద్యాలయమువారి ప్రాపుగాంచ నేరకున్నను, చెన్నపురి సర్వకళాశాలవారి యాదరణ భాగ్యమును గొంత చవిచూచెను. 1934 వ సంవత్సరమందలి యింటరు మీడియేటుపరీక్ష కాంధ్రమున నీపుస్తక మొక పఠనీయ