Jump to content

ఆంధ్ర గ్రంథాలయం/సంపుటము 1/సంచిక 3-4/సంపాదకీయం

​

సంపాదకీయం

'God helps those who help themselves'

'గ్రంథాలయ సర్వస్వం' 'ఆంధ్రగ్రంధాలయం'గా మారి సంవత్సరం గడిచింది. సార్వజనిక గ్రంధాలయోద్యమవ్యాప్తియందగ్రగణ్యులైన శ్రీ అయ్యంకి వెంకట రమణయ్యగారు మొదటి సంచికకు సంచార గ్రంథాలయములను గుఱించి చక్కని వ్యాసమును వ్రాశారు. ఆర్షపత్రిక వారావ్యాసంలో గ్రంథాలయ సేవకునకు కావలసిన సంగతులు చాల ఉన్నవన్నారు. విజ్ఞానంవారు దాని నవశ్యంగా చదువ వలసినదన్నారు. గ్రంథాలయ శాస్త్రమందారి తేరి, ఖండాంతరముల సహితము ఖ్యాతిగాంచి, మద్రాసు విశ్వవిద్యాలయపు గ్రంధాలయమున ప్రధాన గ్రంధపాలకులుగా నున్న ఎస్.ఆర్. రంగనాధన్, ఎమ్.ఏ., ఎల్.టీ., ఎఫ్.ఎల్.ఏ. గారు, ఆ గ్రంధాలయముననే చిరకాలమునుండి పనిచేయుచు గొప్ప అనుభవమును సంపాదించిన కె. ఎమ్. శివరామన్, బి.ఎ.,సి. సుందరం, బి.ఎ. గార్లు ప్రశంసనీయమగు వ్యాసముల నాంగ్లమందు మాపత్రికకు వ్రాస్తున్నారు. 'ఆంధ్రగ్రంధాలయం' లోని ఆంగ్లవ్యాసములు చాల గొప్పగను, ఆచరణయం దనుభవములోనికి వచ్చు పెక్కువిషయములతోను తొలకాడుచున్నవని ఇతర దేశాల వారు పొగడారు. ఆర్షపత్రిక ఈవిషయాన్ని గురించి చెబుతూ “ఇంగ్లీషులో వ్రాయబడిన వ్యాసములు, గ్రంధాలయోద్యమమును గుఱించిన పాశ్చాత్యదేశపు పత్రికలలో ఉండు ఉన్నత వ్యాసములకు పై చేయిగానే ఉన్నవిగాని తీసిపోలేదు. ఈ పత్రికను ప్రజలు విశేషముగ ఆదరింపగోరెదము” అని వ్రాసింది. గ్రంథాలయ శాస్త్రమందు డిప్లొమాను పొందిన శ్రీ పుణ్యమూర్తి, శ్రీ పాతూరి నాగభూషణంగార్లు కాలానుగుణ్యంగానుండు వ్యాసములను వ్రాసి, గ్రంధాలయ వార్తలను ప్రోగుజేసి సహాయం చేస్తున్నారు.

ఆంధ్రదేశ గ్రంధాలయ సంఘానికి అధ్యక్షులైన శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, ఎమ్.ఎ. గారు వయోజనవిద్యమీద రెండు, మూడు సంచికలకు వ్యాసములు ​వ్రాశారు. పత్రికాభివృద్ధి విషయంలో వారు చాల తోడ్పడుతున్నారు. బెజవాడి కాలేజీ ప్రధానాచార్యులగు డాక్టరు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు ఎం.ఏ.,పీహెచ్.డి (లండను) గారు, తెనాలి తాలూకా గ్రంథాలయ సంఘాధ్యక్షులగు శ్రీ వడ్లమూడి వెంకటరత్నంగారు మా ఆంధ్ర గ్రంథాలయమునకు వచ్చే ముఖ్యమైన గ్రంధాలను విమర్శించి మాకెంతో తోడ్పడుతున్నారు. ఆంధ్రదేశమందు వివిధప్రాంతాలలో జరుగుచున్న గ్రంధసేవను గూర్చి, వయోజన విద్యనుగూర్చి మా పత్రికలలో ప్రకటిస్తున్నాం. ప్రముఖులీ పత్రికను ప్రశంసించారు. పెద్దలు ప్రోత్సాహకరమగు సందేశాలను పంపారు. మహాసంగ్రామ జ్వాలలమధ్య నుండియు, గ్రంధాలయ శాస్త్రకోవిదులును, లండనులోని క్రోయిడను కేంద్రగ్రంధాలయపాలకులును అగు డబ్లియు. సి బర్విక్ సేయర్ గారు మాపత్రికా ప్రచురణను ప్రోత్సహిస్తూ సందేశ మంపారు. దక్షిణాఫ్రికా గ్రంధాలయ సంఘంవారు తమ పత్రికను ఇప్పటికీ-యుద్ధసమయమని-విడువకుండా మా పత్రికకు బదులుగా పంపిస్తున్నారు. న్యూజిలాండు గ్రంధాలయ సంఘంవారు తమ పత్రికను పంపెదమని వ్రాశారు. ఇంగ్లాండు,అమెరికా, ఫ్రాన్సు, జపాను మొదలుగాగల విదేశాలకు ముప్పదినాలుగు ఆంధ్ర గ్రంధాలయ ప్రతులు పంపాము. యుద్ధమందు మునిగియుండుటచే కొన్నిదేశాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుటకు వీలులేక పోయింది. పంజాబు గ్రంధాలయ సంఘం వారు 'మోడరన్ లయిబ్రేరియన్' అను తమ పత్రికను, వంగదేశ గ్రంధాలయ పరిషత్తువారు తమ ప్రచురణలను పంపుతున్నారు. మద్రాసు గ్రంధాలయసంఘం వారు, వారి 'మెమోయర్సు'ను మా పత్రికకు వినిమయంగా పంపించడమే కాకుండా, వారి గ్రంధాలయములోని పుస్తకాలను రిఫరెన్సుకొరకు పంపి, ఇంకా అనేకవిధాల తోడ్పడుతున్నారు.

