ఆంధ్ర వేదములు : ఋగ్వేదము/ప్రకాశకుల తొలిపలుకు

వికీసోర్స్ నుండి

ప్రకాశకుల తొలిపలుకు.

1914లో బొంబాయిలో "ఋగ్వేదము"ను ఆంగ్లములోనికిని, మహారాష్ట్రములోనికిని భాషాంతరీకరించి ప్రకటించుచుండిరి. గుంటూరులో నూతనోద్యమములకు ప్రోత్సాహకరుడుగా నుండిన శ్రీయుత ఉన్నవ లక్ష్మీనారాయణగారు మొదలగు స్నేహితులము వేదముల నాల్గింటిని ఆంధ్రభాషలోనికి అనువదింపవలెనని తలంచితిమి. కాని అప్పుడే ఐరోపా మహాసంగ్రామము ప్రారంభమగుటచేతను, బళ్ళారిలోని ప్రముఖులుకొందరు ఆంధ్రానువాదము ఆరంభించిరని తెలియుటచేతను మేము విరమించితిమి. బళ్ళారివారిపని కొంతవరకుజరిగి ఆగిపోయెను. యుద్ధము నాలుగేండ్లు సాగెను. అది ముగిసినపిదప దీనినిసాగింప మరల సంకల్పముకలిగెను. గుంటూరునుండి భావపురికి (బాపట్ల) పోవు న్యాయస్థానముతో బోయి అచట యీ కార్యమును నిర్వహింపవచ్చునని ఆశకలిగెను. ఆ సమయముననే పూజనీయులగు మహాత్మ గాంధీగారు మోహన వేణుగానముపూరించి దేశీయమహాజనసభతో పాటు భారతజాతినంతను స్వాతంత్ర్య సమరరంగమున కాకర్షించెను. అంతటితో రెండవ సంకల్పము వీగిపోయెను. అసహాయోద్యమ తీవ్రప్రచారము సాగుచుండగనే బ్రాహ్మణ, బ్రాహ్మణేతర అసమానత్వమును తొలగించుటకు వేద వేదాంగములను ఆంధ్రీకరించి ఆంధ్రులకెల్లరకు హస్తగతమొనర్చుట భావ్యమని తెలుపుచుంటిమి. కాని ఆసమయమున సహాయమొనర్చుటకు పూనిన ఒకానొక స్నేహితుని పవిత్ర సంకల్పము దురదృష్టవశమున కొనసాగదయ్యె. సాయమొనర్తుమనిన మరియొకరు అకాలమృత్యు వాతబడిరి. స్వాతంత్ర్యోద్యమము నిమ్నోన్నతస్థాయిలలో నడుచు చుండెను. ఇంతలో వినయాశ్రమమును శ్రీముఖ సం|| మార్గశిర బహుళ సప్తమి స్థిరవాసరమున (23 - 12 - 33) మహాత్ములు ప్రారంభించిరి. ఆంధ్రవేదానువాదము ఆశ్రమోద్దేశములలో నొకటియై వరలుచుండెను. సత్యాగ్రహ సిద్ధాంతములోని సర్వధర్మ సమానత్వమను ముఖ్యసూత్రమునకును సర్వమత గ్రంథములను సమానభక్తి గౌరవములతో స్వభాషలో సమకూర్చి సమన్వయమొనర్చి సదాచరణతో ప్రవర్తిల్లచేయుట పరమకర్తవ్యముగా ప్రత్యక్షమయ్యెను. తదుద్దేశ్యముతో ఆర్య, బౌద్ధ, క్రైస్తవ, మహమ్మదీయమతోద్గ్రంథముల నాంధ్రీకరించుటకు పూనితిమి. జారుతృష్ణ. కన్‌ప్యూషియస్ ప్రవక్తల ప్రబోధగ్రంథములనుగూడ ఆంధ్రీకరింపదలచితిమి. పశుధర్మమునుండి దైవధర్మమునకు పరిణామమందుచున్న మానవకోటి నుద్ధరింప యుగయుగాంతరముల పరమేశ్వరుడు ప్రసాదించిన మహాప్రబోధములను సర్వజనసులభముగా లభింపజేయుట, విశ్వసందేశమని రూఢియయ్యెను.

మతములలోనికెల్ల ఆది ఆర్యమతము. ఆర్యధర్మమునకు వేదముమూలము. వేదములు షడంగములతోసహా ప్రకటించుట జ్ఞానవిజ్ఞానములకు సాధనమార్గము. "ఆంధ్రావని మోదమున్‌బొరయ" ఆంధ్రవాఙ్మయము పరిపూర్ణతనొంద, ఆంధ్రుల జ్ఞానవై రాగ్యములు సర్వతోముఖవ్యాప్తిపొంద, లోకోద్భవమునకు కారణభూతుడైన పరమేశ్వరునుండి వెలువడిన ఋగ్యజుస్సామాధర్వవేదంబుల తదంగ సమేతంబుగా సుబోధకమగు శైలిలో యనువదించి ఆంధ్రవేదంబులు"గా ఆంధ్రలోకంబునకు లభింపజేయుట పరమకర్తవ్యము. ఇట్లు మనోవీధిలో తాండవమాడుచున్న భావపరంపరలకు కాలపరిణామముబట్టి కార్యరూపమొందు కాలము సంఘటిల్లెను. ఒకానొక స్నేహితుని వాగ్దత్తము అవలంబనమయ్యెను. చిరకాల స్నేహితులును, సంపన్న గృహస్థులును, అగు శ్రీయుత ఆలపాటి దేవయ్యగారు యజుర్వేద శాఖలలో నొకదానికి పూనుకొని తనకుమారుడు వెంకటకృష్ణయ్యగారిద్వారా 23 - 12 - 37 తేదీన జరుపబడిన వార్షికోత్సవమపుడు చదివించిన ధనము కార్యోపక్రమణకు తోడ్పడెను. తాతలనాటినుండి మాకుటుంబమునకు పోషకులుగానున్న శ్రీ రాచూరు జమీందారగు శ్రీరాజా మాణిక్యారావు వెంకటహయగ్రీవరావు బహదూరుగారు గత ముక్కోటిఏకాదశినాడు తనుతల్లి శ్రీరాజా రాజలక్ష్మాయమ్మ బహదురుగారి జ్ఞాపకార్ధమై శుక్లయజుర్వేదమునకై యిచ్చిన సనదుమరింతప్రోత్సాహ మొనర్చెను. ఆశ్రమ రాజపోషకుడు శ్రీయుతమద్ది వెంకటరంగయ్యగారు సామవేదమును భరించసమకట్టుట సంతోషప్రదమయ్యెను. బాల్యస్నేహితుడు శ్రీయుతమంతెన సుబ్బరాజుగారు తనతండ్రి జ్ఞాపకార్ధమై ఋగ్వేదభారమును వహించి కార్యలోపమురాకుండ రక్షించె. అధర్వ వేదమును పూనుకొన్న ఒకానొకస్నేహితుని కృషి ఈ కార్యసమాప్తికి తోడ్పడనున్నది. అనాదిగా ఈ వేదమంత్రములను పండితవ రేణ్యులు భద్రపరచియున్నారు. అందునిగూఢములైన భావపరంపరలు పండితపామరులకెల్ల సులభముగా బోధపడు నట్లు మధురమైనశైలిలో తేలికయైనపదములగూర్చి ఆంధ్రానువాదము జరుగుచున్నది. వేదవిమర్శకుల భావములును, ప్రకాశకుల స్వంతభావములును ప్రత్యేక సంపుటములలో తెలుపబడును. కరుణామయుని అపారమైన అనుగ్రహముచేతనే సనాతనులైన పండితులు యీ అనువాదమునకు పూనుకొనిరి. ఋగ్వేదమును సుప్రసిద్ధసంస్కృతాంధ్రపండితులును, సంస్కర్తలును, పురాణవాచస్పతి బిరుదాంకితులును నగు బ్రహ్మశ్రీ జంకుపల్లె మల్లయ్యశాస్త్రిగారు ఆంధ్రీకరించియున్నారు. సామ, అధర్వ వేదములను వారే అనువదింతురు. సాహిత్యశిరోమణి బ్రహ్మశ్రీ రామవరపు కృష్ణమూర్తి శాస్త్రిగారు కృష్ణయజుర్వేదమనువదించిరి. శుక్ల యజుర్వేదమును గూడ అనువదింతురు.

ఆంధ్రవేదప్రకటనకు అనివార్యములైన చోటతప్ప స్వదేశవస్తువులనే వాడుచున్నాము. యుద్ధకాలమగుటచేత వస్తువుల ధరలు పెరుగుటయు, వస్తువులు సులభముగా లభింపకుండుటయు కొంత ఆటంకమును కల్పించుచున్నవి. మూడేండ్లనుండి మురియుచున్న ప్రకటన అంతరాయములచే అప్పటప్పటికి ఆలస్యమగుచుండెను. కాని పరుచూరు ప్రాంతవాసులు మా ఆలస్యమునకు జంకక, మా వాయిదాలను నిరసింపక, వేలకొలదిగా ధనమిచ్చి ఆదరాభిమానములతో తోడ్పడుటచేతనే ఈపని యిప్పటికి సాధ్యమైనది. ఆంధ్రవేదములు సంపూర్తియగుసరికి కొన్నియేండ్లుపట్టును. ఆంధ్రులందరును, ఆరంభశూరులుగాక సుస్థిరసమగ్రోత్సాహముతో ఈ కార్యక్రమమునకు తోడ్పడుదురుగాక యని ఆశించుచున్నాము. మొదటి ఐరోపామహాసంగ్రామమునకు పూర్వము తలపెట్టిన కార్యము, రెండవ సంగ్రామకాలమున కార్యరూపము నొందుట కరుణామయుని కార్యలీలయే గదా!

ఇట్లు,

గొల్లపూడి సీతారామశాస్త్రి.

విక్రమవైశాఖ పూర్ణిమ,

మంగళవారము 21 - 5 - 40.