కాని పత్రికయెడ మన వారుమాత్రం తగినంత ఆదరణ చూపుట లేదు. ఈ సందర్భంలో భారతి సంపాదకీయంలో నుడివిన ఈక్రింది మాటలు జ్ఞాపకం వస్తున్నాయి:

“పత్రికలను కొని చదవడానికి మనదేశం ఇంకా అలవాటు పడలేదు. విజ్ఞానం అంటే ఇంకాదేశీయులకు తృష్ణకలగలేదు. దేహానికి ఆహారం ఏవిధంగా అవసరమో మనస్సుకు కూడా ఆహారం అవసరమనే భావం ఇంకా మనవారికి తట్టలేదు. పాశ్చాత్య దేశాలమాట అట్లావుంచి, ఒక్క మన హిందూదేశం విషయంలో నేఆలోచించినా ఆంధ్రీతరములైన బంగాళము, మహారాష్ట్రము,గుజరాతు మొదలైన రాష్ట్రాలలో వాఙ్మయాభివృద్ధి అమితంగా అవుతోంది. ఆరాష్ట్రాలలో తమ తమ మాతృభాషలను సర్వతోముఖంగా
​
అభివృద్ధి నొందించుకోడానికి బహుళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. గవర్నమెంటు కార్యాలయాలలో ఉన్నతోద్యోగాలలో ఉన్నవారూ, విశ్వవిద్యాలయాలలో ఉన్నతపీఠాలను అధిష్ఠించే వారూ కూడా తమకు తెలిసిన విషయాలను మాతృభాషలో వ్రాసితమతోడి సోదరులకు విజ్ఞానం వెదజల్లుతూంటారు. మాతృభాషల కారాష్ట్రాలలో ఎక్కడలేని జనమూ బలమూ వస్తోంది. కాని మనదేశంలోని పరిస్థితులు వేరు; ప్రజలలో ఆవిజ్ఞానతృష్ణాలేదు, ఉత్సాహమూ లేదు.”

దేశమందలి పరిస్థితి యిది. అష్టకష్టములుపడి వ్యాసములు వ్రాసి, వ్రాయించి ముద్రాపకుల సహన, సహాయములతో కాగితమునకు కరువుగానున్న ఈయుద్ధ దినములలో పత్రికను ప్రచురిస్తోంటే, ఊరకేయిమ్మని, సగము ఖరీదునకిమ్మని పీడిస్తూంటేను పత్రికా ప్రచురణావసరమును గుర్తించినవారు, ధనవంతులు గూడ వ్యయమునకు వెరుస్తూంటేను పత్రికానిర్వహణ మెట్లు జరుగుతుంది? ధనాభావము చేత నే 3,4 సంచిక లొకటిగా యిప్పుడు ప్రచురింపవలసి వచ్చింది.

దేశమందలి నిరక్షరాస్యత, జ్ఞానశూన్యత గ్రంథాలయోద్యమ వ్యాప్తికిగల అవసరం చర్విత చర్వణంగా చర్చిస్తే విసుగువస్తుందేమోఅని విడచి పెడుతున్నాము. “ప్రజలకూ గ్రంథాలయాలకు మధ్య సుహృద్భావాన్ని పెంపొందించి, గ్రంధాలయాలకు నూతనసభ్యుల నాకర్షించి వారిలో ఆశయాన్విత పఠనమును ప్రోత్సహించి, ఉత్తమగ్రంధములను ఏర్చుకొనుటయందు చదువరులకు సహాయము చేసి, చదువరికి తగిన గ్రంథమును, గ్రంధమునకు తగిన చదువరిని చేకూర్చి, పారకుల కుపయోగించు ఇతర గ్రంధస్థ విషయములను సూచించుట కే మా గ్రంధాలయ పత్రిక ఆశిస్తోంది.” ఈ మా పత్రికను ప్రజలు, ప్రజాసంస్థలు ఆదరించి దేశసౌభాగ్యమునకు తోడ్పడుదురని నమ్ముతున్నాము,

కీర్తి శేషులు

సరససామ్య ప్రశస్త కననకవిశిఖామణి శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు పంతులుగారు

వీరు పట్టభద్రులు; ఆంధ్రగీర్వాణ భాషాకోవిదులు; శ్రీరామభక్తులు. వీరు రామాయణాన్నంతా నాటకాలుగా వ్రాసి ఆంధ్రవాణికి ప్రశంసనీయమగు సేవ చేశారు. పంతులుగారి శైలిలో అద్భుతమైన వ్యక్తిత్వం, సహజమైన పోకడ కనబడుతుంది. వీరి రచనలలో నాజూకైన హాస్యరసంతోలకాడుతుంది. పంతులుగారి సాక్షి నెరుగనివారుండరు. వారి రచనా కౌశలానికి 'సాక్షి'యే సాక్షి. ప్రభుసన్మా ​సం, ప్రజల గౌరవం పొందిన కవులలో ఒకరు. శ్రీపిఠాపురం రాజువారు పంతులు గారు వ్రాసిన నాటకాల నన్నిటిని అచ్చువేయించారు. కీర్తిశేషులు దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు వారి 'సాక్షి' వ్యాసాలను ఆంధ్రపత్రికలో ప్రకటించేవారు. లక్ష్మీనరసింహారావు పంతులు గారి స్వస్థలం రాజమహేంద్రవరం. కాని చాల కాలమునుంచి పిఠాపురంలోనే ఉంటున్నారు. 80 ఏళ్లు వచ్చాక 1940 వ సవత్సరం జనవరి 1వ తేదీని స్వర్గస్థులయారు. పంతులుగారి ఆత్మకు భగవంతుడు శాంతిప్రసాదించుగాక! వారి కుటుంబానికి మాసానుభూతి.

కళాప్రపూర్ణ, మహోపాధ్యాయ, శబరవాగనుశాసనులు

శ్రీ గిడుగు వెంకటరామమూర్తి పంతులుగారు

తెలుగు భాషాప్రపంచంలో సామ్రాజ్యవాదం పోయి ప్రజాస్వామికం ప్రబలడానికి గత 30 సంవత్సరాలనుండీ కృషిచేసి కృతార్థులైన శ్రీ గిడుగు వేంకట రామమూర్తిపంతులుగారి నిర్యాణం ప్రతి ఆంధ్రునికీ సంతాప హేతువు. జనసామాన్యంలో విజ్ఞానవ్యాప్తి కలుగ జేయడానికి చక్కని రాజమార్గాన్ని నిర్మించి, వాగనుశాసనుల ఆజ్ఞల నుల్లఘించవలసి వస్తోందనే భయాన్నుండి తప్పించి, సామాన్యులనుకొనే వారికిగూడ గ్రంథరచనాధికారం ప్రసాదించి, ప్రజలలో విజ్ఞానం వ్యాపింపజేయగల మనో ధైర్యం కలిగించిన ఆ మహామహుని నిర్యాణానికి కంటతడిబెట్టని వారుండరు. కడపటి సందేశమిస్తూ, అభినవాంధ్రవాణిని పత్రికాధిపతుల చేతులలో బెట్టిన పంతులు గారి తుదిమాటలు జ్ఞప్తి యందుంచుకొని విద్యగఱపడంలోనూ, గ్రంధాలు రచించడంలోనూ ప్రతీ ఆంధ్రుడు స్వాభావికమైన వాడుకభాషనే ఉపయోగించి ఆవాడుక భాషామూర్తి ఆత్మకు శాంతి చేకూరుస్తారని నమ్ముతున్నాము. చంద్రునికి నూలు పోగన్న సామ్యమున మేమీ సంచికను పంతులుగారి జ్ఞాపకార్ధం ప్రచురిస్తూన్నాం. పంతులుగారి కుటుంబానికి మా సానుభూతి. వంతులుగారి ఆత్మకు వరమేశ్వరుడు శాంతి ననుగ్రహించుగాక!


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse